నేటి నుంచి ఎయిర్ షో
మూడు రోజులపాటు బెజవాడలో నిర్వహణ
విజయవాడ: బెజవాడలో ఎయిర్‌షోను గురువారం ప్రారంభిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అమరావతి చరిత్రలో గుర్తుండేలా విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 4 లక్షల మంది విమాన విన్యాసాలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి మూడు రోజుల పాటు ఎయిర్ షో జరుగుతుందని చెప్పారు. విజయవాడ గేట్‌వే హోటల్‌లో నిర్వహించే ఏవియేషన్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెలిగేట్‌లు 200 మందికి పైగా హాజరవుతారన్నారు.
సీఎం చంద్రబాబు ప్రారంభించే ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 4.30 నుంచి 4.45 గంటల వరకు పున్నమి, భవానీఘాట్‌లో నాలుగు ప్రత్యేక విమానాలతో నిర్వహించే ఎయిర్ షో ప్రజలను కనువిందు చేస్తుందని తెలిపారు. 13, 14 తేదీల్లో ఉదయం 11.30 నుంచి 11.45 గంటలకు, మధ్యాహ్నం 4 నుంచి 4.15 గంటల వరకు ఈ ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. ఎయిర్‌షో నిర్వహించేందుకు లండన్ నుంచి వచ్చి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న మార్క్ జఫ్రీ మాట్లాడుతూ ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికి ఐదు షోలు నిర్వహించామన్నారు. దీని తర్వాత త్వరలో చైనాలో ఎయిర్ షో నిర్వహిస్తామని చెప్పారు.
కాగా అత్యాధునిక హంగులతో నిర్మించిన గన్నవరం విమానాశ్రయ నూతన టెర్మినల్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజు జాతికి అంకితం చేయనున్నారు. రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా గన్నవరం విమానాశ్రయం పేరును అమరావతి విమానాశ్రయంగా మార్చాలని కోరుతూ సీఎం కు బుధవారం కేంద్ర మంత్రి అశోక్ లేఖ రాశారు.