Aviation Industry
-
ఎయిరిండియా, ఇండిగో సహా.. 70కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశీయంగా నడిచే, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికల బెడద ఎక్కువైంది. గురువారం దేశంలోని 70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. ఎయిరిండియా,విస్తారా,ఇండిగోలకు చెందిన 20 విమానాలకు, ఆకాశ ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. దీంతో 11 రోజుల్లో సుమారు 250 విమానాలకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి.తాజా, బాంబు బెదిరింపులపై ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధి స్పందించారు. ‘గురువారం సైతం తమ సంస్థకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అకాశ ఎయిర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. భద్రత..నియంత్రణ అధికారులతో సంప్రదింపులు జరిపాం. స్థానిక అధికారులతో సమన్వయంతో అన్ని భద్రత పరమైన విధానాలను అనుసరిస్తున్నాము’ అని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.అకల్ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్‌లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akul Dhingra (@akuldhingra) -
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాక్‌పిట్‌లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్.. రూ.30లక్షల ఫైన్!
తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్న పైలెట్‌పై ప్రముఖ దేశీయ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియా కఠిన చర్యలు తీసుకుంది. పైలెట్‌ను మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అంతేకాదు తన స్నేహితురాలికి సపచర్యలు చేయాలని సిబ్బందిని ఆదేశించాడు. అందుకు ఒప్పుకోని సిబ్బందిపై దుర్భాషలాడాడు. చేయి చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏ (Directorate General of Civil Aviation)ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన డీజీసీఏ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను చర్యలు తీసుకోవాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా పైలెట్‌కు రూ.30లక్షల ఫైన్ వేసింది. 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్‌ను విరుద్ధంగా విధులు నిర్వహించిన 3 నెలల పాటు పైలెట్ లైసెన్స్ (పీఐసీ) క్యాన్సిల్ చేసింది. -
మళ్లీ లాభాల్లోకి దేశీ ఎయిర్‌లైన్స్
ముంబై: కోవిడ్ మహమ్మారి ధాటికి కుదేలైన దేశీ విమానయాన సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టనున్నాయి. వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, రుణభారాన్ని తగ్గించుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఏవియేషన్ పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ నష్టాల భారాన్ని 75–80 శాతం మేర రూ. 3,500–4,500 కోట్లకు తగ్గించుకోనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ. 17,500 కోట్లుగా నమోదైంది. ప్యాసింజర్ల ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడటం, వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం వంటివి ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా విమానయానంలో 75 శాతం వాటా ఉన్న మూడు పెద్ద ఎయిర్‌లైన్స్‌పై విశ్లేషణ ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ .. కోవిడ్ పూర్వ స్థాయిని అధిగమించవచ్చని, చార్జీలు అప్పటితో పోలిస్తే 20–25 శాతం అధిక స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. విమాన ఇంధన ధరలు సగటున తగ్గడం కూడా దీనికి తోడైతే ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరు మెరుగుపడి, అవి లాభాల్లోకి మళ్లగలవని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ► 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (కోవిడ్ పూర్వం) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ 9 నెలల కాలంలో దేశీ, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ వరుసగా 90 శాతం, 98 శాతానికి కోలుకుంది. ► అంతర్జాతీయ సర్వీసులను కూడా పునరుద్ధరించడంతో బిజినెస్, విహార ప్రయాణాలు సైతం పెరిగాయి. ద్వితీయార్ధంలో పండుగల సీజన్ కూడా వేగవంతమైన రికవరీకి ఊతమిచ్చింది. ► అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నా భారత్ ఎదుర్కొని నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఇదే తీరు కొనసాగవచ్చని అంచనాలున్నాయి. ► చార్జీలపై పరిమితులను తొలగించడమనేది విమానయాన సంస్థలు తమ వ్యయాల భారాన్ని ప్రయాణికులకు బదలాయించేందుకు ఉపయోగపడుతోంది. ► ఏవియేషన్ రంగం వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 8,000–10,000 కోట్ల ఈక్విటీని సమకూర్చుకోనుంది. విమానాల సంఖ్యను పెంచుకునేందుకు, ప్రస్తుతమున్న వాటిని సరిచేసుకునేందుకు నిధులను వెచ్చించనుంది. ► నిర్వహణ పనితీరు మెరుగుపడటం, ఈక్విటీ నిధులను సమకూర్చుకోవడం వంటి అంశాల కారణంగా స్వల్ప–మధ్యకాలికంగా విమానయాన సంస్థలు రుణాలపై ఆధారపడటం తగ్గనుంది. ► బడా ఎయిర్‌లైన్‌ను (ఎయిరిండియా) ప్రైవేటీకరించిన నేపథ్యంలో రుణ భారం తగ్గి, ఫలితంగా వడ్డీ వ్యయాలూ తగ్గి పరిశ్రమ లాభదాయకత మెరుగుపడనుంది. ► అయితే, సమయానికి ఈక్విటీని సమకూర్చుకోవడం, విమానాల కొనుగోలు కోసం తీసుకునే రుణాలు, కొత్త వైరస్‌లేవైనా వచ్చి కోవిడ్–19 కేసులు మళ్లీ పెరగడం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఆకాశ ఎయిర్ హైదరాబాద్ నుంచి సర్వీసులను నేటి (బుధవారం) నుండి ప్రారంభిస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–గోవా మధ్య ఇవి నడువనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరో రెండు సర్వీసులను ఫిబ్రవరి 15 నుంచి జోడించనున్నారు. విశాఖపట్నం సహా ప్రస్తుతం ఆకాశ ఎయిర్ దేశంలోని 13 నగరాలకు సేవలను అందిస్తోంది. ఈ ఏడాది మరో నాలుగైదు నగరాలు తోడవనున్నాయని కంపెనీ కో–ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థ వద్ద 14 విమానాలు ఉన్నాయని చెప్పారు. మార్చి నాటికి మరో నాలుగు వచ్చి చేరుతున్నాయని వెల్లడించారు. 2023 రెండవ అర్ధ భాగంలో అంతర్జాతీయ సర్వీసులు నడుపుతామని తెలిపారు. నాలుగేళ్లలో ఆకాశ ఎయిర్ ఖాతాలో 72 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటాయని కో–ఫౌండర్ బెల్సన్ కొటినో పేర్కొన్నారు. -
ఏవియేషన్ పరిశ్రమ.. వీ షేప్ రికవరీ!
న్యూఢిల్లీ: దేశీ పౌరవిమానయాన పరిశ్రమ వీ ఆకారంలో బలమైన రికవరీ చూస్తోందని (ఎలా పడిపోయిందో, అదే మాదిరి కోలుకోవడం) ఈ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దేశీ ప్రయాణికుల సంఖ్యలోనూ బలమైన వృద్ధి కనిపిస్తోందంటూ, రానున్న సంవత్సరాల్లోనూ ఇది కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండేళ్లపాటు ఏవియేషన్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను చూడడం తెలిసిందే. గతేడాది చివరి నుంచి పుంజుకున్న పరిశ్రమ ఈ ఏడాది బలమైన వృద్ధిని చూస్తుండడం గమనార్హం. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పైనే నమోదవుతోంది. ప్రయాణికుల సంఖ్య ఎంతో ఉత్సాహకరంగా ఉందంటూ, ఈ ఏడాది నవంబర్ నాటికి 111 మిలియన్లకు చేరుకుందని సింధియా వెల్లడించారు. వాయు మార్గంలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటూ, అందుకే ఈ స్థాయి గణాంకాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఏవియేషన్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవారం 2,883 దేశీ సర్వీసుల్లో 4,15,426 మంది ప్రయాణించారు. ‘‘కరోనా ముందు 2019లో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.15 లక్షలుగా ఉండగా, గడిచిన రెండు వారాల్లో దీనికి మించి ప్రయాణిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. డిసెంబర్ 24న 4.35 లక్షల మంది ప్రయాణించారు’’అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కేసులు ఆందోళనకరం.. ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణకొరియా, జపాన్, యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళకర విషయమేనని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘‘మేము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అందుకే ఆరోగ్యశాఖ సూచనలకు అనుగుణంగా భారత్‌కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి స్క్రీనింగ్ (పరీక్షలు) నిర్వహిస్తున్నాం. అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఎక్కువ కేసులు రావడం లేదు. ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణి అవసరం’’అని చెప్పారు. అంత రద్దీని అంచనా వేయలేదు.. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర రద్దీ కారణంగా ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవడం తెలిసిందే. పండుగల సమయంలో అంత రద్దీని తాము అంచనా వేయలేదని సింధియా చెప్పారు. ‘‘నిజానికి ఇది విమానాశ్రయాల బాధ్యత. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాల్లేని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉంది. రద్దీ వేళల్లో విమానాశ్రయాల సామర్థ్యానికి అనుగుణంగా ట్రాఫిక్‌ను కట్టడి చేయడం, సామర్థ్యాన్ని విస్తరించడం దీనికి పరిష్కారం’’అని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఢిల్లీ విమానాశ్రయంతోపాటు, పలు ఇతర విమానాశ్రయాల్లో రద్దీపై పౌర విమానయాన శాఖకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పౌర విమానయాన శాఖ పలు దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ను నియంత్రించామని, మరిన్ని గేట్లు తెరిచామని మంత్రి చెప్పారు. ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ ఇదే తరహా చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2019తో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపారు. -
దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి
న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థలు అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సెప్టెంబర్‌లో నమోదైన 1.04 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 27 శాతం ఎగిసి 89.85 లక్షల నుండి 1.14 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కాలంలో దాదాపుగా నిల్చిపోయిన విమాన ప్రయాణాలు కొంతకాలంగా తిరిగి ప్రారంభమవుతుండటంతో .. విమానయాన పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. డేటాలోని మరిన్ని కీలకాంశాలు.. ► దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో మార్కెట్ వాటా సెప్టెంబర్‌లో 58 శాతంగా ఉండగా అక్టోబర్‌లో 56.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 0.9 శాతం నుండి 1.4 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ వాటా 7.3 శాతంగా, గో ఫస్ట్ వాటా 7 శాతంగా ఉంది. ► ఎయిరిండియా మార్కెట్ వాటా 9.1 శాతంగా ఉండగా, ఎయిర్‌ఏషియాది 7.6 శాతానికి చేరింది. విస్తార వాటా 9.6 శాతం నుండి 9.2 శాతానికి దిగి తగ్గింది. ► సమయ పాలనలో (ఓటీపీ) ఎయిరిండియా (90.8 శాతం) అగ్రస్థానంలో ఉండగా విస్తారా (89.1 శాతం), ఎయిర్ఏషియా ఇండియా (89.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడూ టాటా గ్రూప్ కంపెనీలే కావడం గమనార్హం. ► ఇండిగో ఓటీపీ 87.5 శాతంగా ఉండగా, అలయన్స్ ఎయిర్ (74.5%), స్పైస్‌జెట్ (68.9%), గో ఫస్ట్ (60.7%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ఓటీపీని లెక్కించారు. ► 2022 జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 9.88 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 6.21 కోట్లతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ 59 శాతం పెరిగింది. -
నష్టాల్లోనే జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ జెట్ ఎయిర్వేస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 308 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 306 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 45 కోట్ల నుంచి 13.5 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయాలు రూ. 322 కోట్లకు చేరాయి. మూడున్నరేళ్లుగా కార్యకలాపాలు నిలిచిపోయిన కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జలాన్ కల్రాక్ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను గెలుపొందింది. అయితే కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావలసి ఉంది. -
ఎయిరిండియా ఉద్యోగులకు టాటా గ్రూప్ శుభవార్త!
ఉద్యోగులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. టాటా గ్రూపులో భాగమైన ఎయిరిండియా సెప్టెంబర్1 నుంచి ఉద్యోగులకు కోవిడ్-19 ముందున్న శాలరీలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. జీత భత్యాలతో పాటు ఉద్యోగుల తొలగింపు, అలవెన్సులు, భోజన సౌకర్యాలన్నింటిని సవరిస్తున్నట్లు చెప్పింది. దేశీయ విమానయాన రంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనా విజృంభణ, నమోదైన కేసులు, ప్రయాణికులపై ఆయా దేశాల ఆంక్షల కారణంగా విమానాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల నుంచి కోలుకుని కోవిడ్ ముందు నాటి స్థాయికి తిరిగి వచ్చాయి. దీంతో కొన్ని ఏవియేషన్ సంస్థలు నష్టాలతో దివాళా తీశాయి. మరికొన్ని సంస్థలు ఛార్జీల్ని పెంచాయి. ఉద్యోగులకు చెల్లించే జీతాలతో పాటు, ఇతర సౌకర్యాల్ని పూర్తిగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా ఉద్యోగులకు చెల్లించే జీతాల్ని పునరుద్దరిస్తూ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.విమానయాన రంగం కోవిడ్ ముందు స్థాయికి చేరుకుంటుంది. అందుకే తగ్గించిన ఉద్యోగుల శాలరీలను పెంచే అంశంపై సమీక్షలు జరపడం సంతోషంగా ఉందని ఎయిరిండియా చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఎయిరిండియా కొత్త సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్! -
ఏవియేషన్‌కు కొలువుల కళ!
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా తగ్గిపోవడం, ప్రయాణాలపై అన్ని ఆంక్షలు తొలగిపోవడం ఏవియేషన్ పరిశ్రమకు కలసి వస్తోంది. దీంతో గత రెండేళ్ల నుంచి విహార యాత్రలకు దూరమైన వారు.. ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని విమానం ఎక్కేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎయిర్‌లైన్స్ సంస్థలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. మరోవైపు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆకాశ ఎయిర్‌లైన్స్ కొత్తగా సేవలు ఆరంభిస్తుండడం, మరోవైపు చాలా కాలంగా నిలిచిన జెట్ ఎయిర్వేస్ సేవల పునరుద్ధరణతో ఈ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వచ్చే రెండు త్రైమాసికాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు సుమారు 30 శాతం మేర అదనంగా ఉద్యోగులను నియమించుకోవచ్చని పరిశ్రమ నిపుణుల అంచనా. ఆటోమేషన్ చుట్టూ చర్చ నడుస్తున్నప్పటికీ.. ఏవియేషన్ పరిశ్రమ ఎక్కువగా మానవవనరులపైనే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని టీమ్‌లీజ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ (రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్) జోయ్ థామస్ తెలిపారు. ఏవియేషన్ పరిశ్రమలో నెలకొన్న ధోరణులను పరిశీలిస్తే వచ్చే రెండు క్వార్టర్లలో నియామకాలు 30 శాతం పెరగొచ్చని చెప్పారు. మాన్స్టర్ డాట్ కామ్ డేటాను పరిశీలిస్తే.. 2022 ఏప్రిల్ నెలలో ఏవియేషన్ రంగంలో నియామకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది. మారిన పరిస్థితులు.. కరోనా కారణంగా ప్రయాణాలపై విధించిన ఆంక్షల వల్ల ఏవియేషన్ రంగం గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను చూసిన మాట వాస్తవం. ఏవియేషన్, దీని అనుబంధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్రయిట్ ఫార్వార్డర్స్, కార్గో ఎయిర్‌లైన్స్ ఒక్కటే ఇందుకు భిన్నం. దీంతో ఏవియేషన్ రంగంలో భారీగా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. వేతనాల్లో కోత పడింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు 2020 ఏప్రిల్, మే నెలల్లో అసలు సర్వీసులే నడపలేని పరిస్థితి. ఆ తర్వాత నుంచి రెండేళ్లపాటు దేశీయ సర్వీసులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో నష్టాలను తట్టుకోలేక ఉద్యోగుల వేతనాలకు కోతలు పెట్టిన పరిస్థితులు చూశాం. కరోనా రెండేళ్ల కాలంలో ఈ పరిశ్రమలో సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని పార్లమెంటరీ డేటానే చెబుతోంది. రూ.25,000 కోట్లకు పైగా పరిశ్రమ నష్టాలను ఎదుర్కొన్నది. ఇండిగో అయితే తన మొత్తం సిబ్బందిలో 10 మందిని తగ్గించింది. విస్తారా సైతం తన సిబ్బంది వేతనాలకు కోత పెట్టింది. స్పైస్‌జెట్, గోఫస్ట్ వేరియబుల్ పేను ఆఫర్ చేశాయి. కొత్త సంస్థలు.. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఆకాశ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు మొదలవన్నాయి. ఎయిర్ ఇండియా యాజమాన్యం మారిపోవడం, టాటా గ్రూపులో ఎయిర్‌లైన్స్ సంస్థల స్థిరీకరణ, కరోనా కేసులు తగ్గిపోవడం, విదేశీ సర్వీసులకు ద్వారాలు తెరవడం డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కమర్షియల్ పైలట్ల నియామకాలు వచ్చే కొన్నేళ్లపాటు వృద్ధి దశలోనే ఉంటాయని క్వెస్‌కార్ప్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ జోషి చెప్పారు. కొత్త సంస్థల రాక, ఉన్న సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడం వల్ల నిర్వహణ సిబ్బందికి డిమాండ్ పెంచుతుందని జోషి వివరించారు. -
వరుస సమావేశాలు.. పోటెత్తిన విజిటర్లు
బేగంపేట ఎయిర్‌పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఆఫ్ ఇండియా 2022 ఏవియేషన్ షో రెండో రోజు సందండిగా సాగింది. ఏవియేషన్ సెక్టార్‌కి చెందిన కీలక కాన్ఫరెన్సులు రెండో రోజు జోరుగా కొనసాగాయి. మరోవైపు ఏవియేషన్ షో చూసేందుకు బిజినెస్ విజిటర్లు భారీగానే వచ్చారు. హెలికాప్టర్లు, హిందూస్తాన్ విమానాలు మొదలు ఎయిర్‌బస్ వరకు అనేక విహాంగాలను ఈ షోలో ప్రదర్శించారు. హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ షోకు హాజరయ్యారు. గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో భాగంగా రెండో రోజు ఫ్యూచర్ ఆఫ్ ట్రావెల్, ఎయిర్పోర్ట్ పర్స్పెక్టివ్, ఎయిరో మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్వో, ఇండో యూఎస్ రౌండ్ టేబుల్ తదితర అంశాలపై విస్త్రృత చర్చలు జరిగాయి. వింగ్స్ ఆఫ్ ఇండియా చివరి రెండు రోజులు సాధారణ సందర్శనకు అనుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ షోకు రావాలనుకునే వారు వింగ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, బుక్ మై షో ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఎయిర్‌షో ఉంటుంది. -
