national level competetions
-
ముగిసిన ఎస్జీఎఫ్ ఫుట్‌బాల్ పోటీలు
కడప: స్థానిక జెడ్పీ హైస్కూల్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 67వ ఎస్జీఎఫ్ అంతర్‌జిల్లాల ఫుట్‌బాల్(అండర్–19) పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో మొదటి స్థానంలో కడప, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో 2–1 స్కోర్‌తో అనంతపురంపై కడప జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో అనంతపురం, ద్వితీయస్థానంలో గుంటూరు, మూడోస్థానంలో కడప, నాలుగోస్థానంలో చిత్తూరు నిలిచాయి. ఫైనల్స్‌లో 4–3 స్కోర్‌తో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు మదనపల్లె ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ, ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య చేతుల మీదుగా కప్‌లు, మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వరదారెడి గారి నారదరెడ్డి ఫుట్‌బాల్ పోటీల నిర్వహణకు రూ.10,116, విజేతలుగా నిలిచిన కడప(బాలికలు), అనంతపురం(బాలురు) జట్టులకు ఒక్కొక్క జట్టుకు రూ.10,116 చొప్పున మొత్తం రూ.30,348 ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత మదనపల్లెలో తొలిసారిగా 67వ ఎస్జీఎఫ్ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య మాట్లాడుతూ 67వ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకరరెడ్డి, రాజగోపాల్, ఏసీటీఓ నాగేంద్ర, హెచ్ఎం సుబ్బారెడ్డి, మహమ్మద్‌ఖాన్, పీఈటీలు అన్సర్, సుధాకర్, రమేష్, నాగరాజు, కరుణానిధి, 13 జిల్లాల జట్ల మేనేజర్లు, కోచ్‌లు పాల్గొన్నారు. అండర్–19 జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉదయ్‌భాస్కర్, శ్రీనివాసులు, రమేష్ వ్యవహరించారు. జాతీయస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 4 వరకు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో, బాలికలు నవంబర్‌లో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. బాలికలజట్టు: ఎస్.భానుశ్రీ, కె.మనీషా, ఆర్.భువన, ఎం.సావిత్రి(కడప), పి.కావ్యశ్రీ, యు.హారిక, కె.మమత(అనంతపురం), ఎం.పవిత్రపావని, ఎం.జ్యోతి, పి.టి.వి.హరిప్రియ(గుంటూరు), పి.సులోచన, జి.హేమహాసిని(వైజాగ్), పి.సుహర్ష, ఏ.బెహ్హప్మన్ జున్నా(కృష్ణా), కె.పావని(చిత్తూరు), జి.కావేరి(ప్రకాశం), ఎం.శిరీషా(నెల్లూరు), వి.సత్యసౌమ్య(ఈస్ట్‌గోదావరి) రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా కె.జొన్నాప్రహర్షిత(కృష్ణ), ఎం.వెంకటసుప్రజ (కడప), ఎల్.గాయత్రి(విజయనగరం), వి.ప్రజ్ఞారమణ(కర్నూలు), జీవిత(నెల్లూరు). బాలుర జట్టు: ఆసిఫ్, ఎ.నందకిశోర్, భరత్, జి.నరేంద్ర(అనంతపురం), జి.కౌశిక్, ఎస్.డి.రవూఫ్, ఎస్.కె.నాగషరీఫ్(గుంటూరు), సీతుమాధవ్, పి.విఘ్నేష్(కడప), సుఫియాన్, సి.అరవింద్(చిత్తూరు), జె.మైఖేల్(ప్రకాశం), అభి(కర్నూలు), వైడియస్ అశ్వథ్(వైజాగ్), జే.రాముడు(కృష్ణ), కెల్విన్కెన్నెట్(చిత్తూరు), వై.కల్యాణ్(విజయవాడ), కె.అశోక్‌కుమార్(నెల్లూరు) స్టాండ్‌బైలుగా అఖిల్‌యాదవ్(చిత్తూరు), వి.విజయ్(గుంటూరు), డి.వీరబాబు(ఈస్ట్‌గోదావరి), టి.రోహిత్.శ్రీ.ఫణిధర్(వెస్ట్‌గోదావరి), జ్ఞానేశ్వర్(శ్రీకాకుళం). -
Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి..
ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. హర్షవర్ధన్ రావు... యూఎస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఆదిలాబాద్ కుర్రాడు. తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడినప్పుడు పిల్లలు అక్కడే చదువుకుంటారు... అందులో కొత్త, వింత ఏమీ ఉండకపోవచ్చు. అయితే హర్ష ఒక విజేత. అతడి తల్లి నీనారావు అతడి మార్గదర్శి. కొడుకును తీర్చిదిద్దడం కోసం ఆమె తన కెరీర్‌ను వదులుకున్నారు. ఇప్పుడు హర్ష చదువు, ఆటపాటలు, హార్స్‌రైడింగ్ వంటి నైపుణ్యాల్లో ఆరితేరాడు. నేషనల్ లెవెల్ హార్స్ రైడింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. సానుభూతి చూపులతో సాంత్వన పొంది, అంతటితో తృప్తి పడి ఉంటే ఈ రోజు తన కొడుకును విజేతగా చూపించగలిగేవారు కాదు నీనారావు. ఈ ప్రయత్నంలో ఆమె టాప్ 100 హెల్త్ కేర్ లీడర్స్ కేటగిరీలో చేరారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె పంచుకున్న వివరాలు. నా దిశ మారింది! ‘‘మాది మహారాష్ట్ర, మా వారిది మంచిర్యాల. అలా తెలుగింటి కోడలి నయ్యాను. నా జీవితాన్ని రెండు వేర్వేరు పార్శ్వాలుగా చూడాలి. తొలి పార్శ్వం పూర్తిగా అకడమిక్ గా సాగింది. పీహెచ్డీ పూర్తి చేసి ఎకనమిక్స్, హిస్టరీ, నేచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ విధానాలు, పర్యావరణ నిర్వహణ వంటి అంశాల మీద అనేక పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద సమర్పించాను. యూఎస్‌లో నివసిస్తున్న నేటివ్ అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్ జాతులు, మనదేశంలో నాగాలాండ్, అండమాన్, ఇతర ఆదివాసీ జాతుల మీద పరిశోధనలు నిర్వహించాను. మా అబ్బాయి హర్షవర్ధన్ స్పెషల్ నీడ్స్ కిడ్ అని తెలిసిన తరవాత నా పంథా పూర్తిగా మారిపోయింది. మేము గుర్తించడం కూడా ఆలస్యంగానే జరిగింది. ఆ తర్వాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తనకు పన్నెండేళ్లు నిండినప్పుడు మేము యూఎస్‌కి తీసుకెళ్లిపోయాం. ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని చెప్పారు అక్కడి డాక్టర్లు. అంటే తన మనసులో అనుకున్న విషయాన్ని సంభాషణ ద్వారా వ్యక్తీకరించడంలో తగినంత చురుగ్గా లేకపోవడం అనవచ్చు. హర్ష చాలా తెలివైన పిల్లాడు, తన సమస్యను అధిగమించడానికి తల్లిదండ్రులుగా మా వంతు సపోర్టునివ్వాలి. అందుకోసం ఆటిజమ్‌తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, నిపుణులను సంప్రదించాను. తనను ది బెస్ట్ కిడ్‌గా తయారు చేసుకోగలిగాను. యూఎస్‌లో హైస్కూల్లో ఆనర్స్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరాడు. హార్స్ రైడింగ్‌లో చురుగ్గా ఉన్నాడు. ఇంకో విషయం... మా అబ్బాయి యూఎస్‌లో చదివినప్పటికీ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు చదవడం రాయడం కూడా బాగా నేర్చుకున్నాడు. నేను ఇంతగా శ్రమించడానికి ఆర్థిక వెసులుబాటు ఉంది. అలాగే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఐదువందల మందిలో ఒక బిడ్డ ఇలా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో నాలాంటి తల్లులు ఇంకా ఉన్నారు. అయితే వాళ్లందరికీ నాకు ఉన్న వెసులుబాటు ఉండకపోవచ్చు. అందుకే హర్ష కోసం యూఎస్, యూకే, ఇండియాలోని నిపుణుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం ఒక నియమావళిని రూపొందించాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేని పేదవాళ్లకు మార్గిక సేవాసంస్థ నుంచి సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యేక సేవలందించాం. పేరెంట్స్తోపాటు స్పెషల్ ఎడ్యుకేటర్స్కి శిక్షణనిచ్చాం. వాళ్లు పిల్లలకు ఫోన్ ద్వారా రోజుకో టాస్క్ ఇస్తూ రోజంతా ఒక వ్యాపకంలో మునిగేలా చేశారు. అలాగే సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లకు కూడా థియరిటికల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాం. సానుభూతి వద్దు! ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లులకు నేను చెప్పేది ఒక్కటే. పిల్లలు పుట్టిన తర్వాత నెలలు గడిచే కొద్దీ మెడ నిలపాల్సిన సమయానికి మెడ నిలపకపోవడం, కూర్చోవాల్సిన సమయానికి కూర్చోకపోవడం, మాట్లాడాల్సిన వయసుకి మాట్లాడకపోవడం వంటి తేడాని గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎవరూ ఇలాంటి స్థితిని కోరు కోరు. కానీ ఎదురైన తర్వాత ఎదుర్కోవడం ఒక్కటే మన ముందున్న ఆప్షన్. మానసికంగా కుంగిపోవద్దు. దేనినీ దాచవద్దు. పిల్లలను సమాజానికి చూపించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయవద్దు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాలి. పిల్లల మూడ్‌ని బట్టి ఆ సమయంలో వారిని ఎలా డీల్ చేయాలనే విషయంలో శిక్షణ తీసుకోవాలి. ఆ అవగాహనతో మెలగాలి. వారిలో తప్పనిసరిగా ప్రత్యేకమైన కళ ఏదో ఉండి తీరుతుంది. దానిని గ్రహించండి. దానిని సాధన చేయించండి. నేను ఓ చాంపియన్‌కి తల్లినయ్యాను. మీ బిడ్డ ఐన్‌స్టీన్ కావచ్చు... మీరు ఐన్‌స్టీన్ తల్లి కావచ్చు’’ అన్నారు నీనారావు. సింపతీ కోరుకోవద్దని తల్లులకు చెబుతూనే, ‘ప్రత్యేకమైన పిల్లల పట్ల, ఆ తల్లిదండ్రుల పట్ల సానుభూతి చూపించడం మానేయండి. దానికి బదులు ప్రోత్స హించండి’ అని సమాజానికి హితవు చేశారామె. ప్రత్యేక చిత్రకారులు స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్లో కొందరు చక్కగా పాటలు పాడేవాళ్లున్నారు. మరొకరు చక్కగా బొమ్మలు వేస్తారు. మరొకరు మంచి కవితలు రాస్తారు. వాళ్లలోని సృజనాత్మకతను బయటకు తీయడం మన బాధ్యత. పిల్లలు వేసిన బొమ్మలు, కవితలతో ఓ పుస్తకం ప్రచురించాం. మేఘన తల్లి ఇద్దరమ్మాయిలున్న సింగిల్ పేరెంట్. ఆ అమ్మాయి వేసిన బొమ్మ చూడండి. చెట్టుకొమ్మకు కట్టిన ఊయల, ఆ ఊయలలో తల్లి రూపం ఉంది. ఊయల లోపల పాపాయి ఉంది. పన్నెండేళ్ల అమ్మాయి మాతృత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రించిందో చూడండి. మరో అమ్మాయి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుని చక్కటి నినాదాలతో బొమ్మలు వేసింది. తమ మేధను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మాధ్యమాన్ని ఎంచుకున్నట్లే వీరు కూడా. – డాక్టర్ నీనారావు, ఫౌండర్, మార్గిక స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
ఆరు పతకాలతో అదరగొట్టిన హైదరాబాదీలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలతో అదరగొట్టారు. మైసూర్లో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో వైష్ణవి వీరవంశం, కొమరవెల్లి లాహిరి స్వర్ణ పతకాలు సాధించారు. తనూజా కామేశ్వర్, సాహిత్ బండారం రజత పతకాలు నెగ్గగా... లావేటి ఝాన్సీప్రియ, అమితవ వీరారెడ్డి కాంస్య పతకాలు గెలిచారు. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోచ్ సుహీమ్ షేక్ మాట్లాడుతూ భవిష్యత్‌లో హైదరాబాద్ సెయిలర్లు మరిన్ని పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
బాల బాహుబలి
తల్లి చేయాల్సిన అభిషేకం కోసం ఏకంగా శివలింగాన్నే పెళ్లగించి జలపాతం కింద ఉంచాడు సినీ బాహుబలి! తల్లిదండ్రులు ధాన్యం మూటగట్టడానికి పడే కష్టాన్ని తాను కనిపెట్టిన యంత్రంతో తేలిక చేశాడు ఈ బాల బాహుబలి!! అతడు కనిపెట్టిన పరికరం ధాన్యాన్ని సులువుగా నింపి, ఒక చోట నుంచి మరో చోటకు సునాయాసంగా మోసుకెళ్లడానికి వీలుకల్పిస్తుండటంతో జాతీయ అవార్డే వరించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డుల పోటీలో మూడో బహుమతిని గెల్చుకుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ పరికరాన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. మన వాళ్ల ఆవిష్కరణలను వెలుగులోకి వచ్చిన వెంటనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వం. గొప్ప ప్రారంభం. ప్రభుత్వం ఇదే మాదిరిగా దృష్టి సారించాల్సిన అద్భుత గ్రామీణ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మూలనపడి ఉన్నాయి. వాటిలో కొన్నిటికైనా గుర్తింపు వస్తుందని, ఆవిష్కర్తలకూ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. పద్నాలుగు సంవత్సరాల మర్రిపల్లి అభిషేక్ రైతు బిడ్డ. 8వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట అతని స్వగ్రామం. ఆ ఊళ్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి. తండ్రి లక్ష్మీరాజం వ్యవసాయ పనులు చేస్తూ, తల్లి రాజవ్వ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సెలవు రోజుల్లో ఇంటివద్ద ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి అభిషేక్ ప్రయత్నిస్తుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత వేసవిసెలవుల్లో సిరంజీలు, కాటన్ బాక్స్‌లతో వాటర్ ప్రెషర్ ద్వారా నడిచే పొక్లెయినర్‌ను తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఓ రోజు తన తండ్రితో కలసి వేములవాడలోని మార్కెట్‌యార్డుకు వెళ్లాడు. అక్కడ కార్మికులు ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతున్నారు. ఒకరు ఖాళీ సంచిని పట్టుకొని నిలబడుతుంటే, మరొకరు ధాన్యాన్ని కిందినుంచి ఎత్తి సంచిలో నింపుతున్నారు. ధాన్యం నింపిన బస్తాను మరో ఇద్దరు తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. ఈ పనిని అభిషేక్ శ్రద్ధగా గమనించాడు. ఒక ధాన్యం సంచిని నింపడానికి నలుగురు పనిచేయాలా? ఈ కష్టాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేమా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచనే తక్కువ శ్రమతో చక్కగా పనిచేసే ఓ పరికరం రూపకల్పనకు దారితీసింది. ఈ పరికరంలో 2 నిమిషాల్లో ధాన్యం బస్తాను నింపి, బరువు ఎంతో తెలుసుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అతనికి వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి, జాతీయ స్థాయి బహుమతిని పొందడానికి హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, సైన్స్టీచర్ వెంకటేశం ప్రోత్సాహం తోడ్పడింది. గొప్ప ఆలోచన.. రూ. 5 వేల ఖర్చు.. ధాన్యాన్ని సంచిలోకి సులువుగా ఎత్తే పరికరం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్)ను తయారు చేస్తే బాగుంటుందన్న తన ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులకు అభిషేక్ తెలియజేశాడు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ఆలోచనకు ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత గైడ్ టీచర్ వెంకటేశ్ సూచనలు, సహకారంతో ఐరన్ షీట్లు, రాడ్లు, బరువు తూచే మిషన్‌ను కొనుగోలు చేసి.. వారం రోజులపాటు వెల్డింగ్ షాపులో శ్రమించి తను ఆశించిన విధంగా అభిషేక్ పరికరాన్ని ఆవిష్కరించాడు. ఇందుకోసం రూ. 5 వేల వరకు ఖర్చయింది. ఈ పరికరంతో ఒక్కరే అత్యంత సులభంగా కేవలం రెండు నిమిషాల్లోనే ధాన్యాన్ని బస్తాలోకి నింపుకోవచ్చు. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ట్రాలీ వంటిది ఒకటి, ధాన్యాన్ని తీసుకొని సంచిలోకి పోసే పరికరం ఒకటి. సంచిని నింపిన తర్వాత ఈ రెంటిని విడదీసి, ట్రాలీ ద్వారా ధాన్యం బస్తాను గోదాములోకి తీసుకెళ్లి భద్రంగా పెట్టుకోవచ్చు. నలుగురు చేసే పనిని ఒక్కరే రెండునిమిషాల్లో పూర్తిచేయడానికి ఈ పరికరం దోహదపడుతోంది. ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనక్’ ఎగ్జిబిషన్– 2019లో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ వాష్‌రూమ్ క్లీనర్‌కు మొదటి బహుమతి, అండమాన్ నికోబార్‌కు చెందిన విద్యార్థి తయారుచేసిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఓపెనర్‌కు రెండో బహుమతి వచ్చింది. అభిషేక్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌కు మూడవ స్థానం వచ్చింది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ డా. రాంగోపాల్‌రావు చేతుల మీదుగా రూ. పదివేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్ లభించింది. పిన్నవయసులోనే చక్కటి పరికరాన్ని రూపొందించిన అభిషేక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెన్నుతట్టి రూ. 1.16 లక్షల చెక్కు ఇచ్చి అభినందించారు. అభిషేక్ రూపొందించిన పరికరాన్ని మరింత మెరుగుపరచి ఈ రబీ సీజన్లోనే ప్రయోగాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వినియోగించడంతోపాటు, ‘వరి అభిషేక్’ పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేయడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకుల్ సబర్వాల్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రూ. పదివేల నగదు ప్రోత్సాహాన్ని అభిషేక్‌కు అందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే వీలుందని అభిషేక్ గైడ్ టీచర్ వెంకటేశం(85008 65263) తెలిపారు. ఏమిటీ ‘ఇన్స్పైర్’ అవార్డు? కేంద్ర శాస్త్ర – సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ అవార్డ్స్– మనక్’ పోటీలను నిర్వహిస్తున్నాయి. 2020 నాటికి శాస్త్రవిజ్ఞాన రంగంలో మొదటి 5 దేశాల్లో మన దేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణాభిలాషకు ప్రేరణ కలిగించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 6–10వ తరగతుల (10–15 ఏళ్ల వయసు) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను గుర్తించడం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాలను రేకెత్తించడమే లక్ష్యం. ఈ ఆలోచనలు సొంతవి, సాంకేతికతకు సంబంధించినవి అయి ఉండాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో, వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేవిగా ఉండే సొంత ఆలోచనలై ఉండాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పది లక్షల వినూత్న ఆలోచనలను సేకరిస్తారు. వాటిలో ఉత్తమమైన వాటిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మెరుగైన ఆలోచనల ప్రకారం యంత్ర పరికరాల నమూనాలను తయారు చేయడానికి రూ. పది వేల చొప్పున గ్రాంటును మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా గరిష్టంగా వెయ్యి ఆవిష్కరణలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బహుమతులు పొందిన ఆవిష్కరణలకు స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక సంస్థల ద్వారా సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించి, ఆయా ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షన్నర పాఠశాలల నుంచి 2.88 లక్షల వినూత్న ఆలోచనలను సేకరించి వడపోసిన తర్వాత 60 ఆవిష్కరణలు ఢిల్లీకి చేరాయి. అందులో మూడోస్థానాన్ని తెలుగు విద్యార్థి అభిషేక్ దక్కించుకోవడం విశేషం. ఇంత పేరు తెస్తాడనుకోలేదు! నా కొడుకు తయారు చేసిన వడ్ల మిషన్కి ఇంత పేరు వస్తుందని నాకు తెలియదు. బడి లేని రోజుల్లో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. కానీ తను తయారు చేసిన ఈ పరికరం ఇంత పేరు తెస్తుందని అనుకోలేదు. ఢిల్లీలో నా కొడుకు అవార్డు తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. – మర్రిపల్లి రాజవ్వ, అభిషేక్ తల్లి, హన్మాజిపేట మరిన్ని పరికరాలు తయారు చేస్తా ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని తయారు చేయగలిగా. నాకు ఏదైనా తయారు చేయాలనే ఆలోచన కలిగినప్పుడల్లా వెంకటేశం సారు, ఇతర టీచర్లు ప్రోత్సహించారు. ఇంటివద్ద అమ్మ, అక్కలు కూడా సహాయం చేసేవారు. నా పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, మూడో బహమతి పొందడం ఆనందంగా ఉంది. ఇకముందు మరిన్ని కొత్త యంత్రాలను తయారుచేస్తా. ఐఏఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. – మర్రిపల్లి అభిషేక్, 8వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మాజిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్స్పైర్’ పోటీల్లో తన పరికరంతో అభిషేక్ – పాదం వెంకటేశ్, సాక్షి, సిరిసిల్ల ఫొటోలు: పుట్టపాక లక్ష్మణ్ -
జాతీయస్థాయి షాట్ పుట్ పోటీలకు కృష్ణలంక కుర్రోడు
గుజరాత్లో డిసెంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి షాట్‌పుట్ పోటీలకు విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన కూచిభట్ల అభిరామ్ ఎంపికయ్యాడు. ముందుగా నాగ్‌పూర్‌లో రెండు రాష్ట్రాల స్థాయిలో జరిగిన పోటీలలో రజత పతకం సాధించడం ద్వారా జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా పుణెలో చదువుతున్న అభిరామ్.. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన పలు సీబీఎస్ఈ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో రజత పతకం సాధించాడు. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహించిన ఈ పోటీలలో పుణెలోని సింహగఢ్ స్ప్రింగ్‌డేల్ పబ్లిక్ స్కూల్ తరఫున అతడు అండర్ 17 విభాగంలో పాల్గొన్నాడు. అక్కడ గట్టి పోటీ ఎదుర్కొని రెండో స్థానంలో నిలవడంతో.. గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం లభించింది. తాను బయట ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, స్కూల్లో తమ వ్యాయామ ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణతోనే ఈ పతకం సాధించానని అభిరామ్ ‘సాక్షి’కి తెలిపాడు.