సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా హైపర్ టెన్షన్(అధిక రక్తపోటు) బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం విస్తరించిన ఈ జీవనశైలి జబ్బుపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల బాధితులు శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, నియంత్రించడానికి రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో కేంద్రం పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. తాజాగా దీన్ని మరో 100 జిల్లాలకు విస్తరింపజేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు జిల్లాలను ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో చేపట్టనున్న స్క్రీనింగ్ పరీక్షలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారం అందిస్తోంది. హైపర్ టెన్షన్‌ను సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే రానున్న ఐదేళ్లలో మరో ఐదారు కోట్ల మంది దీనిబారినపడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అధిక రక్తపోటు బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, 2025 నాటికి ఈ వ్యాధి విస్తరణను కనీసం 25 శాతం అరికట్టాలని సూచించింది.
బాధితులకు ప్రభుత్వం తరపున మందులివ్వాలి
హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్‌కు (పక్షవాతం) గురవుతున్నారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తాజాగా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ (నిర్ధారణ) పరీక్షలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, ఇందుకోసం నర్సులకు, హెల్త్ వర్కర్లకు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని, బాధితులకు ప్రభుత్వం తరఫునే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్’గా మార్చాలని, గ్రామస్థాయిలో అధిక రక్తపోటు బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికం
ఆంధ్రప్రదేశ్‌లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల నివేదికలో తేలింది. రాష్ట్రంలో దాదాపు కోటి మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా బాధితులు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హైపర్ టెన్షన్ బాధితులు పెరుగుతున్న కారణంగా గుండెపోటు, పక్షవాతం కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ప్రాథమిక దశలోనే గుర్తించాలి
‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాము హైపర్ టెన్షన్ బారిన పడినట్లు కూడా తెలియదు. పట్టణాల్లో కూడా చాలామంది తమకు వ్యాధి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అసాధారణంగా ఉన్నవారికీ గుండెపోటు వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువ. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు’’
– డా.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, సూపరింటెండెంట్, కర్నూలు జనరల్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment