ఎయిరిండియా కొనుగోలు యోచన లేదు
స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. గొప్ప అసెట్ అయినప్పటికీ ప్రస్తుతం దాన్ని కొనుగోలు చేసేంత పటిష్టంగా తమ కంపెనీ లేదని, ఇప్పటి పరిస్థితుల్లో అంత రిస్కు తీసుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా అనేదే ఒక పెద్ద బ్రాండ్. నిస్సందేహంగా గొప్ప అసెట్ కూడా. కానీ చాలా చిన్నదైన స్పైస్‌జెట్ దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడే పరిస్థితిలో లేదు‘ అని సింగ్ పేర్కొన్నారు. రుణగ్రస్త ఎయిరిండియాలో వాటాల విక్రయం చేపట్టే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసిన దరిమిలా పలు సంస్థలు చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి.
లాభసాటి కాబట్టే బరిలోకి: ఇండిగో ప్రెసిడెంట్
ఎయిరిండియా కొనుగోలుతో లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే బరిలోకి దిగినట్లు ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు. సంస్థ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉన్న పక్షంలో ముందుకెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎయిరిండియా కొనుగోలు యోచన వెనుక గల కారణాలను వివరిస్తూ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ‘ఒకవేళ ఆ ప్రతిపాదన లాభసాటి కాకపోతే.. ఉద్యోగులకు, కస్టమర్లకు, వాటాదారులకు ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చనటువంటిదైతే ఎయిరిండియా కొనుగోలు ప్రయత్నాలు చేయబోము‘ అని ఘోష్ వివరించారు.