బోస్టన్: విమానయాన పరిశ్రమను కరోనా గట్టిగానే దెబ్బకొట్టింది. 2020 నుంచి 2022 మధ్య పరిశ్రమకు సుమారు 201 బిలియన్ల మేర నష్టాలు (రూ.15 లక్షల కోట్లు) ఎదురుకావచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. పరిశ్రమ 2023లోనే తిరిగి లాభాల్లోకి ప్రవేశించొచ్చని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విలియమ్ ఎం వాల్‌ష పేర్కొన్నారు. ‘‘సంక్షోభం పతాక స్థాయిని దాటేశాం. తీవ్రమైన అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కోలుకునే మార్గం కనిపిస్తోంది’’అని వాల్‌ష అన్నారు.
ఐఏటీఏ 77వ వార్షిక సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘2021లో నష్టాలు 52 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చు. 2020లో నష్టాలు 138 బిలియన్ డాలర్లతో పోలిస్తే చాలా వరకు తగ్గినట్టే. 2022లో నష్టాలు 12 బిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చు. మొత్తం మీద కరోనా కారణంగా పరిశ్రమకు వాటిల్లే నష్టం 201 బిలియన్ డాలర్లుగా ఉంటుంది’’ అని విల్లీ వివరించారు.
దేశీయంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది లాక్‌డౌన్‌లతో పడిపోయిన ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) క్రమంగా 70 శాతానికి కోలుకుంది. అయినప్పటికీ కరోనాకు ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం భారత్ నుంచి 20 శాతం మేరే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. 2021లో అంతర్జాతీయంగా ఏవియేషన్ పరిశ్రమ ఆదాయం 26.7 శాతం వృద్ధితో 472 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఐఏటీఏ పేర్కొంది. 2022లో 40 శాతం వృద్ధి చెంది 658 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.
చదవండి: భారత్‌కు తొలిసారి తాలిబన్ల లేఖ: విమానాలు నడపాలని విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment