నా నడక నేల మీదే | CM YS Jagan Comments In Andhra Pradesh Assembly Sessions | Sakshi
Sakshi News home page

నా నడక నేల మీదే

Published Thu, Mar 16 2023 1:53 AM | Last Updated on Thu, Mar 16 2023 3:17 PM

CM YS Jagan Comments In Andhra Pradesh Assembly Sessions - Sakshi

నాకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో వ్యవసాయం అంతే ముఖ్యం. ఐటీ ఎంత ముఖ్యమో చిరు వ్యాపారులు, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులవృత్తుల్లో ఉన్న వారు కూడా అంతే ముఖ్యం. వారు ఎలా బతకగలుగుతున్నారన్నది కూడా అంతే ముఖ్యం. నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో నెల నెలా పింఛన్లు తీసుకుంటున్న అవ్వాతాతలు కూడా అంతే ముఖ్యం. మనందరి ప్రభుత్వం ద్వారా సంక్షేమం, అభివృద్ధి పథకాలతో డబ్బులందుకుంటున్న నిరుపేద అక్క చెల్లెమ్మలు, వారి కుటుంబాలు, వారి బాగోగులు కూడా అంతే ముఖ్యమని చెప్పడానికి గర్వపడుతున్నాను. వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, లింగ వివక్షలేని సాధికారతలు అంతకన్నా ముఖ్యం.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘నా నడక నేల మీదే. నా ప్రయాణం సామాన్యులు, పేదలతోనే. నా యుద్ధం పెత్తందార్లతో. నా లక్ష్యం పేదరిక నిర్మూలన’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సిద్ధాంతాన్ని విస్పష్టంగా ప్రకటించారు. పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడితేనే పేద కులాలు బాగుంటాయని అన్నారు. పేద కుటుంబాలు, పేద కులా­లను బలపరుస్తూ.. వారికి అన్ని సాధికారతలు కల్పి­స్తేనే సమాజం బాగుంటుందని చెప్పారు. ‘సమా­జంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం బాగుంటుందని నేను నమ్మాను. దానిని ఆచరించి ఫలితాలు చూపించాను. ఇదే నా ఎకనామిక్స్‌. ఇదే నా పాలిటిక్స్‌.

ఇదే నేను నా తండ్రిని చూసి నేర్చుకున్న హిస్టరీ. ఇవన్నీ కలిపితేనే మీ జగన్‌’ అని తన పాలనా విధానాన్ని ఆవిష్కరించారు. శాసన­సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవా­దాలు తెలిపే తీర్మానంపై బుధవారం ఆయన ప్రసంగిస్తూ గత నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గణాంకాలతో సహా వివరించారు. తమ ప్రభుత్వ విధానాల మౌలిక స్వరూపాన్ని, లక్ష్యాలను శాసనసభ వేదికగా విశదీకరిస్తూ తన రాజకీయ విధానాన్ని పునరుద్ఘాటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

98.5 శాతం హామీలు నెరవేర్చాం
► మన ప్రభుత్వం వచ్చి దాదాపు 45 నెలలు కావస్తోంది. నాలుగేళ్లు గడవకముందే 98.5 శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని చెప్పాం. దాన్ని ఆచరణలో చూపించాం. జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేశాం. రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకు రాగలిగాం. 

► పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. ఈ మూడు తరాలకు మేలు చేసేలా రూ.1,97,473 కోట్లు నేరుగా నగదు బదిలీ పథకం (డీబీటీ) ద్వారా అంటే నేరుగా బటన్‌ నొక్కి లబ్ధిదారులకు అందించాం. 

► మన పరిపాలనలో ఇంటింటికి.. మనిషి మనిషికి ఏ విధంగా మేలు జరిగిందన్నది గడప గడపకు వెళ్లి వివరాలతో చెబుతున్నాం. మంచి జరిగిందని భావిస్తే మనందరి ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి మద్దతు పలకండని మన ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి చెప్పగలిగేలా 45 నెలల పరిపాలన సాగిందని సగర్వంగా చెబుతున్నాం.  

► 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు పరిపాలన, సేవలు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. వీటిలో 1,34,000 మంది మన పిల్లలు శాశ్వత ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. 600 పౌర సేవలు లంచాలు, వివక్షకు తావులేకుండా గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం. 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ చొప్పున 2,65,000 మంది ప్రతి ఇంటికి మంచి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో పౌర సేవల్లో ఇదో గొప్ప విప్లవం.

► దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ఏర్పాటు చేశాం. ఇందులో విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి ఒక్క రైతులకు తోడుగా నిలిచాం. ఆర్‌బీకేలలో 10,778 మంది అగ్రికల్చర్, హార్టికల్చర్‌ గ్రాడ్యుయేట్లు సేవలు అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగం మీద ప్రధానంగా దృష్టి సారించాం. గత ప్రభుత్వంలో ఇలాంటి సేవలు లేవు. 

భూ వివాదాలకు శాశ్వత ముగింపు 
► గతంలో మండలానికి ఓ సర్వేయర్‌ ఉంటే గొప్ప.  లంచాలు ఇస్తే తప్ప మనకు టైమ్‌ ఇచ్చేవారు కాదు. అలాంటిది ఈ రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో 10,185 మంది సర్వేయర్లను నియమించాం. వారి ద్వారా వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టి.. కబ్జాలు, భూవివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పే పలికేలా అడుగులు వేస్తున్నాం. 

► మరో 7 వేల మెగావాట్లను యూనిట్‌ కేవలం రూ.2.49కే మరో 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. ఏడాదికి 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వ్యవసాయానికి పగటి పూటే అందుబాటులో ఉండేలా చేస్తూ ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నాం. 

ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ 
► ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా దేశంలోనే నంబర్‌వన్‌ స్థానం మన రాష్ట్రానికే దక్కిందని చెప్పడానికి గర్వపడుతున్నా. అందువల్లే రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పారిశ్రామిక సంస్థలు, పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మొన్న దావోస్‌లో, నిన్న విశాఖలో ప్రత్యక్షంగా చూశాం. 

► 28 రాష్ట్రాల మన దేశంలో 2021–22కుగాను అత్యధికంగా 11.23 శాతం ఆర్థిక వృద్ధి రేటుతో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచి జీఎస్‌డీపీ గ్రోత్‌రేట్‌ నమోదు చేసింది. 14.02 శాతం తలసరి ఆదాయం పెరిగిన రాష్ట్రంగా కూడా నిలిచింది. 

ఊరూరా స్పష్టమైన మార్పు
► 45 నెలల పాలనలో ఏ గ్రామాన్ని తీసుకన్నా జగన్‌ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. 600 సేవలు అందిస్తున్న సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకేలు, ఇ–క్రాప్, పంట కోనుగోలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిటీ డాక్టర్‌ కాన్సెప్ట్, అన్‌లిమిటెడ్‌ బ్యాండ్‌ విడ్త్‌ ద్వారా వర్క్‌ ఫ్రం హోమ్‌ కోసం డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, వాటిలో నిర్మిస్తున్న ఇళ్లు.. కాలనీలు కనిపిస్తాయి.  
► నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల గడప వద్దకే అందిస్తున్నాం. ఇందుకోసం 9,260 డెలివరీ వ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. 

విద్యా విప్లవంతో పెద్ద పెద్ద చదువులు
► గత ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు శిథిలమైన స్థితిలో ఉండేవి. నాడు–నేడు ద్వారా వాటి రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నాం. ప్రభుత్వ బడిని సీబీఎస్‌ఈ ఇంగ్లిష్‌ మీడియంతో తీర్చిదిద్దగలుగుతున్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం. గోరుముద్ద మెనూ నుంచి పిల్లల డ్రెస్‌ వరకు అన్నింటా కూడా ఒక మేనమామలా శ్రద్ధ చూపుతున్నా. ఫలితంగా మన పిల్లలు పెద్ద చదువుల వైపు దూసుకెళ్తున్నారు.

► జగనన్న విద్యా దీవెన పథకంతో వంద శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్, వసతి దీవెనతో పిల్లలు అందరికీ తోడుగా ఉంటున్నాం. కొన్నాళ్ల తర్వాత ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ అవుతుంది. ఇంటరేక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌తో పిల్లలకు చదువులు చెబుతారు. దాంతో ప్రభుత్వ బడులతో పోటీ పడేందుకు కార్పొరేట్‌ బడుల వాళ్లు కూడా ఇదే మాదిరి అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది.

► ఇప్పటికే 15,200కుపైగా ఉన్న ప్రభుత్వ బడులు ఆరో తరగతి నుంచి ఉన్న 5,800 బడుల్లో 30,230 క్లాస్‌రూమ్‌లో ఈ జూన్‌లో బడులు తెరిచే నాటికే ఇంటరేక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌తో డిజిటల్‌ క్లాస్‌ రూములు అందుబాటులోకి వస్తున్నాయి. మన బడి నాడు–నేడుతో దాదాపు 45 వేల స్కూళ్లు, కాలేజీల రూపురేఖలు మారుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement