aditya ghosh
-
ఇండిగో కొత్త సారథి రణజయ్ దత్తా
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో ఎంతో అనుభవం ఉన్న రణజయ్ దత్తాను నూతన సీఈవోగా ఐదేళ్ల కాలానికి నియమించినట్టు ఇండిగో ప్రకటించింది. ఆదిత్య ఘోష్ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు సంస్థ ఈ నియామకాన్ని పూర్తి చేసింది. ఇక, సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్‌ను కంపెనీ చైర్మన్‌గా నియమించినట్టు తెలిపింది. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాతాల్కిక సీఈవో రాహుల్ భాటియా నుంచి దత్తా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుందని కంపెనీ తెలిపింది. రణజయ్ దత్తా ప్రస్తుతం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సంస్థలో ఆయన 20 ఏళ్ల నుంచి పనిచేస్తూ.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్లానింగ్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మెయింటెనెన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్), వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) వంటి కీలక పదవులను నిర్వహించారు. ఎయిర్ సహారా సంస్థకు ప్రెసిడెంట్‌గా రెండేళ్లు పనిచేశారు. ఎయిర్ కెనడా, యూఎస్ ఎయిర్వేస్ సంస్థలకు అడ్వైజర్‌గానూ వ్యవహరించారు. ‘‘ఇండిగో ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్ సంస్థగా అపూర్వ విజయం సాధించింది. ఈ సంస్థలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అధికంగా వృద్ధి చెందుతున్న సంస్థల్లో ఇండిగో ఒకటి. భవిష్యత్తులో మరింత వేగంగా వృద్ధిని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి’’ అని దత్తా పేర్కొన్నారు. ఇండిగోకు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మాతృ సంస్థ. డిసెంబర్‌తో ముగిసిన కాలానికి ఈ సంస్థ నికర లాభం 75 శాతం క్షీణించి రూ.190 కోట్లకు పరిమితమయింది. ఇండిగోకు ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆదిత్య ఘోష్ ఇటీవలే హోటల్ అగ్రిగేటర్ ఓయోలో చేరిన సంగతి తెలిసిందే. -
ఇండిగో ప్రెసిడెంట్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. 2008 నుండి అధ్యక్షపదవిలో కొనసాగిన ఆదిత్య ఘోష్ తన పదవికా రాజీనామా చేశారు. దీంతో పదేళ్ళపాటు సంస్థతో కలిసిచేసిన ఘోష్‌తో అనుబంధం జూలై 31వ తేదీతో ముగియనుంది. అలాగే ఇండిగో ప్రెసిడెంట్, సీఈవో పదవికి వైమానిక రంగ నిపుణుడైన గ్రెగర్ టేలర్ పేరును పరిశీలిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. మరోవైపు రాహుల్ భాటియాను మధ్యంతర సీఈవో గా నియమించినట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే రాజీనామాకు గల కారణాలను అటు ఘోష్ గానీ, ఇటు ఇండిగో సంస్థ వెల్లడి చేయలేదు. సమీప భవిష్యత్తులో "తరువాతి అడ్వెంచర్" కు అధిరోహించనున్నానని మాత్రం ఘోష్ వ్యాఖ్యానించారు. 2007 మే 30 న ఘోష్ సీనియర్ అడ్వైజర్‌గా ఇండిగో బోర్డులో చేరారు. -
ఇండిగో 24 కొత్త విమానాలు
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో దేశీ నెట్వర్క్ పరిధిలోకి 24 కొత్త విమానాలను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఇండిగో కంపెనీ జనవరి 7 నుంచి ఢిల్లీ- త్రివేండ్రం, బెంగళూరు-విశాఖపట్నం, బెంగళూరు- భువనేశ్వర్, అహ్మదాబాద్- బెంగళూరు, భువనేశ్వర్-కోల్‌కతా, చెన్నై-త్రివేండ్రం మధ్య 12 కొత్త ఫ్లైట్స్‌ను నడపనుంది. ఇక జనవరి 14 నుంచి చెన్నై-హైదరాబాద్‌కు 6వ డైలీ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను నడుపుతామని కంపెనీ తెలియజేసింది. వీటికి అదనంగా జనవరి 15 నుంచి బెంగళూరు-కోల్‌కతా, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ముంబై ప్రాంతాలకు అదనంగా మరో 10 ఫ్లైట్లను నడపనుంది. ఢిల్లీ-త్రివేండ్రం-ఢిల్లీ మధ్య డైలీ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో దేశీ విమాన నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ ఈ సందర్భంగా చెప్పారు. -
ఇండిగో కొత్త సర్వీస్‌లు
న్యూఢిల్లీ: తక్కువ రేట్లకు విమాన సర్వీసులు అందించే ఇండిగో ఆదివారం నుంచి దేశీయంగా 10 కొత్త సర్వీసులు ప్రారంభించనుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కోల్‌కతాల నుంచి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆదిత్య ఘోష్ తెలియజేశారు. చెన్నై-హైదరాబాద్, చెన్నై-కోల్‌కతా, హైదరాబాద్-గోవా, చెన్నై-గోవా (వయా హైదరాబాద్) మధ్య తాజా నాన్-స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీ నుంచి ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-గోవా మధ్య కూడా కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.