నష్టాల ఊబిలో ఏవియేషన్
ముంబై: విమానయాన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనూ భారీ నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రూ.25,000–26,000 కోట్ల మేర నష్టాలను నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జెట్ ఇంధన ధరలు (ఏటీఎఫ్) పెరిగిపోవడం, టికెట్ చార్జీలపై పరిమితులు కంపెనీలకు ప్రతికూల అంశాలుగా తెలిపింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నష్టాలు రూ.14,000–16,000 కోట్లకు తగ్గుతాయని అంచనా వేసింది. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిశ్రమకు అదనంగా రూ.20,000–22,000 కోట్ల వరకు నిధుల అవసరం ఉంటుందని తెలిపింది. పెరిగిన రద్దీ దేశీయ ప్రయాణికుల రద్దీ వార్షికంగా చూస్తే 2021–22లో 50–55 శాతం మేర వృద్ధి చెందుతుందని ఇక్రా పేర్కొంది. టీకాలు ఎక్కువ మందికి ఇవ్వడం, ఆంక్షలు సడలిపోవడం అనుకూలించే అంశాలని తెలిపింది. అయినప్పటికీ కరోనా ముందస్తు గణాంకాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2023–24 సంవత్సరంలోనే కరోనా ముందున్న స్థాయికి విమాన ప్రయాణికుల రద్దీ చేరుకుంటుందని పేర్కొంది. కరోనా రెండో విడత తీవ్రంగా ఉండడం, ఆ వెంటే ఒమిక్రాన్ వెలుగు చూడడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదల నిదానంగా ఉన్నట్టు వివరించింది. వ్యయాల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఏటీఎఫ్ సగటు ధరలను పరిశీలించినప్పుడు, గతేడాదితో పోలిస్తే 68 శాతం పెరిగాయని.. అదే సమయంలో టికెట్ చార్జీలపై పరిమితులు నష్టాలకు దారితీస్తున్నట్టు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు త్వరలో అనుమతిస్తుండడం, ఒమిక్రాన్ తగ్గిపోవడంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో ప్రయాణికుల రద్దీ పుంజుకుంటుందని ఇక్రా తెలిపింది. ఎయిర్‌లైన్స్ రుణ భారం తక్కువగా ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నికర నష్టాలు తగ్గేందుకు సాయపడుతుందని పేర్కొంది. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో 2022–23 సంవత్సరంలో ఏటీఎఫ్ కోసం ఎయిర్‌లైన్స్ అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా విక్రయానికి ముందు రుణ భారం గణనీయంగా తగ్గించుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత ఏవియేషన్ పరిశ్రమపై నెగెటివ్ అవుట్‌లుక్ (ప్రతికూల దృక్పథం)ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. పనితీరును మెరుగుపరుచుకోవడం, రుణభారాన్ని తగ్గించుకునే వరకు భారత ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిళ్లు కొనసాగుతాయని తెలిపింది. -
కడప నుంచి అయిదు నగరాలకు ఇండిగో సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఇండిగో.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి అయిదు నగరాలకు సర్వీసులు నడపనుంది. వీటిలో మార్చి 27 నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, మార్చి 29 నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సర్వీసులు అందిస్తున్న నగరాల్లో కడప 73వది. కరోనా విలయతాండవం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. కరోనా నుంచి కోలుకునే సమయంలోనే ఫ్యూయల్ ధరల పిడుగుపడింది. దీంతో ఏవియేషన్ సెక్టార్ ఇప్పుడప్పుడే గాడిన పడదు అనే వాదనలు వినిపించాయి. కానీ కడప లాంటి టైర్ త్రీ సిటీస్‌లో కూడా తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ సెక్టార్ త్వరగా కోలుకుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. -
కరోనా కాటు..రూ.15లక్షల కోట్లు ఆవిరి
బోస్టన్: విమానయాన పరిశ్రమను కరోనా గట్టిగానే దెబ్బకొట్టింది. 2020 నుంచి 2022 మధ్య పరిశ్రమకు సుమారు 201 బిలియన్ల మేర నష్టాలు (రూ.15 లక్షల కోట్లు) ఎదురుకావచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. పరిశ్రమ 2023లోనే తిరిగి లాభాల్లోకి ప్రవేశించొచ్చని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విలియమ్ ఎం వాల్ష పేర్కొన్నారు. ‘‘సంక్షోభం పతాక స్థాయిని దాటేశాం. తీవ్రమైన అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కోలుకునే మార్గం కనిపిస్తోంది’’అని వాల్ష అన్నారు. ఐఏటీఏ 77వ వార్షిక సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘2021లో నష్టాలు 52 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చు. 2020లో నష్టాలు 138 బిలియన్ డాలర్లతో పోలిస్తే చాలా వరకు తగ్గినట్టే. 2022లో నష్టాలు 12 బిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చు. మొత్తం మీద కరోనా కారణంగా పరిశ్రమకు వాటిల్లే నష్టం 201 బిలియన్ డాలర్లుగా ఉంటుంది’’ అని విల్లీ వివరించారు. దేశీయంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది లాక్డౌన్లతో పడిపోయిన ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) క్రమంగా 70 శాతానికి కోలుకుంది. అయినప్పటికీ కరోనాకు ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం భారత్ నుంచి 20 శాతం మేరే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. 2021లో అంతర్జాతీయంగా ఏవియేషన్ పరిశ్రమ ఆదాయం 26.7 శాతం వృద్ధితో 472 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఐఏటీఏ పేర్కొంది. 2022లో 40 శాతం వృద్ధి చెంది 658 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. చదవండి: భారత్‌కు తొలిసారి తాలిబన్ల లేఖ: విమానాలు నడపాలని విజ్ఞప్తి -
అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు..! త్వరలోనే..!
ముంబై: ది ఇండియన్ వారెన్ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పలు రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తాజాగా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కొత్త ఎయిర్‌లైన్‌ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్ జున్‌జున్‌వాలా ప్రకటించారు. భారత్‌లో తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్న విమానయాన రంగంలో సుమారు 35 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నారు. ఎయిర్‌లైన్ కంపెనీలో సుమారు 40 శాతం మేర వాటాను రాకేష్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే పదిహేను రోజుల్లో భారత విమానయాన శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓ సీ ) రానుందని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. కాగా రాకేష్ మొదలుపెడుతున్న సొంత ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ అని తెలుస్తోంది. గతంలో డెల్టా ఎయిర్ లైన్స్‌లో పనిచేసిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, పలు సభ్యులు కూడా కంపెనీలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొనబోయే ఎయిర్‌క్రాఫ్ట్స్ సామర్ధ్యం 180 ప్యాసింజర్ల వరకూ ఉండబోతోంది. అత్యంత చౌక ధరలకే విమాన సర్వీసులను అందించే లక్ష్యంతో మార్కెట్లోకి రానుంది. కోవిడ్ మహమ్మారి రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యింది. అయితే రాబోయే రోజుల్లో భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని రాకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి ముందే, భారతదేశంలోని విమానయాన సంస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఒకప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012 లోనే తన కార్యకలాపాలను ముగించింది. దాంతో పాటుగా ఇటీవల జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ విమాన ప్రయాణాలను ఆమోదం వచ్చిన కొన్ని రోజులకే 2019లో తన ఆపరేషన్లను నిలిపివేసింది. -
ఇండిగో కొత్త సారథి రణజయ్ దత్తా
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో ఎంతో అనుభవం ఉన్న రణజయ్ దత్తాను నూతన సీఈవోగా ఐదేళ్ల కాలానికి నియమించినట్టు ఇండిగో ప్రకటించింది. ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు సంస్థ ఈ నియామకాన్ని పూర్తి చేసింది. ఇక, సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్‌ను కంపెనీ చైర్మన్‌గా నియమించినట్టు తెలిపింది. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్ భాటియా నుంచి దత్తా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుందని కంపెనీ తెలిపింది. రణజయ్ దత్తా ప్రస్తుతం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సంస్థలో ఆయన 20 ఏళ్ల నుంచి పనిచేస్తూ.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్లానింగ్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మెయింటెనెన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) వంటి కీలక పదవులను నిర్వహించారు. ఎయిర్ సహారా సంస్థకు ప్రెసిడెంట్‌గా రెండేళ్లు పనిచేశారు. ఎయిర్ కెనడా, యూఎస్ ఎయిర్వేస్ సంస్థలకు అడ్వైజర్‌గానూ వ్యవహరించారు. ‘‘ఇండిగో ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్ సంస్థగా అపూర్వ విజయం సాధించింది. ఈ సంస్థలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అధికంగా వృద్ధి చెందుతున్న సంస్థల్లో ఇండిగో ఒకటి. భవిష్యత్తులో మరింత వేగంగా వృద్ధిని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి’’ అని దత్తా పేర్కొన్నారు. ఇండిగోకు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మాతృ సంస్థ. డిసెంబర్‌తో ముగిసిన కాలానికి ఈ సంస్థ నికర లాభం 75 శాతం క్షీణించి రూ.190 కోట్లకు పరిమితమయింది. ఇండిగోకు ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆదిత్య ఘోష్ ఇటీవలే హోటల్ అగ్రిగేటర్ ఓయోలో చేరిన సంగతి తెలిసిందే. -
ఏవియేషన్ షేర్లకు చమురు సెగ
సాక్షి,ముంబై: దడ పుట్టిస్తున్న క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో విమానయాన సంస్థలకు షేర్లు పతనం వైపు పరుగులు తీశాయి. బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు అంతర్జాతీయ వాణిజ్యంలో బ్యారెల్ మార్కుకు 80 డాలర్లు దాటడంతో సోమవారం ఏవియేషన్ సెక్టార్లో అమ్మకాలకు తెరతీసింది. అటు న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 72 డాలర్లను తాకింది. సోమవారం ఉదయం ఒకేసారి రెండు శాతం పెరగడంతో స్సైస్ జెట్ 4.15 శాతం నష్టపోయి 73.85 స్థాయికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ స్టాక్ 47.85 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 48.78 శాతం కోల్పోయింది. దీంతో తాజా 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ 6 శాతం క్షీణించింది. గత ఏడాది నుంచి 22.48 శాతం కోల్పోయి ఇది కూడా లైఫ్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్ కూడా 7.70 శాతం పడిపోయింది. ఇరాన్‌పై ఆంక్షలు అమలు గడువు దగ్గరపడేకొద్దీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు జెట్ స్పీడుతో పరుగులు తీస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే 80 డాలర్లకు చేరగా, నవంబర్ నెలకల్లా 90 డాలర్లు, ఏడాది చివరికల్లా 100 డాలర్లకు చేరుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఆంక్షలు కారణంగా రాబోయే నెలల్లో చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లు ఉంటుందని జెపి మోర్గాన్ తన తాజా మార్కెట్ విశ్లేషణలో పేర్కొంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో సెగ కొనసాగుతోంది. గత ఐదు వారాల్లో 71 డాలర్ల నుంచి బ్యారెల్ 80 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు దిగుమతిలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌లో ఇంధన భారాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
భారీగా పడిపోయిన జెట్ ఎయిర్వేస్ షేర్
ముంబై : దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ షేరు భారీగా పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో జెట్ ఎయిర్వేస్ షేరు 14.5 శాతం మేర కిందకి దిగ జారింది. ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి. తొలి క్వార్టర్ ఫలితాలను కంపెనీ వాయిదా వేయడంతో, షేర్ ధర తీవ్ర ఒడిదుడుకులు పాలవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరపు జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడానికి ఆ కంపెనీ ఆడిటర్లు ఆమోదం తెలుపలేదు. కొన్ని విషయాల మూసివేత కారణంతో ఆడిట్ కమిటీ, కంపెనీ బోర్డుకు ఫలితాల ప్రకటన గురించి ఎలాంటి ఆమోదం పంపించలేదు. దీంతో కంపెనీ ఫలితాల ప్రకటన వాయిదా వేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే గత ముగింపుకు 6.53 శాతం నష్టంలో జెట్ ఎయిర్వేస్ షేరు ఎంట్రీ ఇచ్చింది. ఆ అనంతరం మరింత కిందకి పడిపోతూ వస్తోంది. జెట్ ఎయిర్వేస్ షేరు ఇంతలా పడిపోతూ ఉంటే.. దీని ప్రత్యర్థి కంపెనీలు ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్, స్పైస్‌జెట్‌లు 1.7 శాతం, 2.2 శాతం పైకి ఎగుస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఫలితాలపై ఇప్పటికే విశ్లేషకులు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ ఎలరా క్యాపిటల్ అంచనాల ప్రకారం జెట్ ఎయిర్వేస్ రూ.490 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలుస్తోంది. ఇంధన ఖర్చులు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో ఈ సారి ఏవియేషన్ సెక్టార్ అవుట్‌లుక్ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఇండిగో తాను ప్రకటించిన ఫలితాల్లో నికర లాభాల్లో 97 శాతాన్ని కోల్పోయింది. ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్ తన ఫలితాలను వచ్చే వారంలో ప్రకటించబోతుంది. మరోవైపు ఇంధన ధరలు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి మరలింది. తొలుత ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం కోత పెట్టాలని చూసింది. ఆ ప్రతిపాదనకు పైలెట్లు ఒప్పుకోకపోవడంతో, 500 మంది ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అంతేకాక తన క్యారియర్ వాటాను కొంతమేర విక్రయించేందుకు సాయపడాలని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను సైతం జెట్ ఎయిర్వేస్ కోరింది. -
సామాన్యుడికి విమాన సేవలు చేరేనా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెట్టు ముందా, కాయ ముందా? అన్నట్టుంది భారత విమానయాన రంగం పరిస్థితి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం వచ్చే 20 ఏళ్లలో 200 చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం ఉంటే విస్తరణ చేపట్టడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మరి విమానాలు నడిపేందుకు కావాల్సిన సౌకర్యాల మాటేమిటన్నదే ఇక్కడ ప్రశ్న. సర్వీసులతోపాటే ప్రయాణికులు పెరుగుతారని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి అశోక్ లావాసా చెబుతున్నారు. చిన్న ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అంటూ బాధ్యతను రాష్ట్రాలపై మోపారు. మరోవైపు అన్ని వసతులుంటే సర్వీసులు నడుపుతామని ఆపరేటర్లు అంటున్నారు. ముందు సర్వీసులు ప్రారంభించండి వసతులు కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. మీరు నిర్మిస్తే మేమొస్తాం.. నాన్-హబ్ ప్రాంతాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య తమకు 66 శాతముందని ఎమిరేట్స్ భారత్, నేపాల్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ ఎస్సా సులేమాన్ అహ్మద్ తెలిపారు. అమృత్సర్, పుణె, గోవా తదితర నగరాలకు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌లో నాన్-హబ్ ప్రాంతాల్లో విమాన సేవల కంపెనీలకు అవకాశాలనేకమని చెప్పారు. అయితే మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తే సర్వీసులు ప్రారంభించేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తారని వెల్లడించారు. భారత్‌లో వైమానిక ఇంధనం ధర ఎక్కువగా ఉండడమే పెద్ద సమస్యగా పరిణమించిందని స్పైస్‌జెట్ గ్రౌండ్ సేవల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కమల్ హింగోరాణి అన్నారు. పన్నులు తగ్గితే సర్వీసులు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పన్నులు, ఇతర చార్జీలు తగ్గించకుండా చిన్న విమానాశ్రయాల్లో కల్పించే సాధారణ వసతులు తమకు వద్దంటున్నారు. అందరూ కలిస్తేనే.. ప్రస్తుతం భారత్‌లో వ్యాపార, పర్యాటక ప్రయాణికులే అధికం. సాధారణ ప్రయాణికులకు విమాన సేవలు చేరువ కావాలి. ఫిక్కీ, కేపీఎంజీ నాలెడ్జ్ పేపర్ ప్రకారం 2030 నాటికి భారత విమానయాన రంగం ప్రపంచంలో అగ్ర స్థానానికి చేరుకుంటుంది. ఇది కార్యరూపం దాల్చాలంటే విమానయాన సంస్థలకు విమాన సీట్ల కేటాయింపుల విషయంలో నిబంధనలు సరళతరం కావాల్సిందేనని కేపీఎంజీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్ట్నర్, హెడ్ అంబర్ దూబే అన్నారు. ఎంఆర్వో కేంద్రాలు దిగుమతి చేసుకుంటున్న పరికరాలు ఏడాదిలోపు వినియోగించకపోతే పన్నులు చెల్లించాలన్న నిబంధన హాస్యాస్పదమన్నారు. విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను ఇతర దేశాలతో పోలిస్తే 60% ఎక్కువగా ఉంది. ఇది పరిశ్రమ వృద్ధికి ఆటంకమేనని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం, పరిశ్రమ రెండూ చేతులు కలిస్తేనే విమానయాన రంగానికి మంచి రోజులని స్పష్టం చేశారు.