కోవిడ్ సోకిన ఇటలీ పర్యాటకులను ఢిల్లీలోని ప్రత్యేక చికిత్స కేంద్రానికి తరలిస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా వైరస్) భారత్‌లోనూ హడలు పుట్టిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటివరకు భారత్‌లో 29 కేసులు నమోదయ్యాయి. వారిలో 16 మంది ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టులే. ఇప్పటివరకు 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేసేవారు. కోవిడ్ అంతగా లేని జాబితాలో ఆస్ట్రియా ఉండడంతో ఆ దేశం నుంచి వచ్చిన ఢిల్లీ వాసికి విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయలేదు. ఆ తర్వాత అతనికి వైరస్ సోకడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇకపై అన్ని విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మరోవైపు ఈ వైరస్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
ఈ ఏడాది రంగు పడదు
కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని∙మోదీ బుధవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా ఉంటున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచనల మేరకు తాను ఈసారి హోలీ మిలాన్ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నానని ట్విటర్‌లో మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలందరూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, హోలీని ఈ సారి జరుపుకోవద్దని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు కూడా హోలీ ఉత్సవాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సారి హోలి వేడుకలు రద్దు చేస్తున్నట్టుగా ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ఒకే కుటుంబంలో ఏడుగురికి
ఇటీవల ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ సోకినట్లు తాజాగా వైద్య పరీక్షల్లో తేలిన విషయం తెలిసిందే. ఆగ్రాలో ఉన్న ఆయన కుటుంబీకులు ఆరుగురికి కూడా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. 16 మంది ఇటలీ టూరిస్టులలో 14 మందికి ఢిల్లీలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటలీ పర్యాటకుల్లో రాజస్థాన్‌కు వెళ్లిన భార్యాభర్తలిద్దరికీ కోవిడ్ సోకడంతో వారికి జైపూర్‌లో ఎస్‌ఎంహెచ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. గుర్గావ్‌లో పేటీఎం ఉద్యోగికి పాజిటివ్‌గా వచ్చింది. ఇతను ఇటలీకి వెళ్లొచ్చినట్లు తెలిసింది. చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
అమెరికాలో 9 మంది మృతి
♦ దేశంలో 21 ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ సెంటర్లు
♦ 12 ప్రధాన రేవు పట్టణాలు , 65 చిన్న రేవుల్లోనూ స్క్రీనింగ్ సదుపాయాలు
♦ రెండు నెలల్లో 6 లక్షల మంది వరకు స్క్రీనింగ్
♦ నేపాల్ సరిహద్దుల నుంచి వచ్చిన వారిలో 10 లక్షల మందికి స్క్రీనింగ్
♦ వైద్యుల పర్యవేక్షణలో 27 వేల మంది
♦ ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ నుంచి పర్యాటకులకు అనుమతి నో
♦ చైనా, ఇరాన్, ద.కొరియా, ఇటలీలకు అత్యవసరమైనా వెళ్లవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి
♦ కోవిడ్ ప్రబలుతున్న ఇతర దేశాలకు ప్రయాణాలు మానుకుంటే మంచిదని సూచన
♦ అమెరికాలో తొమ్మిది మంది మరణించారు. 126 కేసులు నమోదయ్యాయి.
♦ ఇటలీలో వైరస్ మృతులసంఖ్య 100 దాటింది.
♦ ఇరాన్‌లో 92 మంది మరణిస్తే, 2,922 కేసులు నమోదయ్యాయి. దేశ ప్రజాప్రతినిధుల్లో 8% మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు.
♦ ఇరాక్‌లో తొలి మరణం నమోదైంది.
♦ ఉమ్రా యాత్రను రద్దు చేసిన సౌదీ అరేబియా
♦ ఇతర దేశాల్లో పెరుగుతుండగా, చైనాలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ కొరియాలో కొత్తగా 516 కేసులు నమోదైతే, చైనాలో 130 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
♦ చైనాలో ఈ రోజు 38 మంది మరణించగా, దేశంలో మృతుల సంఖ్య 2981కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 3,123 దాటింది.
Comments
Please login to add a commentAdd a comment