మరోసారి సంక్షేమ,అభివృద్ధి బడ్జెట్
మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ–అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్ ద్వారా మరో అడుగు ముందుకేశాం.
– సీఎం వైఎస్ జగన్
కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తున్నా దాన్ని కనీసం ఆలోచనల్లోనైనా అందుకోలేనంత దూరంలో ఎక్కువ మంది ఉండిపోతే.. ఆ అభివృద్ధికి అర్థం ఉందా? అందుకే... నాలుగేళ్ల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ సామాన్యులతోనే ప్రయాణిస్తున్నారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్ని సవాళ్లెదురైనా మనసా వాచా మ్యానిఫెస్టోనే అనుసరిస్తున్నారు. చదువు రూపంలో ఆస్తిని అందించటం... ఆరోగ్య పరిరక్షణతో అప్పులపాలు కాకుండా చూడటం... రైతన్నలను, మహిళల్ని, అవ్వాతాతలను ఆదుకుని ఆర్థిక, సామాజిక చక్రాన్ని ముందుకు నడిపించటమే తొలి ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. సామాజికంగా... ఆర్థికంగా వెనకబడిన వారిని ముందుకు తెస్తేనే అభివృద్ధికి అర్థం ఉంటుందన్నది ఆయన ఎకనమిక్స్.ఈ 5వ బడ్జెట్లో కూడా స్పష్టంగా కనిపించింది అదే!!.
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా అన్ని వర్గాల అభ్యున్నతికి అండగా నిలిచే అభివృద్ధి, సంక్షేమ సమతుల్యతతో కూడిన బడ్జెట్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. జెండర్ బేస్డ్ బడ్జెట్ ద్వారా సమాజంలో సగం ఉన్న మహిళలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. పిల్లలకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేయడం విశేషం.
అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనగా వరుసగా ఐదోసారి రూ.2,79,279.27 కోట్లతో 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540.71 కోట్లుగా, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు బుగ్గన పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.23,316.70 కోట్లు రెవెన్యూ లోటు, రూ.54,587.52 కోట్లు ద్రవ్య లోటు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్యలోటు 1.54 శాతం ఉంటుందని, రెవెన్యూ ఆదాయం రూ.2,06,224.01 కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇందులో కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.41,338.02 కోట్లు వస్తాయని, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.46,834.64 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు తెలిపారు. రెవెన్యూ లోటుతో పాటు ద్రవ్య లోటును అదుపులో పెట్టే చర్యలు తీసుకున్నట్లు బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకు ముందు సీఎం అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమై 2023–24 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
నవరత్నాలకు పెద్దపీట
ఎప్పటిలాగే మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాల కొనసాగింపునకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలతో పాటు మైనార్టీ యాక్షన్ ప్రణాళిక పేరుతో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తం మీద రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. మరో పక్క వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సాగునీటి రంగాల్లో మౌలిక రంగాలకు పెద్ద పీట వేశారు. బడ్జెట్‌లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకత ప్రదర్శించారు.
ఏయే రంగాల్లో ఏయే పథకాలకు ఎన్ని నిధులు కేటాయించింది స్పష్టంగా వివరించారు. అవ్వా తాతల సామాజిక పెన్షన్లను వచ్చే ఏడాది జనవరిలో నెలకు 3 వేల రూపాయలు చేస్తామని ప్రకటించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ పెన్షన్ కానుకకు ఏకంగా రూ.21,434 కోట్లు కేటాయించారు. నవరత్న పథకాల్లోని అన్ని వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
సచివాలయాలకు కేటాయింపులు
చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, కాపులు, లాయర్లకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లు.. గ్రామ, పట్టణ సచివాలయాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. నేరుగా నగదు బదిలీ చేసే 22 నవరత్నాల పథకాలకు బడ్జెట్‌లో రూ.54,228 కోట్లు కేటాయించారు.
మహిళల పథకాలకు ప్రత్యేకంగా రూ.77,914.43 కోట్లు, పిల్లల పథకాలకు ప్రత్యేకంగా రూ.20,593.38 కోట్లు కేటాయించారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.38,605 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.20,005 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.6,929 కోట్లు, మైనార్టీ కాంపొనెంట్‌కు రూ.4,203 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి రూ.51,345 కోట్లు, సాధారణ విద్యా రంగానికి రూ.32,198 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.15,882 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.14,043 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.17,531 కోట్లు కేటాయించారు.
రైతుల సంక్షేమంపై శ్రద్ధ
రైతుల సంక్షేమంపై శ్రద్ధ చూపుతూ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. రైతులకు సంబంధించిన అన్ని పథకాలకు కేటాయింపులు కొనసాగించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా జల వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమానికి రూ.3500 కోట్లు.. వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమానికి రూ.2214.21 కోట్లు కేటాయించారు.
పేదల గృహ నిర్మాణాలకు రూ.6291.70 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.4,887 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తంకు రూ.610 కోట్లు కేటాయించారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.6,546 కోట్లు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి రూ.2,400 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వానికి రూ.532 కోట్లు కేటాయించారు.
2022–23 సవరించిన అంచనాలు
2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,40,509.34 కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ.2,05,555.95 కోట్లు కాగా, మూల ధన వ్యయం రూ.16,846.69 కోట్లు అని తెలిపారు.
2022–23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు రూ.29,107 కోట్లు కాగా, ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.47,716 కోట్లు అని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 2.21 శాతం కాగా, ద్రవ్య లోటు 3.62 శాతంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment