బాల బాహుబలి | Telangana boy’s paddy filling machine to be put to use from this Rabi | Sakshi
Sakshi News home page

బాల బాహుబలి

Published Tue, Feb 26 2019 5:26 AM | Last Updated on Tue, Feb 26 2019 5:26 AM

Telangana boy’s paddy filling machine to be put to use from this Rabi - Sakshi

తాను రూపొందించిన పరికరంతో ఆరబోసిన ధాన్యాన్ని సులువుగా బస్తాలోకి నింపుతున్న అభిషేక్‌

తల్లి చేయాల్సిన అభిషేకం కోసం ఏకంగా శివలింగాన్నే పెళ్లగించి జలపాతం కింద ఉంచాడు సినీ బాహుబలి! తల్లిదండ్రులు ధాన్యం మూటగట్టడానికి పడే కష్టాన్ని తాను కనిపెట్టిన యంత్రంతో తేలిక చేశాడు ఈ బాల బాహుబలి!!

అతడు కనిపెట్టిన పరికరం ధాన్యాన్ని సులువుగా నింపి, ఒక చోట నుంచి మరో చోటకు సునాయాసంగా మోసుకెళ్లడానికి వీలుకల్పిస్తుండటంతో జాతీయ అవార్డే వరించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఇన్‌స్పైర్‌ అవార్డుల పోటీలో మూడో బహుమతిని గెల్చుకుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ పరికరాన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతోంది.

మన వాళ్ల ఆవిష్కరణలను వెలుగులోకి వచ్చిన వెంటనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వం. గొప్ప ప్రారంభం. ప్రభుత్వం ఇదే మాదిరిగా దృష్టి సారించాల్సిన అద్భుత గ్రామీణ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మూలనపడి ఉన్నాయి. వాటిలో కొన్నిటికైనా గుర్తింపు వస్తుందని, ఆవిష్కర్తలకూ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. పద్నాలుగు సంవత్సరాల మర్రిపల్లి అభిషేక్‌ రైతు బిడ్డ. 8వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట అతని స్వగ్రామం.

ఆ ఊళ్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి. తండ్రి లక్ష్మీరాజం వ్యవసాయ పనులు చేస్తూ, తల్లి రాజవ్వ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సెలవు రోజుల్లో ఇంటివద్ద ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి అభిషేక్‌ ప్రయత్నిస్తుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత వేసవిసెలవుల్లో సిరంజీలు, కాటన్‌ బాక్స్‌లతో వాటర్‌ ప్రెషర్‌ ద్వారా నడిచే పొక్లెయినర్‌ను తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ ఓ రోజు తన తండ్రితో కలసి వేములవాడలోని మార్కెట్‌యార్డుకు వెళ్లాడు.

అక్కడ కార్మికులు ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతున్నారు. ఒకరు ఖాళీ సంచిని పట్టుకొని నిలబడుతుంటే, మరొకరు ధాన్యాన్ని కిందినుంచి ఎత్తి సంచిలో నింపుతున్నారు. ధాన్యం నింపిన బస్తాను మరో ఇద్దరు తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. ఈ పనిని అభిషేక్‌ శ్రద్ధగా గమనించాడు. ఒక ధాన్యం సంచిని నింపడానికి నలుగురు పనిచేయాలా? ఈ కష్టాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేమా? అని  తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచనే తక్కువ శ్రమతో చక్కగా పనిచేసే ఓ పరికరం రూపకల్పనకు దారితీసింది.   ఈ పరికరంలో 2 నిమిషాల్లో ధాన్యం బస్తాను నింపి, బరువు ఎంతో తెలుసుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అతనికి వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి, జాతీయ స్థాయి బహుమతిని పొందడానికి హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, సైన్స్‌టీచర్‌ వెంకటేశం ప్రోత్సాహం తోడ్పడింది.

గొప్ప ఆలోచన.. రూ. 5 వేల ఖర్చు..
ధాన్యాన్ని సంచిలోకి సులువుగా ఎత్తే పరికరం (ప్యాడీ ఫిల్లింగ్‌ మిషన్‌)ను తయారు చేస్తే బాగుంటుందన్న తన ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులకు అభిషేక్‌ తెలియజేశాడు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ఆలోచనకు ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత గైడ్‌ టీచర్‌ వెంకటేశ్‌ సూచనలు, సహకారంతో ఐరన్‌ షీట్లు, రాడ్లు, బరువు తూచే మిషన్‌ను కొనుగోలు చేసి..  వారం రోజులపాటు వెల్డింగ్‌ షాపులో శ్రమించి తను ఆశించిన విధంగా అభిషేక్‌ పరికరాన్ని ఆవిష్కరించాడు.

ఇందుకోసం రూ. 5 వేల వరకు ఖర్చయింది. ఈ పరికరంతో ఒక్కరే అత్యంత సులభంగా కేవలం రెండు నిమిషాల్లోనే ధాన్యాన్ని బస్తాలోకి నింపుకోవచ్చు. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ట్రాలీ వంటిది ఒకటి, ధాన్యాన్ని తీసుకొని సంచిలోకి పోసే పరికరం ఒకటి. సంచిని నింపిన తర్వాత ఈ రెంటిని విడదీసి, ట్రాలీ ద్వారా ధాన్యం బస్తాను గోదాములోకి తీసుకెళ్లి భద్రంగా పెట్టుకోవచ్చు. నలుగురు చేసే పనిని ఒక్కరే రెండునిమిషాల్లో పూర్తిచేయడానికి ఈ పరికరం దోహదపడుతోంది.

ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌–మనక్‌’ ఎగ్జిబిషన్‌– 2019లో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్‌ వాష్‌రూమ్‌ క్లీనర్‌కు మొదటి బహుమతి, అండమాన్‌ నికోబార్‌కు చెందిన విద్యార్థి తయారుచేసిన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ఓపెనర్‌కు రెండో బహుమతి వచ్చింది. అభిషేక్‌ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్‌ మిషన్‌కు మూడవ స్థానం వచ్చింది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ డా. రాంగోపాల్‌రావు చేతుల మీదుగా రూ. పదివేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్‌ లభించింది.

పిన్నవయసులోనే చక్కటి పరికరాన్ని రూపొందించిన అభిషేక్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు వెన్నుతట్టి రూ. 1.16 లక్షల చెక్కు ఇచ్చి అభినందించారు. అభిషేక్‌ రూపొందించిన పరికరాన్ని మరింత మెరుగుపరచి ఈ రబీ సీజన్‌లోనే ప్రయోగాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వినియోగించడంతోపాటు, ‘వరి అభిషేక్‌’ పేరిట పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకుల్‌ సబర్వాల్‌ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రూ. పదివేల నగదు ప్రోత్సాహాన్ని అభిషేక్‌కు అందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే వీలుందని అభిషేక్‌ గైడ్‌ టీచర్‌ వెంకటేశం(85008 65263) తెలిపారు.

ఏమిటీ ‘ఇన్‌స్పైర్‌’ అవార్డు?
కేంద్ర శాస్త్ర – సాంకేతిక శాఖ, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ‘ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌– మనక్‌’ పోటీలను నిర్వహిస్తున్నాయి. 2020 నాటికి శాస్త్రవిజ్ఞాన రంగంలో మొదటి 5 దేశాల్లో మన దేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణాభిలాషకు ప్రేరణ కలిగించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 6–10వ తరగతుల (10–15 ఏళ్ల వయసు) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను గుర్తించడం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాలను రేకెత్తించడమే లక్ష్యం.

ఈ ఆలోచనలు సొంతవి, సాంకేతికతకు సంబంధించినవి అయి ఉండాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో, వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేవిగా ఉండే సొంత ఆలోచనలై ఉండాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పది లక్షల వినూత్న ఆలోచనలను సేకరిస్తారు. వాటిలో ఉత్తమమైన వాటిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మెరుగైన ఆలోచనల ప్రకారం యంత్ర పరికరాల నమూనాలను తయారు చేయడానికి  రూ. పది వేల చొప్పున గ్రాంటును మంజూరు చేస్తారు.

దేశవ్యాప్తంగా గరిష్టంగా వెయ్యి ఆవిష్కరణలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బహుమతులు పొందిన ఆవిష్కరణలకు స్టార్టప్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక సంస్థల ద్వారా సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించి, ఆయా ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షన్నర పాఠశాలల నుంచి 2.88 లక్షల వినూత్న ఆలోచనలను సేకరించి వడపోసిన తర్వాత 60 ఆవిష్కరణలు ఢిల్లీకి చేరాయి. అందులో మూడోస్థానాన్ని తెలుగు విద్యార్థి అభిషేక్‌ దక్కించుకోవడం విశేషం.

ఇంత పేరు తెస్తాడనుకోలేదు!
నా కొడుకు తయారు చేసిన వడ్ల మిషన్‌కి ఇంత పేరు వస్తుందని నాకు తెలియదు. బడి లేని రోజుల్లో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. కానీ తను తయారు చేసిన ఈ పరికరం ఇంత పేరు తెస్తుందని అనుకోలేదు. ఢిల్లీలో నా కొడుకు అవార్డు తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది.

– మర్రిపల్లి రాజవ్వ, అభిషేక్‌ తల్లి, హన్మాజిపేట

మరిన్ని పరికరాలు తయారు చేస్తా
ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని తయారు చేయగలిగా. నాకు ఏదైనా తయారు చేయాలనే ఆలోచన కలిగినప్పుడల్లా వెంకటేశం సారు, ఇతర టీచర్లు ప్రోత్సహించారు. ఇంటివద్ద అమ్మ, అక్కలు కూడా సహాయం చేసేవారు. నా పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, మూడో బహమతి పొందడం ఆనందంగా ఉంది. ఇకముందు మరిన్ని కొత్త యంత్రాలను తయారుచేస్తా. ఐఏఎస్‌ అధికారి కావాలన్నది నా లక్ష్యం.

– మర్రిపల్లి అభిషేక్, 8వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మాజిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా


ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్‌స్పైర్‌’ పోటీల్లో తన పరికరంతో అభిషేక్‌

– పాదం వెంకటేశ్, సాక్షి, సిరిసిల్ల
ఫొటోలు: పుట్టపాక లక్ష్మణ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement