కుదుపుల ప్రయాణంలో స్పైస్‌జెట్
పెరిగిపోతున్న రుణభారం, బకాయిలు
స్వయంకృతాపరాధం, సమస్యలతో సతమతం
అన్ని వ్యాపారాలు ఒకేలా ఉండవు. ఒక దాంట్లో గెలిచాం కదా మరొకటేదైనా కూడా అంతే అనుకుంటే సమస్యలు తప్పవు. మీడియాలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న సన్ గ్రూప్ సంస్థ స్పైస్‌జెట్ ఏవియేషన్ రంగంలో రివ్వున ఎగరలేకపోతుండటం దీనికి మరో నిదర్శనం. ఇప్పుడిప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు కొందరు ముందుకొస్తున్నా.. స్పైస్‌జెట్ కష్టాలకు అనేకానేక కారణాలు ఉన్నాయి. ఇందులో కొన్ని స్వయంకృతాపరాధాలు కాగా మరికొన్ని రాజకీయపరమైనవి. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ సమస్యలపై ఈ కథనం.
దేశీయంగా ఎయిర్‌లైన్స్ వ్యాపారం చాలా సంక్లిష్టమైనది. ఈ రంగంలో సమస్యల ధాటికి తట్టుకోలేక పలు సంస్థలు మూతబడ్డాయి. దమానియా, ఈస్ట్ వెస్ట్, మోదీలుఫ్త్, ఎండీఎల్‌ఆర్, పారమౌంట్, ఎన్‌ఈపీసీ, కింగ్‌ఫిషర్.. ఇవన్నీ ఆ కోవకి చెందినవే. తాజాగా స్పైస్‌జెట్ అదే బాటలో ఉందన్న సందేహాలు రేకెత్తాయి. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దాకా దేశీయంగా రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఉన్న స్పైస్‌జెట్‌కి 20% మార్కెట్ వాటా ఉంది.
కింగ్‌ఫిషర్ మూతపడటంతో ఆ సంస్థ మార్కెట్‌ను స్పైస్‌జెట్, ఇండిగో దక్కించుకున్నాయి. అలాంటిది అకస్మాత్తుగా స్పైస్‌జెట్‌కు జబ్బు చేసింది. ప్రస్తుతం రోజు గడవడానికి నిధులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. విమానాలు లీజుకిచ్చిన కంపెనీలు, చమురు సంస్థలు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ. 1,400 కోట్లు బకాయి పడింది. మరో 2,000 కోట్ల పైచిలుకు రుణ భారమూ ఉంది.
చేతులారా
స్పైస్‌జెట్ పరిస్థితి ఇలా దిగజారడానికి కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా కారణం. తక్షణ అవసరాలు తీర్చుకునేందుకు తరచూ డిస్కౌంట్ స్కీములు మొదలైన వాటితో అప్పటికప్పుడు నిధులు సమకూర్చుకోవడం వీటిలో ఒకటి. ఏ కంపెనీ అయినా ఎంతో కాలం ఇలాంటి వాటితో మనుగడ సాగించడం కష్టం. పై స్థాయిలో నిర్వహణపరమైన లోపాలు దీనికి తోడయ్యాయి. వ్యాపారాన్ని అప్పటిదాకా మెరుగ్గా నిర్వహించుకుంటూ వస్తున్న పై స్థాయి అధికారులు మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా వైదొలిగారు.
ప్రమోటరు కళానిధి మారన్ కుటుంబం అడపాదడపా నిధులు సమకూరుస్తూనే ఉన్నా అవి సరిపోవడం లేదు. అలాగే రుణాలపై అధిక వడ్డీలూ తోడయ్యాయి. పలు విమానాల రద్దు వల్ల సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో కంపెనీ రోజుకీ రూ. 2 - 2.5 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్లు అంచనా. ఏవియేషన్ సంబంధిత సమస్యలూ కంపెనీ కుదేలవుతుండటానికి కారణమయ్యాయి. దేశీయంగా విమాన ఇంధనం చార్జీలు అత్యధిక స్థాయిలో ఉంటుండటంపై ఎయిర్‌లైన్స్ గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే.. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 75% దాకా ఇంధనం ఖర్చులే (ఏటీఎఫ్) ఉంటాయి.
ఇన్వెస్టర్ల నిరాసక్తి..: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌లో మనీల్యాండరింగ్‌కి సంబంధించి మారన్ సోదరులపై అభియోగాలు ఉండటంతో స్పైస్‌జెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా ముందుకు రాకపోయి ఉండొచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇటు విశ్వసనీయత, అటు క్రెడిట్ రేటింగ్ రెండూ కూడా దెబ్బతినడంతో ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి కనపర్చలేదని వారి అంచనా. అయితే, ప్రస్తుతం వ్యవస్థాపక ప్రమోటరు అజయ్ సింగ్, జేపీ మోర్గాన్ చేజ్ సంస్థ ఇందులో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం కంపెనీకి ఊరటనిచ్చే విషయం.
రాజకీయపరమైన సమస్యలు ..
కంపెనీ కష్టాలు మరింతగా పెరుగుతుండటం వెనుక రాజకీయపరమైన కారణాలు కూడా ఉండొచ్చంటున్నారు మార్కెట్ వర్గాలు. స్పైస్‌జెట్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వారిని అణగదొక్కడానికి ప్రత్యర్థులు ఈ మార్గాన్ని అనుసరిస్తుండొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. సంస్థకు సరైన సమయంలో నిధులు లభించకుండా అడ్డంకులు సృష్టించడం, బకాయిలు అప్పటికప్పుడు కట్టేయాల్సిందేనంటూ ఒత్తిళ్లు తేవడం, చాలా రోజుల ముందుగా టికెట్ల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోనివ్వకుండా ఆంక్షలు విధించడం మొదలైనవన్నీ ఇందులో భాగమే అయి ఉంటాయన్నది వారి విశ్లేషణ. ఇప్పుడు కంపెనీని ఆదుకునేందుకు ముందుకొచ్చిన వ్యవస్థాపక ప్రమోటరు అజయ్ సింగ్‌కి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఇందుకు బలం చేకూరుస్త్తున్నాయని వారంటున్నారు.