నాన్ ఏరోనాటికల్ ఆదాయం పెంచుకోవాలి
కన్సల్టెన్సీ సంస్థ కాపా సూచనలు
న్యూఢిల్లీ: భారత విమానాశ్రయాలు తమ ధరల వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ ఏరో నాటికల్ ఆదాయాలను మరింత పెంచుకోవడం ద్వారా లాభదాయకతను వృద్ధి చేసుకోవాలని ఈ రంగానికి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సూచించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీ పౌర విమానయాన మార్కెట్‌గా అవతరించగా, ఏటేటా ఎయిర్ ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) పెరుగుతూ వెళుతుండడం తెలిసిందే. దీంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు తమ సేవలను విస్తరిస్తుండడం గమనార్హం. ఈ తరుణంలో కాపా ఇండియా విడుదల చేసిన నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నడిచే విమానాశ్రయాలు నాన్ ఏరో మర్గాల (విమానయేతర) ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని ఇది సూచించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలోని విమానాశ్రయలతో పోలిస్తే పీపీపీ విధానంలోని విమానాశ్రయాల్లో నాన్ ఏరో ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ ఇవన్నీ పీపీపీ విధానంలో నడిచే విమానాశ్రయాలు కాగా, 2019–2020లో నాన్ ఏరో ఆదాయంలో వీటి వాటాయే 71 శాతంగా ఉంది. మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్‌లో మాత్రం వీటి వాటా 53 శాతమే’’అని కాపా ఇండియా తెలిపింది.
ఇంకా అవకాశాలున్నాయి..
విమానాశ్రయాలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి నాన్ ఏరో ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మరింత పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు కాపా ఇండియా అభిప్రాయపడింది. ఇందుకోసం విమానాశ్రయాలు తమ ధరల విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ల వనరుల విషయంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉన్నాయా? ఎయిర్‌లైన్ వ్యాపార నమూనా, ఫ్రీక్వెన్సీ, ప్యాసింజర్ల ప్రొఫైల్ మధ్య భారీ వైరుధ్యం ఉందా అనేది పరిశీలించాలని సూచించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశీ ఎయిర్‌లైన్స్ 6.61 కోట్ల ప్రయాణికులకు సేవలు అందించడం గమనార్హం. క్రితం ఏడాదిలో విమానాల్లో ప్రయాణించిన వారు 6.36 కోట్లుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment