హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
దేశీయంగా 30 కోట్లకు..
పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు.
కొత్త విమానాశ్రయాలు..
దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు.
రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు..
ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
Published Fri, Jan 19 2024 1:00 AM | Last Updated on Fri, Jan 19 2024 1:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment