Department of Civil Aviation
-
విమాన తయారీకి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా వాణిజ్య విమానాల తయారీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనుంది. తద్వారా విమాన తయారీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వైమానిక రంగానికి పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024ను లోక్‌సభ ఆగస్ట్‌లో ఆమోదించింది. ఈ బిల్లులో విమాన తయారీ, డిజైన్లను నియంత్రించే ప్రొవిజన్లను చేర్చింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా సొంత తయారీకి దారి ఏర్పాటు చేసింది. వెరసి సొంత విమానాలను భారత్ తయారు చేసుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు తెరతీసిందని నాయుడు తెలియజేశారు. ఇందుకు ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో పరిశ్రమ సంబంధిత నిపుణులు తదితరులను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో సొంత విమానాల తయారీ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని హామీనిచ్చారు. విమాన తయారీలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. వీటిని భారత్ ఎగుమతి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమాన తయారీ దిగ్గజాలు బోయింగ్, ఎయిర్‌బస్‌లకు భారత్ కీలక మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఇప్పటికే చిన్నతరహా పౌర విమానాలను రూపొందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న వైమానిక మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. పీహెచ్డీ సీసీఐ ఏర్పాటు చేసిన సదస్సులో నాయుడు వైమానిక తయారీ అంశాలపై ప్రసంగించారు. విమానాల నిర్వహణ, పూర్తిస్థాయి తనిఖీలు, మరమ్మతుల(ఎంఆర్వో) కార్యకలాపాలలో సైతం భారత్‌కు అపార అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశాన్ని వైమానిక, ఎయిర్ కార్గో, ఎంఆర్వో కార్యకలాపాలకు కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తావించారు. -
మామునూరుకు పెద్ద విమానాలు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయాన్ని పెద్ద విమానాల ఆపరేషన్‌తోనే ప్రారంభించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించడంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. అవరోధంగా ఉన్న రెండు ప్రధాన అంశాలను వెంటనే కొలిక్కి తెచ్చేలా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం–పౌరవిమానయాన శాఖ మధ్య ఒప్పందం కుదరనుంది. విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుండగా 150 కి.మీ. నిడివిలో మరో విమానాశ్రయం ఉండకూడదన్న అంశాన్ని అధిగమించేలా హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో పౌర విమానయాన శాఖ చర్చలు జరపనుంది. ఈ రెండు కీలక ప్రక్రియలు పూర్తయితే ఏడాదిన్నరలోపే విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ భావిస్తోంది. ఈ ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఓ పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే.. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయమే అందుబాటులో ఉంది. బేగంపేటలోని పాత విమానాశ్రయం కేవలం ప్రముఖుల ప్రత్యేక విమానాల నిర్వహణకే పరిమితమైంది. దీంతో రెండో విమానాశ్రయం వెంటనే అవసరమని నిర్ణయించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయానికి చర్యలు చేపట్టింది. దాంతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలలో మరో ఐదు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మిగతా వాటి విషయంలో జాప్యం జరిగే పరిస్థితి ఉండటంతో వరంగల్ విమానాశ్రయాన్ని వెంటనే నిర్మించాలని చర్చల సందర్భంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయి. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంలో ఎయిర్‌్రస్టిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్‌వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే ఉంది. దశాబ్దాలుగా వాటి వినియోగం లేకపోవటంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత్ ఎయిర్్రస్టిప్కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధీనంలోనే ఉంది. అక్కడే ఇప్పుడు కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. పెద్ద విమానాశ్రయం నిర్మాణమంటే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున చిన్న విమానాలు ఆపరేట్ చేసేలా ప్రస్తుతానికి చిన్న రన్‌వేతో చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలో భావించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దాన్ని విస్తరిస్తూ పోవాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఒకేసారి పెద్ద విమానాలను ఆపరేట్ చేసే పూర్తిస్థాయి విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఖరారు చేశారు. ఇటీవల కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంతో ఉండటంతో దీనికి మార్గం సుగమమవుతోంది. అదనపు భూసేకరణకు రంగం సిద్ధం.. అందుబాటులో ఉన్న భూమికి అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్కడికి చేరువలోనే పశుసంవర్థక శాఖకు చెందిన స్థలం అందుబాటులో ఉండటంతో దాన్ని సేకరించనున్నారు. ఒక గ్రామాన్ని తరలించాల్సి ఉంటుంది. త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం. విమానాశ్రయం వస్తే వరంగల్‌కు మరిన్ని పెట్టుబడులు.. