Air ticket
-
విమానం టికెట్‌తో అంతరిక్షానికి!
సాక్షి, హైదరాబాద్: విమానం టికెట్‌తో అంతరిక్షంలోకి ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవని, మరో పదేళ్లలోనే అది సాధ్యమవుతుందని స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన అన్నారు. రాకెట్ల నిర్మాణానికి హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా అనుకూలమైందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను తయారు చేసిన సంస్థ స్కైరూట్ అనే విషయం తెలిసిందే. ఫిక్కీలేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే అంతరిక్షానికి ఎగిరిన తమ రాకెట్ పూర్తిగా హైదరాబాద్‌లోనే తయారైందని, అది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైనదని పేర్కొన్నారు. సొంతంగా ఉపగ్రహాలను తయారు చేసుకోగల సామర్థ్యం చాలా కొద్దిదేశాలకే ఉందని, భారత్ ఈ రంగంలో ఇప్పటికే ముందు వరసలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ కూడా అంతరిక్ష రంగంలో ఓ ప్రధానకేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా వంద నుంచి 150 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంటే, రానున్న పదేళ్లలో వీటి సంఖ్య పదివేలకు తరువాతి పదేళ్లలో 40 వేలకూ చేరుకుంటుందని చెప్పారు. అంతరిక్షంలో విహారయాత్రలకు పాశ్చాత్య దేశాలు సిద్ధమవుతున్నాయని, భారత్‌లోనూ ఇంకో పదేళ్లకు ఇది సాధ్యం కావచ్చని పవన్‌కుమార్ తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రస్తుతానికి ఈ అంశంపై దృష్టి పెట్టడంలేదన్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ తయారు చేస్తున్న రాకెట్ ‘విక్రాంత్ 1’ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదని, దీని ప్రయోగం వచ్చే ఏడాది జరగవచ్చని తెలిపారు. ఇప్పటివరకూ రాకెట్ల ద్వారా గరిష్టంగా పదిమంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుందని, ఎక్కువ మందితో ప్రయాణించే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం దేశంలో అంతరిక్ష పరిజ్ఞానం వృద్ధిలో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతైనా ఉందని, స్టార్టప్ కంపెనీలు ధ్రువ స్పేస్, స్కై రూట్ ఏరోస్పేస్‌లు హైదరాబాద్‌లో ఉండటం, రాకెట్ ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట ఏపీలో ఉండటాన్ని పవన్‌కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏరోస్పేస్ రంగంలో ఇప్పటికీ మహిళల భాగస్వామ్యం పదిశాతం మాత్రమే ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ కల్పనా చావ్లా స్ఫూర్తితో మరింతమంది ఈ రంగంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాలసీ బజార్ వైస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అలోక్ బన్సర్, రాపిడో బైక్ షేరింగ్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుంటుపల్లి పవన్ తదితరులు కూడా స్టార్టప్ రంగంలో తమ అనుభవాలను పంచుకున్నారు. -
విమాన చార్జీలను 15% పెంచాలి
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు. ‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. ఏటీఎఫ్ రేటు 16 % పెంపు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది. ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది. -
టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించిన బాలుడు... గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ..
Boy Managed To Travel Almost 3000 kilometres Alone: ఇంతవరకు మనం బస్సు లేక రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం గురించి విని ఉంటాం. అదృష్టం బావుంటే పట్టుబడం లేదంటే ఫైన్ కట్టి బయటపడతాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ బుడ్డోడు ఒంటరిగా అదికూడా టికెట్టు లేకుండా ఏకంగా విమానం ఎక్కి వచ్చేశాడు. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బ్రెజిల్‌లోని ఇమాన్యుయెల్ మార్క్వెస్ ఒలివేరా అనే 9 ఏళ్ల బాలుడు ఒంటరిగా లేకుండా విమానంలో ప్రయాణించాడు. అంతేకాదు తన ఇంటి నుంచి సుమారు 3వేల కి. మీ దూరంలో ఉన్నఆగ్నేయ రాష్ట్రమైన సావో పాలోలోని గౌరుల్హోస్కు విమానంలో పయనించాడు. ఈ మేరకు అతని తల్లి డేనియల్ మార్క్వెస్ ఆ రోజు కొడుకుని ఉదయం 5 గంటల ప్రాంతంలో చూశానని చెప్పారు. ఆ తర్వాత అతను కనిపించక చాలా ఆందోళన చెందామని వివరించారు. ఆ బాలుడు గూగుల్‌లో టికెట్ లేకుండా, ఎవరి కంటపడకుండా విమానం ఎక్కడం ఎలా అనే దానిపై సర్చ్ చేసి మరీ వెళ్లాడు. ఆ బాలుడి తల్లికి అతని ఆచూకి తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్లకంటే ఈజీగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్‌ని ఆపరేట్ చేసేస్తున్నారు. కానీ ఈ బాలుడిని చూస్తే మరీ ఇంత అడ్వాన్స్డ్గా పిల్లలు ఉంటారా? అని ఆశ్చర్యం కలగకమానదు. అంతేకాదు పెద్దల్లో గుబులు కూడా కాస్త ఎక్కువ అవుతుంది. ఈ మేరకు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎలాంటి ప్రయాణ పత్రాలు లేదా లగేజీ లేకుండా బాలుడు ఎలా ఎక్కగలిగాడనే విషయంపై మనౌస్ విమానాశ్రయ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో) -
ఎయిర్ ఏషియా బిగ్ సేల్
హైదరాబాద్: విమాన టికెట్లకు సంబంధించి ఎయిర్ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.తమ బిగ్‌సేల్‌లో భాగంగా పుణే, గోవా, కోచి, గౌహతి, వైజాగ్ వంటి దేశీయ రూట్లలో విమాన టికెట్లు రూ.990 (అన్ని చార్జీలు కలుపుకొని)నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీగ్ట్రాండ్ టెక్ పేర్కొన్నారు. అలాగే బ్యాంకాక్, కౌలాలంపూర్, వంటి అంతర్జాతీయ నగరాలకు తమ గ్రూప్ విమానాల ద్వారా జరిపే విమాన ప్రయాణాలకు చార్జీలను రూ.3,699కు ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఈ నెల 29 వరకూ ఎయిర్ఏషియాడాటకామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ కాలం వచ్చే ఏడాది మే 1 నుంచి 2017 ఫిబ్రవరి 5 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్‌కు డెరైక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్ ఏషియా ఎక్స్ నుంచి అందిస్తున్నామని వివరించారు.