Screening tests
-
Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది. 185 కొత్త కేసులు.. కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికి దేశంలో గురువారం 185 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.47కోట్ల మంది వైరస్ బారినపడగా.. 5.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు -
పిల్లల్లో న్యూమోనియా నివారణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలను గుర్తించి వారికి ముందుగానే వైద్యం చేయడం ద్వారా మరణాలను కట్టడి చేయడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా న్యూమోనియా వ్యాధి నివారణ, ప్రజల్లో అవగాహన కల్పించడానికి గత నెల 12 నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వాతావరణంలో వచ్చే మార్పులతో పిల్లలు వివిధ అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఆ సమస్యల్లో న్యూమోనియా ప్రధానమైనది. దేశంలో ఏటా ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో 16శాతం న్యూమోనియా కారణంగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూమోనియా నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే టీకా పంపిణీ చేస్తోంది. 7.32 లక్షల మంది చిన్నారుల స్క్రీనింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు 21,50,790 మంది ఉన్నారు. కాగా సర్వేలో భాగంగా ఇప్పటి వరకూ 7,32,820 మంది చిన్నారులను ఏఎన్ఎంలు స్క్రీనింగ్ చేశారు. వీరిలో 92,396 మందిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు దగ్గు, జలుబు, ఇతర సమస్యలున్నట్టు గుర్తించారు. తీవ్ర న్యూమోనియా సమస్య ఉన్న పిల్లలను మెరుగైన వైద్యం కోసం పీహెచ్‌సీల నుంచి పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ఇక్కడ చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అనంతరం ఆరోగ్య పరిస్థితిపై పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ఫాలోఅప్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నడుస్తోంది. అనకాపల్లి టాప్ ఐదేళ్లలోపు పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహణలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాల్లో 61,822 మంది చిన్నారులుండగా వీరిలో 62.59 శాతం మందికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తయింది. 58.55 శాతంతో శ్రీకాకుళం రెండో స్థానంలో, 56.46 శాతంతో కాకినాడ మూడో స్థానంలో ఉన్నాయి. కేవలం 19.05శాతంతో ప్రకాశం జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరు వరకు.. ఐదేళ్ల లోపు పిల్లల్లో న్యూమోనియా సమస్యను నివారించడానికి చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే చేస్తున్నాం. న్యూమోనియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభిస్తున్నాం. తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పిల్లల్లో సమస్య తీవ్రమయ్యే పరిస్థితులుంటాయి. ఈ క్రమంలోనే సర్వే చేపడుతున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సర్వే కొనసాగుతుంది. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
Corona Virus: ఫోర్త్ వేవ్ టెన్షన్.. విమానాశ్రయాల్లో అలర్ట్
సాక్షి, బెంగళూరు: కరోనా ఫోర్త్ వేవ్ భయాల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. జపాన్, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయంలోనే ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తారు. ఆ్రస్టేలియా, వియత్నాం, న్యూజిలాండ్ నుంచి వచ్చే వారిపై కూడా నిఘా పెట్టారు. రాష్ట్రంలో 126 కరోనా కేసులు రాష్ట్రంలో శనివారం కొత్తగా 126 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. 76 మంది రోగులు కోలుకున్నారు. మరో ఇద్దరు మరణించారు. 1,785 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో తాజాగా 120 కేసులు, 72 డిశ్చార్జిలు నమోదయ్యాయి. నగరంలో ప్రస్తుతం 1,715 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో 9,944 మందికి కరోనా పరీక్షలు చేశారు. 62,768 మందికి టీకాలను పంపిణీ చేశారు. చిక్కమగళూరులో రెండు, చిత్రదుర్గం, కలబురిగి, మైసూరు, ఉడుపిలో ఒక్కో కరోనా కేసు వచ్చాయి. బెళగావిలో ఒకరు, విజయపురలో ఒకరు మృతి చెందారు. ఇది కూడా చదవండి: ‘చార్ధామ్’కు కోవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు -
వినికిడి సమస్యలు లేని ఏపీనే లక్ష్యం
సాక్షి, అమరావతి: వినికిడి లోపాలు, ఇతర సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వైఎస్సార్ కంటి వెలుగు తరహాలోనే చెముడుతో బాధపడేవారిని వీలైనంత త్వరగా చిన్న వయసులోనే గుర్తించి.. వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేస్తే ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు అంచెల్లో వినికిడి లోపాలు ఉన్నవారిని గుర్తించాలని సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసింది. పుట్టిన శిశువుతోపాటు తల్లికీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో వినికిడి లోపాలేమైనా ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత పిల్లలకు ఒకటో నెల, మూడో నెల, ఆరో నెల రాగానే ఆస్పత్రుల్లోనే స్క్రీనింగ్ నిర్వహించి వినికిడి లోపాలుంటే చికిత్స చేస్తారు. అలాగే రెండేళ్లలోపు పిల్లలు, స్కూల్ బయట ఉన్న పిల్లలు, 50 ఏళ్లు పైబడినవారిలో ఈ లోపాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్సీ డాక్టర్లతో 104 సంచార వైద్య వాహనాల ద్వారా స్క్రీనింగ్‌ను నిర్వహిస్తారు. పీహెచ్‌సీలు, 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్ల పై నుంచి 18 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి పరీక్షలు చేస్తారు. చెముడుతో బాధపడేవారిని గుర్తించి.. అవసరమైనవారికి ఆపరేషన్లు చేయిస్తారు. అంతేకాకుండా వారికి కావాల్సిన పరికరాలను కూడా అందిస్తారు. గ్రామీణ, పట్టణ పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 74 ప్రభుత్వ ఆస్పత్రులు గుర్తింపు.. అలాగే శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో కూడా వినికిడి లోపాలుంటాయని, అలాంటి వారిని కూడా గుర్తించి చికిత్సలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా శబ్ద కాలుష్యం ఉన్న పరిశ్రమల్లో పనిచేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, డ్రైవర్లు, రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివసించే వారిలో వినికిడి లోపాలను గుర్తించనున్నారు. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయడంతోపాటు, ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించనున్నారు. వినికిడి లోపాలున్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేందుకు 74 ప్రభుత్వ ఆస్పత్రులను గుర్తించారు. ఇందుకోసం ఈఎన్టీ సర్జన్లు, వైద్య సిబ్బంది నియామకంతోపాటు స్క్రీనింగ్ పరికరాలను సమకూర్చుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికను రూపొందించింది. -
సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 8 నుంచి తెరుచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని గురువారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో ఏముందంటే.. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేనివారిని మాత్రమే హోటళ్లలో నియమించుకోవాలి. వినియోగదారుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటించాలి. ఇక సామాజిక దూరం తప్పనిసరి. వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో హోటళ్లలో రద్దీ పెరగకుండా నియంత్రించాలి. హోటళ్లలో పనిచేస్తున్న వారిలో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగదారులతో డైరెక్టు కాంటాక్టు ఉండే విధులకు వారిని దూరంగా ఉంచాలి. ప్రజలు, సిబ్బంది రావడానికి, తిరిగి వెళ్లడానికి.. అలాగే సరుకుల రవాణాకు వేర్వేరు దారులు ఉండాలి. సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలోనే.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం ఆర్డర్ ఇవ్వడానికి, నగదు చెల్లింపులకు డిజిటల్ వేదికలను ఉపయోగించేలా ప్రోత్సహించాలి. ఇందుకు ఈ–వ్యాలెట్లు ఉపయోగించడం మేలు. హోటళ్లకు వచ్చిన అతిథుల ఆరోగ్యం, ప్రయాణ చరిత్ర వంటి వివరాలను రికార్డుల్లో భద్రపర్చాలి. వారి నుంచి గుర్తింపు పత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. అతిథుల లగేజీని రసాయనాలతో క్రిమిరహితం(శానిటైజ్) చేయాలి. అతిథులు, హోటల్ సిబ్బంది నేరుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందుకు ఇంటర్‌కామ్/మొబైల్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. గేమింగ్ జోన్లు, చిన్న పిల్లల ఆటస్థలాలను కచ్చితంగా మూసివేయాలి. హోటళ్లలో ఒకసారి వాడి పారేసే మెనూ కార్డులు, న్యాప్కిన్లు ఉపయోగించాలి. రెస్టారెంట్లలోనే ఆహారం తినే అవకాశాన్ని నిరుత్సాహపరుస్తూ సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఫుడ్ డెలివరీ సిబ్బంది ఆహార ప్యాకెట్లను కస్టమర్ల ఇంటి డోర్ల దగ్గర వదిలేయాలి. నేరుగా వారి చేతికే అందజేయడం తగదు. హోం డెలివరీకి వెళ్లే సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. మాస్కులు ధరిస్తేనే అనుమతి షాపింగ్ మాళ్లలోనూ కరోనా నియంత్రణ చర్యలను వంద శాతం పాటించాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు విధించిన మార్గదర్శకాలే షాపింగ్ మాళ్లకు కూడా వర్తిస్తాయి. మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతించాలి. మాల్ లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించేలా చూడాలి. సందర్శకులంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. షాపింగ్ మాల్ లోపల సందర్శకులు చేత్తో తాకేందుకు అవకాశం ఉనఅన్ని ప్రాంతాలు, వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. లోపల ఉమ్మివేయడం నేరం. కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలోనూ ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రికార్డు చేసిన పాటలు, ఆధ్యాత్మిక గీతాలు, బృంద గానాలకు ఇలాంటి చోట అనుమతి లేదు. ప్రసాదాలు పంచడం, జనంపై పవిత్ర జలాలు చల్లడం వంటివి చేయకూడదు. ఒకవేళ అన్నదానం చేస్తే అక్కడ భౌతిక దూరం పాటించాలి. మార్కింగ్ చేయాల్సిందే హోటళ్ల ముఖద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అలాగే వినియోగదారులకు, సిబ్బందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి. ఒక్కొక్కరికి మధ్య కనీసం 6 మీటర్ల సామాజిక దూరం ఉండేలా చూసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని హోటళ్ల యాజమాన్యాలు నియమించుకోవాలి. వినియోగదారులు సామాజిక దూరం పాటించడం కోసం హోటల్ లోపల, బయట మార్కింగ్ చేయాలి. ఇక ఏసీలు 24–30 డిగ్రీల సెల్సియస్ మధ్య నడిచేలా చూడాలి. -
15 నుంచి ‘వందే భారత్’ రెండో విడత
న్యూఢిల్లీ/శ్రీనగర్/మాలె: ఈ నెల 15వ తేదీ నుంచి వందే భారత్ మిషన్‌ను రెండో విడత చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రెండో విడతలో కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, జర్మనీ, స్పెయి¯Œ దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురానున్నారు. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు రెండో రోజు కొనసాగింది. శుక్రవారం సింగపూర్ నుంచి 234 మంది, బంగ్లాదేశ్ నుంచి 168 మంది స్వదేశానికి చేరుకున్నారు. మొదటి రోజైన గురువారం రాత్రి యూఏఈ నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో 363 మంది భారతీయులు కేరళకు చేరుకున్న విషయం తెలిసిందే. వందే భారత్ మిషన్‌లో భాగంగా సింగపూర్ నుంచి 234 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన ప్రత్యేక బోయింగ్ విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. అందులోని వారందరికీ స్క్రీనింగ్ చేపట్టి, క్వారంటైన్‌కు తరలించారు. వీరితోపాటు, బంగ్లాదేశ్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న 168 మంది కశ్మీర్ విద్యార్థులతో కూడిన మొదటి విమానం నేరుగా శ్రీనగర్‌కు చేరుకుంది. కాగా, మాల్దీవుల్లో ఉన్న భారతీయుల కోసం పంపిన నేవీకి చెందిన ఐఎన్ఎస్ యుద్ధనౌక ‘జలాశ్వ’ 700 మందితో గురువారం తిరుగు పయనమయింది. 10వ తేదీ నాటికి కోచికి చేరుకోనుంది. -
భారత్‌లో కోవిడ్ కల్లోలం
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా వైరస్) భారత్‌లోనూ హడలు పుట్టిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటివరకు భారత్‌లో 29 కేసులు నమోదయ్యాయి. వారిలో 16 మంది ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టులే. ఇప్పటివరకు 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేసేవారు. కోవిడ్ అంతగా లేని జాబితాలో ఆస్ట్రియా ఉండడంతో ఆ దేశం నుంచి వచ్చిన ఢిల్లీ వాసికి విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయలేదు. ఆ తర్వాత అతనికి వైరస్ సోకడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇకపై అన్ని విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మరోవైపు ఈ వైరస్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది రంగు పడదు కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని∙మోదీ బుధవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా ఉంటున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచనల మేరకు తాను ఈసారి హోలీ మిలాన్ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నానని ట్విటర్లో మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలందరూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, హోలీని ఈ సారి జరుపుకోవద్దని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు కూడా హోలీ ఉత్సవాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సారి హోలి వేడుకలు రద్దు చేస్తున్నట్టుగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఒకే కుటుంబంలో ఏడుగురికి ఇటీవల ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ సోకినట్లు తాజాగా వైద్య పరీక్షల్లో తేలిన విషయం తెలిసిందే. ఆగ్రాలో ఉన్న ఆయన కుటుంబీకులు ఆరుగురికి కూడా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. 16 మంది ఇటలీ టూరిస్టులలో 14 మందికి ఢిల్లీలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటలీ పర్యాటకుల్లో రాజస్థాన్‌కు వెళ్లిన భార్యాభర్తలిద్దరికీ కోవిడ్ సోకడంతో వారికి జైపూర్‌లో ఎస్ఎంహెచ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. గుర్గావ్లో పేటీఎం ఉద్యోగికి పాజిటివ్‌గా వచ్చింది. ఇతను ఇటలీకి వెళ్లొచ్చినట్లు తెలిసింది. చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అమెరికాలో 9 మంది మృతి ♦ దేశంలో 21 ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ సెంటర్లు ♦ 12 ప్రధాన రేవు పట్టణాలు , 65 చిన్న రేవుల్లోనూ స్క్రీనింగ్ సదుపాయాలు ♦ రెండు నెలల్లో 6 లక్షల మంది వరకు స్క్రీనింగ్ ♦ నేపాల్ సరిహద్దుల నుంచి వచ్చిన వారిలో 10 లక్షల మందికి స్క్రీనింగ్ ♦ వైద్యుల పర్యవేక్షణలో 27 వేల మంది ♦ ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ నుంచి పర్యాటకులకు అనుమతి నో ♦ చైనా, ఇరాన్, ద.కొరియా, ఇటలీలకు అత్యవసరమైనా వెళ్లవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి ♦ కోవిడ్ ప్రబలుతున్న ఇతర దేశాలకు ప్రయాణాలు మానుకుంటే మంచిదని సూచన ♦ అమెరికాలో తొమ్మిది మంది మరణించారు. 126 కేసులు నమోదయ్యాయి. ♦ ఇటలీలో వైరస్ మృతులసంఖ్య 100 దాటింది. ♦ ఇరాన్లో 92 మంది మరణిస్తే, 2,922 కేసులు నమోదయ్యాయి. దేశ ప్రజాప్రతినిధుల్లో 8% మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. ♦ ఇరాక్‌లో తొలి మరణం నమోదైంది. ♦ ఉమ్రా యాత్రను రద్దు చేసిన సౌదీ అరేబియా ♦ ఇతర దేశాల్లో పెరుగుతుండగా, చైనాలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ కొరియాలో కొత్తగా 516 కేసులు నమోదైతే, చైనాలో 130 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ♦ చైనాలో ఈ రోజు 38 మంది మరణించగా, దేశంలో మృతుల సంఖ్య 2981కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 3,123 దాటింది. -
రోజూ 800 మందికి కరోనా స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో రోజూ 800 మందికి కరోనా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వ హిస్తున్నారు. వైరస్ అధికంగా విస్తరించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్నంగా పరిశీలించాకే బయటకు పంపిస్తు న్నారు. చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగ పూర్, మలేసియా దేశాల నుంచి హైదరా బాద్‌కు వచ్చే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆ దేశాలకు చెందిన 29 విమానాల నుంచి 2,733 మంది ప్రయాణికులను విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడిం చింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న స్క్రీనింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం వారు అక్కడ సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల నుంచి రోజూ వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగుతుంటారు. వారిలో ఆ ఐదు దేశాలకు చెందిన ప్రయాణికులు రోజూ సరాసరి 800 మంది వస్తుంటారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మిగిలిన దేశాలకు చెందినవారికి జలుబు, దగ్గు, తలనొప్పి వంటి కరోనా వైరస్ లక్షణాలుంటే వెంటనే తమను సంప్రదించాలని కోరుతున్నారు. అటువంటి లక్షణాలతో ఇప్పటికే ఇళ్లకు చేరినవారుంటే తమను సంప్రదించాలని లేకుంటే ఎవరికివారు ఇళ్లల్లోనే ఒంటరిగా ఉండిపోవాలని కోరుతున్నారు. ఇలా 27 మంది ప్రయాణికులు వస్తే వారు తమ తమ ఇళ్లల్లో 28 రోజుల పాటు ఇంటి నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేశారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రికి ఇప్పటివరకు వచ్చిన 19 ప్రయాణికులను పరీక్షించగా, వారికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. ఇదిలావుంటే రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్‌కు 125 ఫోన్ కాల్స్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 4,275 వ్యక్తిగత రక్షణ పరికరాలు, 15 వేల ఎన్95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరో ప్రకటనలో తెలిపారు. -
‘కరోనా’పై అప్రమత్తత
న్యూఢిల్లీ/బీజింగ్/న్యూయార్క్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించి, వారిలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించారు. మంగళవారం వరకు 43 విమానాల ద్వారా వచ్చిన 9,156 మంది ప్రయాణీకులను పరీక్షించామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొంది. చైనాలోని భారత రాయబార కార్యాలయం తమకు ఈ వైరస్‌కు సంబంధించిన తాజా వివరాలను క్రమం తప్పకుండా అందజేస్తోందని భారత ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదన్ తెలిపారు. చైనాలో పెరిగిన మృతుల సంఖ్య చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 17కి చేరింది. అలాగే, ఈ వైరస్ సోకిన 444 మందిని గుర్తించారు. చైనాలో నూతన సంవత్సరం, వసంత రుతు ఆగమన ఉత్సవాల సందర్భంగా జనవరి 24 నుంచి సెలవులు ఉంటాయి. ఈ సెలవు రోజుల్లో లక్షలాది మంది చైనాకు రావడమో, చైనా నుంచి వెళ్లడమో చేస్తారు కనుక ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే, ఈ వైరస్‌ను తొలుత వూహాన్ నగరంలోనే గుర్తించిన కారణంగా, ఆ నగర పౌరులను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. హాంకాంగ్, మకావు, మెక్సికో, థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియాల్లోనూ ఈ వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదమున్న నేపథ్యంలో జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య ఎమర్జెన్సీ’గా ప్రకటించే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిపారు. కాగా, అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతడు ఇటీవల వూహాన్ నుంచి వచ్చినట్లు తెలిపారు. -
హైపర్ ‘టెన్షన్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా హైపర్ టెన్షన్(అధిక రక్తపోటు) బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం విస్తరించిన ఈ జీవనశైలి జబ్బుపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల బాధితులు శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, నియంత్రించడానికి రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో కేంద్రం పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. తాజాగా దీన్ని మరో 100 జిల్లాలకు విస్తరింపజేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు జిల్లాలను ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో చేపట్టనున్న స్క్రీనింగ్ పరీక్షలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారం అందిస్తోంది. హైపర్ టెన్షన్‌ను సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే రానున్న ఐదేళ్లలో మరో ఐదారు కోట్ల మంది దీనిబారినపడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అధిక రక్తపోటు బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, 2025 నాటికి ఈ వ్యాధి విస్తరణను కనీసం 25 శాతం అరికట్టాలని సూచించింది. బాధితులకు ప్రభుత్వం తరపున మందులివ్వాలి హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్‌కు (పక్షవాతం) గురవుతున్నారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తాజాగా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ (నిర్ధారణ) పరీక్షలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, ఇందుకోసం నర్సులకు, హెల్త్ వర్కర్లకు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని, బాధితులకు ప్రభుత్వం తరఫునే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్’గా మార్చాలని, గ్రామస్థాయిలో అధిక రక్తపోటు బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికం ఆంధ్రప్రదేశ్‌లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల నివేదికలో తేలింది. రాష్ట్రంలో దాదాపు కోటి మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా బాధితులు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హైపర్ టెన్షన్ బాధితులు పెరుగుతున్న కారణంగా గుండెపోటు, పక్షవాతం కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రాథమిక దశలోనే గుర్తించాలి ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాము హైపర్ టెన్షన్ బారిన పడినట్లు కూడా తెలియదు. పట్టణాల్లో కూడా చాలామంది తమకు వ్యాధి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అసాధారణంగా ఉన్నవారికీ గుండెపోటు వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువ. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు’’ – డా.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, సూపరింటెండెంట్, కర్నూలు జనరల్ ఆస్పత్రి -
టెస్ట్‌కు తరలండి క్యాన్సర్‌ను తరమండి
క్యాన్సర్ గురించి భయపడకండి. వచ్చినా సరే త్వరగా గుర్తించి చికిత్స చేయించుకుంటే తగ్గుతుంది. ఇలా చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఆధునిక వైద్య విజ్ఞాన పురోభివృద్ధి తర్వాత ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని తెలిసినా... ఆందోళన పడక్కర్లేదు. అయితే ఒకవేళ క్యాన్సర్‌ను గుర్తించడంలో ఆలస్యం అయ్యిందంటే... కాస్త ఆందోళన తప్పదు. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంచి చిక్సిత అందించవచ్చు. అది దాదాపుగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసుకోవడంతో సమానం. అయితే మరి క్యాన్సర్స్‌ను ముందే గుర్తించడం ఎలా? వేర్వేరు క్యాన్సర్లకు పరీక్షలేమిటి? అవేమిటో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. క్యాన్సర్‌ను ఎంత త్వరగా తెలుసుకుంటే...అంత త్వరగా, పూర్తిగా నయం అవుతుందని తెలుసుకున్నాం. అలాగే క్యాన్సర్ గుర్తింపు ఎంత ఆలస్యం అవుతుంటే... చికిత్సతో తగ్గే అవకాశాలు అంతగా తగ్గుతుంటాయని కూడా గ్రహించాలి. కొన్ని రకాల క్యాన్సర్ల లక్షణాలు ముందుగా కనిపించవు. అంటే బాగా ముదిరాకే కనిపిస్తాయన్నమాట. ఇలా చూసినప్పుడు... లక్షణాల ఆధారంగా క్యాన్సర్‌ను తెలుసుకోవాలంటే అప్పటికే విలువైన సమయం గడచిపోయి, అది బాగా ముదిరిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఏడాదీ కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే లక్షణాలు కనిపించకపోయినా క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చు. ఇక ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ దాదాపూ నయమైనట్లే అని చెప్పుకున్నాం కాబట్టి ఆ గుర్తింపు పరీక్షలే... రక్షించే పరీక్షలవుతాయనీ గ్రహించాలి, అందుకే వాటిని చేయించుకోవాలి. అయితే ఇలాంటి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు కొన్ని క్యాన్సర్లకు మాత్రం అందుబాటులో లేవు. అవి మినహాయిస్తే, మిగతావి... (అంటే గుర్తించేందుకు అవకాశం ఉన్నవాటిని మాత్రం) పరీక్షలతో తెలుసుకోవడం మేలు. లక్షణాలేమీ కనిపించకపోయినా... పూర్తి ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా ముందుజాగ్రత్త కోసం క్యాన్సర్ ఉందేమోనని చేయించుకునే పరీక్షలనే స్క్రీనింగ్ అంటారు. మరి ఈ స్క్రీనింగ్ ఎవరికి అవసరం? ‘మాకు లక్షణాలేమీ లేవు. మరెందుకు చేయించుకోవాలి?’ అని కొందరు అడగవచ్చు. ముందే తెలుసుకోవడం నివారణతో సమానం కాబట్టి అందరూ చేయించుకోవడం మంచిది. ఇక రిస్క్ గ్రూపులకైతే ఇవి తప్పనిసరి. పురుషులు మాత్రమే చేయించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు ప్రోస్టేట్ క్యాన్సర్ : కాస్తంత వయస్సు పైబడ్డ తర్వాత పురుషుల్లో ఎక్కువగా కనిపించేది... ‘ప్రోస్టేట్ క్యాన్సర్’. దీన్ని చాలా చిన్న పరీక్షతోనే కనిపెట్టవచ్చు. పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే చవకైన, సులభమైన పరీక్ష సహాయంతో క్యాన్సర్‌ను ఎంతో ముందుగానే కనుక్కోవచ్చు. యాభై ఏళ్లు పైబడ్డ పురుషులు ప్రతి ఏడాదీ చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఇదేగాక మలద్వారం ద్వారా వేలితో చేసే మరో పరీక్ష డిజిటర్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ). ఈ పరీక్షలతో డాక్టర్లు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కనుగొంటారు. మహిళలకు మాత్రమే అవసరమైన స్క్రీనింగ్స్ పరీక్షలు సర్వికల్ క్యాన్సర్:... సర్వికల్ క్యాన్సర్ ఒక సానుకూలత ఉంది. అదేమిటంటే... ఈ క్యాన్సర్ వచ్చేందుకు చాలా ముందుగానే గుర్తించేందుకు వీలుగా దీనికి సుదీర్ఘమైన ప్రీ–క్యాన్సర్ దశ ఉంటుంది. దాంతో ఈ వ్యాధి రావడానికి పదేళ్ల ముందే దాన్ని పసిగట్టవచ్చు. దీనికి చేయించుకోవాల్సిందల్లా పాప్‌స్మియర్ అనే ఒక సింపుల్ పరీక్ష. దీన్ని ప్రతి మహిళా 25 ఏళ్లు దాటాక చేయించాలి. ప్రీ–క్యాన్సర్ కనిపించకపోతే... అప్పట్నుంచి ప్రతి మూడేళ్లకోమారు ఈ పరీక్ష చేయించుకుంటే చాలు. రిస్క్ గ్రూప్‌లో ఎవరెవరు? ∙కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు ∙పిల్లలు లేని వాళ్లు ∙ముప్ఫయి ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు... వీరంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్ గ్రూప్. ఈ రిస్క్ గ్రూపులకు మూడు పరీక్షలు అవసరం. అందులో మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్ కంటే ముందే... తమకే తెలిసిపోతుంది. ఫలితంగా ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరగా కనిపెట్టగలరు. ఇతరత్రా కాస్తంత తేడా ఏమైనా ఉంటే దాన్ని డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. రొమ్ము క్యాన్సర్: రొమ్ము క్యాన్సర్ విషయంలో వయస్సుకూ వ్యాధికీ సంబంధం ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు (రిస్క్) పెరుగుతుంటాయి. అందరిలోనూ వచ్చే సాధారణ క్యాన్సర్లు... వాటి రిస్క్ ఫ్యాక్టర్లు... మహిళలకూ, పురుషులకూ... ఈ ఇరువురిలోనూ కనిపించే సాధారణ క్యాన్సర్లూ, అవి వచ్చే రిస్క్ గ్రూప్‌ల వివరాలివి. ఈ కింద పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్లు మీలో ఉంటే మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి... విషయం వివరించి... వారు సూచించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మలద్వారం, పెద్ద పేగు క్యాన్సర్... (కోలో రెక్టల్ క్యాన్సర్): ఇందులోని రిస్క్ గ్రూపులను లెవెల్–1, లెవెల్–2, లెవెల్–3, లెవెల్–4 అని నాలుగుగా విభజించవచ్చు. ఇందులో లెవెల్–1 అంటే... కుటుంబ చరిత్రలో ఈ రకం క్యాన్సర్ వచ్చిన రోగులున్నవారు. లెవెల్–2 అంటే... కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉండి, 50 ఏళ్లు పైబడ్డవారు. లెవెల్–3 అంటే... 50 ఏళ్లకు ముందుగానే ఈ వ్యాధి వచ్చిన దగ్గరి బంధువులున్నవారు, వారితో పాటు మరో ఇద్దరు ముగ్గురికి ఈ వ్యాధి ఉంటే... లెవెల్–4 అంటే... చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, 50 పైబడి ఉండటంతో పాటు... చాలా దగ్గరి బంధువులు అంటే తల్లిదండ్రుల్లో ఒకరికి వ్యాధి రావడం... లెవెల్–1 స్థాయి రోగులైతే... మలంలో ఏవైనా రక్తకణాలున్నాయేమో తెలుసుకునేందుకు చేసే ‘ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్’ అనే సాధారణ మలపరీక్షను 50 ఏళ్లు పైబడ్డవారిలో ఏడాదికోసారి చేయించాలి. వారికి సిగ్మాయిడోస్కోపీ విత్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనే పరీక్షను ప్రతి ఐదేళ్లకు ఓసారి చేయించాలి. లెవెల్–2 రోగులకు... పై పరీక్షలే. అయితే... అవి వీటిని ప్రతి మూడేళ్లకోమారు చేయిస్తుండాలి. లెవెల్–3 రోగులకు... కొలనోస్కోపీతో పాటు డాక్టర్లు వేలితో చేసే డిజిటల్ రెక్టమ్ ఎగ్జామినేషన్ పరీక్షలను 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి ప్రతి 3–5 ఏళ్లకు చేయిస్తుండాలి. దాంతో పాటు ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్‌ను 35 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి ఏడాదీ చేయిస్తుండాలి. లెవెల్–4 రోగులకు... కొలనోస్కోపీ పరీక్షతో పాటు డిజిటల్ రెక్టమ్ పరీక్షను 25 ఏళ్ల వయసప్పటి నుంచే ప్రతి 1–3 ఏళ్లకోమారు చేయిస్తుండాలి. ఇటీవలే కొత్తగా మల పరీక్షలో ఒకరకమైన స్టూల్ డీఎన్ఏ పరీక్షతో పాటు, సీటీ కొలనోస్కోపీ అనే నొప్పి లేని వర్చువల్ కొలనోస్కోపీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్లను ముందుగానే తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఇది సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాళ్లలో చాలా ఎక్కువ. ప్రధానంగా మనదేశంలో పురుషుల్లో చాలా ఎక్కువ. సాధారణ చెస్ట్ ఎక్స్–రే ద్వారా, స్ఫూటమ్ సైటాలజీ పరీక్షతో పాటు హై రెజల్యూషన్ సీటీ స్కాన్ ద్వారా దీన్ని కనుక్కోవచ్చు. పొగతాగేవారు ఈ క్యాన్సర్‌కు హైరిస్క్‌గా భావించాలి. వారు తమలో కొద్దిపాటి అసౌకర్యంగాని, లక్షణాలుగాని కనిపిస్తే... వెంటనే ఈ పరీక్షలు చేయించుకోవాలి. స్టమక్ క్యాన్సర్... : ఇది రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న హైరిస్క్ వర్గాలవారు ఎవరంటే... ∙పర్నీసియస్ ఎనిమియా అనే ఒక రకం రక్తహీనతతో బాధపడుతున్న... కాస్తంత వయస్సు పైబడ్డ వారు. ∙గతంలో అల్సర్‌కు ఆపరేషన్ (గ్యాస్ట్రెక్టమీ) చేయించుకున్నవారు. ∙ఫెమీలియల్ అడెనోమేటస్ పాలిపోసిస్ అనే తరహా పాలిప్స్ ఉన్నవారు. ∙హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) అనే సూక్ష్మజీవి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినవాళ్లు. స్క్రీనింగ్ పరీక్ష : వీళ్లంతా కడుపులో క్యాన్సర్ కోసం తరచూ డబుల్ కాంట్రాస్ట్ బేరియం పరీక్ష, ఎండోస్కోపీ చేయించుకోవాలి. ∙వాళ్లతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినేవాళ్లూ, పొగతాగేవాళ్లూ, ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సీ తక్కువగా తీసుకునేవారితో పాటు రబ్బరు, బొగ్గు పని చేసేవాళ్లు తరచూ ఈ పరీక్షలు చేయంచుకోవడం మంచిది. మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. ఇది ఎవరికి అవసరం అంటే... 30 ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి. 35 ఏళ్లప్పుడు ఒకసారి... 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి 40ఏళ్లు దాటక 50వ ఏటి వరకూప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి 50ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది. ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లకు డాక్టర్ సలహా మేరకు ఇంకా త్వరితంగానే అవసరం కావచ్చు. చాలా హై రిస్క్ గ్రూపు వారికి ఈ కింది పరీక్షలు... : కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు భావిస్తే... ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా దాన్ని కనుక్కోవచ్చు. జన్యుపరీక్షల ద్వారా– బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదీ రానిది తెలుసుకోవచ్చు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్... దక్షిణ భారత దేశంలోని పురుషుల్లో కొలనోరెక్టల్ క్యాన్సర్ తర్వాత అత్యంత ఎక్కువగా కనిపించేవి హెడ్, నెక్ క్యాన్సర్లే. పురుషుల్లో పొగాకు, ఆల్కహాల్ అలవాట్లు ఎక్కువగా ఉండటంతో ఇవి వారిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చిన వారు ఏడాదికోమారు డాక్టర్‌ను కలిసి, వారు సూచించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి వచ్చి తగ్గినవాళ్లు ఆ ఏడాది మొదటి ఏడాదిలో ప్రతి మూడు నెలలకొకసారి, ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. -
క్యాన్సర్‌కు ఆన్సర్!
నేడు క్యాన్సర్ సర్వైవర్స్ డే క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే తగిన చికిత్సకు ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ ఒక మాయదారి జబ్బు. ఒక్కోసారి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా ఒంట్లో ఎక్కడో మారుమూల నక్కి ఉంటుంది. అందుకే ఎలాంటి లక్షణాలూ లేకపోయినా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నా ఒంట్లో క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. క్యాన్సర్‌లో కొన్ని రకాలు కేవలం మహిళల్లోనే కనిపిస్తే, ఇంకొన్ని కేవలం పురుషుల్లో మాత్రమే కనిపిస్తాయి. మరికొన్ని రకాల క్యాన్సర్ స్త్రీ పురుష భేదం లేకుండా అందరిలోనూ కనిపిస్తాయి. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందరికీ అంత అవసరం కాకపోయినా, రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ సోకే అవకాశాలు గల రిస్క్ గ్రూపులకు ఈ స్క్రీనింగ్ పరీక్షలు చాలా అవసరం. ఎవరెవరు రిస్క్ గ్రూపుల్లోకి వస్తారో, ఏయే రకాల క్యాన్సర్లకు ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు అవసరమో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం... మహిళల్లో మాత్రమే... సర్వికల్ క్యాన్సర్: సర్వికల్ క్యాన్సర్‌కు ముందు సుదీర్ఘమైన ప్రీ–క్యాన్సర్ దశ ఉంటుంది. అందువల్ల దీనిని పదేళ్ల ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రతి మహిళా పాతికేళ్ల వయసు దాటాక పాప్‌స్మియర్ టెస్ట్ అనే సాధారణ పరీక్ష చేయించుకోవడం మంచిది. ప్రీ–క్యాన్సర్ లక్షణాలేవీ లేకుంటే ప్రతిమూడేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. ప్రీ–క్యాన్సర్ లక్షణాలు ఉంటే తగిన చికిత్స పొందడం ద్వారా ఈ క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ విషయంలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయి. రిస్క్ గ్రూప్ అంటే ఎవరెవరు? కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు, పిల్లలు లేని వాళ్లు, ముప్ఫయి ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు... వీరంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్ గ్రూప్. ఈ రిస్క్ గ్రూపులు చేయించాల్సిన పరీక్షలు మూడు. అందులో మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. ఫలితంగా రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్ కంటే ముందుగా, తమకే అర్థమైపోతుంది. రొమ్ముల్లో తేడా ఏమైనా ఉంటే దాన్ని మీ డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. మమోగ్రఫీ ఎవరికి అవసరం అంటే... ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి. ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి. 40 ఏళ్లు దాటాక 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి. 50 ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది. ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లకు డాక్టర్ సలహా మేరకు ఇంకా ముందుగానే ఈ పరీక్ష అవసరం కావచ్చు. హైరిస్క్ గ్రూప్ వారికి... కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా దాన్ని కనుక్కోవచ్చు. జన్యుపరీక్షల ద్వారా– బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదీ రానిదీ తెలుసుకోవచ్చు. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వయసు పైబడ్డ పురుషుల్లో సాధారణంగా కనిపించేది ప్రొస్టేట్ క్యాన్సర్. దీనిని ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) అనే తేలికైన, చౌకైన పరీక్ష సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. యాభై ఏళ్లు పైబడ్డ పురుషులు ఏటా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఇదేకాకుండా, మలద్వారం ద్వారా వేలితో చేసే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ) అనే మరో పరీక్ష ద్వారా వైద్యులు ఈ వ్యాధిని ముందే కనుగొంటారు.తల నుంచి కాలివరకు తొలి దశలో గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలు... తల భాగంలో... ఈ క్యాన్సర్స్ నోరు, దవడ, నాలుక మీద లేదా చిగుళ్లలో ఎక్కడైనా రావచ్చు. ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు ఉన్నా క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్ గ్రంధుల వాపు. గొంతు భాగంలో... దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఉన్న అనుభూతి ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. కడుపులో... కడుపులో క్యాన్సర్ ఉన్నట్లయితే పొట్టలో మంట, పొట్టలో రక్తస్రావం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్. పేగుల్లో... మల మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు రావడం జరుగుతుంది. రెక్టల్ క్యాన్సర్‌లో... మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతో పాటు బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒవేరియన్ క్యాన్సర్... దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ చూపించకుండానే ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని ‘సైలెంట్ కిల్లర్’గానూ అభివర్ణిస్తుంటారు. టెస్టిస్ క్యాన్సర్... పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడి పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. చర్మ క్యాన్సర్... చర్మ క్యాన్సర్‌ను ఏ,బీ,సీ,డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ–కలర్ అంటే రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు. కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్స్... మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. బ్లడ్ క్యాన్సర్... రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలాంటిది రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. బ్రెయిన్ క్యాన్సర్... శరీరంలోని అన్ని భాగాలకు లాగే మెదడుకూ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, విషయాలు గుర్తుంచుకోకపోవడం, కొన్నిసార్లు సాంఘిక, సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అవయవాలు చచ్చుబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాన్సర్ తొలిదశలో కనిపించే లక్షణాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. లక్షణాలేవైనా కనిపిస్తే ఆందోళన చెందకుండా పరీక్ష చేయించుకొని అది క్యాన్సర్ కాదని నిర్ధారించుకొని నిశ్చింతగా ఉండండి. పెద్దపేగు క్యాన్సర్... రిస్క్ ఫ్యాక్టర్లు మహిళలకూ, పురుషులకూ వేర్వేరుగా వచ్చే క్యాన్సర్ల తర్వాత ఇద్దరిలోనూ కనిపించే సాధారణ క్యాన్సర్లూ, అవి వచ్చే రిస్క్ గ్రూప్‌ల వివరాలివి. ఈ కింద పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్లు మీలో ఉంటే మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మలద్వారం, పెద్ద పేగు క్యాన్సర్... (కోలో రెక్టల్ క్యాన్సర్) ఇందులోని రిస్క్ గ్రూపులను లెవెల్–1, లెవెల్–2, లెవెల్–3, లెవెల్–4 అని నాలుగు దశలుగా విభజించవచ్చు. ఇందులో లెవెల్–1: కుటుంబ చరిత్రలో ఈ రకం క్యాన్సర్ వచ్చిన రోగులున్నవారు. లెవెల్–2: కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉండి, 50 ఏళ్లు పైబడ్డవారు. ∙లెవెల్–3: 50 ఏళ్లకు ముందుగానే ఈ వ్యాధి వచ్చిన దగ్గరి బంధువులున్నవారు, వారితో పాటు మరో ఇద్దరు ముగ్గురికి ఈ వ్యాధి ఉంటే...∙లెవెల్–4: చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, 50 పైబడి ఉండటంతో పాటు... చాలా దగ్గరి బంధువులు అంటే తల్లిదండ్రుల్లో ఒకరికి వ్యాధి రావడం... లెవెల్–1 స్థాయి రోగులైతే... మలంలో ఏవైనా రక్తకణాలున్నాయేమో తెలుసుకునేందుకు చేసే ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ అనే సాధారణ మలపరీక్ష 50 ఏళ్లు పైబడ్డవారిలో ఏడాదికోసారి చేయించాలి. వారికి సిగ్మాయిడోస్కోపీ విత్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనే పరీక్షను ప్రతి ఐదేళ్లకు ఓసారి చేయించాలి. లెవెల్–2 రోగులకు... పై పరీక్షలే. అయితే... అవి ప్రతి మూడేళ్లకోమారు చేయిస్తుండాలి. లెవెల్–3 రోగులకు... కొలనోస్కోపీతో పాటు డాక్టర్లు వేలితో చేసే డిజిటల్ రెక్టమ్ ఎగ్జామినేషన్ పరీక్షలను 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి ప్రతి 3–5 ఏళ్లకు చేయిస్తుండాలి. దాంతో పాటు ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్‌ను 35 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి ఏడాదీ చేయిస్తుండాలి. లెవెల్–4 రోగులకు... కొలనోస్కోపీ పరీక్షతో పాటు డిజిటల్ రెక్టమ్ పరీక్షను 25 ఏళ్ల వయసప్పటి నుంచే ప్రతి 1–3 ఏళ్లకోమారు చేయిస్తుండాలి. ఇటీవలే కొత్తగా మల పరీక్షలో ఒకరకమైన స్టూల్ డీఎన్ఏ పరీక్షతో పాటు, సీటీ కొలనోస్కోపీ అనే నొప్పి లేని వర్చువల్ కొలనోస్కోపీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల ఈ క్యాన్సర్లను చాలా ముందుగా తెలుసుకోవచ్చు. క్యాన్సర్‌ను గుర్తించడానికి... ∙తగిన కారణాల్లేకుండా బరువు తగ్గడం ∙ఆకలి తగ్గడం ∙ఎడతెరిపి లేకుండా దగ్గు lలింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు lఆయా అవయవాల్లోంచి రక్తస్రావం... ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన పరీక్షలు జరిపించుకోవాలి. ఇప్పుడు నయమయ్యే కేసులు ఎక్కువ.. గతంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ప్రతి ఐదుగురు క్యాన్సర్ పేషెంట్లలో ఒకరు భారతీయుడు. కానీ ఇటీవల ప్రతి నలుగురిలోనే ఒకరు భారతీయుడు. అయితే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, ముందుగానే అరికట్టగల విషయంలో భారత్‌దే అగ్రస్థానం. కానీ దురదృష్టకరమైన అంశం ఏమిటంటే... దీన్ని ముందుగా గుర్తించలేకపోవడం కూడా ఇక్కడే జరుగుతోంది. ఇక సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వస్తే... ముందుగా గుర్తిస్తే 40–50 శాతం సర్వైకల్ క్యాన్సర్లను చాలా సమర్థంగా నయం చేయవచ్చు. అంటే ముందుగా గుర్తించడమే చికిత్సకు కీలకం అన్నమాట. సర్వైకల్ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్‌ను కలిగించే వైరస్ అయిన హెచ్‌పీవీ వైరస్‌ను తుదముట్టించడం సాధ్యమే. ఇందుకోసం 9–35 ఏళ్ల వయసు గల మహిళలు దీన్ని తీసుకోవాలి. హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ అందించే సదుపాయం ఉంది. ఇక మా సంస్థలో ఉన్న డిజిటల్ మామోగ్రామ్ అనేది రొమ్ము క్యాన్సర్‌ను చాలా నిర్దిష్టంగా, కచ్చితంగా గుర్తించగలదు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ విషయానికి వస్తే ముందుగా గుర్తిస్తే వీటిని కూడా కచ్చితంగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎమ్. బాబయ్య, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్ స్టమక్ క్యాన్సర్... దక్షిణ భారతదేశంలో ఇది చాలా సాధారణంగా కనిపించే క్యాన్సర్. ఇది రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న హైరిస్క్ ఉన్నవారు ఎవరంటే...∙వయసు పైబడిన దశలో పర్నీసియస్ ఎనీమియా అనే ఒక రకం రక్తహీనతతో బాధపడేవారు. ∙గతంలో అల్సర్‌కు ఆపరేషన్ (గ్యాస్ట్రెక్టమీ) చేయించుకున్నవారు lఫెమీలియల్ అడెనోమేటస్ పాలిపోసిస్ అనే పాలిప్స్ ఉన్నవారు. ∙హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) అనే సూక్ష్మజీవి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినవాళ్లు... వీళ్లంతా కడుపులో క్యాన్సర్ కోసం తరచు డబుల్ కాంట్రాస్ట్ బేరియం పరీక్ష, ఎండోస్కోపీ చేయించుకోవాలి. lవాళ్లతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినేవాళ్లూ, పొగతాగేవాళ్లూ, ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సీ తక్కువగా తీసుకునేవారితో పాటు రబ్బరు, బొగ్గు పరిశ్రమల్లో పని చేసేవాళ్లు తరచు ఈ పరీక్షలు చేయంచుకోవాలి. మస్క్యులోస్కెలెటల్ చికిత్సలతో కాళ్లూ, చేతులు పదిలమిప్పుడు... ఇటీవల కాళ్లు, చేతులు, వెన్నెముకకు వచ్చే క్యాన్సర్లు పెరుగుతున్నాయి. దాదాపు 50 శాతం క్యాన్సర్ రోగుల్లో... వారికి ఉండే ఇతర క్యాన్సర్లు ఎముకలకూ వ్యాపించడం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంటోంది. అయితే ఈ చికిత్స విధానంలో వచ్చిన ఆధునాతనమైన పురోగతి వల్ల ఆ క్యాన్సర్లను తగ్గించడంతో పాటు... వ్యాధి వల్ల కాళ్లు, చేతుల్లో వచ్చిన నిర్మాణపరమైన అవకరాలను తగ్గించడం ఇప్పుడు బాగా సాధ్యమవుతోంది. రోగిని రక్షించుకోవాలంటే గతంలో కేవలం క్యాన్సర్ వచ్చిన కాలు లేదా చెయ్యి భాగాన్ని తొలగించాల్సి రావడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అగత్యం లేదు. ఇప్పటికి నా ఆధ్వర్యంలోనే 2500 మందికి పైగా రోగులకు మేం తగిన చికిత్స అందించి, క్యాన్సర్‌ను నయం చేయడమే కాకుండా అవయవాలు కోల్పోకుండా కూడా కాపాడగలిగాం. అందులో కేవలం ఐదు నెలల బాలుడు కూడా ఉండటం విశేషం. – డాక్టర్ కిశోర్ బి. రెడ్డి, కన్సల్టెంట్ అండ్ చీఫ్ ఆఫ్ మస్క్యులో స్కెలెటల్ ఆంకాలజీ ఇప్పటి శస్త్రచికిత్స పద్ధతులు అత్యంత అధునాతనం క్యాన్సర్ చికిత్సల విషయంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న సరికొత్త శస్త్రచికిత్స విధానాలు, రేడియేషన్ చికిత్స, టార్గెట్ థెరపీ, జెనెటిక్ ప్రొఫైలింగ్ ద్వారా అందించే వ్యక్తిగత చికిత్సల ద్వారా గతంలో కంటే క్యాన్సర్ నయం కావడం అన్నది ఇప్పుడు చాలా ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు చికిత్స తీసుకుంటూ నిశ్చింతగా ఉన్నట్లే వీళ్లూ ఉండవచ్చు. – డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, కన్సల్టెంట్ అండ్ చీఫ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ (మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ) నయం అయ్యాక అంతా నార్మలే! కాస్తంత అప్రమత్తంగా ఉండి, ఏవైనా లక్షణాలను గుర్తించగానే వెంటనే తగిన పరీక్షలు చేయించుకోండి. ఎంత ముందుగా గుర్తించగలిగితే... క్యాన్సర్ అంత త్వరగా తగ్గుతుంది. అందుకే అవగాహనతో స్క్రీనింగ్ పరీక్షలు, త్వరగా కనుగొనడం, సమర్థమైన చికిత్స, ఆ తర్వాత అవసరాన్ని బట్టి డాక్టర్ సూచనల ప్రకారం ఫాలో అప్.. ఇవన్నీ ఉంటే క్యాన్సర్ పూర్తిగా దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ వ్యాధి సోకిన తర్వాత తగిన చికిత్స తీసుకుని, వ్యాధి తగ్గిన వారు... మిగతా వ్యక్తులు మామూలు జీవితం గడిపినట్టే సాధారణమైన జీవితాన్ని గడపవచ్చు. – డాక్టర్ అరుణ్ లింగుంట్ల, కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డ కొందరి ఉదాహరణలు సుమిత్ సుమిత్ అనే పదేళ్ల బాలుడు కర్ణాటకలోని బీదర్‌కు చెందినవాడు. అతడికి అప్లాస్టిక్ అనీమియా అనే క్యాన్సర్ ఉందని తేలింది. దాంతో అతడికి అత్యవసరంగా ఎముక మూలుగ మార్పిడి శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది. తండ్రి మల్లికార్జున ఎముక మూలుగ సరిపోలడంతో సుమిత్‌కు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో శస్త్రచికిత్స నిర్వహించారు. అతడు ఇప్పుడు కోలుకుంటూ అందరు పిల్లల్లాగే సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఆర్కే... ఆర్కే (పేరు మార్చాం) అనే చిన్నారి బి–అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా ఉన్నట్లు తేలింది. అతడికి ఆగష్టు 2016 నుంచి రెండుసార్లు కీమోథెరపీ, జనవరి, 2017లో అలోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే చికిత్సను అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో నిర్వహించారు. ఇందుకోసం అవసరమైన స్టెమ్‌సెల్స్‌ను అతడి సోదరుడి నుంచి స్వీకరించారు. ఇప్పుడు ఆర్కే బాగా కోలుకుంటున్నాడు. ఉమారాజు ఉమారాజు 52 ఏళ్ల మహిళ ఒక మాజీ సైనికుడి భార్య. 2016 జులైలో తీవ్రమైన తలనొప్పి, ఫిట్స్‌తో ఆసుపత్రికి వచ్చే వరకు పాటు చాలా మంచి జీవనశైలితో ఆరోగ్యంగా ఉండేవారు. లక్షణాలు కనిపించగానే బ్రెయిన్ టీబీ లేదా బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చనే అనుమానంతో వెంటనే ఆమెను అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్కు తీసుకొచ్చారు. డాక్టర్లు ఆమెకు క్యాన్సర్ అని తేలింది. శస్త్రచికిత్స తర్వాత రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చారు. ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఎనిమిది నెలలు చాలా కష్టాలు అనుభవించిన ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు స్వతంత్రంగా జీవిస్తూ అందరిలాగే హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. కౌశిక్ ఐదేళ్ల కౌశిక్‌కు తుంటి భాగంలో గడ్డ అయ్యింది. అది అక్కడి ఎముకను పూర్తిగా తినేసింది. మొదట ఆపరేషన్ చేసి తొలగించినా... ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టింది. అతడికి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో శస్త్రచికిత్స చేసి, గతంలో తుంటి భాగంలో తొలగించిన ఎముకను... కాలి నుంచి సేకరించిన ఎముకతో భర్తీ చేశారు డాక్టర్లు. ఇప్పుడు ఆ పిల్లాడు హాయిగా ఆడుతూ, పాడుతూ... ఆనందంగా మామూలు జీవితం గడుపుతున్నాడు. మరిన్ని వివరాలకోసం... అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, హైదరాబాద్ – 500 019. ఫోన్ : 040 6719 9999 / 9000900773 ఇ–మెయిల్ : contactus@americanoncology.com