సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజులో కొత్తగా 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 487 మంది కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 7,67,296కు, మరణాలు 21,129కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2,69,789 కాగా, 4,76,377 మంది బాధితులు చికత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 62.08 శాతానికి చేరుకుంది.
సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు
భారత్‌లో కరోనా వైరస్ ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 49 జిల్లాల్లోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు కరోనా కేసులు, మరణాలను పరిశీలిస్తే భారత్‌లోనే అతి తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనపై రాజేశ్ భూషణ్ స్పందించారు. ప్రజలు భౌతికదూరం కనీసం రెండు మీటర్ల దూరం పాటిస్తే గాలి ద్వారా వైరస్ సోకే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా నిత్యం 2.6 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది.
90 శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే...
దేశంలో 90 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) గురువారం ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలియజేసింది. కేంద్ర మంత్రుల బృందం సమావేశం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో గురువారం జరిగింది. దేశంలో కరోనా బాధితుల కోసం 3,914 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పారు.
కొత్త కేసులు 24,879
Published Fri, Jul 10 2020 2:15 AM | Last Updated on Fri, Jul 10 2020 2:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment