విమానయాన రంగానికి మౌలిక హోదా !
స్పైస్‌జెట్ ఉదంతంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ యోచన
న్యూఢిల్లీ: విమానయాన రంగానికి మౌలిక రంగ హోదా కల్పించే విషయమై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో కింగ్ ఫిషర్, ప్రస్తుతం స్పైస్‌జెట్ సంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడంతో ఈ దిశగా సదరు శాఖ యోచిస్తోంది. మౌలిక రంగ హోదా కల్పిస్తే తక్కువ వడ్డీరేట్లకే రుణాలు లభిస్తాయని, నిధుల లభ్యత సమస్య తొలుగుతుందని, విమానయాన సంస్థలు ఒడ్డునపడుతాయని ఈ శాఖ ఆలోచన. దీనికి సంబంధించిన ఆర్థిక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలను ఆదుకోవడానికి పలు చర్యలు తీసుకోవాలని విమానయాన శాఖ ప్రతిపాదిస్తోంది.
విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీ) సమీకరణకు విమానయాన సంస్థలను అనుమతించాలని, కొన్నేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వాలని, ఈ సంస్థలకిచ్చే రుణాలపై బ్యాంకులు 8 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకూడదని, చమరు కంపెనీలకు ఉన్న బకాయిలను రీ షెడ్యూల్ చేయాలని తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక, కంపెనీ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో నిర్ణయం వెలువడవచ్చని సమాచారం.
అజయ్ సింగ్ ఆసక్తి: కాగా స్పైస్‌జెట్ ఒరిజినల్ ప్రమోటర్ అజయ్ సింగ్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి. సోమసుందరన్‌ను కలవడం పలు ఊహాగానాలకు తెర తీసింది. అంతే కాకుండా ఆయన గురువారం సాయంత్రం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కూడా కలిశారు. దీంతో నాలుగేళ్ల క్రితం స్పైస్‌జెట్ నుంచి వైదొలగిన అజయ్ సింగ్ మళ్ల స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. స్పైస్‌జెట్‌లో మళ్లీ ఇన్వెస్ట్ చేసే విషయమై మాట్లాడటానికి నిరాకరించిన అజయ్ సింగ్ స్పైస్‌జెట్‌కు చాలా సత్తా ఉందని మాత్రం వ్యాఖ్యానించారు.
భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు
గురువారం విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో ప్రారంభించినట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఆయిల్ కంపెనీలకు చెల్లింపుల్ని కంపెనీ జరపడంతో సర్వీసులు ప్రారంభించడానికి వీలుకలిగింది. అయితే బుధవారం స్పైస్‌జెట్ పూర్తిస్థాయిలో సర్వీసుల్ని నడపలేకపోవడంతో పలువురు ప్రయాణికులు స్పైస్‌జెట్ విమాన టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు రూట్లలో ఇతర విమానయాన సంస్థల విమాన టికెట్ల ధరలు 45 శాతం నుంచి 57 శాతం వరకూ పెరిగాయి.
వచ్చే నెల 9 నుంచి విస్తార సర్వీసులు
న్యూఢిల్లీ: టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తార విమానయాన సర్వీసులు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి సర్వీసులను ఢిల్లీ నుంచి ముంబైకు, అహ్మదాబాద్‌లకు నడుపుతామని విస్తార తెలిపింది. బుకింగ్స్ గురువారం రాత్రి పదిన్నర నుంచి ప్రారంభించామని పేర్కొంది.