చిత్తూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం గుట్టుగా సాగుతోంది. కొంతమంది బలహీనతలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు విచ్చలవిడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నిర్వాహకులు సోషల్ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల పట్టుబడిన ఉందతమే దీనికి ఉదాహరణ.
సాక్షి, తిరుపతి క్రైం: కొంతమంది సులభంగా డబ్బు సంపాధించేందుకు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అపార్ట్‌మెంట్లను ఎంచుకుంటున్నారు. జిల్లాతోపాటు నెల్లూరు, తమిళనాడు నుంచి మహిళలు, యువతులను రప్పించి యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. నేరుగా తిరుపతి కాల్‌గరŠల్స్‌తోనే ఈ వెబ్‌సైట్స్ క్రియేట్ అవ్వడం గమనార్హం. వాటిని చూసి ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు, మొత్తం, బ్యాంక్ ఖాతా నంబర్ పంపిస్తారు. డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జీలకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతలను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు. అదేవిధంగా లాడ్జీలో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు. చదవండి: (పూటుగా తాగి లైంగిక దాడి)
సోషల్ మీడియా ద్వారా విటులకు వల
వ్యభిచార గృహాల నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను బాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్ నంబర్‌ను సైతం పెడుతున్నారు. గంటకు రూ.1000 నుంచి రూ.5,000లు, యువతులను ఒక్కరోజు తీసుకువెళితే రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
పేదరికంలో ఉన్న యువతులే టార్గెట్
పేదరికంలో ఉన్న మహిళలు, విద్యార్థినులు, యువతులకు డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికు తరలిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాతోపాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు, లాడ్జీలు, ఊరు శివార్లలో ఇళ్లు తీసు కుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. చదవండి: (మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు)
చెక్ పడేనా?
కొద్దిరోజుల క్రితం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు, అమ్మాయిలు పట్టుబడ్డారు. తాజాగా గత శుక్రవారం తిరుపతి నగరంలో పలమనేరుకు చెందిన వ్యక్తి వ్యభిచారానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు వెల్లడయ్యాయి. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉండడం గమనార్హం. ఈ దందాలో మహిళ కీలకంగా వ్యహరించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వారి ఫోన్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
నిఘా పెట్టాం
ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై నిఘా పెట్టాం. త్వరలోనే వీరిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. లాడ్జీలపైన పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాం. వ్యభిచారాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. ఆధ్యాత్మిక నగర పవిత్రతను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
– ఆవుల రమేష్‌రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment