
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం
అడ్డుకున్న కూటమి ప్రభుత్వం
తాజాగా ప్రతిపాదనలను ఆమోదించిన ఏఏఐ
త్వరలో 350 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నియామకం
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయం భద్రతను త్వరలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) చేపట్టనుంది. ఈ మేరకు గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమోదించిన నిర్ణయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా ఖరారు చేసింది. దీనిని కేంద్ర విమానయాన శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం భద్రతపట్ల సందేహాలకు తెరపడనుంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చొరవ
గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరుగుతుండటంతో దేశంలోని ఇతర విమానాశ్రయాలతో సమాన స్థాయిలో సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఐఎస్‌ఎఫ్ బలగాలు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ భద్రత విధులు నిర్వర్తిస్తాయి.
బంగారం, ఇతర స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటాయి. అందుకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీఐఎస్‌ఎఫ్ భద్రత కోరింది. ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అంగీకరించింది. ఈ ఏడాది జూలై 2 నుంచి విమానాశ్రయం భద్రతను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది.
అడ్డుకున్న కూటమి ప్రభుత్వం
కాగా, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విమానాశ్రయం భద్రత రాష్ట్ర పోలీసు పరిధిలోని ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్‌పీఎఫ్) చేతుల్లోనే ఉండాలని భావించింది. దాంతో జూలై 2న గన్నవరం విమానాశ్రయం భద్రతను సీఐఎస్‌ఎఫ్’కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేశారు.
సీఐఎస్‌ఎఫ్ భద్రత ఇలా..
ప్రస్తుతం ఎస్‌పీఎఫ్‌కు చెందిన 250 మంది గన్నవరం విమానాశ్రయం భద్రత విధుల్లో ఉన్నారు. అయితే, వారిలో 70 మంది మాత్రమే ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్‌వే భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తే ఏకంగా 350 మందిని కేటాయిస్తారు. వారిలో 150 మందిని ప్రత్యేకంగా ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్ వే భద్రతకు నియోగిస్తారు. తద్వారా భద్రత మరింత పటిష్టమవుతుంది.
బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన కేంద్రం
ఇటీవల విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గన్నవరం విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఏఏఐ అప్రమత్తమైంది. గతంలో ఆమోదించినట్టుగా గన్నవరం విమానాశ్రయానికి సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పించాలని నిర్ణయిస్తూ కేంద్ర విమానయాన, హోం శాఖలకు ప్రతిపాదనలు పంపింది. దీంతో జూలై 2న విమానాశ్రయం భద్రతను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కారణాలను కేంద్ర హోం శాఖ వాకబు చేసింది.
సీఐఎస్‌ఎఫ్ భద్రతను కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. కాగా, వచ్చే జనవరిలోనే గన్నవరం విమానాశ్రయ భద్రత బాధ్యతలను సీఐఎస్
ఎఫ్‌కు అప్పగించనున్నట్టు తెలిసింది.