న్యూఢిల్లీ/బీజింగ్/న్యూయార్క్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించి, వారిలో ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ లేదని నిర్ధారించారు. మంగళవారం వరకు 43 విమానాల ద్వారా వచ్చిన 9,156 మంది ప్రయాణీకులను పరీక్షించామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొంది. చైనాలోని భారత రాయబార కార్యాలయం తమకు ఈ వైరస్‌కు సంబంధించిన తాజా వివరాలను క్రమం తప్పకుండా అందజేస్తోందని భారత ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదన్ తెలిపారు.
చైనాలో పెరిగిన మృతుల సంఖ్య
చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 17కి చేరింది. అలాగే, ఈ వైరస్ సోకిన 444 మందిని గుర్తించారు. చైనాలో నూతన సంవత్సరం, వసంత రుతు ఆగమన ఉత్సవాల సందర్భంగా జనవరి 24 నుంచి సెలవులు ఉంటాయి. ఈ సెలవు రోజుల్లో లక్షలాది మంది చైనాకు రావడమో, చైనా నుంచి వెళ్లడమో చేస్తారు కనుక ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే, ఈ వైరస్‌ను తొలుత వూహాన్ నగరంలోనే గుర్తించిన కారణంగా, ఆ నగర పౌరులను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. హాంకాంగ్, మకావు, మెక్సికో, థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియాల్లోనూ ఈ వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదమున్న నేపథ్యంలో జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య ఎమర్జెన్సీ’గా ప్రకటించే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిపారు. కాగా, అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతడు ఇటీవల వూహాన్ నుంచి వచ్చినట్లు తెలిపారు.
‘కరోనా’పై అప్రమత్తత
Published Thu, Jan 23 2020 4:49 AM | Last Updated on Thu, Jan 23 2020 8:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment