1800 సర్వీసులను రద్దు చేసిన స్పైస్‌జెట్
చెన్నై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుత నెలకు సంబంధించి 1,800 సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 31 వరకూ నేపాల్‌లోని ఖాట్మండు, తదితర పలు నగరాలకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో 81 సర్వీసులు సోమవారం(8)నాటివే కావడం గమనార్హం. కళానిధి మారన్‌కు చెందిన సన్ గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
బకాయిలకు సంబంధించి రూ. 200 కోట్లమేర బ్యాంక్ గ్యారంటీలు సమర్పించకపోతే బుధవారానికల్లా క్యాష్ అండ్ క్యారీ ప్రాతిపదికన మాత్రమే కార్యకలాపాలను అనుమతించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ) ఇప్పటికే నిర్ణయించింది. కాగా, మరోవైపు ముందస్తు(అడ్వాన్స్) టికెట్ల బుకింగ్‌కు సంబంధించి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉంది. ఈ బాటలో నెల రోజులకుమించి టికెట్ల బుకింగ్‌ను అనుమతించవద్దంటూ ఇప్పటికే డీజీసీఏ కంపెనీని ఆదేశించింది. ఈ పరిణామాల వల్ల కంపెనీ లెసైన్స్ వెంటనే ప్రమాదంలో పడే అవకాశం లేనప్పటికీ, వివిధ సమస్యలు చుట్టుముట్టవచ్చునని నిపుణులు వ్యాఖ్యానించారు.