సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానం | Buggana Rajendranath Comments in AP Assembly Budget Sessions | Sakshi
Sakshi News home page

సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానం

Published Fri, Mar 17 2023 4:01 AM | Last Updated on Fri, Mar 17 2023 4:01 AM

Buggana Rajendranath Comments in AP Assembly Budget Sessions - Sakshi

సాక్షి, అమరావతి: సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధాన­మని, ఇందుకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడు­తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. జీవనోపాధి, సాధికారత, సామాజిక భద్ర­త, పారిశ్రామికాభివృద్ధే ప్రధానం అని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 2023–24 సంవత్సరానికి రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను గురువారం ఆయన శాసన­సభలో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మాట్లా­డుతూ.. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనంగా మేనిఫెస్టోను రూపొందించామని, అధికారం చేపట్టిన తొలి సంవత్సరమే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేశామని తెలి­పారు. కోవిడ్‌ వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ నాలు­గేళ్లల్లో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు.

ఈ నాలుగేళ్లలో 15,004 గ్రామ, వార్డు సచివాల­యాల ఏర్పాటు, 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, 2.65 లక్షల మంది వలంటీర్ల నియా­మకం, 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో పాటు 15,715 పాఠశా­లల్లో మౌలిక సదుపాయా­లను మెరుగు పరిచామని చెప్పారు.

3,707 వైఎస్సార్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 461 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. దాదాపు 21 పథకాల ద్వారా లబ్ధిదారులకు నాలుగేళ్లల్లో డీబీటీ ద్వారా రూ.1.97 లక్షల కోట్లు జమ చేశామన్నారు. 2023–24లో డీబీటీ విధానంలో రూ.54,228 కోట్లు పంపిణీ చేసే విధంగా కేటాయింపులు చేశామని చెప్పారు.

2018–2019 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం మన జీఎస్‌డీపీ వృద్ధి రేటులో మన రాష్ట్రం దేశంలోనే 22వ స్థానంలో ఉండగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి విధానాల కారణంగా 2021–2022 లో 11.43 శాతం వృద్ధితో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. వచ్చే ఏడాది జీఎస్‌డీపీ 10% వృద్ధితో రూ.14,49,501 కోట్లకు చేరుతుందని అంచనాగా ఉందన్నారు.

రైతులకు చేదోడుగా ఉంటూ గత నాలుగేళ్లల్లో వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద ఇప్పటి వరకు రూ.27,063 కోట్లు రైతుల ఖాతాల్లో వేయడమే కాకుండా వచ్చే ఏడాది కోసం రూ.4,020 కోట్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఇప్పటి వరకు రూ.6,872 కోట్లు ఇవ్వగా, వచ్చే ఏడాది కోసం రూ.1,600 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంత్రి బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే..

పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్ద పీట
► రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేస్తోంది. విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడి­దారుల సదస్సుకు వచ్చిన అద్భుత­మైన స్పందనే ఇందుకు నిదర్శనం. ఎన్టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ వపర్, భారత్‌ బయోటెక్, జీఎంఆర్‌ గ్రూప్, దా­ల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్‌ ఫిన్‌­సర్వ్‌ లిమిటెడ్, సెంచురీ ప్లై్లబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌­కో సిమెంట్స్, అపోలో హాస్పిట­ల్స్‌తో­పాటు అనేక ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఏపీ­లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.

​​​​​​​► ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబా­రులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొ­న్నారు. ఈ సదస్సు ద్వారా రూ.13.42 లక్షల కోట్ల పెట్టు­బడులతో 6 లక్షలకు పైగా ఉద్యోగా­లను సృష్టించే అవకాశం కలిగింది. 378 అవగా­హన ఒప్పందాలు కుదరడం ఎంతో గర్వించదగ్గ విషయం.

​​​​​​​► విశాఖ–చెన్నై కారిడార్‌లో పారిశ్రామిక క్లస్టర్స్‌తో పాటు ఎంఎస్‌ఎంఈ యూనిట్లను ప్రోత్సహించే­లా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నాం.

► 2023–­24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు, వాణి­­­జ్యం కోసం రూ.2,602 కోట్లు కేటాయిస్తున్నాం.


రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు
​​​​​​​► రాష్ట్రంలో దాదాపు 32,725 కిలోమీటర్ల మేర ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కిలోమీటర్ల పొడవున ఉన్న బి.టి.రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాం.

​​​​​​​► రూ.400 కోట్లతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ.రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేశాం. రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్‌ కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ.పొడవుగల రోడ్లకు సంబంధించి రూ.391 కోట్లతో 46 పనులు మంజూరయ్యాయి. డిసెంబర్‌ 2022 నాటికి 383.66 కి.మీ. మేర రహదారి పనులు పూర్తయ్యాయి.

​​​​​​​► 2023–24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహ­దారులు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు కేటాయిస్తున్నాం. పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయు­రారోగ్య ఐశ్వర్యాలను అందించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. దీనికి అనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో 2023–24 బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం ప్రవేశ పెడుతున్నాం. 

ఏటా 50,000 మందికి నైపుణ్య శిక్షణ
​​​​​​​► స్థానిక యువతకు ఉపాధి లభించేలా నైపుణ్య శిక్ష­ణకు పెద్ద పీట వేస్తున్నాం. అసెంబ్లీ నియో­జకవర్గ స్థాయిలో కనీసం ఒక స్కిల్‌ హబ్‌ చొప్పున మొత్తం 192 నైపుణ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఒక స్కిల్‌ కాలేజీ, రాష్ట్ర స్థాయిలో స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా ఏటా 50,000 మందికి శిక్షణ ఇప్పించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం 154 కార్పొరేట్స్‌తో 18 రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం.

​​​​​​​► వచ్చే ఏడాది నైపుణ్య శిక్షణ కోసం రూ.1,166 కోట్లు కేటాయిస్తున్నాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. రూ.22,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం 2023–24  సంవత్స­రానికి రూ.5,600 కోట్లు కేటాయిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement