![IndiGo appoints Ronojoy Dutta as CEO - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/25/INDIGO-1.jpg.webp?itok=ChuuYtz0)
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో ఎంతో అనుభవం ఉన్న రణజయ్ దత్తాను నూతన సీఈవోగా ఐదేళ్ల కాలానికి నియమించినట్టు ఇండిగో ప్రకటించింది. ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు సంస్థ ఈ నియామకాన్ని పూర్తి చేసింది. ఇక, సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్‌ను కంపెనీ చైర్మన్‌గా నియమించినట్టు తెలిపింది. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్ భాటియా నుంచి దత్తా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుందని కంపెనీ తెలిపింది. రణజయ్ దత్తా ప్రస్తుతం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సంస్థలో ఆయన 20 ఏళ్ల నుంచి పనిచేస్తూ.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్లానింగ్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మెయింటెనెన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) వంటి కీలక పదవులను నిర్వహించారు.
ఎయిర్ సహారా సంస్థకు ప్రెసిడెంట్‌గా రెండేళ్లు పనిచేశారు. ఎయిర్ కెనడా, యూఎస్ ఎయిర్‌వేస్ సంస్థలకు అడ్వైజర్‌గానూ వ్యవహరించారు. ‘‘ఇండిగో ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్ సంస్థగా అపూర్వ విజయం సాధించింది. ఈ సంస్థలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అధికంగా వృద్ధి చెందుతున్న సంస్థల్లో ఇండిగో ఒకటి. భవిష్యత్తులో మరింత వేగంగా వృద్ధిని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి’’ అని దత్తా పేర్కొన్నారు. ఇండిగోకు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మాతృ సంస్థ. డిసెంబర్‌తో ముగిసిన కాలానికి ఈ సంస్థ నికర లాభం 75 శాతం క్షీణించి రూ.190 కోట్లకు పరిమితమయింది. ఇండిగోకు ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆదిత్య ఘోష్ ఇటీవలే హోటల్ అగ్రిగేటర్ ఓయోలో చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment