
కూలీలతో కలిసి వరినాట్లు వేస్తున్న ఎస్పీ
సాక్షి, చిత్తూరు: ఏందబ్బా! ఈయనెరో పోలీసాయన్లా ఉండాడే.. వరినాట్లేస్తాండేందబ్బా.. అని అట్లా కళ్లార్పకుండా చూస్తాండారా!? పైన కనిపిస్తున్న ఫొటోలో ఉండేదంతా నిజమే..ఆ సారు తిరుపతి ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి. మంగళవారం మిట్ట మజ్జానం ఎలబారి ఏర్పేడు మండలానికొచ్చినాడు..రాజులపాలెం ఊర్లో సరుకులు పంచేదానికి. ఆ ఊరికాడ రోడ్డు పక్కనే మడికయ్యల్లో వరినాట్లేస్తున్న కూలోల్లు, రైతుల్ని ఆయన్జూసినాడు. అప్పుడు టయిం ఒకటీ ముక్కాలైంది. నడినెత్తిన ఎండ సుర్రుమంటున్నా పనులు చేసేది చూసినాడు. ఆయన ఇస్కూలు సదివే టయింలో పొలం కాడ చేసిన పనులు గాపకం వచ్చినాయేమో!? కాలిబూట్లు తీసేసినాడు. మోకాలిదాకా ప్యాంటు ఎగదీసి, కయ్యలో దిగినాడు.
పగ్గాలు పట్టుకుని ఎస్పీ సారు అదిలించేకాడికి కాడెద్దులు ముందుకు కదిలినాయి. కొంచేపు నల్లమాను పనులు చేసినాడు. కొంచేపటికి వరినాట్లు ఏసేది మొదలుబెట్టినాడు. ఆడ పనికొచ్చిన కూలీలు ఎస్పీతో కలిసి ఖుషీగా నాట్లేసినారు. ఆ తర్వాత ఎస్పీ వాళ్లందరికీ నిత్యావసర సరుకులు, అరటిపండ్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. తానూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానన్నారు. పుట్టుకతో పిల్లలకు భాష నేర్పించేందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ పల్లెలన్నీ పచ్చదనంతో కరోనాకు దూరంగా ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ రమేష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment