Sun Group
-
అక్కడ క్యాన్సిల్.. ఇక్కడ కన్ఫార్మ్
మురుగదాస్–విజయ్ హిట్ కాంబినేషన్ గురించి మనకు తెలిసిందే. ‘తుపాకి’, ‘కత్తి’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రాలు అందించిన ఈ కాంబినేషన్ ఈసారి ఇంకా పెద్ద బ్లాక్బాస్టర్ పై కన్నేశారు. అంత పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే భారీ వ్యయం, విపరీతమైన హంగులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి. వీళ్ల సినిమాని ‘సన్ నేట్వర్క్’ చైర్మన్ కళానిథి మారన్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని సన్ గ్రూప్ సంస్థ స్వయంగా వెల్లడించింది. జనవరిలో షూటింగ్ ప్రారంభించి, దీపావళికి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి అలా ఉంచితే.. అక్షయ్‌కుమార్ హీరోగా మురుగదాస్ ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తారనే వార్త వచ్చింది. ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. అంతకు ముందే కన్ఫార్మ్ అయిన విజయ్ సినిమాను పట్టాలెక్కించే పని మీద ఉన్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. -
కేసీఆర్ కు థాంక్స్: సన్ రైజర్స్ యజమాని
హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ను ప్రోత్సహించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆ జట్టు యజమాని కళానిధి మారన్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను మారన్, సన్ గ్రూప్ సీఈఓ షణ్ముగం, జెమినీ టీవీ ఎండీ కిరణ్, జీఎం బాలకృష్ణన్ కలిశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం .. హైదరాబాద్, తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ లు హైదరాబాద్ లోనే నిర్వహిస్తారని, ఆ రెండు మ్యాచ్ లకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరినట్లు మారన్ తెలిపారు. వచ్చే సీజన్లో ఐపీఎల్ మ్యాచ్ లను మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కళానిధి మారన్ వెల్లడించారు. -
సన్ టీవీ లాభం 19 శాతం అప్
4 రోజుల్లో 23 శాతం ఎగసిన షేర్ న్యూఢిల్లీ : సన్ టీవీ నెట్వర్క్ సంస్థ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 19 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.197 కోట్లకు ఎగసిందని సంస్థ తెలియజేసింది. ఆదాయం రూ.634 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.691కు వృద్ధి చెందింది. కాగా ఈ షేర్ నాలుగు రోజుల్లో 23 శాతం ఎగసింది. ఈ నెల 28న రూ.274గా ఉన్న ఈ షేర్ శుక్రవారం నాటికిరూ.337కు ఎగసింది. సన్ గ్రూప్‌కు చెందిన రెడ్ ఎఫ్ఎంను మూడో దశ ఎఫ్ఎం స్టేషన్ల వేలంలో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించడంతో గత మూడు రోజుల్లో(గురువారం వరకూ) ఈ షేర్ 14 శాతం పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే షేర్ ధర 9 శాతం పెరిగింది. -
కుదుపుల ప్రయాణంలో స్పైస్‌జెట్
పెరిగిపోతున్న రుణభారం, బకాయిలు స్వయంకృతాపరాధం, సమస్యలతో సతమతం అన్ని వ్యాపారాలు ఒకేలా ఉండవు. ఒక దాంట్లో గెలిచాం కదా మరొకటేదైనా కూడా అంతే అనుకుంటే సమస్యలు తప్పవు. మీడియాలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న సన్ గ్రూప్ సంస్థ స్పైస్‌జెట్ ఏవియేషన్ రంగంలో రివ్వున ఎగరలేకపోతుండటం దీనికి మరో నిదర్శనం. ఇప్పుడిప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు కొందరు ముందుకొస్తున్నా.. స్పైస్‌జెట్ కష్టాలకు అనేకానేక కారణాలు ఉన్నాయి. ఇందులో కొన్ని స్వయంకృతాపరాధాలు కాగా మరికొన్ని రాజకీయపరమైనవి. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ సమస్యలపై ఈ కథనం. దేశీయంగా ఎయిర్‌లైన్స్ వ్యాపారం చాలా సంక్లిష్టమైనది. ఈ రంగంలో సమస్యల ధాటికి తట్టుకోలేక పలు సంస్థలు మూతబడ్డాయి. దమానియా, ఈస్ట్ వెస్ట్, మోదీలుఫ్త్, ఎండీఎల్ఆర్, పారమౌంట్, ఎన్ఈపీసీ, కింగ్‌ఫిషర్.. ఇవన్నీ ఆ కోవకి చెందినవే. తాజాగా స్పైస్‌జెట్ అదే బాటలో ఉందన్న సందేహాలు రేకెత్తాయి. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దాకా దేశీయంగా రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఉన్న స్పైస్‌జెట్‌కి 20% మార్కెట్ వాటా ఉంది. కింగ్‌ఫిషర్ మూతపడటంతో ఆ సంస్థ మార్కెట్‌ను స్పైస్‌జెట్, ఇండిగో దక్కించుకున్నాయి. అలాంటిది అకస్మాత్తుగా స్పైస్‌జెట్‌కు జబ్బు చేసింది. ప్రస్తుతం రోజు గడవడానికి నిధులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. విమానాలు లీజుకిచ్చిన కంపెనీలు, చమురు సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ. 1,400 కోట్లు బకాయి పడింది. మరో 2,000 కోట్ల పైచిలుకు రుణ భారమూ ఉంది. చేతులారా స్పైస్‌జెట్ పరిస్థితి ఇలా దిగజారడానికి కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా కారణం. తక్షణ అవసరాలు తీర్చుకునేందుకు తరచూ డిస్కౌంట్ స్కీములు మొదలైన వాటితో అప్పటికప్పుడు నిధులు సమకూర్చుకోవడం వీటిలో ఒకటి. ఏ కంపెనీ అయినా ఎంతో కాలం ఇలాంటి వాటితో మనుగడ సాగించడం కష్టం. పై స్థాయిలో నిర్వహణపరమైన లోపాలు దీనికి తోడయ్యాయి. వ్యాపారాన్ని అప్పటిదాకా మెరుగ్గా నిర్వహించుకుంటూ వస్తున్న పై స్థాయి అధికారులు మేనేజ్మెంట్తో విభేదాల కారణంగా వైదొలిగారు. ప్రమోటరు కళానిధి మారన్ కుటుంబం అడపాదడపా నిధులు సమకూరుస్తూనే ఉన్నా అవి సరిపోవడం లేదు. అలాగే రుణాలపై అధిక వడ్డీలూ తోడయ్యాయి. పలు విమానాల రద్దు వల్ల సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో కంపెనీ రోజుకీ రూ. 2 - 2.5 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్లు అంచనా. ఏవియేషన్ సంబంధిత సమస్యలూ కంపెనీ కుదేలవుతుండటానికి కారణమయ్యాయి. దేశీయంగా విమాన ఇంధనం చార్జీలు అత్యధిక స్థాయిలో ఉంటుండటంపై ఎయిర్‌లైన్స్ గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే.. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 75% దాకా ఇంధనం ఖర్చులే (ఏటీఎఫ్) ఉంటాయి. ఇన్వెస్టర్ల నిరాసక్తి..: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌లో మనీల్యాండరింగ్కి సంబంధించి మారన్ సోదరులపై అభియోగాలు ఉండటంతో స్పైస్‌జెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా ముందుకు రాకపోయి ఉండొచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇటు విశ్వసనీయత, అటు క్రెడిట్ రేటింగ్ రెండూ కూడా దెబ్బతినడంతో ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి కనపర్చలేదని వారి అంచనా. అయితే, ప్రస్తుతం వ్యవస్థాపక ప్రమోటరు అజయ్ సింగ్, జేపీ మోర్గాన్ చేజ్ సంస్థ ఇందులో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం కంపెనీకి ఊరటనిచ్చే విషయం. రాజకీయపరమైన సమస్యలు .. కంపెనీ కష్టాలు మరింతగా పెరుగుతుండటం వెనుక రాజకీయపరమైన కారణాలు కూడా ఉండొచ్చంటున్నారు మార్కెట్ వర్గాలు. స్పైస్‌జెట్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వారిని అణగదొక్కడానికి ప్రత్యర్థులు ఈ మార్గాన్ని అనుసరిస్తుండొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. సంస్థకు సరైన సమయంలో నిధులు లభించకుండా అడ్డంకులు సృష్టించడం, బకాయిలు అప్పటికప్పుడు కట్టేయాల్సిందేనంటూ ఒత్తిళ్లు తేవడం, చాలా రోజుల ముందుగా టికెట్ల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోనివ్వకుండా ఆంక్షలు విధించడం మొదలైనవన్నీ ఇందులో భాగమే అయి ఉంటాయన్నది వారి విశ్లేషణ. ఇప్పుడు కంపెనీని ఆదుకునేందుకు ముందుకొచ్చిన వ్యవస్థాపక ప్రమోటరు అజయ్ సింగ్‌కి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఇందుకు బలం చేకూరుస్త్తున్నాయని వారంటున్నారు. -
స్పైస్‌జెట్‌కు కొత్త ఓనర్?
⇒సన్‌గ్రూప్ కళానిధి మారన్ యాజమాన్యంలో మార్పు! ⇒రంగంలోకి దిగిన పాత ప్రమోటర్ అజయ్ సింగ్.. ⇒ఇన్వెస్టర్ల నుంచి త్వరలో రూ.1,400 కోట్ల పెట్టుబడులకు చాన్స్... న్యూఢిల్లీ: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దేశీ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చేతులు మారనుందా? త్వరలో కొత్త యాజమాన్యం రాబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఊహాగానాలు నిజం కానున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. భారత్, విదేశాలకు చెందిన కొందరు ఇన్వెస్టర్లు కంపెనీలో సుమారు రూ.1,400-1,500 కోట్లమేర కొత్తగా పెట్టుబడులు పెట్టి.. ఆమేరకు వాటాను దక్కించుకోవడానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. కంపెనీ బ్యాలెన్స్‌షీట్, ఆర్థిక పరిస్థితిని మదింపు(డ్యూడెలిజెన్స్) చేసిన తర్వాత పెట్టుబడులపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)కి బకాయిలు చెల్లించకపోవడంతో ఐదు రోజుల క్రితం స్పైస్‌జెట్ విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయి కంపెనీ దాదాపు కుప్పకూలే దశకు చేరిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యంతో చమురు కంపెనీలు, ఏఏఐ బకాయిల చెల్లింపునకు కొంత వ్యవధి ఇవ్వడంతో స్పైస్‌జెట్‌కు తాత్కాలికంగా కొంత ఊరట లభించింది. రంగంలోకి అజయ్ సింగ్... కష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌పై ఈ కంపెనీని నెలకొల్పిన అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కంపెనీని గాడిలోపెట్టడంతోపాటు ఇతర ఇన్వెస్టర్లతో కలిసి మళ్లీ పెట్టుబడులు పెట్టే ప్రణాళికల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సింగ్ పలుమార్లు భేటీ కావడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి. అంతేకాకుండా స్పైస్‌జెట్‌లో పెట్టుబడులకు ఇది మంచి తరుణమని.. కంపెనీకి మళ్లీ పుంజుకోగల సత్తా ఉందంటూ వ్యాఖ్యానించారుకూడా. 2010లో సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్.. స్పైస్‌జెట్ ఇన్వెస్టర్లయిన కన్సాగ్రా, విల్బర్ రాస్ నుంచి 38% వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. ఆతర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా కొంత వాటాను దక్కించుకోవడంతో యాజమాన్యం ఆయన చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం మారన్, సన్‌గ్రూప్‌లకు స్పైస్‌జెట్‌లో 53.48 శాతం వాటా ఉంది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో మైనారిటీ వాటాదారుగా ఉన్న అజయ్ సింగ్‌కు సుమారు 5 శాతం వాటా ఉంది. కాగా, కంపెనీ ఆస్తులు, ఇతరత్రా అంశాలను మదింపుచేసేందుకు 4-6 వారాల వ్యవధి పట్టొచ్చని.. ఆ తర్వాత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. మారన్, సన్‌గ్రూప్ వద్దనుంచి యాజమాన్య నియంత్రణ ఇతర ఇన్వెస్టర్లకు వెళ్తుంది. తక్షణావసరం రూ.1,400 కోట్లు... విమానాలను లీజుకిచ్చిన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ.1,400 కోట్లమేర బకాయి పడింది. కంపెనీ గట్టెక్కాలంటే తక్షణం ఈ మొత్తం అవసరం. మరో రూ.2,000 కోట్లకుపైగా రుణ భారం కూడా ఉంది. కాగా, స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో బడా ఇన్వెస్టర్లతో అజయ్ సింగ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వాళ్లుగనుక వాటా కొనుగోలు చేస్తే.. యాజమాన్య మార్పిడితో పాటు రుణాల చెల్లింపు బాధ్యతను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా.. విమానయాన సేవలు సజావుగా సాగేందుకు మరిన్ని నిధులను కూడా వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ(షేర్ల మొత్తం విలువ) రూ.900 కోట్లుగా ఉంది. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.48 చొప్పున మారన్ వాటాను కొన్నారు. కంపెనీ కష్టాల నేపథ్యంలో ఇటీవలే రూ.13 స్థాయిని తాకిన షేరు.. తాజా ఊరటతో మళ్లీ 16 స్థాయికి కోలుకుంది. ఎవరీ అజయ్ సింగ్... స్పైస్‌జెట్‌ను గట్టెక్కించేందుకు దీని అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ తెరపైకి రావడంతో అందరికళ్లూ ఇప్పుడు ఆయనపైనే ఉన్నాయి. ఢిల్లీ ఐఐటీలో పట్టాపుచ్చుకున్న సింగ్.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. పారిశ్రామికవేత్త ఎస్కే మోడీకి చెందిన నష్టజాతక మోడీలుఫ్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత దీని పేరును స్పైస్‌జెట్‌గా మార్చి.. లాభాలబాట పట్టించారు. దేశంలో ప్రధాన చౌక విమానయాన సంస్థగా తీర్చిదిద్దిన ఘనత అజయ్ సింగ్‌కే దక్కుతుంది. అయితే, 2010లో కంపెనీలో ఇతర ప్రధాన ఇన్వెస్టర్లు తమ వాటాను మారన్‌కు విక్రయిండచంతో యాజమాన్యం చేతులు మారింది. ఇదిలాఉంటే... అధికార బీజీపీ ప్రభుత్వంతో సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్పైస్‌జెట్ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎందుకంటే తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం విషయంలో సింగ్ కీలక పాత్ర పోషించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ ఎన్నివిజ్ఞప్తులు చేసినా పట్టించుకోని మోదీ సర్కారు.. సింగ్ రంగంలోకి దిగాక ఊరటకల్పించే చర్యలు చేపట్టడం గమనార్హం. -
స్పైస్‌జెట్‌కు లభించని ఊరట
తక్షణ ఆర్థిక సాయం ఆర్ధించిన సంస్థ హామీ ఇవ్వని పౌర విమానయాన శాఖ న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, సమస్యల్లో కూరుకుపోయిన సన్గ్రూప్కు చెందిన స్పైస్‌జెట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. తక్షణం తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ స్పైస్‌జెట్ అధికారులు సోమవారం ప్రభుత్వాన్ని కోరారు. స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్, సన్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎస్.ఎల్. నారాయణన్ తదితర కంపెనీ ఉన్నతాధికారులు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మను కలిసి తక్షణం తమను ఆదుకోవాలని విజ్నప్తి చేశారు. అయితే వారికి ఎలాంటి హామీ లభించలేదు. ఇలాంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలు పై స్థాయిలో తీసుకుంటారని శర్మ పేర్కొన్నారు. స్పైస్‌జెట్ అంశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి, పెట్రోలియం, ఆర్థిక మంత్రి త్వ శాఖలకు నివేదించామని తెలిపారు. స్పైస్‌జెట్ రుణ భారం రూ.2,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ సంస్థ సాఫీగా కార్యకలాపాలు నిర్వహించాలంటే తక్షణం రూ.1,400 కోట్లు అవసరం. దేశీయ విమాన సర్వీసుల మార్కెట్లో 17 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ మొత్తం 1,861 సర్వీసులను రద్దు చేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.310 కోట్ల నష్టాన్ని పొందింది. అంతకు ముందటి క్వార్టర్ నష్టాల(రూ.559 కోట్లు)తో పోల్చితే ఇది తక్కువే. ఈ సంస్థకు నష్టాలు రావడం ఇది వరుసగా ఐదో క్వార్టర్. -
1800 సర్వీసులను రద్దు చేసిన స్పైస్‌జెట్
చెన్నై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుత నెలకు సంబంధించి 1,800 సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 31 వరకూ నేపాల్‌లోని ఖాట్మండు, తదితర పలు నగరాలకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో 81 సర్వీసులు సోమవారం(8)నాటివే కావడం గమనార్హం. కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బకాయిలకు సంబంధించి రూ. 200 కోట్లమేర బ్యాంక్ గ్యారంటీలు సమర్పించకపోతే బుధవారానికల్లా క్యాష్ అండ్ క్యారీ ప్రాతిపదికన మాత్రమే కార్యకలాపాలను అనుమతించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ) ఇప్పటికే నిర్ణయించింది. కాగా, మరోవైపు ముందస్తు(అడ్వాన్స్) టికెట్ల బుకింగ్‌కు సంబంధించి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉంది. ఈ బాటలో నెల రోజులకుమించి టికెట్ల బుకింగ్‌ను అనుమతించవద్దంటూ ఇప్పటికే డీజీసీఏ కంపెనీని ఆదేశించింది. ఈ పరిణామాల వల్ల కంపెనీ లెసైన్స్ వెంటనే ప్రమాదంలో పడే అవకాశం లేనప్పటికీ, వివిధ సమస్యలు చుట్టుముట్టవచ్చునని నిపుణులు వ్యాఖ్యానించారు. -
ఐఎస్ఎల్ నుంచి సన్ గ్రూప్ ఔట్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌కు ఆరంభానికి ముందే షాక్ తగిలింది. బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ సన్ గ్రూప్.. లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయానికి గల కారణాలను అటు ఆ సంస్థగానీ, ఇటు ఐఎస్ఎల్ నిర్వాహకులు గానీ ప్రకటించకపోయినా.. జె.ఎస్.డబ్ల్యు అనే సంస్థతో సన్ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఐఎంజీ-రిలయన్స్ వ్యతిరేకించింది. దీంతో తాము లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సన్ గ్రూప్ తెలిపింది. అయితే డ్రాఫ్ట్‌లో బెంగళూరు జట్టు ఎంపిక చేసుకున్న 14 మంది ఆటగాళ్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే జట్టుకు వారు ప్రాతినిధ్యం వహిస్తారని లీగ్ నిర్వాహకులు హామీ ఇచ్చారు. మాంచెస్టర్‌లో ఆవిష్కరణ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ ఆవిష్కరణ ఇంగ్లండ్‌లో జరగనుంది. సెప్టెంబర్ 6న అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రముఖుల సమక్షంలో మాంచెస్టర్‌లో వైభవంగా జరిగే కార్యక్రమంలో ఐఎస్‌ఎల్‌ను ఆవిష్కరించనున్నారు. 2017లో భారత్ ఆతిథ్యమివ్వనున్న అండర్-17 ప్రపంచకప్‌ను కూడా అదే వేదికపై ఆవిష్కరిస్తారు. -
దిగొచ్చిన విమానం..!
న్యూఢిల్లీ: అధిక చార్జీల కారణంగా ప్రయాణికులు తగ్గిపోతూ... ఉన్న ప్రయాణికులు కూడా సింహభాగం కొన్ని ఎయిర్‌లైన్స్‌నే ఆశ్రయిస్తుండటంతో కంపెనీలు మరోసారి ధరల పోరుకు తెరతీశాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే జనవరి-మార్చి మధ్య కాలంలో ఈసారి కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లతో తెరమీదికొచ్చాయి. బేస్ ఫేర్, ఇంధన సర్‌చార్జీలను 50 శాతం తగ్గిస్తున్నట్లు సన్ గ్రూప్‌నకు చెందిన స్పైస్‌జెట్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే... ఇండిగో, గోఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ఇలాంటి ఆఫర్లనే అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్ ఇండియా ‘స్ప్రింగ్‌సేల్’... డిస్కౌంట్ అనంతరం కొన్ని రూట్లలో ఎయిర్ ఇండియా టికెట్ ప్రారంభ ధర పన్నులతో కలిపి రూ.1,357 స్థాయిలో ఉంది. సాధారణ రోజుల్లో చార్జీలతో పోలిస్తే ఇది 70 శాతం తక్కువ. ‘స్ప్రింగ్‌సేల్’ పేరుతో ఎయిర్ ఇండియా ప్రారంభిస్తున్న డిస్కౌంట్ సేల్ నేటి (బుధవారం) నుంచి ప్రారంభమై శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ టికెట్లు కొన్నవారు ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 15లోగా ప్రయాణించాల్సి ఉంటుంది. తమ నెట్‌వర్క్‌లోని అన్ని రూట్లలోనూ రాయితీ చార్జీలు వర్తిస్తాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. స్పైస్‌జెట్... 50 శాతం బేస్ ఫేర్‌తో పాటు ఇంధన సర్‌చార్జీలను సగానికి తగ్గించామని స్పైస్‌జెట్ ప్రకటించింది. ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ కంపెనీలు ఈ సీజన్లో ఇలాంటి ఆఫర్ల సాయంతో సీట్లను భర్తీ చేస్తుంటాయని, డిస్కౌంట్లు ఇచ్చి ప్రయాణికులను ఆకట్టుకోకపోతే ఆ సీట్లు ఖాళీగానే ఉంటాయని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. మంగళవారం ప్రారంభమైన చార్జీల రాయితీ మూడు రోజులపాటు అమల్లో ఉంటుంది. అంటే గురువారం రాత్రి 12 గంటల్లోపు బుక్ చేసుకునే టికెట్లపైనే డిస్కౌంట్ వర్తిస్తుంది. ‘ఈ ఆఫర్ దేశంలోని కొన్ని నగరాలకే పరిమితం. అంతర్జాతీయ పర్యటనలపై డిస్కౌంటు ఉండకపోవచ్చు...’ అని సన్ గ్రూప్ సీఎఫ్ఓ నారాయణన్ చెప్పారు. రాయితీ చార్జీలతో కంపెనీ ఆదాయంపై ఎలాంటి ప్రభా వం పడబోదన్నారు. ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ లోపు ప్రయాణించగలిగే టికెట్లు మాత్రమే లభ్యమవుతాయన్నారు. ఇండిగో, గో ఎయిర్ కూడా... ఇండిగో, గో ఎయిర్ అధికారికంగా ఇంకా డిస్కౌంట్లను ప్రకటించకపోయినా... ప్రయాణ తేదీకి 30-60 రోజుల ముందు టికెట్లు కొనేవారికి ఆ కంపెనీలు 50 శాతం వరకు టికెట్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలియజేశారు. కాగా ఎయిర్‌లైన్ కంపెనీలు బేస్ ఫేర్‌ను మాత్రమే తగ్గిం చాయి. వర్తించే ఇతర ఫీజులు, పన్నులన్నిటినీ ప్రయాణికులే భరించాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే స్పైస్‌జెట్ విమానంలో గోవా - ముంబై చార్జీ కేవలం 20 శాతమే తగ్గుతుంది. చార్జీల తగ్గింపును ధ్రువీకరించడానికి ఆయా ఎయిర్‌లైన్స్ అధికారులు అందుబాటులోకి రాలేదు. రెండున్నర రెట్లు పెరిగిన బుకింగ్స్.. ఎయిర్‌లైన్స్ కంపెనీలు చార్జీలను తగ్గించిన కొద్ది గంటల్లోనే తమ వెబ్సైట్లో బుకింగ్‌ల సంఖ్య దాదాపు 250% పెరిగినట్లు యాత్రా డాట్‌కామ్ ప్రతినిధి శరత్ దలాల్ చెప్పారు. మరో ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్ సైతం ఎయిర్ టికెట్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. డిస్కౌంట్ సంగతి అందరికీ తెలిసిన తర్వాత బుకింగ్స్ మరింత పెరగవచ్చని పేర్కొంది. గూగుల్‌లో రెండు లక్షల సెర్చ్‌లు స్పైస్‌జెట్ చార్జీలను సగానికి సగం తగ్గించినట్లు తెలియడంతో నెట్లో ఎంక్వయిరీలు ప్రారంభించారు. గూగుల్‌లో మంగళవారం ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది సెర్చ్ చేశారు. చార్జీలు ఎంత తగ్గాయో ఆరా తీశారు.