కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్‌తో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందని, రాష్ట్రంలో పౌర విమానయాన రంగానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ కొలిక్కి వచ్చాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. బుధవారం ఢిల్లీలోని నిర్మాణ్‌భవన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురితో బుగ్గన సమావేశమయ్యారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయాలకు సంబంధించి పెండింగ్ పనుల విషయమై కేంద్రమంత్రితో చర్చించారు. భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించిన అనుమతుల గురించి కేంద్రమంత్రితో మాట్లాడానని తెలిపారు.
ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం త్వరలోనే ఉంటుందన్నారు. అలాగే భోగాపురానికి సంబంధించి ప్రస్తుత ఎయిర్‌పోర్టు నుంచి తరలింపు అంశంతోపాటు ఇతర సాంకేతిక అంశాలపై చర్చించామని చెప్పారు. అన్ని అంశాలపై పౌర విమానయాన మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని పేర్కొన్నారు.
మాది టీడీపీ మాదిరిగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాదు
తమ ప్రభుత్వం టీడీపీ మాదిరిగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాదని, సహనంతో కూడిన సమర్థత కలిగిన ప్రభుత్వమని బుగ్గన చెప్పారు. శంకుస్థాపనల కోసం కాకుండా ప్రారంభోత్సవాలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment