చిన్న నగరాల నుంచి సింగపూర్‌కు ఫ్లైట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, సింగపూర్‌కు చెందిన టైగర్ ఎయిర్ సోమవారమిక్కడ మూడేళ్ల కాలానికిగాను ఇంటర్‌లైన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిద్వారా స్పైస్‌జెట్ సర్వీసులు అందిస్తున్న దేశంలోని 14 నగరాలను సింగపూర్‌కు అనుసంధానిస్తారు. అంటే ప్రయాణికులు ఒకే టికెట్‌పై ఈ నగరాల నుంచి స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చి, ఇక్కడి నుంచి టైగర్ ఎయిర్ విమానంలో సింగపూర్‌కు చేరుకుంటారు. జనవరి 6 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో ప్రయాణికుల నుంచి యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేయరు. ప్రయాణికులకు తక్కువ వ్యయానికే సేవలు అందించాలన్న లక్ష్యంతో రెండు విమానయాన సంస్థలను ఏకం చేశామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ నగరాల నుంచే..
స్పైస్‌జెట్ సర్వీసులందిస్తున్న తిరుపతి, వైజాగ్, అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, కోల్‌కత, కోయంబత్తూరు, ఢిల్లీ, గోవా, ఇండోర్, మంగళూరు, మదురై, పుణె, బెంగళూరు నగరాలకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా విమాన చార్జీ (అన్ని కలుపుకుని) ఒకవైపుకు రూ.4,699. తిరుగు ప్రయాణమైతే చార్జీ రూ.9,998 ఉంది. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం సింగపూర్‌కు వారంలో అయిదు సర్వీసులను టైగర్ ఎయిర్ నడుపుతోంది. ఇక సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చే టైగర్ ఎయిర్ ప్రయాణికులు జనవరి 12 నుంచి స్పైస్‌జెట్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీ కలెక్షన్, చెక్డ్ ఇన్ బ్యాగేజీ బట్వాడా ఉచితం. కాగా, ఒక విదేశీ సంస్థతో ఇంటర్‌లైన్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలో ఇదే తొలిసారి. కీలక మార్కెట్లలో భారత్ ఒకటని టైగర్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అలెగ్జాండర్ నిగ్గీ తెలిపారు.
హైదరాబాద్ నుంచి మరిన్ని..
శక్తివంతమైన భాగస్వామిని త్వరలోనే ప్రకటిస్తామని స్పైస్‌జెట్ సీవోవో సంజీవ్ కపూర్ వెల్లడించారు. తమ సేవల విషయంలో మూడు నాలుగు నెలల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో స్పైస్‌జెట్‌కు రూ.559 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఏడాదిలో కంపెనీ దశ తిరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇంటర్‌లైన్ ఒప్పందాలు మరిన్ని కుదుర్చుకుంటాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో అపార అవకాశాలున్నాయి. ఈ నగరాలు లక్ష్యంగా కొత్త నెట్‌వర్క్‌ను త్వరలో ప్రకటిస్తాం. ఢిల్లీ, చెన్నై తర్వాత కీలక నగరం హైదరాబాద్. భాగ్యనగరం నుంచి మరిన్ని నగరాలను విమానాలు నడుపుతాం’ అని పేర్కొన్నారు. 17 బోయింగ్ 737 విమానాలకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. టైగర్ ఎయిర్‌తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సోమవారం స్పైస్‌జెట్ షేరు బీఎస్‌ఈలో క్రితం ముగింపుతో పోలిస్తే 7.64 శాతం ఎగసి రూ.16.90 వద్ద క్లోజయ్యింది. 84.24 లక్షల షేర్లు చేతులు మారాయి.