paddy field
-
దిగుబడి రాలేదని వరి పంటకు నిప్పు
నిడమనూరు: సన్నాలు దిగుబడి రావడం లేదని ఓ రైతు వరి పొలాన్ని తగలబెట్టాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన రైతు కంచి శ్రీనివాస్ తనకున్న ఆరు ఎకరాల్లో యాసంగి సీజన్లో చింట్లు (సన్నాలు) రకం వరి సాగు చేశాడు. అందులో రెండున్నర ఎకరాల్లో 60 బస్తాల ధాన్యం, మరో ఎకరంన్నరలో మూడు బస్తాలు దిగుబడి మాత్రమే వచ్చింది. ఎకరంన్నర భూమిలో పంటను వరి కోత మెషీన్ మూడు గంటలపాటు కోయగా.. మూడు బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో మిగిలిన రెండు ఎకరాల వరికి శనివారం ఆ రైతు నిప్పంటించాడు. యాసంగిలో దొడ్డు రకం సాగు వద్దని ప్రభుత్వం చెప్పడం వల్ల సన్నాలు సాగు చేస్తే దిగుబడి రాలేదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
బండి సంజయ్ ,కిషన్‌రెడ్డిల బండారం బయటపెట్టిన :కేటీఆర్
-
కేంద్రంపై ‘వరి’ యుద్ధం
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యంగా రైతులను అవమానించేలా మాట్లాడిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు మండిపడ్డారు. కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఎండగట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పార్టీ ఉద్యమ కార్యాచరణను శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో మొదలయ్యే టీఆర్ఎస్ నిరసనలు 11న ఢిల్లీ వేదికగా జరిగే నిరసన దాకా కొనసాగుతాయని కేటీఆర్ వివరించారు. ఢిల్లీలో జరిగే నిరసనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే విషయాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు. దౌర్భాగ్య నాయకులు రెచ్చగొట్టి వరి వేయించారు... ‘ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని మూర్ఖపు, పిచ్చి, రైతు వ్యతిరేక, మనసులేని ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకే యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చిలక్కి చెప్పినట్లు చెప్పింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, రాష్ట్రానిది దళారీ పాత్ర అంటూ రైతుల్ని రెచ్చగొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి చెప్పాలంటూ గతేడాది నవంబర్ 18న సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి నిరసన దీక్షకు దిగారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గినా 35–36 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. బండి సంజయ్ అనే దౌర్భాగ్యుడు, కిషన్‌రెడ్డి అనే పనికిమాలిన కేంద్ర మంత్రి వల్లే ఈ పరిస్థితి తలెత్తగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం తెలివితక్కువ వాళ్లు అంటూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. ఇప్పుడు రైతులు పండించే ధాన్యాన్ని బీరాలు పలికిన బీజేపీ దౌర్భాగ్యులు తీసుకుంటారా? ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టం.. అంతు చూస్తాం. ఇప్పటికే 12,769 గ్రామ పంచాయతీలతోపాటు అన్ని మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌లు తదితర సంస్థలన్నీ ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానించి ప్రధానికి పంపాయి. కేంద్రం స్పందించనందున గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన తెలపాలని నిర్ణయించాం’అని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, రైతుబంధుసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గండ్ర వెంకట రమణారెడ్డి, గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, క్రాంతికిరణ్, గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు. ఇదీ ఉద్యమ కార్యాచరణ... ► ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతారు. ఈ శిబిరంలో రైతులు కూడా పాల్గొనాల్సిందిగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ► 5న విరామం ► 6న రాష్ట్రం మీదుగా వెళ్లే 4 జాతీయ రహదారులపై నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో రాస్తారోకోలు చేపడతారు. ► 7న హైదరాబాద్ మినహా 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతాయి. ► 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడంతోపాటు పార్టీ కార్యకర్తలు, రైతులు ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేసి కేంద్రం దమననీతి, భ్రష్టు రాజకీయాలపై నిరసన తెలపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ► 9, 10 తేదీల్లో విరామం ► 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసనకు దిగనుంది. మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జీహెచ్ఎంసీ మినహా 141 మున్సిపాలిటీల చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. చదవండి: అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్ . -
వరినాట్లు వేస్తున్న ఎస్పీ
సాక్షి, చిత్తూరు: ఏందబ్బా! ఈయనెరో పోలీసాయన్లా ఉండాడే.. వరినాట్లేస్తాండేందబ్బా.. అని అట్లా కళ్లార్పకుండా చూస్తాండారా!? పైన కనిపిస్తున్న ఫొటోలో ఉండేదంతా నిజమే..ఆ సారు తిరుపతి ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి. మంగళవారం మిట్ట మజ్జానం ఎలబారి ఏర్పేడు మండలానికొచ్చినాడు..రాజులపాలెం ఊర్లో సరుకులు పంచేదానికి. ఆ ఊరికాడ రోడ్డు పక్కనే మడికయ్యల్లో వరినాట్లేస్తున్న కూలోల్లు, రైతుల్ని ఆయన్జూసినాడు. అప్పుడు టయిం ఒకటీ ముక్కాలైంది. నడినెత్తిన ఎండ సుర్రుమంటున్నా పనులు చేసేది చూసినాడు. ఆయన ఇస్కూలు సదివే టయింలో పొలం కాడ చేసిన పనులు గాపకం వచ్చినాయేమో!? కాలిబూట్లు తీసేసినాడు. మోకాలిదాకా ప్యాంటు ఎగదీసి, కయ్యలో దిగినాడు. పగ్గాలు పట్టుకుని ఎస్పీ సారు అదిలించేకాడికి కాడెద్దులు ముందుకు కదిలినాయి. కొంచేపు నల్లమాను పనులు చేసినాడు. కొంచేపటికి వరినాట్లు ఏసేది మొదలుబెట్టినాడు. ఆడ పనికొచ్చిన కూలీలు ఎస్పీతో కలిసి ఖుషీగా నాట్లేసినారు. ఆ తర్వాత ఎస్పీ వాళ్లందరికీ నిత్యావసర సరుకులు, అరటిపండ్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. తానూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానన్నారు. పుట్టుకతో పిల్లలకు భాష నేర్పించేందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ పల్లెలన్నీ పచ్చదనంతో కరోనాకు దూరంగా ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ రమేష్ రెడ్డి -
బాల బాహుబలి
తల్లి చేయాల్సిన అభిషేకం కోసం ఏకంగా శివలింగాన్నే పెళ్లగించి జలపాతం కింద ఉంచాడు సినీ బాహుబలి! తల్లిదండ్రులు ధాన్యం మూటగట్టడానికి పడే కష్టాన్ని తాను కనిపెట్టిన యంత్రంతో తేలిక చేశాడు ఈ బాల బాహుబలి!! అతడు కనిపెట్టిన పరికరం ధాన్యాన్ని సులువుగా నింపి, ఒక చోట నుంచి మరో చోటకు సునాయాసంగా మోసుకెళ్లడానికి వీలుకల్పిస్తుండటంతో జాతీయ అవార్డే వరించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డుల పోటీలో మూడో బహుమతిని గెల్చుకుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ పరికరాన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. మన వాళ్ల ఆవిష్కరణలను వెలుగులోకి వచ్చిన వెంటనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వం. గొప్ప ప్రారంభం. ప్రభుత్వం ఇదే మాదిరిగా దృష్టి సారించాల్సిన అద్భుత గ్రామీణ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మూలనపడి ఉన్నాయి. వాటిలో కొన్నిటికైనా గుర్తింపు వస్తుందని, ఆవిష్కర్తలకూ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. పద్నాలుగు సంవత్సరాల మర్రిపల్లి అభిషేక్ రైతు బిడ్డ. 8వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట అతని స్వగ్రామం. ఆ ఊళ్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి. తండ్రి లక్ష్మీరాజం వ్యవసాయ పనులు చేస్తూ, తల్లి రాజవ్వ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సెలవు రోజుల్లో ఇంటివద్ద ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి అభిషేక్ ప్రయత్నిస్తుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత వేసవిసెలవుల్లో సిరంజీలు, కాటన్ బాక్స్‌లతో వాటర్ ప్రెషర్ ద్వారా నడిచే పొక్లెయినర్‌ను తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఓ రోజు తన తండ్రితో కలసి వేములవాడలోని మార్కెట్‌యార్డుకు వెళ్లాడు. అక్కడ కార్మికులు ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతున్నారు. ఒకరు ఖాళీ సంచిని పట్టుకొని నిలబడుతుంటే, మరొకరు ధాన్యాన్ని కిందినుంచి ఎత్తి సంచిలో నింపుతున్నారు. ధాన్యం నింపిన బస్తాను మరో ఇద్దరు తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. ఈ పనిని అభిషేక్ శ్రద్ధగా గమనించాడు. ఒక ధాన్యం సంచిని నింపడానికి నలుగురు పనిచేయాలా? ఈ కష్టాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేమా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచనే తక్కువ శ్రమతో చక్కగా పనిచేసే ఓ పరికరం రూపకల్పనకు దారితీసింది. ఈ పరికరంలో 2 నిమిషాల్లో ధాన్యం బస్తాను నింపి, బరువు ఎంతో తెలుసుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అతనికి వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి, జాతీయ స్థాయి బహుమతిని పొందడానికి హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, సైన్స్టీచర్ వెంకటేశం ప్రోత్సాహం తోడ్పడింది. గొప్ప ఆలోచన.. రూ. 5 వేల ఖర్చు.. ధాన్యాన్ని సంచిలోకి సులువుగా ఎత్తే పరికరం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్)ను తయారు చేస్తే బాగుంటుందన్న తన ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులకు అభిషేక్ తెలియజేశాడు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ఆలోచనకు ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత గైడ్ టీచర్ వెంకటేశ్ సూచనలు, సహకారంతో ఐరన్ షీట్లు, రాడ్లు, బరువు తూచే మిషన్‌ను కొనుగోలు చేసి.. వారం రోజులపాటు వెల్డింగ్ షాపులో శ్రమించి తను ఆశించిన విధంగా అభిషేక్ పరికరాన్ని ఆవిష్కరించాడు. ఇందుకోసం రూ. 5 వేల వరకు ఖర్చయింది. ఈ పరికరంతో ఒక్కరే అత్యంత సులభంగా కేవలం రెండు నిమిషాల్లోనే ధాన్యాన్ని బస్తాలోకి నింపుకోవచ్చు. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ట్రాలీ వంటిది ఒకటి, ధాన్యాన్ని తీసుకొని సంచిలోకి పోసే పరికరం ఒకటి. సంచిని నింపిన తర్వాత ఈ రెంటిని విడదీసి, ట్రాలీ ద్వారా ధాన్యం బస్తాను గోదాములోకి తీసుకెళ్లి భద్రంగా పెట్టుకోవచ్చు. నలుగురు చేసే పనిని ఒక్కరే రెండునిమిషాల్లో పూర్తిచేయడానికి ఈ పరికరం దోహదపడుతోంది. ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనక్’ ఎగ్జిబిషన్– 2019లో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ వాష్‌రూమ్ క్లీనర్‌కు మొదటి బహుమతి, అండమాన్ నికోబార్‌కు చెందిన విద్యార్థి తయారుచేసిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఓపెనర్‌కు రెండో బహుమతి వచ్చింది. అభిషేక్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌కు మూడవ స్థానం వచ్చింది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ డా. రాంగోపాల్‌రావు చేతుల మీదుగా రూ. పదివేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్ లభించింది. పిన్నవయసులోనే చక్కటి పరికరాన్ని రూపొందించిన అభిషేక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెన్నుతట్టి రూ. 1.16 లక్షల చెక్కు ఇచ్చి అభినందించారు. అభిషేక్ రూపొందించిన పరికరాన్ని మరింత మెరుగుపరచి ఈ రబీ సీజన్లోనే ప్రయోగాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వినియోగించడంతోపాటు, ‘వరి అభిషేక్’ పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేయడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకుల్ సబర్వాల్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రూ. పదివేల నగదు ప్రోత్సాహాన్ని అభిషేక్‌కు అందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే వీలుందని అభిషేక్ గైడ్ టీచర్ వెంకటేశం(85008 65263) తెలిపారు. ఏమిటీ ‘ఇన్స్పైర్’ అవార్డు? కేంద్ర శాస్త్ర – సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ అవార్డ్స్– మనక్’ పోటీలను నిర్వహిస్తున్నాయి. 2020 నాటికి శాస్త్రవిజ్ఞాన రంగంలో మొదటి 5 దేశాల్లో మన దేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణాభిలాషకు ప్రేరణ కలిగించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 6–10వ తరగతుల (10–15 ఏళ్ల వయసు) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను గుర్తించడం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాలను రేకెత్తించడమే లక్ష్యం. ఈ ఆలోచనలు సొంతవి, సాంకేతికతకు సంబంధించినవి అయి ఉండాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో, వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేవిగా ఉండే సొంత ఆలోచనలై ఉండాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పది లక్షల వినూత్న ఆలోచనలను సేకరిస్తారు. వాటిలో ఉత్తమమైన వాటిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మెరుగైన ఆలోచనల ప్రకారం యంత్ర పరికరాల నమూనాలను తయారు చేయడానికి రూ. పది వేల చొప్పున గ్రాంటును మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా గరిష్టంగా వెయ్యి ఆవిష్కరణలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బహుమతులు పొందిన ఆవిష్కరణలకు స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక సంస్థల ద్వారా సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించి, ఆయా ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షన్నర పాఠశాలల నుంచి 2.88 లక్షల వినూత్న ఆలోచనలను సేకరించి వడపోసిన తర్వాత 60 ఆవిష్కరణలు ఢిల్లీకి చేరాయి. అందులో మూడోస్థానాన్ని తెలుగు విద్యార్థి అభిషేక్ దక్కించుకోవడం విశేషం. ఇంత పేరు తెస్తాడనుకోలేదు! నా కొడుకు తయారు చేసిన వడ్ల మిషన్కి ఇంత పేరు వస్తుందని నాకు తెలియదు. బడి లేని రోజుల్లో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. కానీ తను తయారు చేసిన ఈ పరికరం ఇంత పేరు తెస్తుందని అనుకోలేదు. ఢిల్లీలో నా కొడుకు అవార్డు తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. – మర్రిపల్లి రాజవ్వ, అభిషేక్ తల్లి, హన్మాజిపేట మరిన్ని పరికరాలు తయారు చేస్తా ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని తయారు చేయగలిగా. నాకు ఏదైనా తయారు చేయాలనే ఆలోచన కలిగినప్పుడల్లా వెంకటేశం సారు, ఇతర టీచర్లు ప్రోత్సహించారు. ఇంటివద్ద అమ్మ, అక్కలు కూడా సహాయం చేసేవారు. నా పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, మూడో బహమతి పొందడం ఆనందంగా ఉంది. ఇకముందు మరిన్ని కొత్త యంత్రాలను తయారుచేస్తా. ఐఏఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. – మర్రిపల్లి అభిషేక్, 8వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మాజిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్స్పైర్’ పోటీల్లో తన పరికరంతో అభిషేక్ – పాదం వెంకటేశ్, సాక్షి, సిరిసిల్ల ఫొటోలు: పుట్టపాక లక్ష్మణ్ -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
గుంటూరు : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. గుంటూరు జిల్లా నర్సరావుపేట డిపోకు చెందిన ఆర్డినరి బస్సు ముప్పాళ్ల వెళ్తున్న సమయంలో తుంగపాడు స్టేజి సమీపంలోకి చేరుకోగానే బస్సు స్టీరింగ్ విరిగిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దాంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే ఒక్కసారిగి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులంతా బస్సులోని కిందకి దిగిపోయారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు
విశాఖపట్నం: ట్రాక్టర్‌ను తప్పించబోయిన వోల్వో బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటన విశాఖ జిల్లా కాశీంకోట సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. బస్సులోని దాదాపు 33 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో స్వస్థలాలకు పంపారు. గాయపడిన డ్రైవర్‌ను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.