Shamshabad international airport
-
బెలుగా భలేగా.. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం
శంషాబాద్: సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బెలుగా విమానం మరోసారి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వియత్నాం నుంచి ఈజిప్ట్ వెళ్తున్న ఈ విమానంలో ఇంధనం నింపడంతో పాటు పైలట్ల విశ్రాంతి కోసం సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తిరిగి బుధవారం రాత్రి ఇక్కడి నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరింది. గతేడాది డిసెంబర్ 4 రాత్రి దుబాయ్ నుంచి భారీ సరుకుతో థాయ్‌లాండ్‌లోని పటాయా వెళుతూ ఇంధనం, విశ్రాంతి కోసం బెలుగా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సరుకు రవాణా విమానాల్లో ఈ ఎయిర్‌బస్ బెలుగా విమానం(ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) ఒకటి. విమాన ఆకారం ఉబ్బెత్తు తలతో ఉండే బెలుగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో.. బెలుగా విమానం పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు, బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కాగా, అతి పెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవ్ ఏఎస్–225 మ్రియా కూడా ఇంధనం, విశ్రాంతి కోసం 2016, మే 13న శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ప్రస్తుతం మ్రియా లేకపోవడంతో కార్గోలో బెలుగానే అతిపెద్ద విమానంగా గుర్తిస్తున్నారు. -
పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు!
శంషాబాద్: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్ రూపంలో ప్యాక్ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్న విదేశీయులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సుల్స్ రికవరీ చేశామని కస్టమ్స్ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్‌ను పారదర్శకంగా ఉండే టేప్‌తో 108 క్యాప్సుల్స్‌గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్‌గా మార్చుకుని అతడికి భారత్ రావడానికి టూరిస్ట్ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్ క్యాప్సుల్స్‌ను మింగించి ఎథిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ప్రయాణికుల జాబితా వడపోసి.. కస్టమ్స్ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్ ప్రొఫైలింగ్ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్ క్యాప్సుల్స్ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. -
‘శంషాబాద్’కు ఇంధన పొదుపు అవార్డు
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డును గెలుచుకుంది. ప్రభుత్వం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జీఎంఆర్ ప్రతినిధులకు అవార్డును అందజేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ముందు వరుసలో ఉందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుందన్నారు. -
దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ -
పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్.. క్యూ మేనేజ్మెంట్
శంషాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ తగ్గుముఖం పడుతున్న వేళ సురక్షితమైన విమానయానానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఆయా రాష్ట్రాలు దేశీయ ప్రయాణంలో నిబంధనలను సడలించడంతో మళ్లీ విమానయానం ఊపందుకునే అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయంలోని విశేషాలివీ ►కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్‌లో భాగంగా చెక్–ఇన్ హాల్స్ వద్ద సెల్ఫ్ కియోస్కులను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ చెక్–ఇన్ ప్రక్రియ పూర్తవుతుంది. ►శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు. ►దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్. ►దేశీయ ప్రయాణంలో నిబంధనల సడలింపుతో ఊపందుకోనున్న విమానయానం పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్ సౌకర్యం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. ►దేశీయ ప్రయాణంలో పూర్తి ఈ–బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించగా, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎమిరేట్స్, గో ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ–బోర్డింగ్ సదుపాయాన్ని వినియోగంలోకి తెచ్చాయి. ►ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా క్యూ మేనేజ్మెంట్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. రద్దీ ప్రాంతాలపై డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకేచోట రద్దీ ఏర్పడకుండా నివారిస్తున్నారు. ►జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు ‘హెచ్ఓఐ’ యాప్ తో భాగస్వామ్యాన్ని రూపొందించుకున్నాయి. దీంతో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డర్లతోపాటు పేమెంట్ సౌకర్యాలను మొబైల్ ఫోన్ల ద్వారా ప్రయాణికులు పొందవచ్చు. ►భౌతిక దూరం నిబంధనలతోపాటు నిరంతర మాస్క్‌ల వినియోగం పర్యవేక్షణ మైక్‌ల ద్వారా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ►టచ్‌లెస్ ఎలివేటర్లతోపాటు ఎక్కువగా వినియోగించే ట్రాలీలు, బెల్టులు ఇతర పరికరాలనూ శానిటైజ్ చేస్తున్నారు. -
ఎ- 320 ఎయిర్ ఏషియా విమానానికి తప్పిన ముప్పు
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. రేపు ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బ్లాస్ట్ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు మెయిల్ పంపాడు. సాయిరాం కాలేరు అనే మెయిల్ ఐడీతో విమానాశ్రయానికి మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు తనిఖీలు చేస్తూనే మరో వైపు ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును గుర్తించలేదని సమాచారం. -
విమానాల సర్వీస్ మార్పిడితో స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చి... దేశంలోకి ప్రవేశించాక దేశీయ సర్వీసులుగా మారే విమానాలను ఎంచుకొని సాగుతున్న బంగారం అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తిని పట్టుకుని రూ.66 లక్షల విలువైన 1.99 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడిన కేరళ వాసిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ విభాగం దీని వెనుక ఉన్న వ్యవస్థీకృత ముఠా కోసం లోతుగా విచారిస్తోంది. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితరదేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా ఉండే విమానాలు దేశంలో డొమెస్టిక్‌గా మారుతాయి. వీటి ఆసరాగా ఈ అక్రమ రవాణా సాగుతోంది. పట్టుబడింది ఇలా... తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ నుంచి ఇండిగో సంస్థకు చెందిన 6ఈ–648 విమానం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయానికి వచ్చింది. అందులో హైదరాబాద్‌కు వచ్చిన ఓ కేరళ వాసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐకు సమాచారం అందింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో కాపుకాసిన అధికారులు అతనిని పట్టుకొని నాలుగు బంగారం బిస్కెట్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66.27 లక్షలు ఉంటుందని డీఆర్ఐ ప్రకటించింది.అతను ప్రయాణించిన విమానం షార్జా నుంచి కేరళలోని త్రివేండ్రానికి అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తోంది. ఆపై దేశీయ సర్వీసుగా మారి మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌కు వెళ్తుంది. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వస్తుంది. ఇలా సూత్రధారుల ఆదేశాల ప్రకారం షార్జా నుంచి బంగారాన్ని తీసుకువచ్చిన వారు దాన్ని ఆ విమానం బాత్రూమ్స్లోని రహస్య ప్రదేశాల్లో దాచి దేశంలోకి ప్రవేశించగానే దాన్ని వదిలేసి తనిఖీల్లో చిక్కకుండా దిగి వెళ్లిపోతాడు.ఆపై అదే విమానంలో దేశీయంగా ప్రయాణించే వ్యక్తికి ముందస్తు సమాచారం ఇచ్చి అదే విమానంలో ప్రయాణించేలా చేశారు. ఆ వ్యక్తి అదను చూసుకుని టాయ్‌లెట్స్‌లో ఉన్న బంగారం తీసుకుంటాడు.ఆపై గమ్య స్థానం చేరగానే కస్టమ్స్ తనిఖీలు లేకుండా బయటకు వచ్చేస్తాడు. ఈ తరహాలోనే ప్రస్తుతం పట్టుబడిన కేరళ వాసి ఇండోర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాడు. ఈ స్మగ్లర్‌కు ఓ మారు పేరు పెట్టి, బోగస్ ఆధార్‌కార్డు సృష్టించి సూత్రధారులు ఇచ్చారు. డీఆర్ఐ అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో... ఇలాంటి వ్యవహారమే కిందటి గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి ఇంటర్నేషనల్ సర్వీసుగా బెంగళూరు వరకు వచ్చి ఆపై కొలంబియా వెళ్లి చెన్నైకు తిరిగి వచ్చి డొమెస్టిక్ సర్వీస్‌గా ఆ విమానం మారింది. ఇందులోని టాయిలెట్స్‌లోని అద్దాల వెనుక స్మగ్లర్లు రూ.60 లక్షల విలువైన 30 బంగారం కడ్డీలను అమర్చారు. ఇది జనవరి 13న చెన్నై నుంచి పుణేకు వెళ్లింది. ఆ తర్వాత