indian airports
-
భారత ఎయిర్‌పోర్ట్‌ల వ్యూహాలు మారాలి
న్యూఢిల్లీ: భారత విమానాశ్రయాలు తమ ధరల వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ ఏరో నాటికల్ ఆదాయాలను మరింత పెంచుకోవడం ద్వారా లాభదాయకతను వృద్ధి చేసుకోవాలని ఈ రంగానికి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సూచించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీ పౌర విమానయాన మార్కెట్‌గా అవతరించగా, ఏటేటా ఎయిర్ ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) పెరుగుతూ వెళుతుండడం తెలిసిందే. దీంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు తమ సేవలను విస్తరిస్తుండడం గమనార్హం. ఈ తరుణంలో కాపా ఇండియా విడుదల చేసిన నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నడిచే విమానాశ్రయాలు నాన్ ఏరో మర్గాల (విమానయేతర) ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని ఇది సూచించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలోని విమానాశ్రయలతో పోలిస్తే పీపీపీ విధానంలోని విమానాశ్రయాల్లో నాన్ ఏరో ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ ఇవన్నీ పీపీపీ విధానంలో నడిచే విమానాశ్రయాలు కాగా, 2019–2020లో నాన్ ఏరో ఆదాయంలో వీటి వాటాయే 71 శాతంగా ఉంది. మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్‌లో మాత్రం వీటి వాటా 53 శాతమే’’అని కాపా ఇండియా తెలిపింది. ఇంకా అవకాశాలున్నాయి..విమానాశ్రయాలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి నాన్ ఏరో ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మరింత పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు కాపా ఇండియా అభిప్రాయపడింది. ఇందుకోసం విమానాశ్రయాలు తమ ధరల విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ల వనరుల విషయంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉన్నాయా? ఎయిర్‌లైన్ వ్యాపార నమూనా, ఫ్రీక్వెన్సీ, ప్యాసింజర్ల ప్రొఫైల్ మధ్య భారీ వైరుధ్యం ఉందా అనేది పరిశీలించాలని సూచించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశీ ఎయిర్‌లైన్స్ 6.61 కోట్ల ప్రయాణికులకు సేవలు అందించడం గమనార్హం. క్రితం ఏడాదిలో విమానాల్లో ప్రయాణించిన వారు 6.36 కోట్లుగా ఉన్నారు. -
కరోనా తరువాత లాభాల్లోకి విమానాశ్రయాలు
-
‘కరోనా’పై అప్రమత్తత
న్యూఢిల్లీ/బీజింగ్/న్యూయార్క్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించి, వారిలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించారు. మంగళవారం వరకు 43 విమానాల ద్వారా వచ్చిన 9,156 మంది ప్రయాణీకులను పరీక్షించామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొంది. చైనాలోని భారత రాయబార కార్యాలయం తమకు ఈ వైరస్‌కు సంబంధించిన తాజా వివరాలను క్రమం తప్పకుండా అందజేస్తోందని భారత ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదన్ తెలిపారు. చైనాలో పెరిగిన మృతుల సంఖ్య చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 17కి చేరింది. అలాగే, ఈ వైరస్ సోకిన 444 మందిని గుర్తించారు. చైనాలో నూతన సంవత్సరం, వసంత రుతు ఆగమన ఉత్సవాల సందర్భంగా జనవరి 24 నుంచి సెలవులు ఉంటాయి. ఈ సెలవు రోజుల్లో లక్షలాది మంది చైనాకు రావడమో, చైనా నుంచి వెళ్లడమో చేస్తారు కనుక ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే, ఈ వైరస్‌ను తొలుత వూహాన్ నగరంలోనే గుర్తించిన కారణంగా, ఆ నగర పౌరులను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. హాంకాంగ్, మకావు, మెక్సికో, థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియాల్లోనూ ఈ వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదమున్న నేపథ్యంలో జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య ఎమర్జెన్సీ’గా ప్రకటించే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిపారు. కాగా, అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతడు ఇటీవల వూహాన్ నుంచి వచ్చినట్లు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులను షేక్ చేసింది గర్ల్‌ఫ్రెండ్ వల్లే..
హైదరాబాద్: తన గర్ల్‌ఫ్రెండ్‌ను టూర్‌కు తీసుకెళ్లే బాధ నుంచి తప్పించుకునేందుకే విమానాలకు హైజాక్ బెదిరింపులు పంపించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అసలు విషయం చెప్పాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఈ సమయంలోనే గర్ల్‌ఫ్రెండ్ ముంబయి, గోవా టూర్లకు విమానంలో తీసుకెళ్లమందని, అది ఎలా తప్పించుకోవాలో అర్థంకాక, ఆమె టూర్‌కు వెళదామని చెప్పిన రోజే హైఅలర్ట్ విధించేలా ప్లాన్ చేసినట్లు తెలిపాడు. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్‌తోపాటు, ముంబయి, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో అప్రమత్తత విధించిన విషయం తెలిసిందే. విమానాలు హైజాక్ వస్తున్నట్లు పలు మెయిళ్లు రావడంతో సంబంధిత ఎయిర్పోర్ట్ అధికారులు హైఅలర్ట్ విధించారు. అనంతరం మెయిల్ పంపించిన వ్యక్తి ఆధారాలకోసం సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ మెయిల్ హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అనంతరం మెయిల్ ఆధారంగా వంశీ చౌదరీ అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం చెప్పాడు. తన గర్ల్‌ఫ్రెండ్ చెన్నైలో ఉంటోందని, ముంబయి, గోవా టూర్‌కు తీసుకెళ్లాలని కోరిందని చెప్పాడు. ట్రాన్స్పోర్ట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తన వద్ద డబ్బు లేక ఇబ్బంది తలెత్తడంతో ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఇలా చేశానని, ఆమె అడగగానే ప్రస్తుతం విమానాశ్రయాల్లో హైఅలర్ట్ విధించారని, విమానాలు రద్దయ్యాయని చెప్పి తప్పించుకున్నానని వివరించాడు. అంతకుముందు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతోనే ఇలా చేసినట్లు తెలిపాడు. గతంలో ఇతడిపై రెండు సైబర్ కేసులు ఉన్నాయంట. ప్రస్తుతానికి సైబర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. -
ఇండియన్ విమానాశ్రయాల్లో కొత్త మార్పు
కోల్‌కతా: త్వరలో భారత్‌లోని అన్ని విమానాశ్రయాల్లోకి ఫుల్ బాడీ స్కానర్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న తడిమి తనిఖీ చేసే పద్ధతి స్థానంలోకి ఈ కొత్త స్కానర్లతో తనిఖీలు రానున్నాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గతంలోనే ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌లో ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీటిని పరీక్షించి చూశారు. దేశంలోని పలు వాణిజ్య పరమైన విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ మాత్రమే సెక్యూరిటీ చూస్తుంటుంది. అయితే, అప్పట్లో ఈ స్కానర్లు బాగానే పనిచేసినప్పటికీ పలువురు ప్రయాణీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పారు. ముఖ్యంగా భారతీయ మహిళలు ధరించే తాళి, ఎక్కువ మడతలు ఉండే చీరలాంటివాటిని స్కానింగ్ చేసే సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో ఈ ఐడియాకు ఎక్కువమంది అనుకూలంగా లేరని అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో ఫుల్ బాడీ స్కానర్లు తప్పక అన్ని విమానాశ్రయాల్లో అవసరమేనని భావిస్తున్నామని వాటిని త్వరలోనే ప్రవేశపెడతామని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. విమానాల్లోని ప్రయాణికుల క్యాబిన్లోకి ల్యాప్‌టాప్‌ను నిషేధించే అంశాన్ని కూడా యోచిస్తున్నట్లు వెల్లడించారు. గత నెలలో అమెరికా, బ్రిటన్ విమానాల్లోకి ల్యాప్ టాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి చీర, మంగళసూత్రం ఉంటే ఎయిర్‌పోర్టులో కష్టమే -
విమాన ప్రయాణీకులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విమానం ప్రయాణం అంటే లగేజీ స్కానింగ్..హ్యాండ్ బ్యాగుల సెక్యూరిటీ తనిఖీలు ఓ పెద్ద తతంగం. అయితే ఇక విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు ఇక శుభం కార్డు పడినట్టే. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పూర్తి భద్రతను నిర్వహించే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఏఎస్) అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్ వ్యవస్థను గురువారం ప్రారంభించింది. హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత ఇతర టెక్నాలజీతో సహాయంతో హ్యాండ్ బ్యాగుల తనిఖీని మరింత కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ఈ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ పద్ధతిని అన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్టు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సామాను భద్రత, స్క్రీనింగ్ సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రయాణీకులకు హ్యాండ్ బ్యాగు టాగ్స్ , స్టాంపింగ్ కష్టాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పద్థతిని అవలంబిస్తున్నట్టు చెప్పింది. బాధ్యత బీసీఏఎస్ ది. -
విమానాశ్రయాల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌కు బెదిరింపు కాల్ రావటంతో దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 11 ఇండిగోవిమానాలను పేల్చేస్తామని చెన్నైలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌కు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు స్మిత్ అని, అమెరికా నుంచి కాల్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఇండిగో విమానాలు ఆపరేట్ అవుతున్న పది విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, శ్రీనగర్, వడోదర, గువాహటి, గోవా, కొచ్చి విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలను అత్యవసరంగా ఆపేశారు. విమానాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.