వరంగల్‌లో పూర్తిస్థాయి విమానాశ్రయాన్నే ప్రారంభించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ సూచనకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏడాదిన్నరలోపే సిద్ధం కానున్న మామునూరు ఎయిర్‌పోర్టు
ఇప్పటికే అక్కడ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వద్ద 696 ఎకరాలు
మరో 253 ఎకరాల కోసం త్వరలో భూసేకరణ
‘150 కి.మీ. నిబంధన’పై జీఎంఆర్‌తో చర్చల కోసం త్వరలో కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయాన్ని పెద్ద విమానాల ఆపరేషన్‌తోనే ప్రారంభించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించడంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. అవరోధంగా ఉన్న రెండు ప్రధాన అంశాలను వెంటనే కొలిక్కి తెచ్చేలా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం–పౌరవిమానయాన శాఖ మధ్య ఒప్పందం కుదరనుంది.
విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుండగా 150 కి.మీ. నిడివిలో మరో విమానాశ్రయం ఉండకూడదన్న అంశాన్ని అధిగమించేలా హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో పౌర విమానయాన శాఖ చర్చలు జరపనుంది. ఈ రెండు కీలక ప్రక్రియలు పూర్తయితే ఏడాదిన్నరలోపే విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ భావిస్తోంది. ఈ ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగింది.
ఇప్పటికే ఓ పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే..
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయమే అందుబాటులో ఉంది. బేగంపేటలోని పాత విమానాశ్రయం కేవలం ప్రముఖుల ప్రత్యేక విమానాల నిర్వహణకే పరిమితమైంది. దీంతో రెండో విమానాశ్రయం వెంటనే అవసరమని నిర్ణయించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయానికి చర్యలు చేపట్టింది. దాంతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలలో మరో ఐదు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
మిగతా వాటి విషయంలో జాప్యం జరిగే పరిస్థితి ఉండటంతో వరంగల్ విమానాశ్రయాన్ని వెంటనే నిర్మించాలని చర్చల సందర్భంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయి. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంలో ఎయిర్‌్రస్టిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్‌వే, గ్‌లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే ఉంది. దశాబ్దాలుగా వాటి వినియోగం లేకపోవటంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత్ ఎయిర్‌్రస్టిప్‌కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధీనంలోనే ఉంది.
అక్కడే ఇప్పుడు కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. పెద్ద విమానాశ్రయం నిర్మాణమంటే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున చిన్న విమానాలు ఆపరేట్ చేసేలా ప్రస్తుతానికి చిన్న రన్‌వేతో చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలో భావించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దాన్ని విస్తరిస్తూ పోవాలని అప్పట్లో నిర్ణయించారు.
కానీ ఒకేసారి పెద్ద విమానాలను ఆపరేట్ చేసే పూర్తిస్థాయి విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఖరారు చేశారు. ఇటీవల కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంతో ఉండటంతో దీనికి మార్గం సుగమమవుతోంది.
అదనపు భూసేకరణకు రంగం సిద్ధం..
అందుబాటులో ఉన్న భూమికి అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్కడికి చేరువలోనే పశుసంవర్థక శాఖకు చెందిన స్థలం అందుబాటులో ఉండటంతో దాన్ని సేకరించనున్నారు. ఒక గ్రామాన్ని తరలించాల్సి ఉంటుంది. త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం.
విమానాశ్రయం వస్తే వరంగల్‌కు మరిన్ని పెట్టుబడులు..
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా వరంగల్ విస్తరిస్తోంది. దాన్ని ఐటీ, ఇతర పరిశ్రమల స్థాపనతో వేగంగా అభివృద్ధి చేయాల్సి ఉందని చాలా ఏళ్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలే కాజీపేట శివారులో కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరింత వేగంగా పారిశ్రామీకరణ జరగాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు రావాలంటే స్థానికంగా విమానాశ్రయం ఉండాలన్నది పారిశ్రామికవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం హైదరాబాద్‌కు వరంగల్ 135 కి.మీ. దూరంలో ఉంది.
వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్‌లో విమానం దిగి దాదాపు మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు కొంత ఆటంకంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. వరంగల్‌లోనే నేరుగా ల్యాండ్ అయ్యే ఏర్పాటు ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని తేల్చారు. ఇదే విషయాన్ని జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని కేంద్రరాష్ట్రప్రభుత్వాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి 150 కి.మీ. నిడివిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండకూడదన్నది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో ఆ సంస్థకు ఉన్న ఒప్పందం చెబుతోంది.
ఈ నిబంధన ఇప్పుడు వరంగల్ విమానాశ్రయానికి అడ్డంకిగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇందుకు త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రతినిధులు ఇందులో ఉంటారని సమాచారం. ఈ కమిటీ సభ్యులు జీఎంఆర్‌తో సంప్రదింపులు జరిపి ఈ సమస్యను కొలిక్కి తేనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment