దిగొచ్చిన విమానం..! | Limited offer: SpiceJet, IndiGo cut fares by 50%; Air India, Jet, GoAir may follow | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన విమానం..!

Published Wed, Jan 22 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

దిగొచ్చిన విమానం..!

దిగొచ్చిన విమానం..!

న్యూఢిల్లీ: అధిక చార్జీల కారణంగా ప్రయాణికులు తగ్గిపోతూ... ఉన్న ప్రయాణికులు కూడా సింహభాగం కొన్ని ఎయిర్‌లైన్స్‌నే ఆశ్రయిస్తుండటంతో కంపెనీలు మరోసారి ధరల పోరుకు తెరతీశాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే జనవరి-మార్చి మధ్య కాలంలో ఈసారి కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లతో తెరమీదికొచ్చాయి. బేస్ ఫేర్, ఇంధన సర్‌చార్జీలను 50 శాతం తగ్గిస్తున్నట్లు సన్ గ్రూప్‌నకు చెందిన స్పైస్‌జెట్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే... ఇండిగో, గోఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ఇలాంటి ఆఫర్లనే అందుబాటులోకి తెచ్చాయి.
 
 ఎయిర్ ఇండియా ‘స్ప్రింగ్‌సేల్’...
  డిస్కౌంట్ అనంతరం కొన్ని రూట్లలో ఎయిర్ ఇండియా టికెట్ ప్రారంభ ధర పన్నులతో కలిపి రూ.1,357 స్థాయిలో ఉంది. సాధారణ రోజుల్లో చార్జీలతో పోలిస్తే ఇది 70 శాతం తక్కువ. ‘స్ప్రింగ్‌సేల్’ పేరుతో ఎయిర్ ఇండియా ప్రారంభిస్తున్న డిస్కౌంట్ సేల్ నేటి (బుధవారం) నుంచి ప్రారంభమై శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ టికెట్లు కొన్నవారు ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 15లోగా ప్రయాణించాల్సి ఉంటుంది. తమ నెట్‌వర్క్‌లోని అన్ని రూట్లలోనూ రాయితీ చార్జీలు వర్తిస్తాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది.
 
 స్పైస్‌జెట్... 50 శాతం
 బేస్ ఫేర్‌తో పాటు ఇంధన సర్‌చార్జీలను సగానికి తగ్గించామని స్పైస్‌జెట్ ప్రకటించింది. ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ కంపెనీలు ఈ సీజన్లో ఇలాంటి ఆఫర్ల సాయంతో సీట్లను భర్తీ చేస్తుంటాయని, డిస్కౌంట్లు ఇచ్చి ప్రయాణికులను ఆకట్టుకోకపోతే ఆ సీట్లు ఖాళీగానే ఉంటాయని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. మంగళవారం ప్రారంభమైన చార్జీల రాయితీ మూడు రోజులపాటు అమల్లో ఉంటుంది. అంటే గురువారం రాత్రి 12 గంటల్లోపు బుక్ చేసుకునే టికెట్లపైనే డిస్కౌంట్ వర్తిస్తుంది. ‘ఈ ఆఫర్ దేశంలోని కొన్ని నగరాలకే పరిమితం. అంతర్జాతీయ పర్యటనలపై డిస్కౌంటు ఉండకపోవచ్చు...’ అని సన్ గ్రూప్ సీఎఫ్‌ఓ నారాయణన్ చెప్పారు. రాయితీ చార్జీలతో కంపెనీ ఆదాయంపై ఎలాంటి ప్రభా వం పడబోదన్నారు. ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ లోపు ప్రయాణించగలిగే టికెట్లు మాత్రమే లభ్యమవుతాయన్నారు.
 
 ఇండిగో, గో ఎయిర్ కూడా...
 ఇండిగో, గో ఎయిర్ అధికారికంగా ఇంకా డిస్కౌంట్లను ప్రకటించకపోయినా... ప్రయాణ తేదీకి 30-60 రోజుల ముందు టికెట్లు కొనేవారికి ఆ కంపెనీలు 50 శాతం వరకు టికెట్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలియజేశారు. కాగా ఎయిర్‌లైన్ కంపెనీలు బేస్ ఫేర్‌ను మాత్రమే తగ్గిం చాయి. వర్తించే ఇతర ఫీజులు, పన్నులన్నిటినీ ప్రయాణికులే భరించాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే స్పైస్‌జెట్ విమానంలో గోవా - ముంబై చార్జీ కేవలం 20 శాతమే తగ్గుతుంది. చార్జీల తగ్గింపును ధ్రువీకరించడానికి ఆయా ఎయిర్‌లైన్స్ అధికారులు అందుబాటులోకి రాలేదు.
 
 రెండున్నర రెట్లు పెరిగిన బుకింగ్స్..
 ఎయిర్‌లైన్స్ కంపెనీలు చార్జీలను తగ్గించిన కొద్ది గంటల్లోనే తమ వెబ్‌సైట్లో బుకింగ్‌ల సంఖ్య దాదాపు 250% పెరిగినట్లు యాత్రా డాట్‌కామ్ ప్రతినిధి శరత్ దలాల్ చెప్పారు. మరో ట్రావెల్ పోర్టల్ మేక్‌మైట్రిప్ సైతం ఎయిర్ టికెట్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. డిస్కౌంట్ సంగతి అందరికీ తెలిసిన తర్వాత బుకింగ్స్ మరింత పెరగవచ్చని పేర్కొంది.
 
 గూగుల్‌లో రెండు లక్షల సెర్చ్‌లు
 స్పైస్‌జెట్ చార్జీలను సగానికి సగం తగ్గించినట్లు తెలియడంతో నెట్‌లో ఎంక్వయిరీలు ప్రారంభించారు. గూగుల్‌లో మంగళవారం ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది సెర్చ్ చేశారు. చార్జీలు
 ఎంత తగ్గాయో ఆరా తీశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement