న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్‌వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్‌వోగా పేర్కొంటారు. ఎంఆర్‌వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్‌వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు.
నూతన విధానంలోని అంశాలు..
► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు.
► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది.
► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది.
► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్‌వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
జాబితాలో బేగంపేట ఎయిర్‌పోర్ట్
విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్‌వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు.
ఎంఆర్‌వో సేవలకు హబ్‌గా భారత్!
Published Fri, Sep 10 2021 12:57 AM | Last Updated on Fri, Sep 10 2021 7:47 AM
Comments
Please login to add a commentAdd a comment