స్పైస్‌జెట్‌కు కొత్త ఓనర్?
⇒సన్‌గ్రూప్ కళానిధి మారన్ యాజమాన్యంలో మార్పు!
⇒రంగంలోకి దిగిన పాత ప్రమోటర్ అజయ్ సింగ్..
⇒ఇన్వెస్టర్ల నుంచి త్వరలో రూ.1,400 కోట్ల పెట్టుబడులకు చాన్స్...
న్యూఢిల్లీ: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దేశీ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చేతులు మారనుందా? త్వరలో కొత్త యాజమాన్యం రాబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఊహాగానాలు నిజం కానున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. భారత్, విదేశాలకు చెందిన కొందరు ఇన్వెస్టర్లు కంపెనీలో సుమారు రూ.1,400-1,500 కోట్లమేర కొత్తగా పెట్టుబడులు పెట్టి.. ఆమేరకు వాటాను దక్కించుకోవడానికి సుముఖంగా ఉన్నారని సమాచారం.
కంపెనీ బ్యాలెన్స్‌షీట్, ఆర్థిక పరిస్థితిని మదింపు(డ్యూడెలిజెన్స్) చేసిన తర్వాత పెట్టుబడులపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)కి బకాయిలు చెల్లించకపోవడంతో ఐదు రోజుల క్రితం స్పైస్‌జెట్ విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయి కంపెనీ దాదాపు కుప్పకూలే దశకు చేరిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యంతో చమురు కంపెనీలు, ఏఏఐ బకాయిల చెల్లింపునకు కొంత వ్యవధి ఇవ్వడంతో స్పైస్‌జెట్‌కు తాత్కాలికంగా కొంత ఊరట లభించింది.
రంగంలోకి అజయ్ సింగ్...
కష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌పై ఈ కంపెనీని నెలకొల్పిన అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కంపెనీని గాడిలోపెట్టడంతోపాటు ఇతర ఇన్వెస్టర్లతో కలిసి మళ్లీ పెట్టుబడులు పెట్టే ప్రణాళికల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సింగ్ పలుమార్లు భేటీ కావడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి.
అంతేకాకుండా స్పైస్‌జెట్‌లో పెట్టుబడులకు ఇది మంచి తరుణమని.. కంపెనీకి మళ్లీ పుంజుకోగల సత్తా ఉందంటూ వ్యాఖ్యానించారుకూడా. 2010లో సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్.. స్పైస్‌జెట్ ఇన్వెస్టర్లయిన కన్సాగ్రా, విల్బర్ రాస్ నుంచి 38% వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. ఆతర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా కొంత వాటాను దక్కించుకోవడంతో యాజమాన్యం ఆయన చేతుల్లోకి వెళ్లింది.
ప్రస్తుతం మారన్, సన్‌గ్రూప్‌లకు స్పైస్‌జెట్‌లో 53.48 శాతం వాటా ఉంది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో మైనారిటీ వాటాదారుగా ఉన్న అజయ్ సింగ్‌కు సుమారు 5 శాతం వాటా ఉంది. కాగా, కంపెనీ ఆస్తులు, ఇతరత్రా అంశాలను మదింపుచేసేందుకు 4-6 వారాల వ్యవధి పట్టొచ్చని.. ఆ తర్వాత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. మారన్, సన్‌గ్రూప్ వద్దనుంచి యాజమాన్య నియంత్రణ ఇతర ఇన్వెస్టర్లకు వెళ్తుంది.
తక్షణావసరం రూ.1,400 కోట్లు...
విమానాలను లీజుకిచ్చిన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ.1,400 కోట్లమేర బకాయి పడింది. కంపెనీ గట్టెక్కాలంటే తక్షణం ఈ మొత్తం అవసరం. మరో రూ.2,000 కోట్లకుపైగా రుణ భారం కూడా ఉంది. కాగా, స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో బడా ఇన్వెస్టర్లతో అజయ్ సింగ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
వాళ్లుగనుక వాటా కొనుగోలు చేస్తే.. యాజమాన్య మార్పిడితో పాటు రుణాల చెల్లింపు బాధ్యతను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా.. విమానయాన సేవలు సజావుగా సాగేందుకు మరిన్ని నిధులను కూడా వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ(షేర్ల మొత్తం విలువ) రూ.900 కోట్లుగా ఉంది. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.48 చొప్పున మారన్ వాటాను కొన్నారు. కంపెనీ కష్టాల నేపథ్యంలో ఇటీవలే రూ.13 స్థాయిని తాకిన షేరు.. తాజా ఊరటతో మళ్లీ 16 స్థాయికి కోలుకుంది.
ఎవరీ అజయ్ సింగ్...
స్పైస్‌జెట్‌ను గట్టెక్కించేందుకు దీని అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ తెరపైకి రావడంతో అందరికళ్లూ ఇప్పుడు ఆయనపైనే ఉన్నాయి. ఢిల్లీ ఐఐటీలో పట్టాపుచ్చుకున్న సింగ్.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. పారిశ్రామికవేత్త ఎస్‌కే మోడీకి చెందిన నష్టజాతక మోడీలుఫ్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత దీని పేరును స్పైస్‌జెట్‌గా మార్చి.. లాభాలబాట పట్టించారు. దేశంలో ప్రధాన చౌక విమానయాన సంస్థగా తీర్చిదిద్దిన ఘనత అజయ్ సింగ్‌కే దక్కుతుంది.
అయితే, 2010లో కంపెనీలో ఇతర ప్రధాన ఇన్వెస్టర్లు తమ వాటాను మారన్‌కు విక్రయిండచంతో యాజమాన్యం చేతులు మారింది. ఇదిలాఉంటే... అధికార బీజీపీ ప్రభుత్వంతో సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్పైస్‌జెట్ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎందుకంటే తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం విషయంలో సింగ్ కీలక పాత్ర పోషించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ ఎన్నివిజ్ఞప్తులు చేసినా పట్టించుకోని మోదీ సర్కారు.. సింగ్ రంగంలోకి దిగాక ఊరటకల్పించే చర్యలు చేపట్టడం గమనార్హం.