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా వరంగల్ విస్తరిస్తోంది. దాన్ని ఐటీ, ఇతర పరిశ్రమల స్థాపనతో వేగంగా అభివృద్ధి చేయాల్సి ఉందని చాలా ఏళ్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలే కాజీపేట శివారులో కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరింత వేగంగా పారిశ్రామీకరణ జరగాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు రావాలంటే స్థానికంగా విమానాశ్రయం ఉండాలన్నది పారిశ్రామికవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం హైదరాబాద్‌కు వరంగల్ 135 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్‌లో విమానం దిగి దాదాపు మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు కొంత ఆటంకంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. వరంగల్‌లోనే నేరుగా ల్యాండ్ అయ్యే ఏర్పాటు ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని తేల్చారు. ఇదే విషయాన్ని జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని కేంద్రరాష్ట్రప్రభుత్వాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి 150 కి.మీ. నిడివిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండకూడదన్నది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో ఆ సంస్థకు ఉన్న ఒప్పందం చెబుతోంది. ఈ నిబంధన ఇప్పుడు వరంగల్ విమానాశ్రయానికి అడ్డంకిగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇందుకు త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రతినిధులు ఇందులో ఉంటారని సమాచారం. ఈ కమిటీ సభ్యులు జీఎంఆర్‌తో సంప్రదింపులు జరిపి ఈ సమస్యను కొలిక్కి తేనున్నారు. -
Wings India 2024: ఎయిర్ షో తేదీలు ఖరారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్‌షో ప్రత్యేక ఆకర్షణ. -
ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
పౌర విమానయాన మంత్రితో బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందని, రాష్ట్రంలో పౌర విమానయాన రంగానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ కొలిక్కి వచ్చాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. బుధవారం ఢిల్లీలోని నిర్మాణ్‌భవన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో బుగ్గన సమావేశమయ్యారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయాలకు సంబంధించి పెండింగ్ పనుల విషయమై కేంద్రమంత్రితో చర్చించారు. భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించిన అనుమతుల గురించి కేంద్రమంత్రితో మాట్లాడానని తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం త్వరలోనే ఉంటుందన్నారు. అలాగే భోగాపురానికి సంబంధించి ప్రస్తుత ఎయిర్‌పోర్టు నుంచి తరలింపు అంశంతోపాటు ఇతర సాంకేతిక అంశాలపై చర్చించామని చెప్పారు. అన్ని అంశాలపై పౌర విమానయాన మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని పేర్కొన్నారు. మాది టీడీపీ మాదిరిగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాదు తమ ప్రభుత్వం టీడీపీ మాదిరిగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాదని, సహనంతో కూడిన సమర్థత కలిగిన ప్రభుత్వమని బుగ్గన చెప్పారు. శంకుస్థాపనల కోసం కాకుండా ప్రారంభోత్సవాలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. -
విమాన చార్జీలకు ఇంకాస్త రెక్కలు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో సెక్యూరిటీ ఫీజు పెరగనుండటంతో విమాన టికెట్ల చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. దీంతో దేశీయంగా ప్రయాణించే వారు ఇకపై రూ. 150 బదులుగా రూ.160 చెల్లించాల్సి రానుంది. అలాగే అంతర్జాతీయ ప్యాసింజర్లు 3.25 డాలర్లు కాకుండా 4.85 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. టికెట్ చార్జీల్లో భాగంగా సెక్యూరిటీ ఫీజు ఉంటుంది. ప్యాసింజర్లు చెల్లించిన సెక్యూరిటీ ఫీజును విమానయాన సంస్థలు .. ప్రభుత్వానికి కడతాయి. విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్ల నిర్వహణకు ఈ నిధులను వినియోగిస్తారు. గతేడాదే దేశీ ప్రయాణాలపై సెక్యూరిటీ ఫీజును రూ. 130 నుంచి రూ. 150కి, విదేశీ ప్రయాణాల టికెట్లపై 3.25 డాలర్లకు పౌర విమానయాన శాఖ పెంచింది. ఇప్పటికే కరోనా వైరస్ పరిణామాలతో విమాన సర్వీసులు రద్దవుతూ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఏవియేషన్ రంగంపై ఇది మరికాస్త భారం కానుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. మూడు నెలల నుంచి ఫ్లయిట్లు నామమాత్రంగా నడుస్తున్నప్పటికీ.. గతేడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్రయాణికుల రద్దీ 82.3 శాతం తగ్గింది. జూన్‌లో దేశీయంగా ఆరు దిగ్గజ ఎయిర్‌లైన్స్‌లో అయిదు సంస్థల ఆక్యుపెన్సీ రేటు 50–60% నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో స్పైస్‌జెట్ ఆక్యుపెన్సీ రేటు 70%, ఇండిగో 60.2%, గోఎయిర్ 50.5%, విస్తార 53.1%, ఎయిర్ఏషియా ఇండియా 56.2 శాతం, ఎయిరిండియా 45.5%గా ఉంది. సంక్షోభ పరిస్థితులతో కుదేలవుతున్న విమానయాన రంగ సంస్థలకు ఊరటనిచ్చే చర్యలపై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2 -
విమానాశ్రయాల్లో పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప విమానా శ్రయాల్లో పౌర విమానయాన శాఖ సూచనల మేరకు థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారి కోసం విశాఖ విమానా శ్రయంలో ప్రత్యేక ఎయిర్‌బ్రిడ్జి, క్యూలైన్లను ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పంపిస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ ‘సాక్షి’కి వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. - 15 దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. - విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు విమాన సర్వీసులు ఉన్నాయి. 15 దేశాల జాబితాలో సింగపూర్, మలేషియా ఉండగా, దుబాయ్ లేదు. దీంతో సింగపూర్, మలేషియా నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం. - విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించి ఆ సమాచారాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, విమానయాన శాఖ, ఇమిగ్రేషన్లకు పంపుతున్నాం. విశాఖలో చేపట్టిన చర్యలు.. - 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా మూడు షిప్టుల్లో వైద్యులు - అనుమానిత రోగులను తరలించడానికి ప్రత్యేక అంబులెన్స్ - శానిటైజేషన్ కోసం ప్రత్యేకంగా 116 మంది సిబ్బంది నియామకం - ప్రయాణికులు చేతులు శుభ్రపర్చుకోవడానికి శానిటైజర్ల ఏర్పాటు - సిబ్బంది, ప్రయాణికులకు మాస్కుల పంపిణీ - విదేశాల నుంచి వచ్చిన వారిని 28 రోజు ల పాటు ఇంటి నుంచి పర్యవేక్షించడం -
బాల బాహుబలి
తల్లి చేయాల్సిన అభిషేకం కోసం ఏకంగా శివలింగాన్నే పెళ్లగించి జలపాతం కింద ఉంచాడు సినీ బాహుబలి! తల్లిదండ్రులు ధాన్యం మూటగట్టడానికి పడే కష్టాన్ని తాను కనిపెట్టిన యంత్రంతో తేలిక చేశాడు ఈ బాల బాహుబలి!! అతడు కనిపెట్టిన పరికరం ధాన్యాన్ని సులువుగా నింపి, ఒక చోట నుంచి మరో చోటకు సునాయాసంగా మోసుకెళ్లడానికి వీలుకల్పిస్తుండటంతో జాతీయ అవార్డే వరించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డుల పోటీలో మూడో బహుమతిని గెల్చుకుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ పరికరాన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. మన వాళ్ల ఆవిష్కరణలను వెలుగులోకి వచ్చిన వెంటనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వం. గొప్ప ప్రారంభం. ప్రభుత్వం ఇదే మాదిరిగా దృష్టి సారించాల్సిన అద్భుత గ్రామీణ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మూలనపడి ఉన్నాయి. వాటిలో కొన్నిటికైనా గుర్తింపు వస్తుందని, ఆవిష్కర్తలకూ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. పద్నాలుగు సంవత్సరాల మర్రిపల్లి అభిషేక్ రైతు బిడ్డ. 8వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట అతని స్వగ్రామం. ఆ ఊళ్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి. తండ్రి లక్ష్మీరాజం వ్యవసాయ పనులు చేస్తూ, తల్లి రాజవ్వ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సెలవు రోజుల్లో ఇంటివద్ద ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి అభిషేక్ ప్రయత్నిస్తుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత వేసవిసెలవుల్లో సిరంజీలు, కాటన్ బాక్స్‌లతో వాటర్ ప్రెషర్ ద్వారా నడిచే పొక్లెయినర్‌ను తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఓ రోజు తన తండ్రితో కలసి వేములవాడలోని మార్కెట్‌యార్డుకు వెళ్లాడు. అక్కడ కార్మికులు ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతున్నారు. ఒకరు ఖాళీ సంచిని పట్టుకొని నిలబడుతుంటే, మరొకరు ధాన్యాన్ని కిందినుంచి ఎత్తి సంచిలో నింపుతున్నారు. ధాన్యం నింపిన బస్తాను మరో ఇద్దరు తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. ఈ పనిని అభిషేక్ శ్రద్ధగా గమనించాడు. ఒక ధాన్యం సంచిని నింపడానికి నలుగురు పనిచేయాలా? ఈ కష్టాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేమా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచనే తక్కువ శ్రమతో చక్కగా పనిచేసే ఓ పరికరం రూపకల్పనకు దారితీసింది. ఈ పరికరంలో 2 నిమిషాల్లో ధాన్యం బస్తాను నింపి, బరువు ఎంతో తెలుసుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అతనికి వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి, జాతీయ స్థాయి బహుమతిని పొందడానికి హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, సైన్స్టీచర్ వెంకటేశం ప్రోత్సాహం తోడ్పడింది. గొప్ప ఆలోచన.. రూ. 5 వేల ఖర్చు.. ధాన్యాన్ని సంచిలోకి సులువుగా ఎత్తే పరికరం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్)ను తయారు చేస్తే బాగుంటుందన్న తన ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులకు అభిషేక్ తెలియజేశాడు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ఆలోచనకు ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత గైడ్ టీచర్ వెంకటేశ్ సూచనలు, సహకారంతో ఐరన్ షీట్లు, రాడ్లు, బరువు తూచే మిషన్‌ను కొనుగోలు చేసి.. వారం రోజులపాటు వెల్డింగ్ షాపులో శ్రమించి తను ఆశించిన విధంగా అభిషేక్ పరికరాన్ని ఆవిష్కరించాడు. ఇందుకోసం రూ. 5 వేల వరకు ఖర్చయింది. ఈ పరికరంతో ఒక్కరే అత్యంత సులభంగా కేవలం రెండు నిమిషాల్లోనే ధాన్యాన్ని బస్తాలోకి నింపుకోవచ్చు. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ట్రాలీ వంటిది ఒకటి, ధాన్యాన్ని తీసుకొని సంచిలోకి పోసే పరికరం ఒకటి. సంచిని నింపిన తర్వాత ఈ రెంటిని విడదీసి, ట్రాలీ ద్వారా ధాన్యం బస్తాను గోదాములోకి తీసుకెళ్లి భద్రంగా పెట్టుకోవచ్చు. నలుగురు చేసే పనిని ఒక్కరే రెండునిమిషాల్లో పూర్తిచేయడానికి ఈ పరికరం దోహదపడుతోంది. ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనక్’ ఎగ్జిబిషన్– 2019లో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ వాష్‌రూమ్ క్లీనర్‌కు మొదటి బహుమతి, అండమాన్ నికోబార్‌కు చెందిన విద్యార్థి తయారుచేసిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఓపెనర్‌కు రెండో బహుమతి వచ్చింది. అభిషేక్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌కు మూడవ స్థానం వచ్చింది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ డా. రాంగోపాల్‌రావు చేతుల మీదుగా రూ. పదివేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్ లభించింది. పిన్నవయసులోనే చక్కటి పరికరాన్ని రూపొందించిన అభిషేక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెన్నుతట్టి రూ. 1.16 లక్షల చెక్కు ఇచ్చి అభినందించారు. అభిషేక్ రూపొందించిన పరికరాన్ని మరింత మెరుగుపరచి ఈ రబీ సీజన్లోనే ప్రయోగాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వినియోగించడంతోపాటు, ‘వరి అభిషేక్’ పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేయడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకుల్ సబర్వాల్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రూ. పదివేల నగదు ప్రోత్సాహాన్ని అభిషేక్‌కు అందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే వీలుందని అభిషేక్ గైడ్ టీచర్ వెంకటేశం(85008 65263) తెలిపారు. ఏమిటీ ‘ఇన్స్పైర్’ అవార్డు? కేంద్ర శాస్త్ర – సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ అవార్డ్స్– మనక్’ పోటీలను నిర్వహిస్తున్నాయి. 2020 నాటికి శాస్త్రవిజ్ఞాన రంగంలో మొదటి 5 దేశాల్లో మన దేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణాభిలాషకు ప్రేరణ కలిగించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 6–10వ తరగతుల (10–15 ఏళ్ల వయసు) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను గుర్తించడం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాలను రేకెత్తించడమే లక్ష్యం. ఈ ఆలోచనలు సొంతవి, సాంకేతికతకు సంబంధించినవి అయి ఉండాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో, వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేవిగా ఉండే సొంత ఆలోచనలై ఉండాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పది లక్షల వినూత్న ఆలోచనలను సేకరిస్తారు. వాటిలో ఉత్తమమైన వాటిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మెరుగైన ఆలోచనల ప్రకారం యంత్ర పరికరాల నమూనాలను తయారు చేయడానికి రూ. పది వేల చొప్పున గ్రాంటును మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా గరిష్టంగా వెయ్యి ఆవిష్కరణలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బహుమతులు పొందిన ఆవిష్కరణలకు స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక సంస్థల ద్వారా సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించి, ఆయా ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షన్నర పాఠశాలల నుంచి 2.88 లక్షల వినూత్న ఆలోచనలను సేకరించి వడపోసిన తర్వాత 60 ఆవిష్కరణలు ఢిల్లీకి చేరాయి. అందులో మూడోస్థానాన్ని తెలుగు విద్యార్థి అభిషేక్ దక్కించుకోవడం విశేషం. ఇంత పేరు తెస్తాడనుకోలేదు! నా కొడుకు తయారు చేసిన వడ్ల మిషన్కి ఇంత పేరు వస్తుందని నాకు తెలియదు. బడి లేని రోజుల్లో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. కానీ తను తయారు చేసిన ఈ పరికరం ఇంత పేరు తెస్తుందని అనుకోలేదు. ఢిల్లీలో నా కొడుకు అవార్డు తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. – మర్రిపల్లి రాజవ్వ, అభిషేక్ తల్లి, హన్మాజిపేట మరిన్ని పరికరాలు తయారు చేస్తా ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని తయారు చేయగలిగా. నాకు ఏదైనా తయారు చేయాలనే ఆలోచన కలిగినప్పుడల్లా వెంకటేశం సారు, ఇతర టీచర్లు ప్రోత్సహించారు. ఇంటివద్ద అమ్మ, అక్కలు కూడా సహాయం చేసేవారు. నా పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, మూడో బహమతి పొందడం ఆనందంగా ఉంది. ఇకముందు మరిన్ని కొత్త యంత్రాలను తయారుచేస్తా. ఐఏఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. – మర్రిపల్లి అభిషేక్, 8వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మాజిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్స్పైర్’ పోటీల్లో తన పరికరంతో అభిషేక్ – పాదం వెంకటేశ్, సాక్షి, సిరిసిల్ల ఫొటోలు: పుట్టపాక లక్ష్మణ్ -
రేణిగుంట రన్‌వేపై తప్పిన ముప్పు
రేణిగుంట, శంషాబాద్: చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే చివర కుంగడంతో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని గాల్లోకి లేపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయాన్ని పైలట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెప్పడంతో వారు కుంగిన రన్‌వేకు మరమ్మతులు చేసి మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో విమానాల రాకపోకలకు అనుమతించారు. సుమారు 5 గంటలపాటు విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో అవస్థలు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన పలు విమానాలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి నిలిచిపోయాయి. అలాగే తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు, స్పైస్‌జెట్ విమానం నిర్ణీత సమయానికి రాకపోవడం, తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 5.45, 7.10 గంటలకు వెళ్లాల్సిన విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వర్షంలోనే రన్‌వే విస్తరణ పనులు అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు వీలుగా రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు కేంద్ర విమానయానశాఖ అనుమతులు మంజూరుచేసింది. రెండ్రోజుల క్రితం రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించారు. సోమవారం రాత్రి 10 గంటలకు వర్షంలోనే రన్‌వే పొడిగింపు పనుల్ని కొనసాగించారు. మంగళవారం ఉదయం నుంచి ఆ రన్‌వేపై పలు విమానాలు రాకపోకలు సాగించాయి. అవన్ని చిన్న విమానాలు కావడంతో రన్‌వే సగం వరకే వెళ్లి టేకాఫ్ తీసుకున్నాయి. అయితే మధ్యాహ్నం 2.50 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానం పెద్దది కావడంతో రన్‌వే చివరి వరకు వెళ్లి టేకాఫ్‌కు ప్రయత్నించింది. రన్‌వే చివర కుంగిఉండడాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమై విమానాన్ని వెంటనే గాల్లో లేపాడు. విషయాన్ని కేంద్ర విమానయానశాఖ ఉన్నతాధికారులకు పైలట్ ఫిర్యాదు చేశాడు. -
విమానం రద్దయితే రూ.20 వేల పరిహారం
న్యూఢిల్లీ: విమానాలు ఆలస్యమైనా లేదా రద్దయినా ఇకపై విమానయాన సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావొచ్చు. వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా పలు కొత్త నిబంధనలను పౌరవిమానయాన శాఖ తీసుకురానుంది. సంబంధించిన ముసాయిదాకు ప్రస్తుతం అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విమానం 6 గంటలకుపైగా ఆలస్యమైతే మొత్తం చార్జీని తిరిగి చెల్లించడం, అనుసంధాన విమానాల ద్వారా ప్రయాణించేవారికి తొలి విమానం రద్దయ్యి, ఆ కారణంగా మరో సిటీలో ఎక్కాల్సిన రెండో విమానాన్ని వారు అందుకోలేని పరిస్థితుల్లో అలాంటి ప్రయాణికులకు రూ. 20వేల వరకు నష్టపరిహారంగా చెల్లించడం తదితర కొత్త నిబంధనలను ప్రవేశపెట్టబోతున్నారు. టికెట్ కొన్నాక విమానంలోకి ఎక్కడానికి అనుమతివ్వకపోతే రూ.5 వేలు పరిహారం చెల్లించాలని ప్రతిపాదించారు. -
నేటి నుంచి ఎయిర్ షో
మూడు రోజులపాటు బెజవాడలో నిర్వహణ విజయవాడ: బెజవాడలో ఎయిర్‌షోను గురువారం ప్రారంభిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అమరావతి చరిత్రలో గుర్తుండేలా విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 4 లక్షల మంది విమాన విన్యాసాలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి మూడు రోజుల పాటు ఎయిర్ షో జరుగుతుందని చెప్పారు. విజయవాడ గేట్‌వే హోటల్లో నిర్వహించే ఏవియేషన్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెలిగేట్లు 200 మందికి పైగా హాజరవుతారన్నారు. సీఎం చంద్రబాబు ప్రారంభించే ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 4.30 నుంచి 4.45 గంటల వరకు పున్నమి, భవానీఘాట్‌లో నాలుగు ప్రత్యేక విమానాలతో నిర్వహించే ఎయిర్ షో ప్రజలను కనువిందు చేస్తుందని తెలిపారు. 13, 14 తేదీల్లో ఉదయం 11.30 నుంచి 11.45 గంటలకు, మధ్యాహ్నం 4 నుంచి 4.15 గంటల వరకు ఈ ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. ఎయిర్‌షో నిర్వహించేందుకు లండన్ నుంచి వచ్చి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న మార్క్ జఫ్రీ మాట్లాడుతూ ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికి ఐదు షోలు నిర్వహించామన్నారు. దీని తర్వాత త్వరలో చైనాలో ఎయిర్ షో నిర్వహిస్తామని చెప్పారు. కాగా అత్యాధునిక హంగులతో నిర్మించిన గన్నవరం విమానాశ్రయ నూతన టెర్మినల్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజు జాతికి అంకితం చేయనున్నారు. రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా గన్నవరం విమానాశ్రయం పేరును అమరావతి విమానాశ్రయంగా మార్చాలని కోరుతూ సీఎం కు బుధవారం కేంద్ర మంత్రి అశోక్ లేఖ రాశారు. -
విశాఖ నుంచి మరో రెండు విమాన సర్వీసులు
విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి జెట్ ఎయిర్వేస్ సంస్థ నూతన సర్వీసులను ప్రకటించింది. విశాఖ - ఢిల్లీ విమాన సర్వీసును ఆదివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ప్రతీ రోజు ఉదయం 9.10 గంటలకు విశాఖలో విమానం బయల్దేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి రాత్రి 8.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇక, విశాఖ-ముంబై సర్వీసు ముంబైలో ఉదయం 6.25గంటలకు బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖలో రాత్రి 9.25 గంటలకు ప్రారంభమైన 11.25 గంటలకు ముంబై చేరుకుంటుంది. -
విమానయాన రంగానికి మౌలిక హోదా !
స్పైస్‌జెట్ ఉదంతంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ యోచన న్యూఢిల్లీ: విమానయాన రంగానికి మౌలిక రంగ హోదా కల్పించే విషయమై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో కింగ్ ఫిషర్, ప్రస్తుతం స్పైస్‌జెట్ సంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడంతో ఈ దిశగా సదరు శాఖ యోచిస్తోంది. మౌలిక రంగ హోదా కల్పిస్తే తక్కువ వడ్డీరేట్లకే రుణాలు లభిస్తాయని, నిధుల లభ్యత సమస్య తొలుగుతుందని, విమానయాన సంస్థలు ఒడ్డునపడుతాయని ఈ శాఖ ఆలోచన. దీనికి సంబంధించిన ఆర్థిక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలను ఆదుకోవడానికి పలు చర్యలు తీసుకోవాలని విమానయాన శాఖ ప్రతిపాదిస్తోంది. విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీ) సమీకరణకు విమానయాన సంస్థలను అనుమతించాలని, కొన్నేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వాలని, ఈ సంస్థలకిచ్చే రుణాలపై బ్యాంకులు 8 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకూడదని, చమరు కంపెనీలకు ఉన్న బకాయిలను రీ షెడ్యూల్ చేయాలని తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక, కంపెనీ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో నిర్ణయం వెలువడవచ్చని సమాచారం. అజయ్ సింగ్ ఆసక్తి: కాగా స్పైస్‌జెట్ ఒరిజినల్ ప్రమోటర్ అజయ్ సింగ్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి. సోమసుందరన్‌ను కలవడం పలు ఊహాగానాలకు తెర తీసింది. అంతే కాకుండా ఆయన గురువారం సాయంత్రం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కూడా కలిశారు. దీంతో నాలుగేళ్ల క్రితం స్పైస్‌జెట్ నుంచి వైదొలగిన అజయ్ సింగ్ మళ్ల స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. స్పైస్‌జెట్‌లో మళ్లీ ఇన్వెస్ట్ చేసే విషయమై మాట్లాడటానికి నిరాకరించిన అజయ్ సింగ్ స్పైస్‌జెట్‌కు చాలా సత్తా ఉందని మాత్రం వ్యాఖ్యానించారు. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు గురువారం విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో ప్రారంభించినట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఆయిల్ కంపెనీలకు చెల్లింపుల్ని కంపెనీ జరపడంతో సర్వీసులు ప్రారంభించడానికి వీలుకలిగింది. అయితే బుధవారం స్పైస్‌జెట్ పూర్తిస్థాయిలో సర్వీసుల్ని నడపలేకపోవడంతో పలువురు ప్రయాణికులు స్పైస్‌జెట్ విమాన టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు రూట్లలో ఇతర విమానయాన సంస్థల విమాన టికెట్ల ధరలు 45 శాతం నుంచి 57 శాతం వరకూ పెరిగాయి. వచ్చే నెల 9 నుంచి విస్తార సర్వీసులు న్యూఢిల్లీ: టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తార విమానయాన సర్వీసులు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి సర్వీసులను ఢిల్లీ నుంచి ముంబైకు, అహ్మదాబాద్‌లకు నడుపుతామని విస్తార తెలిపింది. బుకింగ్స్ గురువారం రాత్రి పదిన్నర నుంచి ప్రారంభించామని పేర్కొంది. -
స్పైస్‌జెట్‌కు లభించని ఊరట
తక్షణ ఆర్థిక సాయం ఆర్ధించిన సంస్థ హామీ ఇవ్వని పౌర విమానయాన శాఖ న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, సమస్యల్లో కూరుకుపోయిన సన్గ్రూప్కు చెందిన స్పైస్‌జెట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. తక్షణం తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ స్పైస్‌జెట్ అధికారులు సోమవారం ప్రభుత్వాన్ని కోరారు. స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్, సన్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎస్.ఎల్. నారాయణన్ తదితర కంపెనీ ఉన్నతాధికారులు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మను కలిసి తక్షణం తమను ఆదుకోవాలని విజ్నప్తి చేశారు. అయితే వారికి ఎలాంటి హామీ లభించలేదు. ఇలాంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలు పై స్థాయిలో తీసుకుంటారని శర్మ పేర్కొన్నారు. స్పైస్‌జెట్ అంశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి, పెట్రోలియం, ఆర్థిక మంత్రి త్వ శాఖలకు నివేదించామని తెలిపారు. స్పైస్‌జెట్ రుణ భారం రూ.2,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ సంస్థ సాఫీగా కార్యకలాపాలు నిర్వహించాలంటే తక్షణం రూ.1,400 కోట్లు అవసరం. దేశీయ విమాన సర్వీసుల మార్కెట్లో 17 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ మొత్తం 1,861 సర్వీసులను రద్దు చేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.310 కోట్ల నష్టాన్ని పొందింది. అంతకు ముందటి క్వార్టర్ నష్టాల(రూ.559 కోట్లు)తో పోల్చితే ఇది తక్కువే. ఈ సంస్థకు నష్టాలు రావడం ఇది వరుసగా ఐదో క్వార్టర్. -
బేగంపేట ఎయిర్‌పోర్టు వాడలేం: అశోక్ గజపతిరాజు
సాక్షి, న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించలేమని పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతి రాజు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బేగంపేట ఎయిర్‌పోర్టును వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రైవేటు ఆపరేటర్లు వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీమేరకు తిరుపతి, విజయవాడ, విశాఖ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. -
సామాన్యుడికీ విమానయోగం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఊరుంటే రోడ్డు పడుతుంది. రోడ్డుంటే బస్సు వస్తుంది. విమానమూ అంతే. విమానాశ్రయం ఉంటే చాలు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఉద్దేశమూ ఇదే. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 200 విమానాశ్రయాలను 20 ఏళ్లలో అభివృద్ధి చేయాలన్నదే ఈ శాఖ లక్ష్యం. తద్వారా దేశీయంగా చిన్న నగరాలకు విమాన సర్వీసులను పెంచాలని చూస్తోంది. మరోవైపు కర్ణాటక ఒక అడుగు ముందుకేసి కోటి రూపాయలకే చిన్న విమానాశ్రయం (ఎయిర్‌స్ట్రిప్) కట్టి చూపిస్తామంటోంది. ఇందుకోసం తమ రాష్ట్రంలో 11 ప్రాంతాలను గుర్తించామని, సామాన్యుడికి విమాన సేవలు కొద్ది రోజుల్లో అందిస్తామని సగర్వంగా చెబుతోంది. మరి కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్రలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను వాడుకలోకి తేవడం, అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తే పర్యాటకంగా, పారిశ్రామికంగానూ ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. సామాన్యుడికి విమాన సేవలు చేరువ అవుతాయి కూడా. ఇవిగో విమానాశ్రయాలు... విమానాశ్రయం అనగానే ప్రముఖంగా వినిపించే పేరు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట. ఇవేగాక హైదరాబాద్ సమీపంలో రక్షణ శాఖ ఆధీనంలో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉన్నాయి. నాదర్గుల్ ఎయిర్‌పోర్ట్‌ను పైలట్ శిక్షణ సంస్థలు వినియోగిస్తున్నాయి. రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, కరీంనగర్ జిల్లా బసంత్‌నగర్ ఎయిర్‌స్ట్రిప్స్ పూర్తిగా ప్రైవేటువి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ప్రకాశం జిల్లా దొనకొండ, వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్, నాగార్జున సాగర్, నల్గొండతోపాటు ఇదే జిల్లాలో ఉన్న ఆలేరు, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎయిర్‌స్ట్రిప్స్ మూతపడ్డాయి. నిజామాబాద్, నెల్లూరు, కొత్తగూడెం, కర్నూలులో విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు మామనూరు, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశీలనలో ఆదిలాబాద్ కూడా ఉంది. కడపలో ఇటీవలే రూ.60 కోట్లతో చేపట్టిన విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయింది. ఏప్రిల్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయాల రాకతో పర్యాటకం తోపాటు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి పెరుగుతుందని బేగంపేట విమానాశ్రయ డెరైక్టర్ ఐ.ఎన్.మూర్తి చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ ఎయిర్‌స్ట్రిప్‌లు రావాలని ఆకాంక్షించారు. తద్వారా ఆపత్కాల పరిస్థితుల్లో తక్షణ సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. కనెక్టివిటీ పాలసీ.. రీజినల్, రిమోట్ ఏరియా ఎయిర్ కనెక్టివిటీ పాలసీని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూపొందించింది. విమానాలు తక్కువగా నడుస్తున్న, ఏమాత్రం నడవని ప్రాంతాలకు సర్వీసులను విస్తరించడమే పాలసీ ముఖ్యోద్దేశం. ఇక ఎంపిక చేసిన విమానాశ్రయాలకు సర్వీసులు నడిపే ఆపరేటర్లకు ల్యాండింగ్, పార్కిం గు, రూట్ నేవిగేషన్ ఫెసిలిటీ, ప్యాసింజరు సర్వీసు వంటి ఫీజులు మినహాయిస్తారు. రక్షణ శాఖ ఆధీనంలోని విమానాశ్రయాలకూ ఇలాంటి రాయితీలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు. షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ఎయిర్‌లైన్స్‌కే రాయితీలు వర్తిస్తాయి. సర్వీసులు నడిచేందుకు మౌలిక ఏర్పాట్లు, విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గిం పు, విద్యుత్ చార్జీలపై పన్ను మినహాయింపు, ఆస్తి పన్ను ఐదేళ్లపాటు మినహాయింపు వంటివి రాష్ట్రాలే కల్పించాలని పాలసీ చెబుతోంది. అంతేకాకుండా నిర్ణీత రూట్లలో నడుస్తున్న సర్వీసుల్లో గుర్తించిన మారుమూల ప్రాంతాలకు ఆపరేటర్లు 10% సర్వీసులను కేటాయించాల్సిందేనని ప్రభుత్వం 1994లో రూపొం దించిన రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్ నిర్దేశిస్తోంది. వీటిని వాడుకుందాం... కర్ణాటక మాదిరిగా తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా అటు పర్యాటకం, ఇటు సాధారణ విమాన ప్రయాణానికీ ఉపయుక్తంగా ఉంటుంది. విదేశీ పర్యాటకులు విమానంలో మన ప్రాంతానికి రావాలంటే ప్రస్తుతానికి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రికి మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్న నగరాలన్నీ పర్యాటకంగా ప్రముఖమైన స్థలాలకు సమీపంలో ఉన్నవే. ఈ నేపథ్యంలో హెలిటూరిజంను ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పట్నుంచో యోచిస్తోంది. మొత్తం ఎయిర్ ట్రాఫిక్‌లో మెట్రోయేతర నగరాల వాటా ప్రస్తుతం 30 శాతమే. భవిష్యత్తులో ఇది 45%కి చేరొచ్చని అంచనా. ప్రాంతాలు-ప్రత్యేకతలు... తాడేపల్లి గూడెం, ఏలూరు: ద్వారకా తిరుమల దేవాలయం, పాపి కొండలు, పట్టిసీమ, క్షీరారామం, గుంటుపల్లి గుహలు, కొల్లేరు సరస్సు, పోలవరం. దొనకొండ: గుండ్లకమ్మ రిజర్వాయర్, చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ, చీరాల. బసంత్‌నగర్: వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, ఎలగందల ఖిల్లా. మామునూరు: వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, రామప్ప గుడి, పాకాల చెరువు, లక్నవరం సరస్సు, ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సమ్మక్క సారక్క జాతర జరిగే మేడారం వరంగల్ జిల్లాలోనే ఉంది. నిజామాబాద్: నిజాం సాగర్, దోమకొండ ఖిల్లా, కెంటు మసీదు. నెల్లూరు: పెంచలకోన, సోమశిల డ్యాం, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, ఉదయగిరి ఖిల్లా. కొత్తగూడెం: భద్రాచలం, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కర్నూలు: శ్రీశైలం, మంత్రాలయం, బెలూం గుహలు, రాయల్ ఫోర్ట్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, మహానంది, అహోబిలం, కొండారెడ్డి ఖిల్లా. నాగార్జున సాగర్: సాగర్ డ్యాం. బొబ్బిలి: ఎటువంటి అతుకులు లేకుండా తయారయ్యే బొబ్బిలి వీణ కొనేందుకు విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు. రామతీర్థం ప్రముఖ పుణ్య క్షేత్రం. నల్గొండ: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, భువనగిరి ఖిల్లా, కొలనుపాక దేవాలయం.