tiger air
-
సింగపూర్ కు మరో 2 సర్వీసులు
-
సింగపూర్ కు మరో 2 సర్వీసులు: టైగర్ఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన యాన రంగంలో ఉన్న టైగర్ఎయిర్ మరో రెండు సర్వీసులను భారత్ నుంచి సింగపూర్‌కు నడుపనుంది. ప్రస్తుతం భారత్‌లోని ఆరు నగరాల నుంచి వారానికి 44 సర్వీసులు నడుస్తున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 మధ్య హైదరాబాద్, తిరుచిరాపల్లి నగరాలకు ఒక్కో సర్వీసును జోడిస్తోంది. దీంతో మొత్తం సర్వీసుల సంఖ్య హైదరాబాద్-సింగపూర్ మధ్య ఏడు, తిరుచిరాపల్లి-సింగపూర్ మధ్య 14కు చేరుకుంటాయి. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు రానుపోను రూ.11.599 నుంచి టికెట్స్‌ను టైగర్ఎయిర్ ప్రకటించింది. బుకింగ్ కాలం జనవరి 20 నుంచి 31. ప్రయాణ తేదీలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 16. -
అంతర్జాతీయ రూట్లలోనూ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: ధరల తగ్గింపు ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులకూ విస్తరించింది. తాజాగా ఖతార్ ఎయిర్వేస్, సింగపూర్ చౌక ధరల విమానయాన సంస్థ టైగర్ ఎయిర్‌లు అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లపై డిస్కౌంట్లను ప్రకటించాయి. ద వరల్డ్ ఈజ్ యువర్స్ పేరుతో ఖతార్ ఎయిర్వేస్ 25 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. అలాగే రూ.10(బేస్ధర)కే సింగపూర్‌కు విమానయానాన్ని టైగర్ఎయిర్ సంస్థ ఆఫర్ చేస్తోంది. వివరాలు.. టైగర్ఎయిర్ బంపర్ ఆఫర్... కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లైన సందర్భంగా టైగర్ఎయిర్ సంస్థ రూ.10(బేస్ ఫేర్) కే సింగపూర్‌కు విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. ఇతర వ్యయాలు, పన్నులు కలుపుకొని ఈ చార్జీ కనిష్టంగా రూ.7,499 ఉంటుందని టైగర్ ఎయిర్ పేర్కొంది. భారత్ నుంచి రౌండ్‌ట్రిప్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని టైగర్ఎయిర్ తెలిపింది. ఈ నెల 21 వరకూ టికెట్లను బుక్ చేసుకోవచ్చని, వచ్చే ఏడాది జనవరి 12 నుంచి మార్చి 31 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. మరిన్ని నగరాలకు కూడా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నామని వివరించింది. బాలి, జకార్తా, పెర్త్, మనీలా, హాంకాంగ్, సిడ్ని, గోల్డ్కోస్ట నగరాలకు స్పెషల్ ఆల్-ఇన్ రిటర్న్ చార్జీలు రూ.11,999 నుంచి ప్రారంభమవుతాయని టైగర్ ఎయిర్ పేర్కొంది. ఖతార్ డిస్కౌంట్ 25 శాతం వరకూ ఇక ఖతార్ ఎయిర్వేస్ సంస్థ ద వరల్డ్ ఈజ్ యువర్స్ పేరుతో తన విమాన టికెట్లపై 25 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 140 రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నామని, బుధవారం ముగుస్తాయని వివరించింది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల జూన్ 15 వరకూ జరిగే విమాన ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. భారత్ నుంచి దోహా ద్వారా ప్రయాణమయ్యే రిటర్న్ టికెట్లకు, అన్ని క్లాసుల టికెట్లకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని వివరించింది. ఈ సంస్థ భారత్ నుంచి దోహా మీదుగా బార్సిలోనా, డల్లాస్, లండన్, మియామి, న్యూయార్క్, ప్యారిస్, రోమ్, తదితర 12 నగరాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. -
సింగపూర్ రిటర్న్ టికెట్ ఉచితం
టైగర్ఎయిర్ స్పెషల్ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకే ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు సింగపూర్ చౌక ధరల విమానయాన సంస్థ టైగర్ఎయిర్, ప్రత్యేకమైన ఆఫర్‌ను ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్, ప్రి-పెయిడ్ కార్డుదారులు సింగపూర్ వెళ్లడానికి టికెట్ తీసుకుంటే రిటర్న్ టికెట్ ఉచితమని (ఎయిర్పోర్ట్ పన్నులు, ఇతర చార్జీలు చెల్లించాలి) టైగర్ఎయిర్ డెరైక్టర్(కమర్షియల్) రాబర్ట్ యంగ్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోచి, తిరువనంతపురం, తిరుచిరాపల్లి నగరాల నుంచి సింగపూర్‌కు ప్రయాణించే తమ విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. జూన్ 16 నుంచి జూలై 6 వరకూ ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి అక్టోబర్ 31 వరకూ, అలాగే వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 26 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కొత్త అనుబంధం మొదలైన సందర్భంగా ఆ బ్యాంక్ ఖాతాదారులకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ఇస్తున్నామని రాబర్ట్ యంగ్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఈ ఆరు నగరాల నుంచి సింగపూర్‌కు వారానికి 44 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. -
సామాన్యుడికి విమాన సేవలు చేరేనా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెట్టు ముందా, కాయ ముందా? అన్నట్టుంది భారత విమానయాన రంగం పరిస్థితి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం వచ్చే 20 ఏళ్లలో 200 చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం ఉంటే విస్తరణ చేపట్టడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మరి విమానాలు నడిపేందుకు కావాల్సిన సౌకర్యాల మాటేమిటన్నదే ఇక్కడ ప్రశ్న. సర్వీసులతోపాటే ప్రయాణికులు పెరుగుతారని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి అశోక్ లావాసా చెబుతున్నారు. చిన్న ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అంటూ బాధ్యతను రాష్ట్రాలపై మోపారు. మరోవైపు అన్ని వసతులుంటే సర్వీసులు నడుపుతామని ఆపరేటర్లు అంటున్నారు. ముందు సర్వీసులు ప్రారంభించండి వసతులు కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. మీరు నిర్మిస్తే మేమొస్తాం.. నాన్-హబ్ ప్రాంతాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య తమకు 66 శాతముందని ఎమిరేట్స్ భారత్, నేపాల్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ ఎస్సా సులేమాన్ అహ్మద్ తెలిపారు. అమృత్సర్, పుణె, గోవా తదితర నగరాలకు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌లో నాన్-హబ్ ప్రాంతాల్లో విమాన సేవల కంపెనీలకు అవకాశాలనేకమని చెప్పారు. అయితే మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తే సర్వీసులు ప్రారంభించేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తారని వెల్లడించారు. భారత్‌లో వైమానిక ఇంధనం ధర ఎక్కువగా ఉండడమే పెద్ద సమస్యగా పరిణమించిందని స్పైస్‌జెట్ గ్రౌండ్ సేవల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కమల్ హింగోరాణి అన్నారు. పన్నులు తగ్గితే సర్వీసులు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పన్నులు, ఇతర చార్జీలు తగ్గించకుండా చిన్న విమానాశ్రయాల్లో కల్పించే సాధారణ వసతులు తమకు వద్దంటున్నారు. అందరూ కలిస్తేనే.. ప్రస్తుతం భారత్‌లో వ్యాపార, పర్యాటక ప్రయాణికులే అధికం. సాధారణ ప్రయాణికులకు విమాన సేవలు చేరువ కావాలి. ఫిక్కీ, కేపీఎంజీ నాలెడ్జ్ పేపర్ ప్రకారం 2030 నాటికి భారత విమానయాన రంగం ప్రపంచంలో అగ్ర స్థానానికి చేరుకుంటుంది. ఇది కార్యరూపం దాల్చాలంటే విమానయాన సంస్థలకు విమాన సీట్ల కేటాయింపుల విషయంలో నిబంధనలు సరళతరం కావాల్సిందేనని కేపీఎంజీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్ట్నర్, హెడ్ అంబర్ దూబే అన్నారు. ఎంఆర్వో కేంద్రాలు దిగుమతి చేసుకుంటున్న పరికరాలు ఏడాదిలోపు వినియోగించకపోతే పన్నులు చెల్లించాలన్న నిబంధన హాస్యాస్పదమన్నారు. విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను ఇతర దేశాలతో పోలిస్తే 60% ఎక్కువగా ఉంది. ఇది పరిశ్రమ వృద్ధికి ఆటంకమేనని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం, పరిశ్రమ రెండూ చేతులు కలిస్తేనే విమానయాన రంగానికి మంచి రోజులని స్పష్టం చేశారు. -
చిన్న నగరాల నుంచి సింగపూర్‌కు ఫ్లైట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, సింగపూర్‌కు చెందిన టైగర్ ఎయిర్ సోమవారమిక్కడ మూడేళ్ల కాలానికిగాను ఇంటర్లైన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిద్వారా స్పైస్‌జెట్ సర్వీసులు అందిస్తున్న దేశంలోని 14 నగరాలను సింగపూర్‌కు అనుసంధానిస్తారు. అంటే ప్రయాణికులు ఒకే టికెట్‌పై ఈ నగరాల నుంచి స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చి, ఇక్కడి నుంచి టైగర్ ఎయిర్ విమానంలో సింగపూర్‌కు చేరుకుంటారు. జనవరి 6 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో ప్రయాణికుల నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీజు వసూలు చేయరు. ప్రయాణికులకు తక్కువ వ్యయానికే సేవలు అందించాలన్న లక్ష్యంతో రెండు విమానయాన సంస్థలను ఏకం చేశామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నగరాల నుంచే.. స్పైస్‌జెట్ సర్వీసులందిస్తున్న తిరుపతి, వైజాగ్, అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, కోల్‌కత, కోయంబత్తూరు, ఢిల్లీ, గోవా, ఇండోర్, మంగళూరు, మదురై, పుణె, బెంగళూరు నగరాలకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా విమాన చార్జీ (అన్ని కలుపుకుని) ఒకవైపుకు రూ.4,699. తిరుగు ప్రయాణమైతే చార్జీ రూ.9,998 ఉంది. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం సింగపూర్‌కు వారంలో అయిదు సర్వీసులను టైగర్ ఎయిర్ నడుపుతోంది. ఇక సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చే టైగర్ ఎయిర్ ప్రయాణికులు జనవరి 12 నుంచి స్పైస్‌జెట్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీ కలెక్షన్, చెక్డ్ ఇన్ బ్యాగేజీ బట్వాడా ఉచితం. కాగా, ఒక విదేశీ సంస్థతో ఇంటర్లైన్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలో ఇదే తొలిసారి. కీలక మార్కెట్లలో భారత్ ఒకటని టైగర్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అలెగ్జాండర్ నిగ్గీ తెలిపారు. హైదరాబాద్ నుంచి మరిన్ని.. శక్తివంతమైన భాగస్వామిని త్వరలోనే ప్రకటిస్తామని స్పైస్‌జెట్ సీవోవో సంజీవ్ కపూర్ వెల్లడించారు. తమ సేవల విషయంలో మూడు నాలుగు నెలల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో స్పైస్‌జెట్‌కు రూ.559 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఏడాదిలో కంపెనీ దశ తిరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇంటర్లైన్ ఒప్పందాలు మరిన్ని కుదుర్చుకుంటాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో అపార అవకాశాలున్నాయి. ఈ నగరాలు లక్ష్యంగా కొత్త నెట్‌వర్క్‌ను త్వరలో ప్రకటిస్తాం. ఢిల్లీ, చెన్నై తర్వాత కీలక నగరం హైదరాబాద్. భాగ్యనగరం నుంచి మరిన్ని నగరాలను విమానాలు నడుపుతాం’ అని పేర్కొన్నారు. 17 బోయింగ్ 737 విమానాలకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. టైగర్ ఎయిర్‌తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సోమవారం స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో క్రితం ముగింపుతో పోలిస్తే 7.64 శాతం ఎగసి రూ.16.90 వద్ద క్లోజయ్యింది. 84.24 లక్షల షేర్లు చేతులు మారాయి.