సామాన్యుడికి విమాన సేవలు చేరేనా? | SpiceJet allots warrants worth Rs 133.2 crore to promoters | Sakshi
Sakshi News home page

సామాన్యుడికి విమాన సేవలు చేరేనా?

Published Fri, Mar 14 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

SpiceJet allots warrants worth Rs 133.2 crore to promoters

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెట్టు ముందా, కాయ ముందా? అన్నట్టుంది భారత విమానయాన రంగం పరిస్థితి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం వచ్చే 20 ఏళ్లలో 200 చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం ఉంటే విస్తరణ చేపట్టడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మరి విమానాలు నడిపేందుకు కావాల్సిన సౌకర్యాల మాటేమిటన్నదే ఇక్కడ ప్రశ్న. సర్వీసులతోపాటే ప్రయాణికులు పెరుగుతారని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి అశోక్ లావాసా  చెబుతున్నారు. చిన్న  ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అంటూ బాధ్యతను రాష్ట్రాలపై మోపారు. మరోవైపు అన్ని వసతులుంటే సర్వీసులు నడుపుతామని ఆపరేటర్లు అంటున్నారు. ముందు సర్వీసులు ప్రారంభించండి వసతులు కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది.

 మీరు నిర్మిస్తే మేమొస్తాం..
 నాన్-హబ్ ప్రాంతాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య తమకు 66 శాతముందని ఎమిరేట్స్ భారత్, నేపాల్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ ఎస్సా సులేమాన్ అహ్మద్ తెలిపారు. అమృత్‌సర్, పుణె, గోవా తదితర నగరాలకు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌లో నాన్-హబ్ ప్రాంతాల్లో విమాన సేవల కంపెనీలకు అవకాశాలనేకమని చెప్పారు. అయితే మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తే సర్వీసులు ప్రారంభించేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తారని వెల్లడించారు. భారత్‌లో వైమానిక ఇంధనం ధర ఎక్కువగా ఉండడమే పెద్ద సమస్యగా పరిణమించిందని స్పైస్‌జెట్ గ్రౌండ్ సేవల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కమల్ హింగోరాణి అన్నారు. పన్నులు తగ్గితే సర్వీసులు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పన్నులు, ఇతర చార్జీలు తగ్గించకుండా చిన్న విమానాశ్రయాల్లో కల్పించే సాధారణ వసతులు తమకు వద్దంటున్నారు.

అందరూ కలిస్తేనే..
 ప్రస్తుతం భారత్‌లో వ్యాపార, పర్యాటక ప్రయాణికులే అధికం. సాధారణ ప్రయాణికులకు విమాన సేవలు చేరువ కావాలి. ఫిక్కీ, కేపీఎంజీ నాలెడ్జ్ పేపర్ ప్రకారం 2030 నాటికి భారత విమానయాన రంగం ప్రపంచంలో అగ్ర స్థానానికి చేరుకుంటుంది. ఇది కార్యరూపం దాల్చాలంటే విమానయాన సంస్థలకు విమాన సీట్ల కేటాయింపుల విషయంలో నిబంధనలు సరళతరం కావాల్సిందేనని కేపీఎంజీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్ట్‌నర్, హెడ్ అంబర్ దూబే అన్నారు. ఎంఆర్‌వో కేంద్రాలు దిగుమతి చేసుకుంటున్న పరికరాలు ఏడాదిలోపు వినియోగించకపోతే పన్నులు చెల్లించాలన్న నిబంధన హాస్యాస్పదమన్నారు. విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను ఇతర దేశాలతో పోలిస్తే 60% ఎక్కువగా ఉంది. ఇది పరిశ్రమ వృద్ధికి ఆటంకమేనని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం, పరిశ్రమ రెండూ చేతులు కలిస్తేనే విమానయాన రంగానికి మంచి రోజులని స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement