సాక్షి, అమరావతి బ్యూరో/గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికీ కోవిడ్–19 సెగ తగిలింది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాలతోపాటు, ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో ఈ విమానాశ్రయం నుంచి నెలకు దాదాపు లక్ష మంది వరకు స్వదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కరోనా విజృంభణతో ఆ సంఖ్య నెలకు సగటున 12 వేలకు (12 శాతానికి) మించి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఈ విమానాశ్రయం నుంచి 3,659 దేశీయ విమాన సర్వీసుల ద్వారా 2,38,537 మంది రాకపోకలు సాగించారు. ఏప్రిల్ నెలంతా కోవిడ్‌తో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మే నెల నుంచి విమాన సర్వీసులను పాక్షికంగా అనుమతించగా.. జూలై నెలాఖరు వరకు 473 విమానాల ద్వారా 34,433 మంది మాత్రమే ప్రయాణించారు.
కువైట్ నుంచి వచ్చినవే ఎక్కువ..
► కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం ‘వందేభారత్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోంది.
► ఇందులో భాగంగా మే నుంచి ఆగస్టు వరకు వివిధ దేశాల నుంచి 117 అంతర్జాతీయ విమానాల్లో విజయవాడ ఎయిర్ పోర్టుకు 16,862 మంది వచ్చారు.
► వీటిలో సగానికి పైగా అంటే 64 విమానాలు కువైట్ నుంచి వచ్చినవే. ఆ తర్వాత స్థానాల్లో దుబాయ్ (17), మస్కట్ (7) దేశాలున్నాయి.
కార్గో విమానాలదీ అదే దారి..
► 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ విమానాశ్రయం నుంచి 2,129 టన్నుల సరుకు (కార్గో) రవాణా జరిగింది.
► ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకు 656.61 టన్నులను మాత్రమే రవాణా చేయగలిగారు. కార్గో రవాణా కూడా అధికంగా పాసింజర్ విమానాల్లోనే జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment