ఎస్‌పీవీ ఏర్పాటుకు రెడీ
ఐదేళ్లలో కార్యకలాపాలు షురూ
న్యూఢిల్లీ: దేశీయంగా వాణిజ్య విమానాల తయారీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేయనుంది. తద్వారా విమాన తయారీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వైమానిక రంగానికి పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024ను లోక్‌సభ ఆగస్ట్‌లో ఆమోదించింది.
ఈ బిల్లులో విమాన తయారీ, డిజైన్‌లను నియంత్రించే ప్రొవిజన్లను చేర్చింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా సొంత తయారీకి దారి ఏర్పాటు చేసింది. వెరసి సొంత విమానాలను భారత్ తయారు చేసుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు తెరతీసిందని నాయుడు తెలియజేశారు. ఇందుకు ఏర్పాటు చేయనున్న ఎస్‌పీవీలో పరిశ్రమ సంబంధిత నిపుణులు తదితరులను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో సొంత విమానాల తయారీ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని హామీనిచ్చారు. విమాన తయారీలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. వీటిని భారత్ ఎగుమతి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమాన తయారీ దిగ్గజాలు బోయింగ్, ఎయిర్‌బస్‌లకు భారత్ కీలక మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఇప్పటికే చిన్నతరహా పౌర విమానాలను రూపొందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న వైమానిక మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. పీహెచ్‌డీ సీసీఐ ఏర్పాటు చేసిన సదస్సులో నాయుడు వైమానిక తయారీ అంశాలపై ప్రసంగించారు. విమానాల నిర్వహణ, పూర్తిస్థాయి తనిఖీలు, మరమ్మతుల(ఎంఆర్‌వో) కార్యకలాపాలలో సైతం భారత్‌కు అపార అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశాన్ని వైమానిక, ఎయిర్ కార్గో, ఎంఆర్‌వో కార్యకలాపాలకు కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment