న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు.
‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది.
ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్‌టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్‌టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది.
ఏటీఎఫ్ రేటు 16 % పెంపు
అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది.
ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment