కీలక రేట్ల విషయంలో ఆర్‌బీఐ యథాతథ స్థితిని కొనసాగించినా, అక్టోబర్–మార్చి కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాలను తగ్గించడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల విషయమై మళ్లీ ఆందోళనలు రేగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ముడి చమురు ధరలు దిగొచ్చినా, డాలర్‌తో రూపాయి మారకం నష్టాలు కొనసాగడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో స్టాక్ సూచీల నష్టాలు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై, 35,884 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు క్షీణించి 10,783 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, ఫార్మా, వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు నష్టపోయాయి.
ప్రపంచ మార్కెట్ల పతనం...
ఆర్‌బీఐ తన పాలసీలో భాగంగా రెపోరేటును ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా 6.5 శాతం వద్దనే కొనసాగించింది. మార్పు లేని ఆర్‌బీఐ పాలసీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. అమెరికాలో దీర్ఘకాలిక బాండ్ల కన్నా, స్వల్ప కాలిక బాండ్ల రాబడులు పెరగడంతో మళ్లీ మందగమనం సంభవిస్తుందనే భయాలు నెలకొన్నాయి. మరోవైపు అమెరికా–చైనాల సయోధ్యపై సంశయాల కారణంగా మంగళవారం అమెరికా స్టాక్ సూచీలు 3 శాతం వరకూ నష్టపోయాయి. ఈ ప్రభావంతో బుధవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఆరంభమయ్యాయి. దీంతో మన సెన్సెక్స్ కూడా బలహీనంగానే మొదలైంది. ఆర్‌బీఐ పాలసీ వెల్లడైన తర్వాత ఈ నష్టాలు మరింతగా పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 357 పాయింట్లు, నిఫ్టీ 122 పాయింట్ల వరకూ నష్టపోయాయి. సీనియర్ బుష్ అంత్యక్రియల సందర్భంగా బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్ పని చేయలేదు.
కొనసాగిన సన్ ఫార్మా నష్టాలు...
సన్ ఫార్మా నష్టాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. గతంలో మూసేసిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసును సెబీ మళ్లీ తెరిచే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ఈ షేర్ పతనమవుతోంది. ఈ షేర్ బుధవారం 6.5 శాతం నష్టంతో రూ.414 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.402కు ఈ షేర్ పతనమైంది. సన్ ఫార్మాతో పాటు 150కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. సెయిల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, డిష్ టీవీ, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, టాటా గ్లోబల్ బేవరేజేస్, నీలకమల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
∙31 సెన్సెక్స్ షేర్లలో ఆరు షేర్లు–హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి.
∙సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.37 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.1.37 లక్షల కోట్లు తగ్గి రూ.1,42,15,155 కోట్లకు పడిపోయింది.
మెప్పించని ఆర్‌బీఐ పాలసీ
Published Thu, Dec 6 2018 1:03 AM | Last Updated on Thu, Dec 6 2018 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment