Rupee exchange
-
రూపాయిలో వాణిజ్యానికి పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: పలు వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలు భారత్‌తో రూపాయి మారకంలో వాణిజ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ విధానంలో లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశాలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘ఈ విధానాన్ని సత్వరం ప్రారంభించేలా బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే మనతో చర్చలు జరుపుతున్నాయి. పలు గల్ఫ్ దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలిసే కొద్దీ మరిన్ని దేశాలు కూడా ఇందులో చేరొచ్చు. సింగపూర్ ఇప్పటికే కొంత మేర లావాదేవీలు జరుపుతోంది‘ అని మంత్రి వివరించారు. ఈ పరిణామం భారత అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తోంది. యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్‌కి తొలిసారిగా రూపాయల్లో చెల్లింపులు జరిపింది. -
రూపీ ట్రేడ్‌పై దక్షిణాసియా దేశాలతో చర్చలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్య లావాదేవీలు నిర్వహించడంపై దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్చలు జరుపుతోంది. యూపీఐ విధానం ద్వారా ప్రాంతీయంగా సీమాంతర చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐకి సంబంధించి ఇప్పటికే భూటాన్, నేపాల్ తదితర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు. క్లోనింగ్‌వంటి రిస్కులు ఉన్న నేపథ్యంలో డిజిటల్ రూపీని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునే విధానంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయంగా ఇప్పటికే కొన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది‘ అని దాస్ వివరించారు. ద్రవ్యోల్బణ కట్టడికి ప్రాధాన్యం .. కోవిడ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్కెట్ల నిబంధనలు కఠినతరం కావడం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంత దేశాలు విధానపరంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. భారత్ వంటి దక్షిణాసియా దేశాలు ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకోసం విశ్వసనీయమైన ద్రవ్యపరపతి విధానాలతో పాటు సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం, ద్రవ్య.. వాణిజ్య విధానాలు, పాలనాపరమైన చర్యలు అవసరమని ఆయన వివరించారు. ఇటీవల కమోడిటీ ధరలు, సరఫరాపరమైన సమస్యలు కొంత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగిన పక్షంలో వృద్ధికి, పెట్టుబడులకు రిస్కులు ఏర్పడవచ్చని దాస్ చెప్పారు. దక్షిణాసియా ప్రాంత దేశాలు ఇంధనాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుండటం వల్ల, ఇంధన దిగుమతిపరమైన ద్రవ్యోల్బణంతో సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలు వాణిజ్యం విషయంలో పరస్పర సహకరించుకుంటే ప్రాంతీయంగా వృద్ధికి, ఉపాధికి మరిన్ని అవకాశాలు లభించగలవని దాస్ చెప్పారు. -
త్వరలో 10 బిలియన్ డాలర్లకు ’రూపీ’ ఎగుమతులు
కోల్‌కతా: రూపాయి మారకం ఆధారిత ఎగుమతులు త్వరలో 8–10 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. రష్యాలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పటిష్టంగా ఉండటం, రెండు దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన తెలిపారు. విదేశీ కరెన్సీ మారకం ఆధారిత ఎగుమతులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ రూపీ ఆధారిత ఎగుమతులకు కూడా ప్రభుత్వం, బ్యాంకులు కల్పించడం కోసం ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారని సహాయ్ తెలిపారు. యూకో తదితర బ్యాంకులు ప్రాసెసింగ్ మొదలుపెట్టాక వచ్చే పక్షం రోజుల్లో రూపాయి మారకంలో సెటిల్మెంట్ ఆధారిత వాణిజ్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు సహాయ్ వివరించారు. ప్రస్తుతం రష్యాకు భారత్ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్యా నుండి దిగుమతులు (ఎక్కువగా ఆయిల్) 400 శాతం పెరిగాయి. ఇక భారత్ నుంచి రష్యాకు ఎక్కువగా టీ, కాఫీ, పొగాకు, చక్కెర మినహా ఇతర ఎగుమతులు తగ్గుతున్నాయి. అయితే, రూపాయి ట్రేడింగ్ మెకానిజం అందుబాటులోకి వచ్చాక ఈ వాణిజ్య లోటు క్రమంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. 750 బిలియన్ డాలర్ల టార్గెట్ సాధిస్తాం.. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 750 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సులభంగానే సాధించగలమని సహాయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా సర్వీసుల వృద్ధి పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం వృద్ధితో 450 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సర్వీసులు 30 శాతం వృద్ధి చెంది 330–340 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి ఉత్పత్తుల ఎగుమతులు 232 బిలియన్ డాలర్లుగాను, సర్వీసులు 150.4 బిలియన్ డాలర్లుగాను ఉన్నట్లు తెలిపారు. ‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఉన్నప్పటికీ భారత్ పటిష్ట స్థానంలో ఉంది. యూరప్‌కు రష్యా ఉత్పత్తుల ఎగుమతులు (చమురు, గ్యాస్ కాకుండా) 65 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి. అలాగే తయారీ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇతర దేశాలు పాటిస్తున్న విధానాలు కూడా భారత్ ఎగుమతులను పెంచుకునేందుకు దోహదపడవచ్చు‘ అని సహాయ్ చెప్పారు. -
విమాన చార్జీలను 15% పెంచాలి
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు. ‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. ఏటీఎఫ్ రేటు 16 % పెంపు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది. ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది. -
మెప్పించని ఆర్బీఐ పాలసీ
కీలక రేట్ల విషయంలో ఆర్బీఐ యథాతథ స్థితిని కొనసాగించినా, అక్టోబర్–మార్చి కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాలను తగ్గించడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల విషయమై మళ్లీ ఆందోళనలు రేగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ముడి చమురు ధరలు దిగొచ్చినా, డాలర్‌తో రూపాయి మారకం నష్టాలు కొనసాగడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో స్టాక్ సూచీల నష్టాలు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై, 35,884 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 85 పాయింట్లు క్షీణించి 10,783 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, ఫార్మా, వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... ఆర్బీఐ తన పాలసీలో భాగంగా రెపోరేటును ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా 6.5 శాతం వద్దనే కొనసాగించింది. మార్పు లేని ఆర్బీఐ పాలసీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. అమెరికాలో దీర్ఘకాలిక బాండ్ల కన్నా, స్వల్ప కాలిక బాండ్ల రాబడులు పెరగడంతో మళ్లీ మందగమనం సంభవిస్తుందనే భయాలు నెలకొన్నాయి. మరోవైపు అమెరికా–చైనాల సయోధ్యపై సంశయాల కారణంగా మంగళవారం అమెరికా స్టాక్ సూచీలు 3 శాతం వరకూ నష్టపోయాయి. ఈ ప్రభావంతో బుధవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఆరంభమయ్యాయి. దీంతో మన సెన్సెక్స్ కూడా బలహీనంగానే మొదలైంది. ఆర్బీఐ పాలసీ వెల్లడైన తర్వాత ఈ నష్టాలు మరింతగా పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 357 పాయింట్లు, నిఫ్టీ 122 పాయింట్ల వరకూ నష్టపోయాయి. సీనియర్ బుష్ అంత్యక్రియల సందర్భంగా బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్ పని చేయలేదు. కొనసాగిన సన్ ఫార్మా నష్టాలు... సన్ ఫార్మా నష్టాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. గతంలో మూసేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును సెబీ మళ్లీ తెరిచే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ఈ షేర్ పతనమవుతోంది. ఈ షేర్ బుధవారం 6.5 శాతం నష్టంతో రూ.414 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.402కు ఈ షేర్ పతనమైంది. సన్ ఫార్మాతో పాటు 150కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. సెయిల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, డిష్ టీవీ, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, టాటా గ్లోబల్ బేవరేజేస్, నీలకమల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ∙31 సెన్సెక్స్ షేర్లలో ఆరు షేర్లు–హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ∙సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.37 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.1.37 లక్షల కోట్లు తగ్గి రూ.1,42,15,155 కోట్లకు పడిపోయింది. -
‘బేర్’ పంజా!
వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా ముదరడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయి, 72.74కు పతనం కావడం కూడా తోడవడంతో స్టాక్ సూచీలు నెల కనిష్టానికి క్షీణించాయి. ముడి చమురు ధరల భగభగలు కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్‌పై ‘బేర్’ల పట్టు మరింతగా బిగుస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 37,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఎఫ్ఎమ్సీజీ, లోహ, వాహన, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల సునామీ చోటు చేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 509 పాయింట్లు పతనమై 37,413 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 11,288 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 1.34 శాతం, నిఫ్టీ 1.32 శాతం చొప్పున నష్టపోయాయి. గత నెల 2 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే కనిష్ట స్థాయి. స్టాక్ సూచీలకు ఇది నెల కనిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. రెండో రోజూ భారీ నష్టాలు.. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. గత ఏడు నెలల్లో స్టాక్ సూచీలు వరుసగా రెండు రోజుల పాటు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, రూపాయి పతనం కొనసాగుతుండటం, వాణిజ్య, కరంట్ అకౌంట్ లోటులు మరింతగా పెరగడం, ప్రపంచ మార్కెట్ల పతనం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నిపుణులంటున్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయని వారంటున్నారు. మధ్యాహ్నం దాకా మధ్యస్థంగానే... స్టాక్ సూచీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 38,043 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం దాకా పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. 561 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో 37,361 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద 682 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 41 పాయింట్లు లాభపడగా, మరో దశలో 164 పాయింట్లు నష్టపోయింది. చివరి గంటలో అమ్మకాలు జోరుగా సాగాయి. వాణిజ్య యుద్ధభయాలు, విదేశీ నిధులు తరలిపోతుండటం, ఆందోళన పరుస్తున్న దేశీయ ఆర్థికాంశాలు ఇన్వెస్టర్లను కలవరపరుస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వెల్లడించారు. బుధవారంనాడు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇక జపాన్ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరిన్ని విశేషాలు... ♦ టాటా స్టీల్ 3.4 శాతం నష్టంతో రూ.592 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. ♦ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, వేల్యుయేషన్లు అధికంగా ఉండటంతో ఎఫ్ఎమ్సీజీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీసీ 2.9 శాతం, హిందుస్తాన్ యూనిలీవర్ 1.1 శాతం చొప్పున పతనమయ్యాయి. ♦ దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు వరుసగా రెండో నెలలో కూడా క్షీణించడంతో వాహన షేర్లు పతన బాట పట్టాయి. హీరో మోటోకార్ప్ 3 శాతం, టాటా మోటార్స్ 3 శాతం, మారుతీ సుజుకీ 1.5 శాతం, బజాజ్ ఆటో 1.2 శాతం, టీవీఎస్ మోటార్ 2.6 శాతం, అశోక్ లేలాండ్ 1.7 శాతం, చొప్పున తగ్గాయి. ♦ 31 సెన్సెక్స్ షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఇక నిఫ్టీ ఫిఫ్టీ షేర్లలో కూడా ఆరు షేర్లు మాత్రమే (కోల్ ఇండియా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్) పెరిగాయి. మిగిలిన 44 షేర్లు నష్టపోయాయి. ♦ ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ.. ఈ ఆరు షేర్లు 3–1% రేంజ్లో పతనమయ్యాయి. సెన్సెక్స్ మొత్తం 509 పాయింట్ల నష్టంలో ఈ ఆరు షేర్ల వాటా 332 పాయింట్లుగా ఉంది. ♦ భారీ పతనం కారణంగా పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, క్యాస్ట్రాల్ ఇండియా, సన్ టీవీ నెట్వర్క్, గుజరాత్ గ్యాస్, మణప్పురం ఫైనాన్స్, సెరా శానిటరీ, డీబీ కార్ప్, జీఐసీ హౌసింగ్, జేపీ అసోసియేట్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, సింఫనీ, సిండికేట్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పతనం కొనసాగుతుంది...! నిఫ్టీ కీలకమైన 11,300 పాయింట్ల దిగువకు పడిపోవటం.. మరింత పతనానికి సూచన అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తథ్యమని, దీంతో డాలర్ మరింతగా బలపడుతుందని, విదేశీ నిధులు మరింతగా తరలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనం, వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతాయని వారంటున్నారు. సూచీలు మరో 5–10 శాతం నష్టపోవచ్చని ఎడిల్వీజ్ క్యాపిటల్ సీఈఓ రాహేశ్ షా అంచనా వేశారు. నిఫ్టీకి తదుపరి మద్దతు స్థాయిలు 11,274 (50 రోజుల మూవింగ్ యావరేజ్), 11,200 పాయింట్లని నిపుణులంటున్నారు. అందుకని షేర్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ సూచించారు. 2 రోజుల్లో 4 లక్షల కోట్లు ఆవిరి గత రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.14 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ గత రెండు రోజుల్లో 977 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ రెండు రోజుల్లో రూ.4,14,122 కోట్లు తగ్గి రూ.1,53,25,666 కోట్లకు తగ్గింది. ‘ఆరే’సిన నష్టాలు... ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు: చైనా దిగుమతులపై తాజాగా సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికి ప్రతిగా తాము కూడా సుంకాలు విధిస్తామని చైనా తెగేసి చెప్పింది. అంతేకాకుండా అమెరికాపై ఆంక్షలు విధించాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ను చైనా కోరింది. మరోవైపు కెనడాతో వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి నెలకొనడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రపంచ మార్కెట్ల పతనం: వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్ బలపడుతుండటంతో వర్ధమాన దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజూ నష్టపోయాయి. రూపాయి విలవిల: ఆరంభంలో నిలకడగా ఉన్న డాలర్‌తో రూపాయి మారకం ఆ తర్వాత నష్టాల్లోకి జారి పోయింది. ఇంట్రాడేలో తాజాగా జీవిత కనిష్ట స్థాయి, 72.74ను తాకింది. ఒకింత రికవరీ అయి చివరకు 72.69 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రూపాయి 13 శాతం నష్టపోయింది. మండుతున్న చమురు: ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ముడి చమురు ధరలు భగభగ మండుతున్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి వివిధ దేశాలకు ముడి చమురు సరఫరాలు నిలిచిపోయి ధరలు మరింతగా ఎగబాకుతాయనే ఆందోళన నెలకొన్నది. దీంతో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 1.30 శాతం ఎగసి 78 డాలర్లకు పెరిగింది. ఇతర కారణాలు: మొండి బకాయిలకు సంబంధించి ఆర్బీఐ ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది. స్థూల ఆర్థికాంశాలు బలహీనంగా ఉండటంతో ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతుందనే అంచనాలతో పదేళ్ల బాండ్ల రాబడులు 8.17 శాతానికి ఎగియడం, కరెంట్ అకౌంట్ లోటు ఏడాది గరిష్టానికి చేరడం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింతగా దెబ్బతీస్తున్నాయి. టెక్నికల్స్: నిఫ్టీ కీలకమైన 50 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అయిన 11,300 పాయింట్ల దిగువకు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. -
ప్రపంచ పరిణామాలు, డేటా కీలకం!
ప్రపంచ పరిణామాలతో పాటు నైరుతి రుతు పవనాల పురోగతి, వివిధ ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వంటి ప్రపంచ పరిణామాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు ఈ వారం స్టాక్ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు. ఈ వారంలో వెలువడే తయారీ, సేవల రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ), కీలక పరిశ్రమల గణాంకాల ప్రభావం కూడా ఉంటుందని మార్కెట్ నిపుణులంటున్నారు. ఇక గురువారం వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చు. వాహన కంపెనీల జూన్ విక్రయాలు బాగా ఉండటంతో వాహన షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. నేడు(సోమవారం) జూన్ నెల తయారీ రంగ పీఎమ్ఐ గణాంకాలు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.6గా ఉన్న పీఎమ్ఐ మేలో 51.2కు తగ్గింది. ఇక ఈ నెల 4న(బుధవారం) జూన్ నెల సేవల రంగం పీఎమ్ఐ గణాంకాలు వెలువడతాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.4గా ఉన్న పీఎమ్ఐ మేలో 49.6కు పడిపోయింది. పరిమిత శ్రేణిలోనే మార్కెట్...! అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తారని, ఫలితంగా మార్కెట్ పరిమితి శ్రేణిలోనే కదలాడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మంచి వర్షాలు, జీడీపీ మంచి వృద్ధి సాధిస్తుండటం, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు .. ఇవన్నీ నష్టాలను పరిమితం చేస్తాయని వివరించారు. చమురు ధరల్లో, డాలర్‌తో రూపాయి మారకంలో నిలకడ నెలకొంటే మార్కెట్‌కు ఒకింత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశాలున్నాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) టీనా వీర్మాణి చెప్పారు. ప్రతికూల ప్రపంచ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటులపై ఒత్తిడి పెరుగతుండటమే దీనికి కారణాలని ఆమె వివరించారు. నేడు రీట్స్ లిస్టింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన తొలి ప్రభుత్వ రంగ సంస్థ, రీట్స్ నేడు (సోమవారం) స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. ఇష్యూ ధర రూ.185తో ఈ నెల 20–22 మధ్య ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ రూ.466 కోట్లు సమీకరించింది. ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ షేర్ కూడా సోమవారమే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. రూ.783 ఇష్యూ ధరతో ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించింది. రూ.48,000 కోట్లను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు 2018 తొలి ఆరు నెలల గణాంకాలు పదేళ్లలోనే గరిష్ట స్థాయి న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి–జూన్) రూ.48,000 కోట్ల నిధుల్ని ఉపసంహరించుకున్నారు. గడిచిన దశాబ్దంలో ఇదే అత్యధిక ఉపసంహరణ. అధిక చమురు ధరలు, వాణిజ్య యుద్ధ ఘర్షణల వంటి పరిణామాలు, అమెరికాలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, బలహీనపడుతున్న రూపాయి ఇలా ఎన్నో అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నిధులు వెనక్కి వెళ్లిపోవడం వెనుక ఉన్నాయి. జనవరి–జూన్ కాలంలో డెట్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.41,433 కోట్లను నికరంగా వెనక్కి తీసుకోగా, ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరణలు రూ.6,430 కోట్లుగా ఉన్నాయి. దీంతో రూ.47,836 కోట్లు బయటకు వెళ్లినట్టయింది. 2008 జనవరి–జూన్ తర్వాత ఈ ఏడాదే అత్యధికంగా ఎఫ్‌పీఐలు పెట్టుబడులను తిరిగి తీసుకోవడం గమనార్హం. నాడు నికరంగా రూ.24,758 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. -
ముడిచమురు, ఫలితాలు ‘మార్కెట్’కు దిశానిర్దేశం
ఈ వారంలో వెలువడే ఎస్బీఐ, సిప్లా వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారంలో ఎస్బీఐ, టాటా మోటార్స్, సిప్లా, జెట్ ఎయిర్వేస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్, సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. మొత్తం 800 కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ పతనం మార్కెట్‌పై స్వల్పంగానే ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ చెప్పారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం ఏమీ ఉండదని ఆయన అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధరలు 80 డాలర్లకు చేరడం, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, కరెన్సీ మారకం, జీడీపీ వృద్ధిపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావం... తక్షణం మార్కెట్‌ను ఆందోళన పరుస్తున్న అంశాలని పేర్కొన్నారు. బ్యారెల్ ముడి చమురు ధరలు 85 డాలర్లకు చేరితే మార్కెట్లో భారీ పతనం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, బాండ్ల రాబడులు కూడా పెరుగుతుండటం మార్కెట్లకు ప్రతికూలమేనని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ టీనా వీర్మాణి చెప్పారు. నేడు ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ లిస్టింగ్ రూ.572 ఇష్యూ ధరతో ఈ నెల 9–11 మధ్య ఐపీఓకు వచ్చిన ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ సోమవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. కొనసాగుతున్న ‘విదేశీ’ అమ్మకాలు మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.18,000 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,830 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.12,947 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో అమ్మకాలు జరుపుతున్నారని విశ్లేషకులంటున్నారు. -
ఆ దేశంలో భారత కరెన్సీ ఎక్స్చేంజ్ క్లోజ్!
పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం బ్లాక్‌మనీని నిర్మూలించడమేమో కాని, చట్టబద్దమైన టెండర్లన్నీ నిలిపివేయబడుతున్నాయి. అమెరికాలోని బ్యాంకులు, భారత కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్లను మూతవేశాయి. అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద బ్యాంకులుగా పేరున్న జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కంపెనీ, సిటీగ్రూప్ ఇంక్‌లు వర్తకులతో కలిసి పనిచేస్తూ క్లయింట్స్‌కు రూపాయిలను అందిస్తుంటాయి. కానీ ఆ వర్తకుల దగ్గర బిల్స్ అందుబాటులో లేవని బ్యాంకుల అధికార ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సమయంలో రూపాయిలను సప్లై చేయలేమని వెల్స్ ఫార్గో అండ్ కో కూడా చెప్పేసింది. ఎక్స్చేంజ్ కోసం కరెన్సీని అంగీకరించమని బ్యాంకు ఆఫ్ అమెరికా కార్పొరేషన్ తేల్చేసింది. ఒకవేళ క్లయింట్ల దగ్గర యూరోలు ఉంటే, బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని, కానీ భారత రూపాయి అయితే, మార్చుకోవడానికి ఎలాంటి బ్యాంకులు ఆఫర్ చేయడం లేదని తెలుస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలో భాగంగా నల్లధనం వెలికితీతకు, చట్టబద్ధం కాని ఆదాయాన్ని బయటకి రాబట్టడానికి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలామంది ప్రజలు ఈ నిర్ణయంతో ఇబ్బందులకు గురిఅవుతున్నారని, క్రెడిట్ కార్డు ఫ్రెండ్లీ కల్చర్ మనది కాదని, నగదు ఆధారిత ఎకానమీ మాత్రమేనని గ్రేట్ ఇండియన్ ట్రావెల్ కంపెనీ అధినేత నందిత చంద్రా తెలిపారు.