పుణే–చెన్నై, చెన్నై–హైదరాబాద్, హైదరాబాద్–రాయ్‌పూర్, రాయ్‌పూర్–ఢిల్లీ, ఢిల్లీ–శ్రీనగర్, శ్రీనగర్–అమృత్సర్, అమృత్సర్–బెంగళూరుల్లో దేశీయంగా తిరిగింది. అయినా విమానంలోని బంగారాన్ని ఎవరూ గుర్తించలేదు, చివరకు గురువారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నప్పుడు దీనిపై అక్కడి కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. వారు తనిఖీలు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు స్మగ్లింగ్ల వెనుక ఒకే సూత్రధారులు ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆధార్‌తో నేరుగావిమానంలోకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: త్వరలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, తనిఖీల వంటివేవీ లేకుండా నేరుగా విమానం ఎక్కేయొచ్చు. టికెట్ బుకింగ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకోగానే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, బ్యాగేజ్ వంటివి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలియజేసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఫేస్ రికగ్నిషన్, వేలిముద్ర, ఐరిస్ వంటి వాటిని పరిశీలించామని, వీటిల్లో ఆధార్ అనుసంధానం ద్వారా ముఖ గుర్తింపు వ్యవస్థను ఎంచుకున్నామని ఎయిర్‌పోర్టు సీఈఓ కిశోర్ వెల్లడించారు. 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఆరంభిస్తామని, ఫలితాలు పరిశీలించాక, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకున్నాక ఈ సేవల్ని ఆరంభిస్తామని తెలియజేశారు. దశల వారీగా బెంగళూరుతో పాటూ ఇతర విమానాశ్రయాలకూ దీన్ని విస్తరిస్తామని, ఆధార్ లేని వారి కోసం బోర్డింగ్ పాస్‌లు, సెల్ఫ్ చెకిన్స్ ఉంటాయని తెలియజేశారు. జనవరిలో విస్తరణ పనులు షురూ.. ఇటీవలే జీఎంఆర్ సంస్థ 4.5 శాతం వడ్డీకి అంతర్జాతీయ మార్కెట్లో రూ.2,250 కోట్ల రుణం తీసుకుంది. దీన్లో రూ.450 కోట్లు (70 మిలియన్ డాలర్లు) హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణ పనుల కోసం వెచ్చిస్తారు. రన్‌వే–2, టెర్మినల్–2 నిర్మాణ పనులను జనవరిలో ప్రారంభించి.. ఏడాదిన్నరలో అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ తెలియజేసింది.ప్రస్తుతం ఒకే రన్‌వే ఉండగా గంటకు 32 విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. విమానాశ్రయ విస్తరణ తర్వాత వీటి సంఖ్య 50కి చేరుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రానున్న ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్ వంటి వాటి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించిందని, మెట్రో రైల్‌ను విమానాశ్రయం వరకూ విస్తరించడం, బెంగళూరు జాతీయ రహదారిలోని అరాంఘడ్ నుంచి విమానాశ్రయం వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రహదారిని 6 లైన్లకు విస్తరించనుండటం దీన్లో భాగమేనని జీఎంఆర్ తెలియజేసింది. జీఎంఆర్, ఎంఏహెచ్‌బీ సంయుక్తంగా 1.5 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు.. జీఎంఆర్ గ్రూప్‌తో తమకు పదేళ్లకు పైగా భాగస్వామ్యం ఉందని మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ) ఎండీ దతుక్ మహ్మద్ బాదిల్షామ్ ఘాజిల్ చెప్పారు. ప్రస్తుతం జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంస్థకు 11 శాతం వాటా ఉంది. గతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తమకు 10 శాతం వాటాలుండేదని, సరైన ఫలితాలు రాలేదని విరమించుకున్నామని, మళ్లీ అందులో వాటా కొనే ఆలోచన లేదని ఘాజిల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టును కూడా జీఎంఆర్ సంస్థే నిర్వహిస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. ‘‘ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల విభాగంలో అపారమైన అవకాశాలున్నాయి. అందుకే జీఎంఆర్‌తో కలసి 1.5 బిలియన్ డాలర్లతో స్పెషల్ పర్పస్ ఫండ్‌ను (ఎస్పీఎఫ్) ఏర్పాటు చేశాం. కొన్ని కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కన్సాలిడేషన్ గురించి చర్చిస్తున్నాం. ఈక్విటీ లేదా జాయింట్ వెంచర్‌గా ఆయా ప్రాజెక్ట్‌లను చేపడతాం’’ అని చెప్పారాయన. హైదరాబాద్ నుంచి 10 లక్షల పర్యాటకులు లక్ష్యం జీహెచ్ఐఏఎల్, ఎంఏహెచ్‌బీ, ఎంటీపీబీ మధ్య ఒప్పందం ఏటా హైదరాబాద్ నుంచి మలేషియాకు లక్ష మంది పర్యాటకులు వస్తున్నారని మలేషియా టూరిజం బోర్డ్ (ప్రమోషన్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖనీదౌద్ చెప్పారు. గతేడాది దేశం నుంచి 6.38 లక్షల మంది పర్యాటకులు వచ్చారని తెలియజేశారాయన. తెలంగాణలో మలేషియా టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి తొలిసారిగా జీఎంఆర్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్), మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ), మలేషియా టూరిజం ప్రమోషన్స్ బోర్డ్ (ఎంటీపీబీ) ఒప్పందం చేసుకున్నాయి. మూడేళ్ల కాలపరిమితి ఉండే ఈ ఎంవోయూపై ఆయా సంస్థల అధికారులు గురువారమిక్కడ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా దేశంలో మలేషియా టూరిజం ప్రమోషన్‌కు రూ.16 కోట్లు వెచ్చించనున్నట్లు ఖనీద్ తెలిపారు. చైనా, టర్కీ దేశాల్లోని పలు విమానాశ్రయాలతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. -
హైదరాబాద్- టర్కీ విమాన సర్వీసుల రద్దు
హైదరాబాద్: ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మేరకు విమాన సర్వీసులను రద్దుచేసినట్లు అధికారలులు తెలిపారు. కాగా, విమానాలు రద్దుకావడంతో టర్కీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు పాతబస్తీలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న పది మంది పట్టుబడిన నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్, రాక్సా, ఎయిర్‌పోర్టు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలో తనిఖీలను ముమ్మరం చేశారు. -
ఎయిర్‌పోర్టు ప్రీపెయిడ్ క్యాబ్స్ చార్జీల సవరణ
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రీపెయిడ్ క్యాబ్స్‌చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో వెలువరించింది. పెరిగిన ధరలు, డ్రైవర్ల జీతభత్యాలు, విడిభాగాల ఖర్చులు, తదితర నిర్వహణ భారాలను దృష్టిలో ఉంచుకొని చార్జీలను స్వల్పంగా పెంచినట్లు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ తెలిపారు. కొత్తగా సవరించిన చార్జీల ప్రకారం పగటిపూట కిలోమీటర్‌కు రూ.17, రాత్రిపూట రూ.20 చొప్పున చార్జి ఉంటుంది. ఈ చార్జీలకు రూ.30లు అదనంగా సర్వీస్ చార్జి చెల్లించాలి. క్యాబ్స్ 8 ఏళ్లలోపువై ఉండాలి. 1000 సీసీ కెపాసిటీ కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగి ఉండాలి. లగేజీపైన రూ.20 కంటే ఎక్కువ తీసుకోకూడదు. క్యాబ్ డ్రైవర్లు తెల్లని యూనిఫామ్ ధరిం చాలి. మాతృభాషతోపాటు ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి. డ్రైవింగ్ లెసైన్స్, పర్మిట్ వివరాలను కార్ల లో ప్రదర్శించాలి. బీఎస్ఎన్ఎల్ టోల్‌ఫ్రీ నంబర్ ‘1074’ కారుకు నాలుగువైపులా ప్రదర్శించాలి. ‘ప్రీపెయిడ్ ట్యాక్సీ’ అనే బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ క్యాబ్‌లలో 50 శాతం.. విమానాశ్రయ నిర్మా ణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులవై ఉండాలి. మిగతా 50 శాతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు పాటించాలి. -
ఎన్టీఆర్ పేరు మార్చే ప్రసక్తే లేదు: జైట్లీ
న్యూఢిల్లీ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. దేశీయ టెర్మినల్ పేరు మార్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరే ఉంటుందని, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే కొనసాగుతుందని ఆయన బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాజీవ్, ఎన్టీఆర్ ఇద్దరూ గౌరవప్రదమైన నేతలేనని అన్నారు. కాగా దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పేరు మార్చడాన్ని తప్పుబట్టిన వారు... రాజీవ్ పేరు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై జైట్లీ పైవిధంగా స్పందించారు. -
జీవో రద్దు చేసే వరకు ఆందోళన: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ జారీ చేసిన జీవోను రద్దు చేసే వరకు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తామని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమలేదని, రాజకీయ లబ్ధికోసమే ఆయన పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘ఎన్టీఆర్ పేరు పెడుతూ 1999లోనే నిర్ణయం జరిగిందని, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు చెబుతున్నారు. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో కింగ్‌మేకర్‌గా ఉన్న బాబు అప్పుడు పేరు ఎందుకు పెట్టలేదు’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెటిలర్లలో తన ఆధిపత్యం చూపించుకోవడానికే బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడేందుకు రాజ్యసభ చైర్మన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. -
రాజ్యసభలో సమయం మారినా పరిస్థితి మారలేదు
ఢిల్లీ: శీతాకాల సమావేశంలో సభ సజావుగా సాగాలనే ఉద్దేశంతో రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చినా సభలో ఆందోళనలకు తెరపడలేదు. రాజ్యసభలో 11 గంటలకే ప్రశ్నోత్తరాల సమయం మొదలయ్యేది. అయితే రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఈ సమయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు. కానీ హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ దే శీయ టెర్మినల్‌కు ఉన్న రాజీవ్‌గాంధీ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో మారిన ప్రశ్నోత్తరాల సమయం వృథా అయింది. -
ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌పై సందిగ్ధం
దగ్గరలో స్టేషన్ వద్దంటున్న జీఎంఆర్ కనెక్టివిటీ రద్దుచేసుకుంటామంటూ రైల్వేశాఖ లేఖ సమస్య పరిష్కారానికి సిద్ధమైన ప్రభుత్వం జీఎంఆర్- రైల్వే సంయుక్త సమావేశానికి నిర్ణయం హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైన్‌ను పొడిగించే విషయంలో రైల్వే-జీఎంఆర్ మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ లైను నిర్మించేందుకు ససేమిరా అంటున్న జీఎంఆర్ తీరుతో విసిగిపోయిన రైల్వేశాఖ.. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు లేఖ రాసింది. ఎంఎంటీఎస్ ప్రాజెక్టును రైల్వేతో కలసి చేపడుతున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం రెండు సంస్థలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వినకుంటే కనెక్టివిటీ ప్రతిపాదనే రద్దు చేసుకుంటాం... నగరంలో ఎంఎంటీఎస్ రెండోదశ విస్తరణ పనులను రాష్ర్ట ప్రభుత్వం-రైల్వే శాఖలు సంయుక్తంగా చేపట్టబోతున్నాయి. ఇప్పటికే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడంతో అదనపు లైన్ల నిర్మాణానికి కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఫలక్‌నుమా వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను రెండోదశలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. రైలు దిగి అక్కడి నుంచి ట్రాలీలో ప్రయాణికులు లేగేజీతో నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేవిధంగా స్టేషన్ నిర్మించాలని ఖరారు చేశారు. అయితే అంత దగ్గరలో స్టేషన్ నిర్మాణానికి జీఎంఆర్ ససేమిరా అంటోంది. ఎయిర్‌పోర్టుకు 3.2 కిలోమీటర్ల దూరం వరకే ఎంఎంటీఎస్‌ను పరిమితం చేయాలంటూ తేల్చిచెప్పింది. కానీ, అంతదూరంలో రైలు దిగితే ప్రయాణికులు మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో లోకల్ రైలును అక్కడి వరకు విస్తరించి ప్రయోజనం ఉండదని రైల్వేశాఖ వాదిస్తోంది. ఎయిర్‌పోర్టు సమీపంలో స్టేషన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే అక్కడకు కనెక్టివిటీ ప్రతిపాదననే రద్దు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయ స్థలం చూపితేనే... భవిష్యత్తులో విమానాశ్రయాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతోనే ఎంఎంటీఎస్ స్టేషన్‌ను దూరంగా నిర్మించాలని జీఎంఆర్ చెబుతోంది. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న స్థలంలో స్టేషన్ నిర్మించి, లైన్లు ఏర్పాటు చేస్తే విస్తరణకు స్థలం లేకుండా పోతుందనేది జీఎంఆర్ వాదన. ఒకవేళ ప్రభుత్వం ముందుగానే ప్రత్యామ్నాయంగా విమానాశ్రయానికి అనుకుని స్థలం ఇస్తే రైల్వే ప్రతిపాదనకు అంగీకరిస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశంలో వీటిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
శంషాబాద్ నుంచి కువైట్‌కు విమానం
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): తెలంగాణ ప్రాం త కార్మికులు నేరుగా కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు కువైట్‌లోని విదేశాం గశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదన చేశారు. ఇప్పటివరకు కువైట్‌కు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో కార్మికులు ఎక్కువ వ్య యం చేసి, ఇతర దేశాల మీదుగా అక్కడికి వెళ్లేవారు. నేరుగా విమాన సర్వీసు ఉంటే చార్జీల ఖర్చు తగ్గుతుంది. శుక్రవారం కువైట్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ కార్మికులు శంషాబాద్ నుంచి నేరుగా కువైట్‌కు లేవనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కువైట్‌కు వెళ్లాలంటే అబుదాబి, దుబాయ్, మస్కట్ ఇతరత్రా గల్ఫ్‌దేశాల మీదుగా వెళ్లాల్సివస్తుందని వివరించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు అయిన తరువాత కార్మికులు ఇక్కడి నుంచి వెళ్లడానికి ఆసక్తిని చూపుతున్నారు. కువైట్‌కు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఏర్పడుతున్న ఆర్థిక భారం గురించి కార్మికులు విదేశాంగ ఉన్నతాధికారుల కు వివరించడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. కువైట్‌కు నేరుగా విమాన సర్వీసును ప్రారంభించే ఏర్పాట్లు జరుగనున్నాయని నిజామాబాద్ జిల్లా ఏర్గట్లకు చెందిన ఆనందం జ్ఞాణేశ్వర్ ‘సాక్షి’కి ఫోన్లో వివరించారు. -
అభివృద్ధి చేశాం..ఆదరించండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘మా హయాంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందింది. రూ. ఆరు వేల కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, వికారాబాద్‌ను శాటిలైట్ సిటీగా ఆధునీకరించాం’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. పదేళ్లలో జిల్లాలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేశామని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా 19 నిమిషాలపాటు ప్రసంగించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాదేనని, ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అధికారంలోకివస్తే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్ధేశించిన చేవెళ్ల- ప్రాణహిత, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని సోనియా వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించామని, ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన సోనియా.. ఆ పార్టీ అధినేత అవకాశవాద, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు మారుపేరు అని విమర్శించారు. ఎవరో చెబితే తెలంగాణ ఇవ్వలేదని, 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించే ఇచ్చామని చెప్పుకొచ్చారు. బహిరంగసభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకులు వాయిలార్ రవి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులను సోనియాకు పొన్నాల పరిచయం చేశారు. భారీగా జనసమీకరణ సోనియా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. భారీగా జనసమీకరణ చేసింది. సుమారు 700 ప్రత్యేక బస్సులతో జిల్లా నలుమూలల నుంచి జనాలను చేవెళ్లకు తరలించారు. ఇటీవల తెలంగాణలో వివిధ చోట్ల జరిగిన అగ్రనేతల సమావేశాలు పేలవంగా జరిగిన నేపథ్యంలో జనసమీకరణపై మాజీ మంత్రి సబిత ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లను చేశారు. పార్టీశ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికల ప్రచారం ముగింపు వేళ అధినేత్రి ప్రసంగం నూతనోత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో కాదని, మీరే నిజమైన హీరోలని సోనియా పేర్కొనడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. కొన్ని పార్టీలు కల్లిబొల్లి మాటలతో దగా చేసేందుకు ముందుకొస్తున్నాయని, అవి చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలనే పిలుపునకు కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. కాగా, సోనియా రాకమునుపు కొందరు నేతలు చేసిన ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలను విసుగెత్తించాయి. -
ఎన్నికలతో బంగారం స్మగ్లింగ్‌కు లింకు
* ఈ కోణంలోనూ దర్యాప్తు: కస్టమ్స్ విభాగం * శంషాబాద్‌లో ఇద్దరు మహిళల నుంచి 15.7 కిలోల బంగారం స్వాధీనం * దిగుమతి సుంకం ఎగవేసేందుకే స్మగ్లింగ్ చేస్తున్నట్లు మహిళల అంగీకారం * వ్యవస్థీకృత ముఠాల ప్రమేయం ఉండొచ్చన్న కస్టమ్స్ రేంజ్ చీఫ్ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు సమీకరణలో భాగంగానే విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా పెరిగిందని అనుమానిస్తున్నట్లు కస్టమ్స్ విభాగం హైదరాబాద్ రేంజ్ చీఫ్ కమిషనర్ బి.బి.ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కోణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఒక్క బుధవారమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళల నుంచి 15.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రసాద్ కథనం ప్రకారం.. బంగారం తదితరాలను అక్రమ రవాణా చేస్తున్న వారి కోసం కస్టమ్స్ విభాగంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ విమానాశ్రయంలో పటిష్ట నిఘా ఉంచింది. స్మగ్లర్ల వేషధారణతో పాటు ప్రవర్తనే అనుమానించడానికి కీలక ఆధారంగా మారుతుంది. కొన్నిసార్లు పాస్‌పోర్ట్‌లో ఉండే వివరాలూ సందేహాలను కలిగిస్తాయి. సాధారణంగానే మహిళా ప్రయాణికులు అనుమానితుల జాబితాలో తక్కువగా ఉంటారు. అయితే బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు దోహా నుంచి ఖతర్ ఎయిర్ వేస్ విమానంలో వచ్చిన ఫాతిమా అనే మహిళ కదలికల్ని అనుమానించిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల నేపథ్యంలో ఈమె బ్యాగేజ్, లగేజీల్లో రూ. 78 లక్షల విలువైన 2.7 కిలోల బంగారం బయటపడింది. దిగుమతి సుంకం ఎగవేత కోసమే అక్రమరవాణా చేస్తున్నామని అంగీకరించిన ఫాతిమాను అరెస్టు చేసిన కొన్ని గంటలకే మరో మహిళ పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టస్‌గా పని చేస్తున్నారు. దుబాయ్‌లో విధులు ముగించుకున్న ఈమె ఆఫ్ డ్యూటీలో ఉండి ఎమిరేట్స్ ఫ్లైట్‌లోనే బుధవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగినప్పటికి నుంచి అదో రకంగా ప్రవర్తిస్తున్న ఈమెను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే కేజీ బరువున్న 13 బంగారం కడ్డీలను తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వీటి విలువ రూ. 3.76 కోట్లుగా నిర్ధారించారు. ఈమె సైతం సుంకం ఎగవేత కోసమే అక్రమ రవాణా చేశానని చెప్తున్నప్పటికీ ఈ వ్యవహారాల వెనుక వ్యవస్థీకృత ముఠాల ప్రమేయాన్ని అనుమానిస్తున్న కస్ట మ్స్ అధికారులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు 16 నెలల్లో రూ. 20.12 కోట్ల విలువైన 67.758 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక శాతం స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగున ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, మొబైల్ చార్జర్స్‌లో దాచి తీసుకు వస్తున్నారని గుర్తించారు. విదేశాల్లో 6 నెలలు ఉండి వచ్చే వారు నిర్ణీత పన్ను చెల్లించి కేజీ బంగారం వరకు తెచ్చుకునే అవకాశం ఉందని ప్రసాద్ తెలిపారు. బరువుకు ఒంగిపోయి దొరికిపోయి... శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ చిక్కిన ఇద్దరు మహిళల్లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తున్న సదాఫ్ఖాన్ ఒకరు. ఈమె గతంలోనూ అనేకసార్లు హైదరాబాద్ వచ్చారు. ఈసారీ దుబాయ్ నుంచి వస్తూ తన హ్యాండ్ బ్యాగ్‌లో రహస్యంగా ఏర్పాటు చేసిన అరలో 13 కేజీల బరువున్న 13 బంగారం కడ్డీలను తీసుకువచ్చారు. వీటిపైన మెర్క్యూరీ పేపర్ చుట్టడంతో స్కానర్‌కు చిక్కకుండా బయటపడ్డారు. అయితే అంత బరువున్న బ్యాగ్‌ను మోస్తున్న కారణంగా సదాఫ్ఖాన్ ఒంగిపోయి భిన్నంగా నడవాల్సి వచ్చింది. ఈ శైలిని చూసి అనుమానించిన కస్టమ్స్ విభాగం అధికారులు ఆమెను తనిఖీ చేయటంతో విషయం బయటపడింది. -
సామాన్యుడికీ విమానయోగం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఊరుంటే రోడ్డు పడుతుంది. రోడ్డుంటే బస్సు వస్తుంది. విమానమూ అంతే. విమానాశ్రయం ఉంటే చాలు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఉద్దేశమూ ఇదే. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 200 విమానాశ్రయాలను 20 ఏళ్లలో అభివృద్ధి చేయాలన్నదే ఈ శాఖ లక్ష్యం. తద్వారా దేశీయంగా చిన్న నగరాలకు విమాన సర్వీసులను పెంచాలని చూస్తోంది. మరోవైపు కర్ణాటక ఒక అడుగు ముందుకేసి కోటి రూపాయలకే చిన్న విమానాశ్రయం (ఎయిర్‌స్ట్రిప్) కట్టి చూపిస్తామంటోంది. ఇందుకోసం తమ రాష్ట్రంలో 11 ప్రాంతాలను గుర్తించామని, సామాన్యుడికి విమాన సేవలు కొద్ది రోజుల్లో అందిస్తామని సగర్వంగా చెబుతోంది. మరి కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్రలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను వాడుకలోకి తేవడం, అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తే పర్యాటకంగా, పారిశ్రామికంగానూ ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. సామాన్యుడికి విమాన సేవలు చేరువ అవుతాయి కూడా. ఇవిగో విమానాశ్రయాలు... విమానాశ్రయం అనగానే ప్రముఖంగా వినిపించే పేరు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట. ఇవేగాక హైదరాబాద్ సమీపంలో రక్షణ శాఖ ఆధీనంలో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉన్నాయి. నాదర్గుల్ ఎయిర్‌పోర్ట్‌ను పైలట్ శిక్షణ సంస్థలు వినియోగిస్తున్నాయి. రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, కరీంనగర్ జిల్లా బసంత్‌నగర్ ఎయిర్‌స్ట్రిప్స్ పూర్తిగా ప్రైవేటువి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ప్రకాశం జిల్లా దొనకొండ, వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్, నాగార్జున సాగర్, నల్గొండతోపాటు ఇదే జిల్లాలో ఉన్న ఆలేరు, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎయిర్‌స్ట్రిప్స్ మూతపడ్డాయి. నిజామాబాద్, నెల్లూరు, కొత్తగూడెం, కర్నూలులో విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు మామనూరు, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశీలనలో ఆదిలాబాద్ కూడా ఉంది. కడపలో ఇటీవలే రూ.60 కోట్లతో చేపట్టిన విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయింది. ఏప్రిల్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయాల రాకతో పర్యాటకం తోపాటు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి పెరుగుతుందని బేగంపేట విమానాశ్రయ డెరైక్టర్ ఐ.ఎన్.మూర్తి చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ ఎయిర్‌స్ట్రిప్‌లు రావాలని ఆకాంక్షించారు. తద్వారా ఆపత్కాల పరిస్థితుల్లో తక్షణ సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. కనెక్టివిటీ పాలసీ.. రీజినల్, రిమోట్ ఏరియా ఎయిర్ కనెక్టివిటీ పాలసీని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూపొందించింది. విమానాలు తక్కువగా నడుస్తున్న, ఏమాత్రం నడవని ప్రాంతాలకు సర్వీసులను విస్తరించడమే పాలసీ ముఖ్యోద్దేశం. ఇక ఎంపిక చేసిన విమానాశ్రయాలకు సర్వీసులు నడిపే ఆపరేటర్లకు ల్యాండింగ్, పార్కిం గు, రూట్ నేవిగేషన్ ఫెసిలిటీ, ప్యాసింజరు సర్వీసు వంటి ఫీజులు మినహాయిస్తారు. రక్షణ శాఖ ఆధీనంలోని విమానాశ్రయాలకూ ఇలాంటి రాయితీలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు. షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ఎయిర్‌లైన్స్‌కే రాయితీలు వర్తిస్తాయి. సర్వీసులు నడిచేందుకు మౌలిక ఏర్పాట్లు, విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గిం పు, విద్యుత్ చార్జీలపై పన్ను మినహాయింపు, ఆస్తి పన్ను ఐదేళ్లపాటు మినహాయింపు వంటివి రాష్ట్రాలే కల్పించాలని పాలసీ చెబుతోంది. అంతేకాకుండా నిర్ణీత రూట్లలో నడుస్తున్న సర్వీసుల్లో గుర్తించిన మారుమూల ప్రాంతాలకు ఆపరేటర్లు 10% సర్వీసులను కేటాయించాల్సిందేనని ప్రభుత్వం 1994లో రూపొం దించిన రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్ నిర్దేశిస్తోంది. వీటిని వాడుకుందాం... కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా అటు పర్యాటకం, ఇటు సాధారణ విమాన ప్రయాణానికీ ఉపయుక్తంగా ఉంటుంది. విదేశీ పర్యాటకులు విమానంలో మన ప్రాంతానికి రావాలంటే ప్రస్తుతానికి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రికి మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్న నగరాలన్నీ పర్యాటకంగా ప్రముఖమైన స్థలాలకు సమీపంలో ఉన్నవే. ఈ నేపథ్యంలో హెలిటూరిజంను ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పట్నుంచో యోచిస్తోంది. మొత్తం ఎయిర్ ట్రాఫిక్‌లో మెట్రోయేతర నగరాల వాటా ప్రస్తుతం 30 శాతమే. భవిష్యత్తులో ఇది 45%కి చేరొచ్చని అంచనా. ప్రాంతాలు-ప్రత్యేకతలు... తాడేపల్లి గూడెం, ఏలూరు: ద్వారకా తిరుమల దేవాలయం, పాపి కొండలు, పట్టిసీమ, క్షీరారామం, గుంటుపల్లి గుహలు, కొల్లేరు సరస్సు, పోలవరం. దొనకొండ: గుండ్లకమ్మ రిజర్వాయర్, చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ, చీరాల. బసంత్‌నగర్: వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, ఎలగందల ఖిల్లా. మామునూరు: వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, రామప్ప గుడి, పాకాల చెరువు, లక్నవరం సరస్సు, ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సమ్మక్క సారక్క జాతర జరిగే మేడారం వరంగల్ జిల్లాలోనే ఉంది. నిజామాబాద్: నిజాం సాగర్, దోమకొండ ఖిల్లా, కెంటు మసీదు. నెల్లూరు: పెంచలకోన, సోమశిల డ్యాం, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, ఉదయగిరి ఖిల్లా. కొత్తగూడెం: భద్రాచలం, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కర్నూలు: శ్రీశైలం, మంత్రాలయం, బెలూం గుహలు, రాయల్ ఫోర్ట్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, మహానంది, అహోబిలం, కొండారెడ్డి ఖిల్లా. నాగార్జున సాగర్: సాగర్ డ్యాం. బొబ్బిలి: ఎటువంటి అతుకులు లేకుండా తయారయ్యే బొబ్బిలి వీణ కొనేందుకు విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు. రామతీర్థం ప్రముఖ పుణ్య క్షేత్రం. నల్గొండ: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, భువనగిరి ఖిల్లా, కొలనుపాక దేవాలయం.