ప్రపంచ పరిణామాలతో పాటు నైరుతి రుతు పవనాల పురోగతి, వివిధ ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వంటి ప్రపంచ పరిణామాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు ఈ వారం స్టాక్ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు.
ఈ వారంలో వెలువడే తయారీ, సేవల రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్‌ఐ), కీలక పరిశ్రమల గణాంకాల ప్రభావం కూడా ఉంటుందని మార్కెట్ నిపుణులంటున్నారు. ఇక గురువారం వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చు. వాహన కంపెనీల జూన్ విక్రయాలు బాగా ఉండటంతో వాహన షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు.
నేడు(సోమవారం) జూన్ నెల తయారీ రంగ పీఎమ్‌ఐ గణాంకాలు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.6గా ఉన్న పీఎమ్‌ఐ మేలో 51.2కు తగ్గింది. ఇక ఈ నెల 4న(బుధవారం) జూన్ నెల సేవల రంగం పీఎమ్‌ఐ గణాంకాలు వెలువడతాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.4గా ఉన్న పీఎమ్‌ఐ మేలో 49.6కు పడిపోయింది.
పరిమిత శ్రేణిలోనే మార్కెట్...!
అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తారని, ఫలితంగా మార్కెట్ పరిమితి శ్రేణిలోనే కదలాడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మంచి వర్షాలు, జీడీపీ మంచి వృద్ధి సాధిస్తుండటం, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు .. ఇవన్నీ నష్టాలను పరిమితం చేస్తాయని వివరించారు.
చమురు ధరల్లో, డాలర్‌తో రూపాయి మారకంలో నిలకడ నెలకొంటే మార్కెట్‌కు ఒకింత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశాలున్నాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) టీనా వీర్మాణి చెప్పారు. ప్రతికూల ప్రపంచ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటులపై ఒత్తిడి పెరుగతుండటమే దీనికి కారణాలని ఆమె వివరించారు.
నేడు రీట్స్ లిస్టింగ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన తొలి ప్రభుత్వ రంగ సంస్థ, రీట్స్ నేడు (సోమవారం) స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. ఇష్యూ ధర రూ.185తో ఈ నెల 20–22 మధ్య ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ రూ.466 కోట్లు సమీకరించింది. ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ షేర్ కూడా సోమవారమే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. రూ.783 ఇష్యూ ధరతో ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించింది.
రూ.48,000 కోట్లను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు
2018 తొలి ఆరు నెలల గణాంకాలు
పదేళ్లలోనే గరిష్ట స్థాయి
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి–జూన్) రూ.48,000 కోట్ల నిధుల్ని ఉపసంహరించుకున్నారు. గడిచిన దశాబ్దంలో ఇదే అత్యధిక ఉపసంహరణ. అధిక చమురు ధరలు, వాణిజ్య యుద్ధ ఘర్షణల వంటి పరిణామాలు, అమెరికాలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, బలహీనపడుతున్న రూపాయి ఇలా ఎన్నో అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నిధులు వెనక్కి వెళ్లిపోవడం వెనుక ఉన్నాయి.
జనవరి–జూన్ కాలంలో డెట్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.41,433 కోట్లను నికరంగా వెనక్కి తీసుకోగా, ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరణలు రూ.6,430 కోట్లుగా ఉన్నాయి. దీంతో రూ.47,836 కోట్లు బయటకు వెళ్లినట్టయింది. 2008 జనవరి–జూన్ తర్వాత ఈ ఏడాదే అత్యధికంగా ఎఫ్‌పీఐలు పెట్టుబడులను తిరిగి తీసుకోవడం గమనార్హం. నాడు నికరంగా రూ.24,758 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment