న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో సెక్యూరిటీ ఫీజు పెరగనుండటంతో విమాన టికెట్ల చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. దీంతో దేశీయంగా ప్రయాణించే వారు ఇకపై రూ. 150 బదులుగా రూ.160 చెల్లించాల్సి రానుంది. అలాగే అంతర్జాతీయ ప్యాసింజర్లు 3.25 డాలర్లు కాకుండా 4.85 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. టికెట్ చార్జీల్లో భాగంగా సెక్యూరిటీ ఫీజు ఉంటుంది. ప్యాసింజర్లు చెల్లించిన సెక్యూరిటీ ఫీజును విమానయాన సంస్థలు .. ప్రభుత్వానికి కడతాయి. విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్ల నిర్వహణకు ఈ నిధులను వినియోగిస్తారు. గతేడాదే దేశీ ప్రయాణాలపై సెక్యూరిటీ ఫీజును రూ. 130 నుంచి రూ. 150కి, విదేశీ ప్రయాణాల టికెట్లపై 3.25 డాలర్లకు పౌర విమానయాన శాఖ పెంచింది.
ఇప్పటికే కరోనా వైరస్ పరిణామాలతో విమాన సర్వీసులు రద్దవుతూ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఏవియేషన్ రంగంపై ఇది మరికాస్త భారం కానుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. మూడు నెలల నుంచి ఫ్లయిట్లు నామమాత్రంగా నడుస్తున్నప్పటికీ.. గతేడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్రయాణికుల రద్దీ 82.3 శాతం తగ్గింది. జూన్‌లో దేశీయంగా ఆరు దిగ్గజ ఎయిర్‌లైన్స్‌లో అయిదు సంస్థల ఆక్యుపెన్సీ రేటు 50–60% నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో స్పైస్‌జెట్ ఆక్యుపెన్సీ రేటు 70%, ఇండిగో 60.2%, గోఎయిర్ 50.5%, విస్తార 53.1%, ఎయిర్‌ఏషియా ఇండియా 56.2 శాతం, ఎయిరిండియా 45.5%గా ఉంది. సంక్షోభ పరిస్థితులతో కుదేలవుతున్న విమానయాన రంగ సంస్థలకు ఊరటనిచ్చే చర్యలపై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2
విమాన చార్జీలకు ఇంకాస్త రెక్కలు
Published Sat, Aug 22 2020 4:37 AM | Last Updated on Sat, Aug 22 2020 4:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment