సామాన్యుడికీ విమానయోగం | Commoner also travel in aeroplane | Sakshi
Sakshi News home page

సామాన్యుడికీ విమానయోగం

Published Fri, Mar 28 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

సామాన్యుడికీ విమానయోగం

సామాన్యుడికీ విమానయోగం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఊరుంటే రోడ్డు పడుతుంది. రోడ్డుంటే బస్సు వస్తుంది. విమానమూ అంతే. విమానాశ్రయం ఉంటే చాలు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఉద్దేశమూ ఇదే. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 200 విమానాశ్రయాలను 20 ఏళ్లలో అభివృద్ధి చేయాలన్నదే ఈ శాఖ లక్ష్యం. తద్వారా దేశీయంగా చిన్న నగరాలకు విమాన సర్వీసులను పెంచాలని చూస్తోంది. మరోవైపు కర్ణాటక ఒక అడుగు ముందుకేసి కోటి రూపాయలకే చిన్న విమానాశ్రయం (ఎయిర్‌స్ట్రిప్) కట్టి చూపిస్తామంటోంది.

ఇందుకోసం తమ రాష్ట్రంలో 11 ప్రాంతాలను గుర్తించామని, సామాన్యుడికి విమాన సేవలు కొద్ది రోజుల్లో అందిస్తామని సగర్వంగా చెబుతోంది. మరి కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్రలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను వాడుకలోకి తేవడం, అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తే పర్యాటకంగా, పారిశ్రామికంగానూ ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. సామాన్యుడికి విమాన సేవలు చేరువ అవుతాయి కూడా.

 ఇవిగో విమానాశ్రయాలు...
 విమానాశ్రయం అనగానే ప్రముఖంగా వినిపించే పేరు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట. ఇవేగాక హైదరాబాద్ సమీపంలో రక్షణ శాఖ ఆధీనంలో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉన్నాయి. నాదర్‌గుల్ ఎయిర్‌పోర్ట్‌ను పైలట్ శిక్షణ సంస్థలు వినియోగిస్తున్నాయి. రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి ఎయిర్‌పోర్ట్, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, కరీంనగర్ జిల్లా బసంత్‌నగర్ ఎయిర్‌స్ట్రిప్స్ పూర్తిగా ప్రైవేటువి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ప్రకాశం జిల్లా దొనకొండ, వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్, నాగార్జున సాగర్, నల్గొండతోపాటు ఇదే జిల్లాలో ఉన్న ఆలేరు, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎయిర్‌స్ట్రిప్స్ మూతపడ్డాయి.

 నిజామాబాద్, నెల్లూరు, కొత్తగూడెం, కర్నూలులో విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు మామనూరు, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశీలనలో ఆదిలాబాద్ కూడా ఉంది. కడపలో ఇటీవలే రూ.60 కోట్లతో చేపట్టిన విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయింది. ఏప్రిల్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయాల రాకతో పర్యాటకం తోపాటు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి పెరుగుతుందని బేగంపేట విమానాశ్రయ డెరైక్టర్ ఐ.ఎన్.మూర్తి చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ ఎయిర్‌స్ట్రిప్‌లు రావాలని ఆకాంక్షించారు. తద్వారా ఆపత్కాల పరిస్థితుల్లో తక్షణ సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు.

 కనెక్టివిటీ పాలసీ..
 రీజినల్, రిమోట్ ఏరియా ఎయిర్ కనెక్టివిటీ పాలసీని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూపొందించింది. విమానాలు తక్కువగా నడుస్తున్న, ఏమాత్రం నడవని ప్రాంతాలకు సర్వీసులను విస్తరించడమే పాలసీ ముఖ్యోద్దేశం. ఇక ఎంపిక చేసిన విమానాశ్రయాలకు సర్వీసులు నడిపే ఆపరేటర్లకు ల్యాండింగ్, పార్కిం గు, రూట్ నేవిగేషన్ ఫెసిలిటీ, ప్యాసింజరు సర్వీసు వంటి ఫీజులు మినహాయిస్తారు. రక్షణ శాఖ ఆధీనంలోని విమానాశ్రయాలకూ ఇలాంటి రాయితీలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు. షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ఎయిర్‌లైన్స్‌కే రాయితీలు వర్తిస్తాయి.

సర్వీసులు నడిచేందుకు మౌలిక ఏర్పాట్లు, విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గిం పు, విద్యుత్ చార్జీలపై పన్ను మినహాయింపు, ఆస్తి పన్ను ఐదేళ్లపాటు మినహాయింపు వంటివి రాష్ట్రాలే కల్పించాలని పాలసీ చెబుతోంది. అంతేకాకుండా నిర్ణీత రూట్లలో నడుస్తున్న సర్వీసుల్లో గుర్తించిన మారుమూల ప్రాంతాలకు ఆపరేటర్లు 10% సర్వీసులను కేటాయించాల్సిందేనని ప్రభుత్వం 1994లో రూపొం దించిన రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్ నిర్దేశిస్తోంది.
 
 వీటిని వాడుకుందాం...
 కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా అటు పర్యాటకం, ఇటు సాధారణ విమాన ప్రయాణానికీ ఉపయుక్తంగా ఉంటుంది. విదేశీ పర్యాటకులు విమానంలో మన ప్రాంతానికి రావాలంటే ప్రస్తుతానికి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రికి మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్న నగరాలన్నీ పర్యాటకంగా ప్రముఖమైన స్థలాలకు సమీపంలో ఉన్నవే. ఈ నేపథ్యంలో హెలిటూరిజంను ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పట్నుంచో యోచిస్తోంది. మొత్తం ఎయిర్ ట్రాఫిక్‌లో మెట్రోయేతర నగరాల వాటా ప్రస్తుతం 30 శాతమే. భవిష్యత్తులో ఇది 45%కి చేరొచ్చని అంచనా.
 
 ప్రాంతాలు-ప్రత్యేకతలు...
 తాడేపల్లి గూడెం, ఏలూరు: ద్వారకా తిరుమల దేవాలయం, పాపి కొండలు, పట్టిసీమ, క్షీరారామం, గుంటుపల్లి గుహలు, కొల్లేరు సరస్సు, పోలవరం.
 దొనకొండ: గుండ్లకమ్మ రిజర్వాయర్, చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ, చీరాల.
 బసంత్‌నగర్: వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, ఎలగందల ఖిల్లా.
 మామునూరు: వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, రామప్ప గుడి, పాకాల చెరువు, లక్నవరం సరస్సు, ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సమ్మక్క సారక్క జాతర జరిగే మేడారం వరంగల్ జిల్లాలోనే ఉంది.

 నిజామాబాద్: నిజాం సాగర్, దోమకొండ ఖిల్లా,  కెంటు మసీదు.

 నెల్లూరు: పెంచలకోన, సోమశిల డ్యాం, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, ఉదయగిరి ఖిల్లా.
 కొత్తగూడెం: భద్రాచలం, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ  కేంద్రం.

 కర్నూలు: శ్రీశైలం, మంత్రాలయం, బెలూం గుహలు, రాయల్ ఫోర్ట్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, మహానంది, అహోబిలం, కొండారెడ్డి ఖిల్లా.
 నాగార్జున సాగర్: సాగర్ డ్యాం.

 బొబ్బిలి: ఎటువంటి అతుకులు లేకుండా తయారయ్యే బొబ్బిలి వీణ కొనేందుకు విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు. రామతీర్థం ప్రముఖ పుణ్య క్షేత్రం.

 నల్గొండ: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, భువనగిరి ఖిల్లా, కొలనుపాక దేవాలయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement