
తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్న పైలెట్‌పై ప్రముఖ దేశీయ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియా కఠిన చర్యలు తీసుకుంది. పైలెట్‌ను మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అంతేకాదు తన స్నేహితురాలికి సపచర్యలు చేయాలని సిబ్బందిని ఆదేశించాడు. అందుకు ఒప్పుకోని సిబ్బందిపై దుర్భాషలాడాడు. చేయి చేసుకున్నాడు.
అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్‌వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏ (Directorate General of Civil Aviation)ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన డీజీసీఏ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను చర్యలు తీసుకోవాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా పైలెట్‌కు రూ.30లక్షల ఫైన్ వేసింది. 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్‌ను విరుద్ధంగా విధులు నిర్వహించిన 3 నెలల పాటు పైలెట్ లైసెన్స్ (పీఐసీ) క్యాన్సిల్ చేసింది.