‘బేర్‌’ పంజా! | Sensex sinks 509 points, Nifty settles at 11287 | Sakshi
Sakshi News home page

‘బేర్‌’ పంజా!

Published Wed, Sep 12 2018 12:12 AM | Last Updated on Wed, Sep 12 2018 5:31 AM

Sensex sinks 509 points, Nifty settles at 11287 - Sakshi

వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా ముదరడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయి, 72.74కు పతనం కావడం కూడా తోడవడంతో స్టాక్‌ సూచీలు నెల కనిష్టానికి క్షీణించాయి. ముడి చమురు ధరల భగభగలు కొనసాగుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌పై ‘బేర్‌’ల పట్టు మరింతగా బిగుస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,500 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి.

ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, వాహన, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల సునామీ చోటు చేసుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 509 పాయింట్లు పతనమై 37,413 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 11,288 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 1.34 శాతం, నిఫ్టీ 1.32 శాతం చొప్పున నష్టపోయాయి. గత నెల 2 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే కనిష్ట స్థాయి. స్టాక్‌ సూచీలకు ఇది నెల కనిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.  

రెండో రోజూ భారీ నష్టాలు..
స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. గత ఏడు నెలల్లో స్టాక్‌ సూచీలు వరుసగా రెండు రోజుల పాటు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, రూపాయి పతనం కొనసాగుతుండటం, వాణిజ్య, కరంట్‌ అకౌంట్‌ లోటులు మరింతగా పెరగడం, ప్రపంచ మార్కెట్ల పతనం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నిపుణులంటున్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయని వారంటున్నారు.  

మధ్యాహ్నం దాకా మధ్యస్థంగానే...
స్టాక్‌ సూచీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి.  ఆరంభంలో  సెన్సెక్స్‌ 121 పాయింట్ల లాభంతో 38,043 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం దాకా పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. 561 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో 37,361 పాయింట్ల వద్ద  కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద  682 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 41 పాయింట్లు లాభపడగా, మరో దశలో 164 పాయింట్లు నష్టపోయింది.

చివరి గంటలో అమ్మకాలు జోరుగా సాగాయి. వాణిజ్య యుద్ధభయాలు, విదేశీ నిధులు తరలిపోతుండటం, ఆందోళన పరుస్తున్న దేశీయ ఆర్థికాంశాలు ఇన్వెస్టర్లను కలవరపరుస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. బుధవారంనాడు పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇక జపాన్‌ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.  

మరిన్ని విశేషాలు...
టాటా స్టీల్‌ 3.4 శాతం నష్టంతో రూ.592 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే కావడం గమనార్హం.
 మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, వేల్యుయేషన్లు అధికంగా ఉండటంతో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీసీ 2.9 శాతం, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ 1.1 శాతం చొప్పున పతనమయ్యాయి.  
  దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు వరుసగా రెండో నెలలో కూడా క్షీణించడంతో వాహన షేర్లు పతన బాట పట్టాయి. హీరో మోటోకార్ప్‌ 3 శాతం, టాటా మోటార్స్‌ 3 శాతం, మారుతీ సుజుకీ 1.5 శాతం, బజాజ్‌ ఆటో 1.2 శాతం, టీవీఎస్‌ మోటార్‌ 2.6 శాతం, అశోక్‌ లేలాండ్‌ 1.7 శాతం,  చొప్పున తగ్గాయి.  
 31 సెన్సెక్స్‌ షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి.  కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఇక నిఫ్టీ ఫిఫ్టీ షేర్లలో కూడా ఆరు షేర్లు మాత్రమే (కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్, ఇన్ఫోసిస్, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌) పెరిగాయి. మిగిలిన 44 షేర్లు నష్టపోయాయి.  
 ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ.. ఈ ఆరు షేర్లు 3–1% రేంజ్‌లో పతనమయ్యాయి. సెన్సెక్స్‌ మొత్తం 509  పాయింట్ల నష్టంలో ఈ ఆరు షేర్ల వాటా 332 పాయింట్లుగా ఉంది.  
 భారీ పతనం కారణంగా పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, భారత్‌ ఎలక్ట్రానిక్స్, క్యాస్ట్రాల్‌ ఇండియా, సన్‌ టీవీ నెట్‌వర్క్, గుజరాత్‌ గ్యాస్, మణప్పురం ఫైనాన్స్, సెరా శానిటరీ, డీబీ కార్ప్, జీఐసీ హౌసింగ్, జేపీ అసోసియేట్స్, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్, సింఫనీ, సిండికేట్‌ బ్యాంక్‌  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.   


ఈ పతనం కొనసాగుతుంది...!  
నిఫ్టీ కీలకమైన 11,300 పాయింట్ల దిగువకు పడిపోవటం.. మరింత పతనానికి సూచన అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు తథ్యమని, దీంతో డాలర్‌ మరింతగా బలపడుతుందని, విదేశీ నిధులు మరింతగా తరలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనం, వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతాయని వారంటున్నారు. సూచీలు మరో 5–10 శాతం నష్టపోవచ్చని ఎడిల్‌వీజ్‌ క్యాపిటల్‌ సీఈఓ రాహేశ్‌ షా అంచనా వేశారు. నిఫ్టీకి తదుపరి మద్దతు స్థాయిలు 11,274 (50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌), 11,200 పాయింట్లని నిపుణులంటున్నారు. అందుకని షేర్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ సూచించారు.


2 రోజుల్లో 4 లక్షల కోట్లు ఆవిరి
గత రెండు రోజుల స్టాక్‌ మార్కెట్‌ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.14 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్‌ గత రెండు రోజుల్లో 977 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ ఈ రెండు రోజుల్లో రూ.4,14,122  కోట్లు తగ్గి రూ.1,53,25,666 కోట్లకు తగ్గింది.


‘ఆరే’సిన నష్టాలు...
ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు: చైనా దిగుమతులపై తాజాగా సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికి ప్రతిగా తాము కూడా సుంకాలు విధిస్తామని చైనా తెగేసి చెప్పింది. అంతేకాకుండా అమెరికాపై ఆంక్షలు విధించాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ను చైనా కోరింది. మరోవైపు కెనడాతో వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి నెలకొనడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
 ప్రపంచ మార్కెట్ల పతనం: వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్‌ బలపడుతుండటంతో వర్ధమాన దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజూ నష్టపోయాయి.  
రూపాయి విలవిల: ఆరంభంలో నిలకడగా ఉన్న డాలర్‌తో రూపాయి మారకం ఆ తర్వాత నష్టాల్లోకి జారి పోయింది. ఇంట్రాడేలో తాజాగా జీవిత కనిష్ట స్థాయి, 72.74ను తాకింది. ఒకింత రికవరీ అయి చివరకు 72.69 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రూపాయి 13 శాతం నష్టపోయింది.
మండుతున్న చమురు: ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ముడి చమురు ధరలు భగభగ మండుతున్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌ నుంచి వివిధ దేశాలకు ముడి చమురు సరఫరాలు నిలిచిపోయి ధరలు మరింతగా ఎగబాకుతాయనే ఆందోళన నెలకొన్నది. దీంతో బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు 1.30 శాతం ఎగసి 78 డాలర్లకు పెరిగింది.   
ఇతర కారణాలు: మొండి బకాయిలకు సంబంధించి ఆర్‌బీఐ ఆదేశాలపై సుప్రీం కోర్ట్‌ స్టే ఇవ్వడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది. స్థూల ఆర్థికాంశాలు బలహీనంగా ఉండటంతో ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచుతుందనే అంచనాలతో పదేళ్ల బాండ్ల రాబడులు 8.17 శాతానికి ఎగియడం,  కరెంట్‌ అకౌంట్‌ లోటు ఏడాది గరిష్టానికి చేరడం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింతగా దెబ్బతీస్తున్నాయి.  
టెక్నికల్స్‌: నిఫ్టీ కీలకమైన 50 రోజుల ఎక్స్‌పోనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ అయిన 11,300 పాయింట్ల దిగువకు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement