క్యాజువల్‌గా చెక్ చేసినప్పుడు తెలుస్తుంది
పిల్లల్లో...
వయసు పైబడ్డవారిలో, పెద్దవారిలో హైబీపీ ఉన్నట్లు వినడం సాధారణమే. అయితే మారిన జీవనశైలితో ఇటీవల చిన్నపిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. పిల్లల్లో హైబీపీ కండిషన్ రెండు విధాలుగా ఉండవచ్చు. మొదటిదాన్ని ప్రైమరీ హైపర్‌టెన్షన్ అంటారు. ఇలా హైపర్‌టెన్షన్ పెరగడానికి నిర్దిష్టమైన కారణమేమీటో తెలియనప్పుడు దాన్ని ప్రైమరీ అంటారు. ఇక బీపీ పెరగడానికి నిర్దిష్టమైన కారణం ఉన్న కండిషన్‌ను సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు. బీపీ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పిల్లలకు స్థూలకాయం ఉండటం, క్యాల్షియమ్ జీవక్రియల్లో మార్పులు, కుటుంబ చరిత్రలో ఎవరికైనా బీపీ ఉండటం, రెనిన్ హార్మోన్‌లో మార్పుల వంటివి ప్రైమరీ హైపర్‌టెన్షన్‌కు కారణం కావచ్చు. అయితే పిల్లల్లో హైపర్‌టెన్షన్ ఉంటే 95% నుంచి 99% మందిలో సెకండరీ హైపర్‌టెన్షనే అయి ఉండవచ్చు. అంటే ఇతర అవయవ సంబంధమైన వ్యాధులు (ఉదాహరణకు మూత్రపిండాల సమస్య, ఇతర మందులు, విషపదార్థాలుతీసుకోవడం, మెదడుకు సంబంధించిన రుగ్మతలు, గుండెజబ్బులు, గ్రంథులకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాల సమస్యలు) ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో బీపీ ఎక్కువగా కనిపిస్తుంది.
చిన్నపిల్లల్లో బీపీ ఉందని నిర్ధరించడం చాలా జాగరూకతతో చేయాలి. సరైన ఉపకరణాలతో, సరైన పద్ధతిలో, ఒకటి రెండుసార్లు పరీక్ష చేసి సెంటైల్ చార్ట్ (బీపీ కొలతలను బట్టి ఏది ఎంత తీవ్రమైనతో తెలిపే చార్ట్) ప్రకారం సరిగ్గా నిర్ధారణ చేయడం చాలా ప్రధానం. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారి పిల్లల విషయంలో మరింత నిశితంగా పరీక్ష చేయాలి. మూడేళ్లు దాటిన పిల్లలకు బీపీ తప్పనిసరిగా చూడాలి.
సెంటైల్ చార్ట్‌లో 90వ పర్సంటైల్ ఉంటే బీపీ ఉన్నట్లు కాదు. అయితే ఈ రీడింగ్ వచ్చిన పిల్లలకు తప్పనిసరిగా ప్రతి ఆరునెలలకు ఒకసారి పరీక్ష చేయించాలి. రీడింగ్ 95-99 ఉంటే ఆ పిల్లలకు హైపర్‌టెన్షన్ స్టేజ్-1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్-2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్-1, స్టేజ్-2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ధారణ చేస్తారు. సాధారణంగా స్కూల్లో ఎన్‌సీసీ, స్పోర్ట్స్ వంటి వాటిల్లో పాల్గొనే పిల్లలను వైద్యులు పరీక్షించినప్పుడే వాళ్లలో బీపీ ఉన్నట్లు గుర్తించడం జరుగుతుంది.
ఎందుకంటే సాధారణంగా పిల్లల్లో హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడుతుంది. అవి... పెరుగుదలలో మార్పులు, తరచూ తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, రక్తస్రావం, కంటిచూపులో మార్పులు, ఫిట్స్ రావడం, పిల్లలు చికాకుగా ఉండటం వంటి కొన్ని లక్షణాలను బీపీ ఎక్కుగా ఉన్న పిల్లల్లో చూడవచ్చు. ఇక నిర్దిష్ట కారణం (సెకండరీ కాజెస్)తో వచ్చే హైపర్‌టెన్షన్‌లో బీపీ వచ్చిన కారణాన్ని గుర్తించి దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది.
పిల్లల్లో ప్రైమరీ హైపర్‌టెన్షన్ నివారణకు...
స్థూలకాయం (ఒబేసిటీ) తగ్గేలా చూడటం
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించడం
నూనె పదార్థాలు, ఉప్పు తగ్గించడం
ఏరోబిక్స్ వంటి ఆటల్లో పిల్లలు పాల్గొనేలా చూడటం...ఈ జాగ్రత్తలతో చాలావరకు తగ్గించవచ్చు.
స్టేజ్-1లో ఉన్న పిల్లలకు సైతం మందులు లేకుండానే పైన పేర్కొన్న జాగ్రత్తలతో నివారించడం సాధ్యమే.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్