టెస్ట్‌కు తరలండి క్యాన్సర్‌ను తరమండి | February 4 World Cancer Day | Sakshi
Sakshi News home page

టెస్ట్‌కు తరలండి క్యాన్సర్‌ను తరమండి

Published Thu, Feb 1 2018 12:47 AM | Last Updated on Thu, Feb 1 2018 12:47 AM

February 4 World Cancer Day - Sakshi

ఫిబ్రవరి 4 వరల్డ్‌ క్యాన్సర్‌ డే

క్యాన్సర్‌ గురించి భయపడకండి. వచ్చినా సరే త్వరగా గుర్తించి చికిత్స చేయించుకుంటే తగ్గుతుంది. ఇలా చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఆధునిక వైద్య విజ్ఞాన పురోభివృద్ధి తర్వాత ఇప్పుడు క్యాన్సర్‌ వచ్చిందని తెలిసినా... ఆందోళన పడక్కర్లేదు. అయితే ఒకవేళ క్యాన్సర్‌ను గుర్తించడంలో ఆలస్యం అయ్యిందంటే... కాస్త ఆందోళన తప్పదు. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంచి చిక్సిత అందించవచ్చు. అది దాదాపుగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసుకోవడంతో సమానం. అయితే మరి క్యాన్సర్స్‌ను ముందే గుర్తించడం ఎలా? వేర్వేరు క్యాన్సర్లకు పరీక్షలేమిటి? అవేమిటో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. 

క్యాన్సర్‌ను ఎంత త్వరగా తెలుసుకుంటే...అంత త్వరగా, పూర్తిగా నయం అవుతుందని తెలుసుకున్నాం. అలాగే క్యాన్సర్‌ గుర్తింపు ఎంత ఆలస్యం అవుతుంటే... చికిత్సతో తగ్గే అవకాశాలు అంతగా తగ్గుతుంటాయని కూడా గ్రహించాలి. కొన్ని రకాల క్యాన్సర్ల లక్షణాలు ముందుగా కనిపించవు. అంటే బాగా ముదిరాకే కనిపిస్తాయన్నమాట. ఇలా చూసినప్పుడు... లక్షణాల ఆధారంగా క్యాన్సర్‌ను తెలుసుకోవాలంటే అప్పటికే విలువైన సమయం గడచిపోయి, అది బాగా ముదిరిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఏడాదీ కొన్ని స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకుంటే లక్షణాలు కనిపించకపోయినా క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చు. ఇక ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ దాదాపూ నయమైనట్లే అని చెప్పుకున్నాం కాబట్టి ఆ గుర్తింపు పరీక్షలే... రక్షించే పరీక్షలవుతాయనీ గ్రహించాలి, అందుకే వాటిని చేయించుకోవాలి. అయితే ఇలాంటి ముందస్తు స్క్రీనింగ్‌ పరీక్షలు కొన్ని క్యాన్సర్లకు మాత్రం అందుబాటులో లేవు. అవి మినహాయిస్తే, మిగతావి... (అంటే గుర్తించేందుకు అవకాశం ఉన్నవాటిని మాత్రం) పరీక్షలతో తెలుసుకోవడం మేలు. లక్షణాలేమీ కనిపించకపోయినా... పూర్తి ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా ముందుజాగ్రత్త కోసం క్యాన్సర్‌ ఉందేమోనని చేయించుకునే పరీక్షలనే స్క్రీనింగ్‌ అంటారు. మరి ఈ స్క్రీనింగ్‌ ఎవరికి అవసరం? ‘మాకు లక్షణాలేమీ లేవు. మరెందుకు చేయించుకోవాలి?’ అని కొందరు అడగవచ్చు. ముందే తెలుసుకోవడం నివారణతో సమానం కాబట్టి అందరూ చేయించుకోవడం మంచిది. ఇక రిస్క్‌ గ్రూపులకైతే ఇవి తప్పనిసరి. 

పురుషులు మాత్రమే చేయించాల్సిన స్క్రీనింగ్‌ పరీక్షలు 
ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ : కాస్తంత వయస్సు పైబడ్డ తర్వాత పురుషుల్లో ఎక్కువగా కనిపించేది... ‘ప్రోస్టేట్‌ క్యాన్సర్‌’. దీన్ని చాలా చిన్న పరీక్షతోనే కనిపెట్టవచ్చు. పీఎస్‌ఏ (ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌) అనే చవకైన, సులభమైన పరీక్ష సహాయంతో క్యాన్సర్‌ను ఎంతో ముందుగానే కనుక్కోవచ్చు. యాభై ఏళ్లు పైబడ్డ పురుషులు ప్రతి ఏడాదీ చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఇదేగాక మలద్వారం ద్వారా వేలితో చేసే మరో పరీక్ష డిజిటర్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌ (డీఆర్‌ఈ). ఈ పరీక్షలతో డాక్టర్లు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను కనుగొంటారు. 

మహిళలకు మాత్రమే అవసరమైన స్క్రీనింగ్స్‌ పరీక్షలు
సర్వికల్‌ క్యాన్సర్‌:... సర్వికల్‌ క్యాన్సర్‌ ఒక సానుకూలత ఉంది. అదేమిటంటే... ఈ క్యాన్సర్‌ వచ్చేందుకు చాలా ముందుగానే గుర్తించేందుకు వీలుగా దీనికి సుదీర్ఘమైన ప్రీ–క్యాన్సర్‌ దశ ఉంటుంది. దాంతో ఈ వ్యాధి రావడానికి పదేళ్ల ముందే దాన్ని పసిగట్టవచ్చు. దీనికి చేయించుకోవాల్సిందల్లా పాప్‌స్మియర్‌ అనే ఒక సింపుల్‌ పరీక్ష. దీన్ని ప్రతి మహిళా 25 ఏళ్లు దాటాక చేయించాలి. ప్రీ–క్యాన్సర్‌ కనిపించకపోతే...  అప్పట్నుంచి ప్రతి మూడేళ్లకోమారు ఈ పరీక్ష చేయించుకుంటే చాలు. 

రిస్క్‌ గ్రూప్‌లో ఎవరెవరు? 
∙కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు ∙పిల్లలు లేని వాళ్లు ∙ముప్ఫయి ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు... వీరంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్‌ గ్రూప్‌. ఈ రిస్క్‌ గ్రూపులకు మూడు పరీక్షలు అవసరం. అందులో మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్‌ కంటే ముందే... తమకే తెలిసిపోతుంది. ఫలితంగా ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరగా కనిపెట్టగలరు. ఇతరత్రా కాస్తంత తేడా ఏమైనా ఉంటే దాన్ని డాక్టర్‌/గైనకాలజిస్ట్‌ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు.

రొమ్ము క్యాన్సర్‌:  రొమ్ము క్యాన్సర్‌ విషయంలో వయస్సుకూ వ్యాధికీ సంబంధం ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు (రిస్క్‌)  పెరుగుతుంటాయి.

అందరిలోనూ వచ్చే సాధారణ క్యాన్సర్లు... వాటి రిస్క్‌ ఫ్యాక్టర్లు... 
మహిళలకూ, పురుషులకూ... ఈ ఇరువురిలోనూ కనిపించే సాధారణ క్యాన్సర్లూ, అవి వచ్చే రిస్క్‌ గ్రూప్‌ల వివరాలివి. ఈ కింద పేర్కొన్న రిస్క్‌ ఫ్యాక్టర్లు మీలో ఉంటే మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి... విషయం వివరించి... వారు సూచించిన స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

మలద్వారం, పెద్ద పేగు క్యాన్సర్‌... (కోలో రెక్టల్‌ క్యాన్సర్‌): 
ఇందులోని రిస్క్‌ గ్రూపులను లెవెల్‌–1, లెవెల్‌–2, లెవెల్‌–3, లెవెల్‌–4 అని నాలుగుగా విభజించవచ్చు. ఇందులో 
లెవెల్‌–1 అంటే... కుటుంబ చరిత్రలో ఈ రకం క్యాన్సర్‌ వచ్చిన రోగులున్నవారు. 
లెవెల్‌–2 అంటే... కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉండి, 50 ఏళ్లు పైబడ్డవారు. 
లెవెల్‌–3 అంటే... 50 ఏళ్లకు ముందుగానే ఈ వ్యాధి వచ్చిన దగ్గరి బంధువులున్నవారు, వారితో పాటు మరో ఇద్దరు ముగ్గురికి ఈ వ్యాధి ఉంటే...
లెవెల్‌–4 అంటే... చాలా స్ట్రాంగ్‌ ఫ్యామిలీ హిస్టరీ, 50 పైబడి ఉండటంతో పాటు... చాలా దగ్గరి బంధువులు అంటే తల్లిదండ్రుల్లో ఒకరికి వ్యాధి రావడం... 
లెవెల్‌–1 స్థాయి రోగులైతే... మలంలో ఏవైనా రక్తకణాలున్నాయేమో తెలుసుకునేందుకు చేసే ‘ఫీకల్‌ అక్కల్ట్‌ బ్లడ్‌ టెస్ట్‌’ అనే సాధారణ మలపరీక్షను 50 ఏళ్లు పైబడ్డవారిలో ఏడాదికోసారి చేయించాలి. వారికి సిగ్మాయిడోస్కోపీ విత్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌ అనే పరీక్షను ప్రతి ఐదేళ్లకు ఓసారి చేయించాలి. 
లెవెల్‌–2 రోగులకు... పై పరీక్షలే. అయితే... అవి వీటిని ప్రతి మూడేళ్లకోమారు చేయిస్తుండాలి. 
లెవెల్‌–3 రోగులకు... కొలనోస్కోపీతో పాటు డాక్టర్లు వేలితో చేసే డిజిటల్‌ రెక్టమ్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షలను 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి ప్రతి 3–5 ఏళ్లకు చేయిస్తుండాలి. దాంతో పాటు ఫీకల్‌ అక్కల్ట్‌  బ్లడ్‌ టెస్ట్‌ను 35 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి ఏడాదీ చేయిస్తుండాలి. 
లెవెల్‌–4 రోగులకు... కొలనోస్కోపీ పరీక్షతో పాటు డిజిటల్‌ రెక్టమ్‌ పరీక్షను 25 ఏళ్ల వయసప్పటి నుంచే ప్రతి 1–3 ఏళ్లకోమారు చేయిస్తుండాలి. 
ఇటీవలే కొత్తగా మల పరీక్షలో ఒకరకమైన స్టూల్‌ డీఎన్‌ఏ పరీక్షతో పాటు, సీటీ కొలనోస్కోపీ అనే నొప్పి లేని వర్చువల్‌ కొలనోస్కోపీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల కోలోరెక్టల్‌ క్యాన్సర్లను ముందుగానే తెలుసుకోవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌: ఇది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లలో చాలా ఎక్కువ. ప్రధానంగా మనదేశంలో పురుషుల్లో చాలా ఎక్కువ. సాధారణ చెస్ట్‌ ఎక్స్‌–రే ద్వారా, స్ఫూటమ్‌ సైటాలజీ పరీక్షతో పాటు హై రెజల్యూషన్‌ సీటీ స్కాన్‌ ద్వారా దీన్ని కనుక్కోవచ్చు. పొగతాగేవారు ఈ క్యాన్సర్‌కు హైరిస్క్‌గా భావించాలి. వారు తమలో కొద్దిపాటి అసౌకర్యంగాని, లక్షణాలుగాని కనిపిస్తే... వెంటనే ఈ పరీక్షలు చేయించుకోవాలి. 

స్టమక్‌ క్యాన్సర్‌... : ఇది రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న హైరిస్క్‌ వర్గాలవారు  ఎవరంటే... 
∙పర్నీసియస్‌ ఎనిమియా అనే ఒక రకం రక్తహీనతతో బాధపడుతున్న... కాస్తంత వయస్సు పైబడ్డ వారు. 
∙గతంలో అల్సర్‌కు ఆపరేషన్‌ (గ్యాస్ట్రెక్టమీ) చేయించుకున్నవారు.
∙ఫెమీలియల్‌ అడెనోమేటస్‌ పాలిపోసిస్‌ అనే తరహా పాలిప్స్‌ ఉన్నవారు.
∙హెలికోబాక్టర్‌ పైలోరీ (హెచ్‌ పైలోరీ) అనే సూక్ష్మజీవి వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చినవాళ్లు.

స్క్రీనింగ్‌ పరీక్ష : వీళ్లంతా కడుపులో క్యాన్సర్‌ కోసం తరచూ డబుల్‌ కాంట్రాస్ట్‌ బేరియం పరీక్ష, ఎండోస్కోపీ చేయించుకోవాలి. ∙వాళ్లతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినేవాళ్లూ, పొగతాగేవాళ్లూ, ఆహారంలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ తక్కువగా తీసుకునేవారితో పాటు రబ్బరు, బొగ్గు పని చేసేవాళ్లు తరచూ ఈ పరీక్షలు చేయంచుకోవడం మంచిది.

మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. ఇది ఎవరికి అవసరం అంటే... 30 ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్‌ చేయించాలి. 35 ఏళ్లప్పుడు ఒకసారి...
40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి 40ఏళ్లు దాటక 50వ ఏటి వరకూప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి 50ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది. ఎక్కువ రిస్క్‌ ఉన్నవాళ్లకు డాక్టర్‌ సలహా మేరకు ఇంకా త్వరితంగానే అవసరం కావచ్చు. 

చాలా హై రిస్క్‌ గ్రూపు వారికి ఈ కింది పరీక్షలు... : కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు భావిస్తే... ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా దాన్ని కనుక్కోవచ్చు. జన్యుపరీక్షల ద్వారా– బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జీన్‌ మ్యూటేషన్స్‌ ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి వాళ్లకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చేదీ రానిది తెలుసుకోవచ్చు. 

హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌... దక్షిణ భారత దేశంలోని పురుషుల్లో కొలనోరెక్టల్‌ క్యాన్సర్‌ తర్వాత అత్యంత ఎక్కువగా కనిపించేవి హెడ్, నెక్‌ క్యాన్సర్లే. పురుషుల్లో పొగాకు, ఆల్కహాల్‌ అలవాట్లు ఎక్కువగా ఉండటంతో ఇవి వారిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ వచ్చిన వారు ఏడాదికోమారు డాక్టర్‌ను కలిసి, వారు సూచించిన స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి వచ్చి తగ్గినవాళ్లు ఆ ఏడాది మొదటి ఏడాదిలో ప్రతి మూడు నెలలకొకసారి, ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement